దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ ఆసక్తికర కేసు వెలుగు చూసింది. ఓ మహిళకు చెందిన బంగారు ఆభరణాల బ్యాగును ఎలుకల సాయంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వినడానికి ఇది కాస్త వింతగా అనిపించినా నిజం. ఆ సంచిలో ఆమె వడ పావ్ ఉంచింది. ఆ బ్యాగ్‌ని పొరపాటున రోడ్డు పక్కన అడుక్కుంటున్న ఓ తల్లి, ఆమె పిల్లలకు ఇచ్చేసింది. కానీ ఆ తల్లి అది తినకుండా బ్యాగును చెత్తకుప్పలో పడేసింది. బ్యాగులో లభించిన బంగారం విలువ దాదాపు 5 లక్షలు.
ముంబైలోని గోరేగావ్‌లో పనిమనిషిగా పనిచేస్తున్న సుందరి అనే మహిళ, తన బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి, వచ్చిన డబ్బుతో అప్పు తీర్చాలనుకుంది. ఇంట్లో ఉన్న బంగారం మొత్తాన్ని బ్యాగులో సర్దుకుంది. అదే సంచిలో యజమాని తినడానికి ఇచ్చిన వడ పావ్ కూడా ఉంది. బ్యాంకుకు వెళుతుండగా, దీనావస్థలో అడుక్కుంటున్న ఓ మహిళ, ఆమె పిల్లల్ని చూసి చలించిపోయి వడపావ్ ఉన్న బ్యాక్ ఇచ్చేసింది. కానీ అందులో నగలు ఉన్నాయనే విషయాన్ని మరిచిపోయింది.
బ్యాంకుకు చేరుకోగానే ఆమె తన తప్పును గ్రహించి వెంటనే దిండోషి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. జరిగినదంతా చెప్పి తనకు సహాయం చేయమని కోరింది. మొత్తానికి పోలీసులు యాచకురాలి జాడను కనిపెట్టారు. అయితే బ్యాగ్ ఆమె దగ్గర లేదు. ఎండిపోయిన వడ పావ్ తినడానికి ఇష్టంలేక, బ్యాగ్ ను ఆమె చెత్తకుప్పలో విసిరేసింది.
యాచకురాలు చెప్పిన స్థలంలో బ్యాగ్ కనిపించకపోవడంతో పోలీసులు ఆ ప్రదేశంలో అమర్చిన సీసీటీవీని పరిశీలించారు. వడ పావ్, బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ని చెత్త కుప్పలో నుంచి ఎలుక కాలువలోకి లాగినట్లు సీసీటీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. సీసీటీవీలో లభించిన క్లూ ఆధారంగా పోలీసుల బృందం, ఎలుకల కలుగు నుంచి బంగారం బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. మహిళకు అప్పగించారు.