ఒకటో తేదీ వస్తున్నదంటే జగన్ ప్రభుత్వానికి వణుకే. జీతాల చెల్లింపునకు ఏపీ సర్కార్ నానా అగచాట్లు పడుతోంది. ఒకవైపు సంక్షేమ పథకాలకు ఇబ్బంది లేకుండా డబ్బు సర్దడం, మరోవైపు ఉద్యోగుల వేతనాలకు అడ్జెస్ట్ చేసుకోవడం ఏ నెలకానెల భారమవుతోంది. ఈ నేపథ్యంలో జూన్ ఒకటో తేదీకే ఉద్యోగులు, పింఛన్‌దారులందరికీ వేతనాలు అందాయి.
ఇటీవల కాలంలో ఇంత ఖచ్చితంగా వేతనాలు అందడం బహుశా ఇదే అయి వుండొచ్చు. అందుకే ఈ నెల జీతాల చెల్లింపుపై ఎల్లో మీడియాలో ఎలాంటి వార్తలు రాలేదు. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని ప్రతిపక్షాలు విమర్శించలేదు.
ప్రతి నెలా జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు, పింఛన్‌దారులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పు పుట్టడం బట్టి ఉద్యోగులు, పింఛన్‌దారులకు వేతనాలు అందడం ఆధారపడి వుంటుంది. ఆర్థిక పరపతికి మించి అప్పులు చేస్తుండడంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతుల నిరాకరణ ఎదురవుతోంది. దీంతో అప్పుల కోసం ఢిల్లీలకి రాష్ట్ర ఆర్థిక మంత్రి, సంబంధిత అధికారులు చక్కర్లు కొట్టడమే ఉద్యోగమైంది. అయితే తెలంగాణ ప్రభుత్వానికి అప్పు విషయంలో ఏపీ కష్టాలొచ్చాయి.
పరిమితికి మించి తెలంగాణ అప్పులు చేయడంతో, సుమారు రూ.18 వేల కోట్ల అప్పునకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వ వివక్షపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నిబంధనా? అని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఈ నెల ఒకటో తేదీ ఉద్యోగులందరికీ తెలంగాణలో జీతాలు వేయలేని పరిస్థితి. కొందరికి మాత్రమే జీతాలు పడ్డట్టు సమాచారం.