ఎవరైనా కూరలో కరివేపాకు వేస్తారు. అన్నంలో కరివేపాకు వేసే వాళ్లు కూడా ఉన్నారు. మరి తాగే టీలో కరివేపాకు వేస్తే ఏమౌతుంది? తేనీరు, కరివేపాకు కాంబినేషన్ సెట్ అవుతుందా?
కచ్చితంగా సెట్ అవుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరీ ముఖ్యంగా కూరలో కరివేపాకును తీసి పక్కన పడేసే వాళ్లు ''కరివేపటీ'' తాగాలని సూచిస్తున్నారు. మలబద్ధకం, అజీర్తి సమస్యలు ఉన్న వాళ్లు ఈ ''కరివేపటీ'' తాగితే మంచిదంట.
ఇక షుగర్ ఉన్నవాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు. చికాగో యూనివర్సిటీలో జరిపిన ఓ పరిశోధనలో ''కరివేపటీ'' తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ 45 శాతం తగ్గినట్టు గుర్తించారు.
కరివేపలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫెనో ఫైబ్రేట్స్ చర్మవ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. ఉదయాన్నే ఈ టీ తాగితే ఇనిస్టెంట్ ఎనర్జీ, ఉత్సాహం వస్తుంది. శరీర ఉష్ణోగ్రతను కూడా ఇది బ్యాలెన్స్ చేస్తుంది.
ఇంతకీ ఈ టీ ఎలా చేసుకోవాలో తెలుసా? బాగా మరిగించిన నీళ్లలో ఓ 20 కరివేపాకులు వేయడమే. నీళ్లు రంగు మారిన తర్వాత ఫిల్టర్ చేస్తే టీ రెడీ. ఇందులో నిమ్మరసం, తేనె కలుపుకోవచ్చు. కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు.
అయితే రోజువారీ భోజనంలో కరివేపాకు తినని వాళ్ల కోసమే ఈ టీ. రెగ్యులర్ గా తినే వంటల్లో కరివేపాకు కూడా కలిపి లాగించేసే వాళ్లకు ఈ ''కరివేపటీ'' అవసరం పెద్దగా ఉండదు.