వెన్నుపోటు మరోసారి చర్చనీయాంశమైంది. ఈ దఫా వెన్నుపోటుకు పితామహుడిగా పేరు గాంచిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై 2001లో కేసీఆర్ నేతృత్వంలో కుట్ర జరిగిందనేది ఆరోపణ. ఈ తీవ్ర ఆరోపణను తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. కేసీఆర్ అధికార దాహం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి 21 ఏళ్ల నాటి కుట్ర బాగోతాన్ని తెరపైకి తేవడం చర్చనీయాంశమైంది.
పిల్లనిచ్చి, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచిన నాయకుడిగా చంద్రబాబు గురించి చెప్పుకుంటారు. వెన్నుపోటుదారుడనే మచ్చ చంద్రబాబును నీడలా వెంటాడుతోంది. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇది చెరగని మచ్చగా మిగిలింది. ఎన్టీఆర్‌ను కూలదోయడంలో బాబుకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సహకరించారు. ఎన్టీఆర్‌ను కూల్చే కుట్రలో బాబుకు బొజ్జల వెన్నుదన్నుగా నిలిచారు. బొజ్జల సమీప బంధువుకు సంబంధించిన వైశ్రాయ్ హోటల్ కేంద్రంగా ఎన్టీఆర్ ప్రభుత్వ కూల్చివేత విజయవంతంగా సాగింది.
ఈ నేపథ్యంలో 2001లో చంద్రబాబును ముఖ్యమంత్రి పీఠం నుంచి కూల్చేందుకు కేసీఆర్ కూడా బొజ్జలను ఆశ్రయించారని బీజేపీ నేత తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం. అయితే జ్యోతుల నెహ్రూ అప్రమత్తం చేయడంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. బాబును దించాలని కేసీఆర్ కుట్రపన్నారనే ఆరోపణలను తోసిపుచ్చలేం.
ఎందుకంటే ఇదే రకమైన ఆరోపణలను గతంలో ఓ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి కూడా చేశారు. అసెంబ్లీలో తన పక్కనే కేసీఆర్ కూచునే వారని, చంద్రబాబును దించాలనే అభిప్రాయాల్ని వ్యక్తపరిచేవారని మైసూరా చెప్పడానికి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు.
అయితే చంద్రశేఖర్ ఆరోపించినట్టు బొజ్జల పాత్ర ఉండే అవకాశం లేదు. బొజ్జలకు కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ సన్నిహితులే. కానీ బొజ్జల తనను పడగొడతాడని తెలిసి కూడా ఆయన్ను చంద్రబాబు ప్రోత్సహిస్తారని నమ్మలేం. ఎందుకంటే కుట్రదారుడు వెంట వుంటే ఎప్పటికైనా ముప్పే అని, ఒక కుట్రదారుడిగా చంద్రబాబుకు తెలిసినట్టుగా మరెవరికీ తెలియదు.
ఎన్టీఆర్‌ను పడగొట్టడంలో సహకరించిన తోడల్లుడు దగ్గుబాటి, బామ్మర్ది హరికృష్ణల రాజకీయ జీవితాలను చంద్రబాబు ఎలా ముగించారో అందరికీ తెలుసు. కానీ బొజ్జల విషయంలో చంద్రబాబు ఆదరణ ఎప్పుడూ తగ్గలేదు. బొజ్జల తుదిశ్వాస వరకూ చంద్రబాబు ప్రేమతో మెలిగారు. వైశ్రాయ్ హోటల్ అధినేతను రాజ్యసభకు కూడా పంపారు. తెలంగాణ బీజేపీ నేత ఆరోపించినట్టు చంద్రబాబును సీఎం పీఠంపై నుంచి కూల్చాలనే కుట్రకు పాల్పడ్డారని నమ్మొచ్చు. కానీ బొజ్జల పాత్రపైనే డౌట్.