ఎన్నో ఏళ్లుగా నయనతార ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఈరోజు విఘ్నేశ్ శివన్ తో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది ఈ లేడీ సూపర్ స్టార్. మరికొన్ని గంటల్లో నయన్-విఘ్నేష్ పెళ్లి సంప్రదాయబద్ధంగా జరగనుంది.
మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్ రిసార్ట్ హోటల్ లో ఈ పెళ్లి కోసం సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు జరగనున్న ఈ పెళ్లికి తమిళనాడుకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. రజనీకాంత్, అజిత్ తో పాటు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ విహాహానికి హాజరయ్యే అవకాశం ఉంది. వీళ్లు ఈరోజు పెళ్లికి వస్తారా లేక రిసెప్షన్ కు హాజరవుతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
సెక్యూరిటీ కూడా గట్టిగా పెట్టారు. అతిథులందరికీ క్యూఆర్ కోడ్ కేటాయించారు. కోడ్ యాక్సెస్ అయిన తర్వాత మాత్రమే హోటల్ లోకి అనుమతిస్తారు. ఎంతమంది వస్తున్నారో కూడా ఆ కోడ్ లో ముందుగానే నిక్షిప్తం అయి ఉంటుంది.
ఇక పెళ్లి ఏర్పాట్ల విషయానికొస్తే.. ప్రతి అడుగులో నయన్-విఘ్నేష్ కనిపించేలా ఏర్పాట్లు చేశారు. చివరికి అతిథులకు ఇచ్చే వాటర్ బాటిళ్లు, చేతి రుమాళ్లపై కూడా నయన్-విఘ్నేష్ ఫొటోలు ప్రింట్ చేశారు. నయనతార ఎలా పెళ్లి చేసుకోవాలని భావించిందో, ఆమె ఆలోచనలకు తగ్గట్టు మొత్తం ఏర్పాటుచేశారు.
గౌతమ్ మీనన్ కు చెందిన కంపెనీ, అతడి టెక్నికల్ యూనిట్ ఈ పెళ్లికి సంబంధించిన చిత్రీకరణ బాధ్యత మొత్తం తీసుకుంది. ప్రతి క్షణాన్ని కెమెరాలో బంధించి, నయనతార, విఘ్నేష్ కు అందించబోతోంది.
ప్రభుదేవాతో నయనతార బంధం పెళ్లిపీటల వరకు వచ్చి ఆగిపోయింది. ఆ తర్వాత ఆమె విఘ్నేష్ శివన్ కు దగ్గరైంది. వీళ్లిద్దరూ దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అలా ప్రేమలో మునిగిన ఈ జంట, ఈరోజు వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగించనుంది నయనతార.