గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు గెలిచాం, వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో గెలిచితీరాలి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయడం ఎల్లో బ్యాచ్‌కి అతిశయోక్తిగా అనిపిస్తోంది. కానీ కుప్పం మున్సిపాలిటీతో పాటు ఆ నియోజకవర్గంలోని స్థానిక సంస్థలన్నింటిని క్లీన్ స్వీప్ చేస్తామని ఎవరైనా అనుకున్నారా? అని ప్రశ్నిస్తూ…. మనిషి తలచు కుంటే అసాధ్యమనేది లేదని జగన్ చెప్పడం వైసీపీ ప్రజాప్రతినిధుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది.
ఆశయాలు, ఆలోచనలు ఉన్నతంగా ఉన్నప్పుడే, మనిషి తనకంటూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం పొందుతాడు. మొదట మనలో మనకు నమ్మకం వుండాలి. ఆ పాజిటివిటీనే సగం విజయం. జగన్ నిన్నటి దిశానిర్దేశం వెనుక స్ఫూర్తి అదే.
నిన్నటి సమావేశంలో మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని, 175 సీట్లు సాధించాలని చెప్పడమే కాకుండా, ఇందుకు నిత్యం ప్రజల మధ్య ఉండడమే ఏకైక మార్గమని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే అని జగన్ మరోసారి స్పష్టం చేశారు. ప్రజల్ని నమ్ముకున్న వాళ్లెవరూ మోసపోరని జగన్ తెలిపారు.
రానున్న రోజుల్లో ఎల్లో మీడియా సాయంతో ప్రత్యర్థులు మరింత దుష్ప్రచారం చేస్తారని, వీటన్నింటిని ప్రజాదరణ ద్వారానే తిప్పి కొట్టాలని సూచించారు. విపక్షాల కుయుక్తులు, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే మనం నిత్యం ప్రజల్లో ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలు, ప్రజలు అని జగన్ వారి నామస్మరణ చేయడం గమనార్హం. ఒకవైపు ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం చేస్తున్న వాళ్లకి, జగన్ ధీమా షాక్ ఇచ్చేలా వుంది.
నామమాత్రంగా కూడా వైసీపీకి సీట్లు రావని తాము నమ్ముతూ, ప్రజల్ని నమ్మించాలని తపిస్తున్న ఎల్లో బ్యాచ్‌కు…. జగన్ దిశానిర్దేశం ఒక పట్టాన జీర్ణం కాలేదు. 175కు 175 సీట్లు సాధించాలని టార్గెట్ పెడితే, కనీసం 120 సీట్లైనా గెలుస్తామని జగన్ నమ్మకం. గతంలో 151 సీట్లు గెలిచిన జగన్‌కు, 175కి 175 దక్కించుకుంటామనే ధీమా వుండడంలో అతిశయోక్తి ఏముంది?
నవరత్నాల పేరుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో పూర్తిస్థాయిలో సంతృప్తి ఉందని జగన్ విశ్వసిస్తున్నారు. దీన్ని ఎలా కాదనగలరు? గడపగడపకూ మన ప్రభుత్వం పేరుతో వైసీపీ ప్రజాప్రతినిధులు నేరుగా ఇళ్ల వద్దకే వెళుతున్నారు. ఏఏ ఇంటికి ఎంతెంత లబ్ధి కలుగుతున్నదో వివరాలతో సహా లబ్దిదారులకే అందిస్తున్నారు. అలాంటప్పుడు నిలదీతకు తావెక్కడిది?
ఒకవేళ ఎక్కడైనా అర్హులైనా ఏదైనా కారణంతో లబ్ధి అందకపోతే, అక్కడికక్కడే వలంటీర్లు, సంబంధిత అధికారుల సమక్షంలోనే పరిష్కార మార్గం చూపుతున్నారు. కనీసం తాము ఏం చేశామో చెప్పుకోడానికి వైసీపీకి అవకాశం ఉంది. వైసీపీ ప్రచారంలో వాస్తవం లేదని టీడీపీ ఇంటింటికెళ్లి ప్రచారం చేయగలదా? తాము వస్తే నవరత్నాల పథకాలను రద్దు చేస్తామని టీడీపీ చెప్పగలదా? ఏది ఏమైనా జగన్ దిశానిర్దేశం వైసీపీ ప్రజాప్రతినిధుల్లో జోష్ నింపింది. ప్రజల వద్దకు మరింత చొరవగా వెళ్లడానికి, ఆశీస్సులు కోరడానికి టానిక్‌గా పనిచేసింది.