తిరుపతిలో పవన్ పోటీ చేస్తే… ఎలా వుంటుందనే అంశంపై ప్రముఖ సంస్థతో ఇటీవల సర్వే చేయించినట్టు సమాచారం. ఈ సర్వే నివేదిక చూసి జనసేనాని పవన్‌కల్యాణ్ షాక్‌కు గురైనట్టు తెలిసింది. తనను తిరుపతి జనసేన నాయకులు మోసం చేస్తున్నారనే అభిప్రాయానికి ఆయన వచ్చారని చెబుతున్నారు. ఒకవేళ తిరుపతిలో నిలిచినా అక్కడి స్థానిక నాయకులను నమ్ముకుంటే మాత్రం నట్టేట మునగడం ఖాయమనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది.
ఈ మధ్య తిరుపతి జనసేన నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది. ఈ సందర్భంగా తిరుపతి నుంచి జనసేనాని పోటీ చేయాలని తీర్మానించారు. పవన్‌కు లక్ష మెజార్టీ తెప్పిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో రాజకీయ పక్షాలన్నీ ఆశ్చర్యపోయాయి. పవన్‌ను పొగుడుతూ, ఆయనకు వాస్తవాలు చెప్పకుండా మభ్యపెడుతున్నారా? అనే అనుమానాలు జనసేన అధిష్టానంలో కలిగాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలో వాస్తవం పరిస్థితి ఏంటో తెలుసుకోడానికి ఒక ప్రముఖ సంస్థతో సర్వే చేయించినట్టు సమాచారం.
ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూసినట్టు విశ్వసనీయ సమాచారం. పవన్‌కల్యాణ్ నిలిస్తే… ఆయన సామాజిక వర్గానికి చెందిన మెజార్టీ ఓట్లు పడుతాయని తేలింది. అలాగే మిగిలిన సామాజిక వర్గాలు చాలా వరకూ దూరమవుతాయని కూడా ఆ సర్వేలో వెల్లడైనట్టు తెలిసింది. ఎందుకంటే జనసేన అంటే కాపు, బలిజల పార్టీ అనే రీతిలో తిరుపతి జనసేన నాయకులు ఇతర సామాజిక వర్గాలను కలుపుకుపోలేదనే వాస్తవం సర్వేలో బయటపడినట్టు సమాచారం. మరీ ముఖ్యంగా క్షేత్రస్థాయిలో జనసేన బలం అంతా డొల్ల అనే కఠిన వాస్తవం వెలుగు చూసింది.
తిరుపతి జనసేన నేతలు మీడియా ముందు అరవడం తప్ప పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషి ఏమీ లేదని సర్వే నిగ్గుతేల్చినట్టు సమాచారం. అలాగే మరికొందరు ముఖ్యనేతలు తిరుమల దర్శన దళారుల అవతారం ఎత్తారనే చేదు నిజం సర్వేలో బయటపడినట్టు సమాచారం. తిరుపతి జనసేన నాయకులెవరికీ పవన్‌తోనూ, మీడియాతోనూ, తిరుమల దర్శన దళారులతో తప్ప, ప్రజలతో సత్సంబంధాలు లేవనే కఠిన నిజాలను సర్వే బయట పెట్టింది. ఈ సందర్భంగా ఉదాహరణలతో సహా సర్వే వివరాలను జనసేన అధిష్టానం ముందు పెట్టినట్టు సమాచారం.
ఏడాది క్రితం తిరుపతి కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో 49 డివిజన్లకు గాను కేవలం ఒకట్రెండు చోట్ల మాత్రమే జనసేన నామినేషన్లు వేసింది. ప్రస్తుతం జనసేన తిరుపతి అధ్యక్షుడు రాజారెడ్డి నివాసం ఉంటున్న 14వ డివిజన్‌లో కనీసం నామినేషన్ కూడా వేయలేని పరిస్థితి. వైసీపీకి ఏకగ్రీవం కావడం వెనుక డబ్బు చేతులు మారినట్టు ఆరోపణలున్నాయి. ఇందులో జనసేన నేతలకు ముట్టింది ఎంతో వాళ్ల మనస్సాక్షికే తెలియాలని సర్వేలో స్పష్టంగా పేర్కొన్నట్టు జనసేన ముఖ్య నాయకులు చెబుతున్నారు.
