మొన్నటికిమొన్న పుష్ప అనే అమ్మాయి సర్ ప్రైజ్ ఇస్తానంటూ తన కాబోయే భర్తను కళ్లు మూసుకోమని చెప్పి, హత్యాయత్నం చేసింది. అలాంటిదే మరో ఘటన కేరళలో జరిగింది. ఓ అబ్బాయి, బర్త్ డే పార్టీ ఇస్తానంటూ తన గర్ల్ ఫ్రెండ్ ను పిలిచాడు. ఆ తర్వాత ఆమెకు నిప్పంటించాడు. ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన బాలసుబ్రమణ్యం, తన పొరుగునే ఉన్న 16 ఏళ్ల అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. పుట్టినరోజు పార్టీ ఉందంటూ నిన్న ఆమెను తన ఇంటికి ఆహ్వానించాడు. అమ్మాయి ఇంటికొచ్చిన వెంటనే మరో గదిలోకి తీసుకెళ్లి తలుపులేశాడు. ఆమెకు నిప్పుపెట్టాడు. తర్వాత తను కూడా నిప్పంటించుకున్నాడు.
ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో బాలసుబ్రమణ్యం తల్లి, తమ్ముడు ఉన్నారు. తీవ్ర గాయాల పాలైన ఇద్దర్నీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం త్రిశూర్ హాస్పిటల్ కు మార్చారు. మృత్యువుతో పోరాడి ఆ ఇద్దరూ మరణించారు. అలా పుట్టినరోజు పార్టీ కోసం వెళ్లిన యువతి ప్రాణాలు కోల్పోయింది.
స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం.. వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారట. వీళ్ల ప్రేమను రెండు కుటుంబాలు నిరాకరించాయట. దీంతో బాలసుబ్రమణ్యం ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు చెబుతున్నారు. తన ప్రేయసిని హత్య చేయడంతో పాటు, తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.