తెలుగు రాష్ట్రాల్లో ఆన్ లైన్ లోన్ యాప్ ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది ఈ యాప్స్ బారిన పడి, వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా చూశాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఓ వేధింపుల ఘటన బయటపడింది. అయితే ఆ అమ్మాయి ధైర్యంగా నిలబడింది, పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధిత మహిళ విజయవాడలో వైఎస్ఆర్ కాలనీలో ఉంటోంది. దగ్గర్లోని ప్రైవేట్ సంస్థలో ఎకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తోంది. ఇంట్లో ఆర్థిక అవసరాలు పెరగడంతో ఆన్ లైన్ లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంది. 55,435 రూపాయలు లోన్ తీసుకుంటే, దానికి వడ్డీతో కలిపి ఇప్పటివరకు 2 లక్షల రూపాయలకు పైగా చెల్లించింది.
అయితే ఇంత చెల్లించినప్పటికీ లోన్ యాప్స్, ఆ మహిళను వదల్లేదు. ఇంకా బాకీ ఉందని, వడ్డీ చెల్లించాలని వేధించడం మొదలు పెట్టాయి. అక్కడితో ఆగకుండా యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి, న్యూడ్ ఫొటోలు తయారుచేసి ఆమెకు పంపించారు. వాటిని సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తామని బెదిరించారు.
అలా ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు 80 వాట్సాప్ నంబర్ల నుంచి బాధిత మహిళకు మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫొటోలు వచ్చాయి. అయితే బాధిత మహిళ బెదిరిపోలేదు. ఆత్మహత్య లాంటి పిరికి ఆలోచనలు చేయలేదు. ధైర్యంగా ముందడుగు వేసింది. సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది.
బాధిత మహిళ అందించిన సాక్ష్యాల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు, లోన్ యాప్ నిర్వహకులపై నిఘా పెట్టారు. 80 వాట్సాప్ నంబర్లను వెదికే పనిలో ఉన్నారు. వీటితో పాటు 4 మొబైల్ నంబర్ల నుంచి వచ్చిన వాయిస్ మెసేజీల్ని కూడా విశ్లేషించే పనిలో పడ్డారు.