యువరాజ్.. ఇంకా కొనే వాళ్లున్నారా? తప్పుకోరాదా!

తనతో పాటు కెరీర్ మొదలుపెట్టిన చాలా మంది క్రికెటర్లు తెరమరుగు అయ్యారు. టీనేజ్ లోనే యువీతో పాటు అంతర్జాతీయ కెరీర్ మొదలుపెట్టిన జహీర్ ఖాన్ వంటి వాళ్లు  రిటైర్మెంట్ ప్రకటించి చాలా కాలం అయ్యింది.…

తనతో పాటు కెరీర్ మొదలుపెట్టిన చాలా మంది క్రికెటర్లు తెరమరుగు అయ్యారు. టీనేజ్ లోనే యువీతో పాటు అంతర్జాతీయ కెరీర్ మొదలుపెట్టిన జహీర్ ఖాన్ వంటి వాళ్లు  రిటైర్మెంట్ ప్రకటించి చాలా కాలం అయ్యింది. ఇక యువీతో పాటు ఎంట్రీ ఇచ్చిన చాలా మంది క్రికెటర్లు రిటైర్మెంట్లు ప్రకటించి.. ఏ కోచింగో, మరో కామెంటరీనో చెబుతూ ఉన్నారు.

అయితే యువరాజ్ సింగ్ మాత్రం ఇంకా వివిధ లీగ్స్ లో ఆడుతూ వస్తున్నాడు.  అయితే కేవలం ఆడుతున్నాడంతే. సరిగా రాణించింది మాత్రం పెద్దగా లేదు. గత ఏడాది కూడా ఐపీఎల్ లో యువరాజ్ ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. నాలుగు మ్యాచ్ లు ఆడించింది. అయితే యువీ ఆకట్టుకోలేకపోయాడు.

అప్పుడు  కేవలం కోటి రూపాయల ధరకే యువీని ఆ ప్రాంచైజ్ కొనుగోలు చేసింది. ఒక  దశలో ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన యువీ అలా కోటి రూపాయల రేంజ్ కు పడిపోయాడు. ఈ ఏడాది ఆ ధరకు కూడా యువీని ముంబై ఇండియన్స్ పెట్టుకోలేదు. ఆయనను ఆ టీమ్ వదులుకుంది.

దీంతో యువరాజ్ పేరు మళ్లీ వేలం జాబితాలోకి వచ్చింది. యువీ వయసు, ఫామ్ రీత్యా ఏ ప్రాంచైజీ అయినా ఈ సారి మళ్లీ కొంటుందా? అనేది అనుమానమే. తన పేరును మళ్లీ  వేలం జాబితాలోకి  చేర్చడానికి యువీ నిరాకరించాల్సింది.

ఒక దశలో ఎంతో అద్భుతంగా రాణించి, అనితర సాధ్యమైన రికార్డులు సాధించిన యువరాజ్.. గౌరవంగా తప్పుకుంటే బావుండేదని పరిశీలకులు అంటున్నారు. కోట్ల రూపాయల విలువ నుంచి కోటి రూపాయలకు వచ్చి, ఇప్పుడు మరీ లక్షల్లోకి రాకుండా.. దర్జాగా తప్పుకుంటే గౌరవంగా ఉండేదేమో అని అభిమానులు కూడా అంటున్నారు.

అంతర్జాతీయ కెరీర్ విషయంలో కూడా యువరాజ్ తెగే వరకూ లాగిలాగి వైదొలిగాడు. ఐపీఎల్ విషయంలోనూ అలానే ఉంది!