అలామొదలై..ఇలా సాగుతోంది..నందినీ రెడ్డి

అలామొదలైంది..అన్న సినిమా ప్రకటించినపుడు ఎవరికీ ఏ ఆసక్తి లేదు..సినిమా విడుదలైన తరువాత స్టార్ట్ అయింది.. దానిపై ఆసక్తి. మంచి హిట్.. ఆ ఊపుతోనే జబర్దస్త్ అంటూ సమంత.. సిద్దార్ధల క్రేజీ కాంబినేషన్ తో సినిమా…

అలామొదలైంది..అన్న సినిమా ప్రకటించినపుడు ఎవరికీ ఏ ఆసక్తి లేదు..సినిమా విడుదలైన తరువాత స్టార్ట్ అయింది.. దానిపై ఆసక్తి. మంచి హిట్.. ఆ ఊపుతోనే జబర్దస్త్ అంటూ సమంత.. సిద్దార్ధల క్రేజీ కాంబినేషన్ తో సినిమా అనౌన్స్ అయింది. ఆరంభంలోనే సూపర్ హైప్.. సినిమా విడుదలై సూపర్ ఫ్లాప్.. ఇలాంటి చిత్రమైన జర్నీ దర్శకురాలు నందినీ రెడ్డిది. టాలీవుడ్ లోని మంచి దర్శకుల్లో ఒకరైన కృష్ణవంశీ శిష్యురాలు నందనీ రెడ్డి. తనకంటూ ఓ ఐడియాలజీ.. విజన్ వున్న దర్శకురాలు. ఓ హిట్టు.. ఓ ఫ్లాపు ఇచ్చిన గ్యాప్ అనంతరం ముచ్చటగా మూడోసారి ‘కళ్యాణ వైభోగమే’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘గ్రేట్ ఆంధ్ర’ ఆమెను పలకరించింది. ఆ ముఖాముఖి..

అందరూ అడుగుతూనే వుంటారు.. గ్యాప్ బాగా వచ్చిందని..అవునా?

నిజమే అందరూ అదే అడుగుతున్నారు. కొన్ని కొన్ని మన చేతుల్లో వుండవు.. తప్పవు.

జబర్ధస్త్ వైఫల్యం కన్నా, ఆ సినిమా కాపీ కథ అన్న బ్యాడ్ నేమ్ తెచ్చిన బాధే ఎక్కువేమో?

చెప్పాను కదా.. కొన్ని కొన్ని మన చేతుల్లో వుండవు. రెండో సినిమాగా నేను చేయాలనుకున్నది ఈ కళ్యాణ వైభోగమే. కానీ నిర్మాతలు వేరే కథ అడిగారు. ఆఫీసుల్లో ఖాళీగా వుండి ఏం చేస్తాం..అక్కర్లేని కబుర్లు చెప్పుకుంటాం. అలాంటపుడు ఆ హిందీ సినిమా ముచ్చట వచ్చింది. అక్కడి నుంచి చాలా జరిగింది.. నా ప్రమేయంతో.. ప్రమేయం లేకుండా.. అయినా ఎవరినీ తప్పు పట్టలేము.. అల్టిమేట్ గా నేను ఓకే అని సినిమా చేసిన తరువాత, నేను నాదే తప్పు అని అంగీకరించాల్సిందే. అందుకే ఇక నో రిగ్రెట్స్.

సో.. మళ్లీ కమింగ్  బ్యాక్ టు హోమ్  అన్నమాట.?

అలా అంటే ఇక్కడ ఓ సెంటిమెంట్ గుర్తుకువస్తుంది. అలా మొదలైంది సినిమా స్వప్నాదత్ కు చేయాల్సి వుంది. కానీ ఎందువల్లో అది మెటీరియలైజ్ కాలేదు. దాము గారికి వచ్చింది.  అలాగే జబర్దస్త్ తరువాత స్వప్న కనిపిస్తే, ఏదోమాటల్లో అసలు రెండో సినిమాగా చేయాల్సింది ఇదీ అంటూ కళ్యాణ వైభోగమే లైన్ చెప్పాను. చాలా బాగుంది కదా.. మనం చేద్దాం అన్నారు. కానీ మళ్లీ ఏదో సమస్య.. మెటీరియలైజ్ కాలేదు.. దామూ గారి దగ్గరకు వచ్చింది ప్రాజెక్టు.

