వాట్సాఫ్ మెసేజీలు, వీడియో కాల్స్.. ప్రేమికులకు ఇప్పుడివే మాధ్యమాలు. గంటలు గంటలు మాట్లాడుకోవడం సర్వసాధారణం. ఆ అమ్మాయి కూడా అదే చేసింది. ప్రతి రోజూ ఫోన్ లో మాట్లాడింది. కొన్ని సార్లు అర్థనగ్న ఫొటోలు కూడా పంపించింది. కట్ చేస్తే, కొన్ని రోజులకు అసలు అతడు తన ప్రియుడు కాదని తెలుసుకుంది. హైదరాబాద్ లో జరిగింది ఈ ఘటన.
హైదరాబాద్ కు చెందిన ఓ యువతికి, రాజు అనే యువకుడు చాన్నాళ్లుగా తెలుసు. ఇద్దరూ గతంలో ప్రేమించుకున్నారు. ఆ తర్వాత గ్యాప్ వచ్చింది. మళ్లీ చాలా రోజులకు సదరు యువతితో రాజు టచ్ లోకి వచ్చాడు. ప్రియుడు మళ్లీ లైన్లోకి రావడంతో యువతిలో ఉత్సాహం వచ్చింది. తరచుగా ఇద్దరూ ఛాట్ చేసుకునేవాళ్లు. ఈ క్రమంలో చాలా దూరం వెళ్లారు. ప్రియుడి కోరిక మేరకు న్యూడ్ ఫొటోలు కూడా పంపించింది యువతి.
చివరికి ఓ రోజు రానే వచ్చింది. ఇద్దరూ కలిసుకోవాలనుకున్నారు. కలిసిన తర్వాత యువతి షాక్ అయింది. ఇన్నాళ్లూ తన ఛాట్ చేసింది, ఫోన్ లో మాట్లాడింది రాజుతో కాదు మహ్మద్ మోసిన్ తో అనే విషయాన్ని గ్రహించింది. రాజు తన ఫోన్ నంబర్ మార్చేయగా, ఆ నంబర్ మోసిన్ చేతికొచ్చింది. ఈ విషయం తెలియని యువతి న్యూడ్ ఫొటోలు పంపించింది.
తన ఫొటోలు డిలీట్ చేయాలని యువతి కోరింది. దానికి మోసిన్ నిరాకరించాడు. అడిగినంత డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. లేదంటే ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో వెంటనే ఆ యువతి షీ టీమ్ ను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన షీటీమ్ పోలీసులు, మోసిన్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు. యువకుడిపై 385, 354, 67-ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.