డిపాజిట్లకు గతిలేదు గానీ.. రాజధాని కడతారట!

‘ఆలూ లేదు చూలూ లేదు కొడుకుపేరు మెగాస్టార్’ అన్నాడట వెనకటికి ఓ ప్రబుద్ధుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం వారి పరిస్థితి అంతకంటె భిన్నంగా ఎంతమాత్రమూ లేదు.  Advertisement ఏపీలో ఉన్నపళంగా ఎన్నికలు పెడితే.. ఏ…

‘ఆలూ లేదు చూలూ లేదు కొడుకుపేరు మెగాస్టార్’ అన్నాడట వెనకటికి ఓ ప్రబుద్ధుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం వారి పరిస్థితి అంతకంటె భిన్నంగా ఎంతమాత్రమూ లేదు. 

ఏపీలో ఉన్నపళంగా ఎన్నికలు పెడితే.. ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా డిపాజిట్ తెచ్చుకోగలిగేపాటి సత్తా ఆ పార్టీకి లేదు గానీ.. తాము అధికారంలోకి రాగానే.. మూడు సంవత్సరాల్లోగా అమరావతిలో రాజధాని నిర్మాణం పూర్తిచేస్తాం అని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు అంటున్నారు. 

తాను అమరావతి వ్యతిరేకి అని పార్టీలో ఉన్న ముద్రను తొలగించుకోవడానికి ఆయన ఇలా అవాకులు చెవాకులు పదేపదే పేలుతున్నట్టుగా ఉన్నది తప్ప.. నిజంగా అమరావతి నిర్మాణం పట్ల ఆయనలో శ్రద్ధ ఉన్నట్లుగా కనిపించడం లేదు. 

అమరావతి రాజధాని విషయంలో భారతీయ జనతా పార్టీకి వాస్తవమైన శ్రద్ధ లేదు. సోము వీర్రాజు సారథి అయినప్పటినుంచి.. అమరావతి సమస్యను వారు పూర్తిగా పక్కన పెట్టారు. చంద్రబాబునాయుడు మీద తమ ఆగ్రహం కక్కడం మీదనే శ్రద్ధ పెట్టారు. ఈలోగా.. తిరుపతిలో జరిగిన పార్టీ సమావేశంలో అమిత్ షా అమరావతి విషయంలో పార్టీ నాయకుల  మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అందరూ ఒక్కసారిగా అమరావతి అనుకూల పాట పాడడం ప్రారంభించారు. 

అమిత్ షా నుంచి అక్షింతలు దండిగా వేయించుకున్న సోము వీర్రాజు.. తనను మించిన అమరావతి ప్రేమికుడు లేడన్నట్లుగా మాట్లాడడం ప్రారంభించారు. నిజంగా అమరావతి మీద శ్రద్ధ ఉండే వారే అయితే గనుక.. ఏదో ఒక క్రియాశీల ప్రయత్నం చేయాలి. అలాంటిదేమీ లేకుండా.. తాము అధికారంలోకి వస్తే.. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తిచేస్తాం అని చెప్పడం చాలా చాలా కామెడీగా ఉంది. 

రాష్ట్రంలో ఎక్కడా డిపాజిట్ తెచ్చుకునేంత సీన్ భారతీయ జనతా పార్టీకి లేదు. వీరు అధికారంలోకి వస్తే మూడేళ్లలో రాజధాని నిర్మించడం నిజమే ఏమో గానీ.. ఇప్పుడు ఏపీ ప్రజలు ఆ పార్టీని ఛీత్కరించుకుంటున్న తీవ్రత గ మనిస్తే వీరు అధికారంలోకి రావడానికి కనీసం మూడు శతాబ్దాలు పడుతుందని మనకు అనిపిస్తుంది. అన్నేళ్లూ ప్రజలు రాజధాని లేకుండా ఎదురు చూడాలనేది బహుశా సోము ఉద్దేశమేమో తెలియదు. 

అసలు రాజధాని నిర్మాణం అంటే సోము గారు ఏం అనుకుంటున్నారో మనకు అర్థం కావడం లేదు. ఓ సెక్రటేరియట్, అసెంబ్లీ, రాజ్ భవన్ లను మూడేళ్లలో కట్టేసి.. రాజధాని అంటే ఇంతే కదా.. మిగిలిన నిర్మాణాలు మీఖర్మం అని గాలికొదిలేస్తారేమో కూడా తెలియదు. అయినా ఇదంతా వారు అధికారంలోకి వచ్చినప్పటి సంగతి కదా!