యూఎస్ నుంచి వచ్చాడు.. ఇక్కడ దొరికిపోయాడు

బాగా చదువుకున్నాడు. అమెరికాలో ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అమ్మానాన్నల్ని చూసేందుకు ఇండియా వచ్చాడు. ఆన్ లైన్ మోసానికి బలయ్యాడు. డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. హైదరాబాద్ లో జరిగింది ఈ ఆన్ లైన్ మోసం. Advertisement హైదరాబాద్…

బాగా చదువుకున్నాడు. అమెరికాలో ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అమ్మానాన్నల్ని చూసేందుకు ఇండియా వచ్చాడు. ఆన్ లైన్ మోసానికి బలయ్యాడు. డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. హైదరాబాద్ లో జరిగింది ఈ ఆన్ లైన్ మోసం.

హైదరాబాద్ లోని మెహదీపట్నంలో నివశిస్తున్న ఓ వ్యక్తి మొబైల్ కు మెసేజ్ వచ్చింది. కరెంట్ బిల్లు కట్టలేదని, అర్జెంట్ గా కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామనేది ఆ మెసేజ్ సారాంశం. నిజంగానే ఆ వ్యక్తి కరెంట్ బిల్లు కట్టలేదు. దీంతో కాస్త ఆందోళన చెందాడు. అప్పుడే అమెరికా నుంచి వచ్చిన కొడుక్కి ఆ మెసేజ్ చూపించాడు.

మెసేజ్ చూసిన అమెరికా కొడుకు అందులో ఉన్న నంబర్ కు కాల్ చేశాడు. లింక్ పంపిస్తాం పేమెంట్ చేయమని అట్నుంచి సమాధానం వచ్చింది. వెంటనే లింక్ వచ్చింది. మనోడు దాన్ని క్లిక్ చేశాడు. ఓటీపీ వచ్చింది. దాన్ని అవతలి వ్యక్తికి చెప్పాడు. అంతే, క్షణాల్లో ఎకౌంట్ నుంచి 8 లక్షల 50 వేలు మాయమయ్యాయి.

ఉన్నట్టుండి ఎకౌంట్ ఖాళీ అవ్వడంతో సదరు వ్యక్తి ఖంగుతిన్నాడు. తిరిగి అదే నంబర్ కు ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. తను ఆన్ లైన్ మోసానికి గురయ్యానని అప్పుడు గ్రహించాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. 

కరెంట్ బిల్లు కట్టమని ట్రాన్స్ కో నుంచి ఎలాంటి సందేశాలు రావనే విషయాన్ని పోలీసులు మరోసారి ప్రకటించారు. కరెంట్ బిల్లు కట్టమని మెసేజీలు పంపించే సంప్రదాయం ఆ డిపార్ట్ మెంట్ లో లేదని చెబుతున్నారు.