వైసీపీ ఎమ్మెల్యేల్లో అదృష్టవంతురాలు ఎవరని ప్రశ్నిస్తే చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ పేరు వినపడుతుంది. చివరి నిమిషంలో టీడీపీ నుంచి వైసీపీలో జాయిన్ కావడంతో పాటు వెంటనే చిలకలూరిపేట టికెట్ దక్కించుకున్నారు. చిన్నవయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిమానాన్ని చూరగొన్నారు. సోషల్ మీడియాలో రజనీకి నెటిజన్ల విశేష ఆదరణ ఉంది.
మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణలో ఆమె జాక్‌పాట్ కొట్టారు. మంత్రి పదవి దక్కించుకున్నారు. అంతేకాదు, కీలకమైన వైద్యారోగ్యశాఖ మంత్రిత్వ బాధ్యతల్ని రజనీకి అప్పగించారు. రజనీకి రాజకీయ ఎదుగుదల ప్రత్యర్థులకు కూడా ఈర్ష్య కలిగేలా ఉందనడంలో అతిశయోక్తి లేదు.
ఎప్పుడూ నవ్వుతూ కనిపించే విడదల రజనీ, ఇతరుల్ని నవ్వించాలని భావిస్తున్నట్టున్నారు. ఆమె జోకులు పేలుస్తున్నారు. ఇందుకు మంగళగిరిలోని వైద్యారోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన అధికారుల సమీక్ష సమావేశం వేదికైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, బయట మందులు కొనుగోలు చేయాలని సూచించవద్దని ఆమె చెప్పడం గమనార్హం.
ఈ సూచనకు నవ్వు ఆపుకోలేక చచ్చామని వైద్యారోగ్యశాఖ అధికారులు చెప్పడం విశేషం. వైద్య సేవల మెరుగు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా మందులు బయట కొనుక్కోవాలని రోగులకు వైద్యులు రాయడం తగదని ఆమె హితవు కూడా చెబుతున్నారు. రోగ నిర్ధారణ పరీక్షలు కూడా ఆస్పత్రిలో చేయాలని ఆమె ఆదేశించారు.
మందులు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో కొంత కాలంగా ప్రభుత్వ ఆస్పత్రుల వైపు సరఫరాదారులు చూడడం లేదన్నది వాస్తవం. బహుశా మంత్రి గారు కలలు కంటున్నారేమో అని వైద్యారోగ్యశాఖ అధికారులు, మందులు సరఫరా చేసిన కాంట్రాక్టర్లు అంటున్నారు.