అంటే సెంటిమెంటల్ గా ఇదీ హిట్ కొట్టాలన్నమాట.?

అలా అని కాదు..జస్ట్ కొ ఇన్సిడెంట్

నాగశౌర్యకు సరైన బ్రేక్ రాలేదు ఇంతవరకు. మీరు మలి సినిమా సమస్యలో వున్నారు. అసలే అన్నీ వున్నా ఓపెనింగ్స్ వుండడం లేదు ఇప్పుడు.?

మీరు అన్నది నిజమే. సినిమాకు ఓపెనింగ్స్ అన్నదే సమస్యగా వుంది ఇప్పుడు. పైగా పబ్లిసిటీ కూడా కీలకం అయింది. కానీ ప్రేక్షకుల అభిరుచి మీద నాకు నమ్మకం వుంది. సినిమా బాగుంటే వాళ్లంతట వాళ్లే థియేటర్ కు వస్తారు. పోస్టర్, ట్రయిలర్, టీజర్ ఇలాంటివి చూసి వాళ్లు ఓ అంచనాకు వస్తారు. ఈ సినిమాకు వెళ్లాలా వద్దా అనేది. ఆ తరువాత  సమీక్షలు.. మౌత్ టాక్.. సో వీటన్నింటి మీద ఆధారపడి ముందుకు వెళ్లడమే… కానీ ఆ సంగతి అలా వుంచితే నాగశౌర్య మంచి నటుడు. మీరన్నది నిజమే అతనికి సరైన బ్రేక రాలేదు. ఈ సినిమా ఆ లోటు తీరుస్తుందన్న నమ్మకం నాకు వుంది. చాలా మంది పెర్ ఫార్మెన్స్ ఇచ్చాడు.

మీ హీరోయిన్ సంగతి.?

ఆమె తొలిసినిమా ఎవడే సుబ్రహ్మణ్యతోనే ఫ్రూవ్ చేసుకుంది. ఈ సినిమాలో కూడా మంచి నటన అందించింది.

ట్రయిలర్ చూస్తుంటే..ఈ లైన్ తో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చేసాయి అనిపిస్తోంది.?

అన్నింటికీ మూలం మణిరత్నం సార్ మౌనరాగం. అయితే అన్ని సినిమాల్లో ఎవరో ఒకరికే ఇష్టం వుండదు పెళ్లి అన్నది. కానీ ఇక్కడ ఇద్దరికీ ఇష్టం వుండదు. ఈ జనరేషన్ తమ ఆశలు, ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తోంది. అది గమనించకుండా పెద్దలు పెళ్లి అంటున్నారు. అసలు పెళ్లికి ప్రేమ కన్నా, స్నేహం పునాది కావాలి. స్నేహం పునాది అయితే దాంతో ప్రేమ ఏర్పడుతుంది.. ఆపై అది గట్టి సంబంధాలకు దారితీస్తుంది. ఒక విధంగా నేను రివర్స్ లో లెక్క చేసి చూపించే ప్రయత్నం చేసానన్నమాట.

మీ అలా మొదలైంది సినిమా విజయం కావడానికి అందులో మిళితం అయిపోయి వున్న స్మూత్ కామెడీ కూడా ఓ కారణం. కానీ కళ్యాణ వైభోగమే సినిమా విషయం చూస్తుంటే కాస్త ఎమోషనల్ డ్రామా అనిపిస్తోంది.?

