పేరుకి సాఫ్ట్ వేర్.. చేసేది డ్రగ్స్ వ్యాపారం

ఇద్దరూ స్నేహితులు, ఒకటే ప్రాంతం. పైగా ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. ఇలా అన్ని అభిరుచులు, ప్రాంతాలు కలవడమే కాదు, ఇద్దరూ డ్రగ్స్ లో కూడా కలిశారు. కలిసి డ్రగ్స్ తీసుకోవడంతో పాటు, డ్రగ్స్…

ఇద్దరూ స్నేహితులు, ఒకటే ప్రాంతం. పైగా ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. ఇలా అన్ని అభిరుచులు, ప్రాంతాలు కలవడమే కాదు, ఇద్దరూ డ్రగ్స్ లో కూడా కలిశారు. కలిసి డ్రగ్స్ తీసుకోవడంతో పాటు, డ్రగ్స్ అమ్మకం కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు. ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను హైదరాబాద్ శివార్లలో పోలీసులు అరెస్ట్ చేశారు.

సూర్యసంపత్, దీపక్ ఫణీంద్ర ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. ఒకరిది కాకినాడ, మరొకరిది రాజమండ్రి. ఇద్దరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ కు అలవాటుపడ్డారు. ఇందులో భాగంగా 25వ తేదీన డ్రగ్స్ కోసం గోవా వెళ్లారు. ఎండీఎంఏ మాత్రలు, ఎల్ఎస్డీ కొనుగోలు చేశారు.

గోవా నుంచి బస్సులో హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ్నుంచి రింగ్ రోడ్డుకు వెళ్లి, లారీ ఎక్కి రాజమండ్రి చేరుకోవాలనేది వీళ్ల ప్లాన్. అనుకున్నట్టుగానే లారీ ఎక్కారు. కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది. పోలీసులకు పక్కా సమాచారం అందింది. హైదరాబాద్ శివార్లలోని చౌటుప్పల్ వద్ద లారీ ఆపారు. సూర్య సంపత్, దీపక్ ఫణీంద్రను అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల విలువ బహిరంగ మార్కెట్లో 2 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని తెలిపారు పోలీసులు. నిందితులిద్దర్నీ కోర్టు ముందు హాజరుపరిచి నల్గొండ జైలుకు తరలించారు.