‘గోపాల గోపాల’ డేట్ ఫిక్స్ అయ్యింది. ఎల్లుండే (జనవరి 10న) ‘గోపాల గోపాల’ సినిమా విడుదల కానుంది. అయితే ముందు అనుకున్న విధంగా ఈ నెల 14న విడుదల కావాల్సిన ‘ఐ’ విడుదలయ్యేలా కనిపించడంలేదు. ‘ఐ’ సినిమా కోసం ‘గోపాల గోపాల’ వెనక్కి వెళ్ళే అవకాశముందంటూ ఊహాగానాలు విన్పించగా, ‘గోపాల గోపాల’ డేట్ ఫిక్స్ అయ్యి, ‘ఐ’ సస్పెన్స్‌లో పడింది.
‘ఐ’ సినిమాకి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో మూడు వారాల పాటు సినిమా విడుదలపై స్టే విధించింది న్యాయస్థానం. దాంతో ‘ఐ’ యూనిట్ షాక్‌కి గురైంది. తెలుగు వెర్షన్ నిర్మాతలు మాత్రం సినిమా ఖచ్చితంగా అనుకున్న సమయానికే విడుదలవుతుందని చెబుతున్నారు. రేపటికల్లా అన్ని విషయాలూ సర్దుకుంటాయన్నది ‘ఐ’ యూనిట్ వాదన.
పరిస్థితులు మాత్రం ‘ఐ’ విడుదలకు ఏమాత్రం సానుకూలంగా కన్పించడంలేదు. ఇదివరకే ‘ఐ’ విడుదల కావాల్సి వున్నా, అనేక కారణాలతో విడుదల ఆలస్యమయ్యింది. తాజాగా కోర్టు విధించిన స్టే ‘ఐ’ విడుదలకు ప్రతిబంధకంగా మారింది. ఈ పరిస్థితుల్లో ‘ఐ’ యూనిట్ ఆశించినట్లుగా జనవరి 14న విడుదలవుతుందా? లేదా? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే.