Advertisement

Advertisement


Home > Movies - Reviews

Major Review: మూవీ రివ్యూ: మేజర్

Major Review: మూవీ రివ్యూ: మేజర్

టైటిల్: మేజర్
రేటింగ్: 3/5
తారాగణం: అడివి శేష్, సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ తదితరులు
కెమెరా: వంశీ పచ్చిపులుసు
ఎడిటింగ్: విజయ్ కుమార్, పవన్ కళ్యాణ్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
సంభాషణలు: అబ్బూరి రవి
నిర్మాత: మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర 
దర్శకత్వం: శశి కిరణ్ తిక్క

వెండితెర మీద బయోపిక్స్ తరచూ వస్తూనే ఉన్నాయి. వీటిల్లో క్రీడాకారుల కథలు ఎక్కువ. అలాగే రాజకీయ, సినీ ప్రముఖుల బయోపిక్స్ కూడా చూస్తున్నాం. ఈ కోవలో ఒక మిలిటరీ ఆఫీసర్ కథ ఈ "మేజర్". 

2008 లో 26/11 ముంబై దాడుల్ని ఎవరూ మరిచిపోలేరు. ఆ ఉదంతంలో ఎనెస్జీ కమెండోల వీరోచిత పోరాటం వల్ల తీవ్రవాదులు హతమయ్యారు. ఆ ఆపరేషన్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవనచిత్రం ఈ "మేజర్". 

తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంట్స్ తో గౌరవప్రదమైన స్థానాన్ని నిలుపుకుంటున్న అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రానికి మహేష్ బాబు కూడా నిర్మాణంలో భాగస్వామి కావడం క్లాస్ కి మాస్ టచ్ ఇచ్చినట్టయ్యింది. 

ఒక ఆఫీసర్ కథని సినిమాటిక్ గా కొన్ని లిబర్టీస్ తీసుకుంటూ తీసిన ఈ సినిమాకి ఆయువుపట్టు సెకండాఫ్. ఎందుకంటే సందీప్ ఉన్నికృష్ణన్ వ్యక్తిగత జీవితం కంటే అతని వీరోచిత పోరాటాన్ని చూసేందుకే అధిక శాతం ప్రేక్షకులకి ఆసక్తుంటుంది. 

అయినా కూడా తొలి సగంలో చూపించిన ఫ్యామిలీ స్టోరీలో ఎక్కడా కూడా అసంబద్ధత లేకుండా, ప్రతి సన్నివేశాన్ని క్లైమాక్స్ లో వాడుకునే విధంగా రాసుకున్నారు. ఆ రకంగా రచయితగా అడివి శేష్ కి నూటికి నూరు మార్కులేయాలి. 

అయితే స్క్రీన్ ప్లే లో మాత్రం లోపాలు లేకపోలేదు. మంచి ఉత్కంఠని రేపే యాక్షన్ సన్నివేశం నడుమ ఫ్లాష్ బ్యాక్ కి కట్టయ్యి కాసేపు పెళ్లి వగైరా సన్నివేశాలు రావడంతో ఎమోషనల్ గ్రాఫ్ డ్రాప్ అవుతుంది. 

అలాగే తొలి సగంలో కూడా ఎమోషన్ సింకవ్వకుండా కథ చాలా స్పీడుగా పరుగెత్తుతున్నట్టుంటుంది. సంభాషణల్లో పెద్దగా పంచ్ లేకపోవడం, మరీ పొయెటిక్ గా ఉండడం కూడా డ్రాప్ కి కొంత కారణం.

సినిమాకి ప్రధాన ఆకర్షణ కంటికి ఇంపుగా ఉంటూ పాత్రల్లో ఒదిగిపోయిన అడివి శేష్, సయీ మంజ్రేకర్. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో యంగ్ సందీప్ గా అడివి శేష్ ఆశ్చర్యపరిచాడు. సయీ మంజ్రేకర్ కూడా ఫ్లాష్ బ్యాక్ లో సన్నగానూ, ప్రెజెంట్ స్టోరీలో కాస్త బొద్దుగానూ కనిపించింది. ఇది వాళ్ల కష్టమో, గ్రాఫిక్స్ మాయాజాలమో వేరే సంగతి. 

ఇక అసలు కథ విషయానికొస్తే ఖడకవాస్లాలో ఎన్.డి.ఎ ట్రైనింగ్ సన్నివేశాల్ని ఆసక్తికరంగా చూపించారు. ట్రైనింగులో చూపించినవన్నీ క్లైమాక్స్ కి కనెక్ట్ చేసిన విధానం "దంగల్" ని గుర్తు చేస్తుంది. ప్రేక్షకులు ఎమోషన్ కి గురయ్యేది ఇలాంటి సన్నివేశాలున్నప్పుడే. 

అయితే నానాపాటేకర్ 1991 నాటి చిత్రం "ప్రహార్" లో అసలు సిసలైన మిలిటరీ ట్రైనింగ్ ఎంత కఠినంగా ఉంటుందో చూడొచ్చు. ఆ స్థాయిలో చూపించగలిగే అవకాశమున్నా ఇందులో కమెర్షియల్ యాంగిల్ కి లోబడి హీరోయిజం పాయింటాఫ్ వ్యూవులో మాత్రమే చూపించినట్టనిపించింది. 

26/11 దాడుల మీద రాం గోపాల్ వర్మ చాలా విపులంగా సినిమా తీసాడు. లియోపాల్డ్ కేఫ్, ముంబాయ్ తాజ్, రైల్వే స్టేషన్ ఎపిసోడ్స్ అన్నీ అందులో కవరయ్యాయి. అయితే ఇందులో ప్రధానంగా సందీప్ ఉన్నికృష్ణన్ సాహసం ప్రధాన కథ. శోభితా ధూళిపాళ ని తాజ్ హోటల్లో ఒక హోస్టేజ్ గా చూపించి ఆ యాంగిల్లో కూడా డ్రామాని రక్తి కట్టించడం బాగుంది. 

మామూలు ఫిక్షన్ సినిమాలో అయితే నలుగురైదుగురు కుర్ర తీవ్రవాదుల్ని చంపడానికి ఇంత యాక్షన్ ఎపిసోడ్ కండక్ట్ చేయడం జరగదు. హీరో గారు చొక్కా నలగకుండా మట్టి కరిపించేస్తాడు. కానీ రియల్ ఆపరేషన్ లో లోపల ఎంతమంది తీవ్రవాదులున్నారో తెలియని నేపథ్యంలో వ్యవహారం చాలా జటిలంగా ఉంటుంది. ఆ జటిలత్వాన్ని మరింత ఉత్కంఠభరితంగా వివరించి హ్యాండిల్ చేసుండాల్సింది. 

ఇలాంటి ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు మీడియా అత్యుత్సాహం వల్ల ఎంత నష్టం జరుగుతుందో రాసుకున్న సీన్ ని మాత్రం మెచ్చుకుని తీరాలి.

మేజర్ సందీప్ గా అడివి శేష్ జీవించాడు. మరీ ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో తన సత్తా చాటుకున్నాడు. క్లైమాక్స్ లో కంట తడి పెట్టించాడు. 

సయీ మంజ్రేకర్ చూడ్డానికి చాలా బాగుంది. నటనపరంగా కూడా న్యాయం చేసింది. 

ప్రకాష్ రాజ్, రేవతి లు సందీప్ తల్లిదండ్రులుగా సటిల్ గా చేసారు. దుర్వార్త విన్నాక ఇద్దరూ కలిసి వర్షంలో తడుస్తూ ఏడ్చిన సన్నివేశం మనసుల్ని కదిలిస్తుంది. 

మిగిలిన నటీనటులంతా పాత్రకు తగ్గట్టుండి, సన్నివేశానికి సరిపడా పని చేసారు. 

శ్రీచరణ్ సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. కెమెరా పనితనం, ఇతర సాంకేతిక విలువలు అన్నీ చక్కగా కుదిరాయి. 

దీనిని దేశభక్తి చిత్రం అనడం కంటే ఒక నిఖార్సైన సైనికుడు మొండితనాన్ని అద్దం పట్టే చిత్రం అని చెప్పుకోవచ్చు. ఈ తరహా చిత్రాలకి ప్రేక్షకుల నుంచి ప్రోత్సాహం లభించాలి. దేశప్రజల రక్షణ కోసం, దేశ గౌరవం కోసం పోరాడి వీరమరణం పొందిన ఒక సైనికుడి జీవితాన్ని సినిమాగా తీసుకుని నాలుగు కన్నీటి బొట్లు రాల్చడం కూడా ఆ సైనికుడికి అర్పించే నివాళే.  

బాటం లైన్: శాల్యూట్ మేజర్

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను