వన్డే వరల్డ్‌కప్ పోటీలకు రంగం సిద్ధమవుతోంది. బీసీసీ ఇప్పటికే15 మందితో కూడిన టీమిండియా జట్టుని ప్రకటించేసింది. ఇంకేముంది.. ప్రపంచ కప్ ఫీవర్ ఇండియాలో షురూ అయినట్టే. కానీ, ఇదివరకటితో పోల్చితే ఈసారి వరల్డ్‌కప్ మీద క్రికెట్ అభిమానుల్లో పెద్దగా ఆశల్లేవు. కారణం, ఎంపికయిన ఆటగాళ్ళే.
ధోనీ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, జడేజా.. ఇలా అతి కొద్ది మంది ఆటగాళ్ళు మాత్రమే సీనియర్స్. గత వరల్డ్‌కప్‌లో సచిన్ లాంటి సీనియర్ క్రికెటర్ అందుబాటులో వున్నాడు. యువరాజ్‌సింగ్ లాంటి మ్యాచ్ విన్నర్ వున్నాడు. సెహ్వాగ్, గంభీర్, జహీర్‌ఖాన్.. ఇలాంటి మేటి క్రికెటర్లతో జట్టు బలంగా వుంది అప్పట్లో. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. అంతా కొత్త కుర్రాళ్ళే. ఆ మాటకొస్తే ధోనీ తప్ప మిగతా ఆటగాళ్ళందర్నీ యంగ్స్టర్స్గానే పరిగణించాల్సి వుంటుంది.
జట్టులో కుదురుగా ఆడుతున్నది ఎవరు? అంటే కోహ్లీ తప్ప ఇంకో పేరు విన్పించడంలేదు. ధోనీ తనదైన స్టయిల్లో బ్యాటింగ్ చేసి చాలాకాలమైంది. ఒత్తిడిని తట్టుకోలేక, ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కి ధోనీ గుడ్ బై చెప్పేశాడు. బౌలింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక్కరంటే ఒక్కరు కూడా సూపర్బ్ బౌలర్ అన్పించుకునేవారు లేరు. ఒక్క భువనేశ్వర్ కుమార్ మాత్రమే బౌలింగ్ విభాగంలో ఫర్వాలేదు.
ఈ పరిస్థితుల్లో టీమిండియాపై ఎవరికైనా అంచనాలు ఎందుకు వుంటాయి.? మామూలుగా అయితే వుండవు. కానీ, ఎలాంటి అంచనాల్లేని జట్టుతో ధోనీ నేతృత్వంలోని టీమిండియా ఒకప్పుడు టీ20 వరల్డ్‌కప్‌ని సొంతం చేసుకుంది. అందులోనూ యువరాజ్‌సింగ్ దుమ్మురేపాడు. వరల్డ్‌కప్ నాటికి పరిస్థితులు ఎలా వుంటాయోగానీ, ఇప్పటికైతే జట్టు ఎంపిక పట్ల క్రికెట్ అభిమానుల్లో చాలా పెదవి విరుపులు కన్పిస్తున్నాయి.
క్రికెట్ అంటే భారతదేశంలో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికిప్పుడు ఎలాంటి అంచనాల్లేకపోయినా.. ఆ టైమ్‌కి అంచనాలు వాటంతట అవే క్రియేట్ అవుతాయి. గత వరల్డ్‌కప్‌ని గెల్చుకున్న టీమిండియా మరోమారు కప్ గెలవాలనే ఆశ ప్రతి ఒక్కరిలోనూ వుంటుంది. ఆశలు తక్కువ, అంచనాలు అతి తక్కువగా వుండడమూ ధోనీ సేనకి పెద్ద ప్లస్. చూద్దాం.. ఏం జరుగుతుందో.!