కాదు..ఇది కూడా అలాగే వుంటుంది. ఎమోషన్, మెలోడ్రామా, ఇలాంటివి ఏవీ వుండవు.. లైఫ్ అలా స్మూత్ గా కళ్ల  ముందు సాగుతుంది అంతే. ఇక్కడ మీకో చమక్కు చెప్పాలి. అలా మొదలైంది క్లయిమాక్స్ లో తాగుబోతు రమేష్.. ఆశిష్ విద్యార్థి భలే క్లిక్ అవుతారు. అనుకోకుండా ఓ అయిడియా వచ్చింది. అది కూడా అతికినట్లు సరిపోయింది. అదే ఈ సినిమా క్లయిమాక్స్ లో కూడా వాళ్లిద్దరు ఎంటర్ కావడం. మొత్తం మీద నేను చెప్పేదేమిటంటే, ఫన్ ఎక్కడా మిస్ కాలేదనే.

తరువాతి సినిమాకు రెడీ అవుతున్నారా?

ఓ మాట చెప్పనా? నాకు రెండో సినిమా అలా కావడం అన్నది ఓ లక్. అంత గట్టి మొట్టికాయ కెరీర్ తొలిదశలోనే రావడం మంచిదే. ఇప్పుడు నేను ఏ నిర్మాత దగ్గర అడ్వాన్స్ తీసుకోవడం లేదు. సరైన కథ రెడీ చేసుకుని, దానికి తగ్గ హీరోలను చూసుకుని, ఎవరు ఓకె అంటే అప్పుడు నిర్మాతను వెదుకుతాను.

కానీ దాదాపు అందరు దర్శకులు ఇలా మొట్టికాయలు తిన్నవాళ్లే. కానీ అడ్వాన్స్ లు తీసుకోవడం మానేయలేదు. పైగా ముందు హీరోలను ఓకె అనిపించుకుని ఆపై కథ అల్లుతున్నారు. నిర్మాతను చూడడం అన్నది హీరో కే వదిలేస్తున్నారు.?

కావచ్చు..మీరన్నది నిజమే. కానీ కొన్నయినా మంచి సినిమాలు రావాలి. అలా రావాలి అంటే దర్శకుల ఆలోచనా విధానం మారాలి. సుకుమార్ లాంటి దర్శకులు సినిమా నిర్మాణం ప్రారంభించడం ఓ మంచి పరిణామం. అలా అవకాశం వున్న అందరూ చేస్తే మంచి సినిమాలు కొన్నయినా వస్తాయి.

మహిళా దర్ళకులు మనకు తక్కువ. మీ కంటూ ఏమైనా ఇబ్బందులు వున్నాయా..దర్శకురాలిగా.?

నాకనే కాదు.. ఏ మహిళా దర్శకురాలికైనా సినిమా రంగంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా టైమింగ్. హీరోలకు అర్థరాత్రి ఖాళీ అయిందని, వెళ్లి, వాళ్లతో మాట్లాడుతూ కూర్చుని కథ గురించో, తరువాతి ప్రాజెక్టు గురించో మాట్లాడి రాగలరు ఏ దర్శకులైనా. నేనైతే అలా వెళ్లలేను. ఇలా తరచు రాపో మెయింటెయిన్ చేసి, చేసి, ఎప్పుడో అవకాశం అందిపుచ్చుకోవడం అన్నది మహిళా దర్శకులకు సాధ్యం అయ్యేది కాదు. ఇక నిర్మాణ పరంగా, మరే ఇబ్బందులు వుండవు.

మీ గురువు కృష్ణవంశీకి ఈ సినిమా చూపించారా?

లేదు ఆయన ఖాళీ లేరు. హిందూపురం వెళ్లారు. రమ్య మేడమ్ పాటలు చూసారు. చాలా బాగున్నాయి నందినీ అన్నారు. ఎందుకంటే ఆమెకు, సార్ కు ఈ కథ చాలా కాలం కిందటే తెలుసు.

సో..ఇంకేంటి?

ఏముంది.. ప్రేక్షకుల ముందుకు నాలుగో తేదీన వస్తున్నాం.. వారికి నచ్చతుందనే పూర్తి నమ్మకంతో వున్నాం.

మీ నమ్మకం వమ్ము కాకూడదని ఆశిద్దాం.

థాంక్యూ

విఎస్ఎన్ మూర్తి