అలాగే తిరుపతి జనసేనకు మరో ఆణిముత్యం లాంటి నాయకుడున్నాడు. ఆయనే చీకటిరాయల్‌గా పాపులర్. పవన్‌కల్యాణ్ తర్వాత పొత్తుల గురించి ఈయనే ఆ స్థాయిలో మాట్లాడుతుంటారు. చీకటి రాయల్ మీడియాతో మాట్లాడ్డం చూస్తే…. వామ్మో ఎంత ప్రజాబలం ఉన్న నాయకుడో అని తప్పక అనుకుంటారు. కానీ తిరుపతిలో బూత్‌స్థాయికి ఎక్కువ. గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఈయన నివాసం ఉంటున్న 16వ డివిజన్‌లో కనీసం నామినేషన్ వేయలేదు.
ఈయనకు తిరుమల దర్శనానికి సంబంధించి దొంగ టికెట్లు అమ్ముకోవడం వృత్తి, ప్రవృత్తి అని సర్వే నివేదికలో పొందుపరచడం జనసేన పెద్దలకు షాక్ ఇచ్చినట్టు సమాచారం. రెండుమూడు సార్లు టీటీడీ విజిలెన్స్ అధికారులకు పట్టుబడి, అధికార పార్టీ నేతల కాళ్లావేళ్లా పడి కేసుల నుంచి తప్పించుకున్నాడనే సమాచారాన్ని జనసేన అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. కనీసం కార్పొరేషన్‌లో తానుంటున్న డివిజన్‌లో కూడా నామినేషన్ వేయకపోవడానికి ఈ కేసుల భయమే కారణమని చీకటి రాయల్‌కు తెలిసినంతగా, మరెవరికీ తెలియదనే టాక్ వుంది. మరీ ముఖ్యంగా ఈయనగారు “రాయల్” కాకపోయినా, రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ సామాజిక వర్గాన్ని తోకగా తగిలించుకోవడం గురించి కూడా సర్వేలో పేర్కొన్నట్టు సమాచారం.
జనసేనలో రాష్ట్రస్థాయిలో కీలకనాయకుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. పవన్ పుణ్యమా అని చంద్రబాబు హయాంలో టీటీడీ బోర్డు మెంబర్‌గా పని చేశారు. ఈయన తిరుపతిలో 4వ డివిజన్‌లో వుంటారు. ఈ డివిజన్ నుంచి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పసుపులేటి హరిప్రసాద్ ప్రస్తుతం తిరుపతి జిల్లా జనసేన అధ్యక్షుడు. గెలుపోటములను పక్కన పెడితే చివరికి తిరుపతిలో తాము నివాసం ఉంటున్న డివిజన్లలో కూడా నామినేషన్లు వేసే దిక్కులేదు.
కేవలం 33వ డివిజన్‌లో మాత్రం ఒక మహిళ జనసేన తరపున పోటీ చేసి శభాష్ అనిపించుకున్నారు. కానీ ఎప్పుడూ ఈమె మీడియా ముందుకు రారు. వార్తల్లో వ్యక్తికారు. పవన్‌పై అభిమానంతో పార్టీ కోసం ప్రచారానికి నోచుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు.
రకరకాల అసాంఘిక కార్యకలాపాలతో సంబంధం వున్న వాళ్లు పవన్‌కల్యాణ్ వీరాభిమానులుగా, జనసేన నాయకులుగా పబ్బం గడుపుకుంటున్న వైనం జనసేన సర్వేలో తేలినట్టు ప్రచారం పార్టీ శ్రేయోభిలాషులు సమాచారం ఇచ్చారు. ఇలా ప్రతి అంశంపైన సర్వే నివేదికలో వివరాలు వెల్లడించినట్టు చర్చ జరుగుతోంది. తిరుపతిలో వైసీపీ, టీడీపీ, జనసేన బలాలు, బలహీనతలు, పవన్ నిలిస్తే ఎలా వుంటుందనే దానిపై సమగ్ర రిపోర్ట్ అందించారు. నిర్ణయాన్ని జనసేనానికే వదిలిపెట్టారు.
ఇదిలా వుండగా పైన పేర్కొన్న అలాంటి నేతలను నమ్ముకుని తిరుపతిలో పవన్ పోటీ చేస్తే మాత్రం వైసీపీ నెత్తిన పాలు పోసినట్టే. ఎందుకంటే తిరుపతిలో ఆ పార్టీ క్షేత్రస్థాయిలో చాలా బలంగా వుంది. కేవలం కులాన్ని, జనసేన నేతల ఆర్భాట ప్రకటనలు నమ్మి తిరుపతి బరిలో పవన్ దిగితే మాత్రం… కుక్కతోక పట్టుకుని సముద్రాన్ని ఈదిన చందమే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.