ఇది లాక్ డౌన్ టైమ్…కొందరికి ఇబ్బంది కావచ్చు. కానీ కొంత మందికి ఇది ఓ మంచి సదవకాశం. ముఖ్యంగా క్రియేటివ్ పీపుల్ కి. సినిమా దర్శకులు ఫుల్ గా ఇప్పుడు తమ తమ వ్యాపకాల్లో మునిగిపోయారు. కొత్త అయిడియాలకు పదును పెడుతున్నారు. కొత్త స్క్రిప్ట్ లు తయారు చేసుకుంటున్నారు. అలాంటి దర్శకులను పలకరిస్తే…
అనిల్ రావిపూడి…ఓ జంధ్యాల..ఓ రాఘవేంద్రరావు కలిస్తే అనిల్ రావిపూడి సినిమా. రాఘవేంద్రరావు సినిమాలు ఎన్నింటికో జంధ్యాల పని చేసారు. ఆ సినిమాలు అన్నీ మాస్ ఎంటర్ టైనర్లే. వాటిల్లో ఎన్నో మ్యానరిజమ్ లు, ఇంకా ఎన్నో చమక్కులు. ఇవన్నీ, ఇలాంటివన్నీ మళ్లీ ఈ తరంలో అనిల్ రావిపూడి సినిమాల్లో చూడొచ్చు. అతి తక్కువ టైమ్ లో అతి తక్కువ సినిమాలతో, అతి ఎక్కువ క్రేజ్, పేరు తెచ్చుకున్న దర్శకుడు. ఆయనను ఈ కరోనా టైమ్ లో పలకరిస్తే..
-హాయ్ సర్…ఫుల్ బిజీ అనుకుంటా!
మీరు కావాలని అడిగారో..మరెందుకు అడిగారో కానీ, ఫుల్ బిజీగానే వున్నాను. ఎఫ్ 3 స్క్రిప్ట్ రెడీ అవుతోంది.
-ఆ మధ్య మీకు సెంటి మెంట్ అయిన విశాఖలో చేసినట్లున్నారుగా.
అక్కడ ఫస్ట్ హాఫ్ సెంటిమెంట్. సెకండాఫ్ మా పల్లెటూరు, ప్రకాశం జిల్లాలో చేయడం అలవాటు. అందుకే కరోనా టైమ్ స్టార్ట్ అవుతూనే ఇక్కడకు వచ్చేసా.
-మీరేనా? మీ టీమ్ కూడానా? ఎందుకంటే మీరు విశాఖ, అరకు మీ టీమ్ తో వెళ్తుంటారుగా.
మా టీమ్ తోనే వచ్చా. ఇక్కడ పల్లెటూరిలో రెండు అంతస్తుల ఇల్లు. పై అంతస్తు అంతా స్టోరీ సిట్టింగ్స్ కు అనుగుణంగా తయారుచేయించి వుంచాను. ఇప్పుడు అక్కడే అంతా జరుగుతోంది. హైదరాబాద్ నుంచి కుక్ లను కూడా తీసుకువచ్చాను. హ్యాపీగా తినడం, డిస్కస్ చేసుకోవడం, రాసుకోవడం. ఇదే నడుస్తోంది.
-ఎఫ్ 3 అనేది ఫ్రాంచైజీ అన్నారు ఆ మధ్య. మరి కాస్త వివరం
అంటే మరేం లేదు. అవే లీడ్ పెయిర్ లు వుంటాయి. కథ మారుతుంది.
-మరి అందులో పాపులర్ అయిన మ్యానరిజమ్ లు?
అవి కామన్..వెంకీ ఆసనం, హనీ ఈజ్ ద బెస్ట్, అంతేగా..అంతేగా..
-ఎఫ్ 3లో మహేష్ బాబు కూడా వుంటారని బలంగా టాక్ ఎందకు ముందు వచ్చింది?
ప్రిలిమనరీగా ఏవోవో అనుకుంటూ వుంటాం. కొన్ని క్యాజువల్ గా అనుకుంటూ వుంటాం. అవన్నీ వార్తలుగా వెళ్లిపోతుంటాయి.
-అంతకన్నా ఏం లేదు అంటారు.
నాకయితే లేదు. నేను ఏం చెప్పినా, రాసేది రాసేస్తుంటారుగా..అందుకే నేను ఫిక్స్ అయిపోయా..మన పని మనం చేసుకోవడమే అని.
-ఎఫ్ 2 హిందీ రీమేక్ మీరు చేయడం లేదా?
మనం ఇక్కడ కంఫర్ట్ గా వున్నాం. మళ్లీ ఎందుకు అక్కరలేని ప్రయత్నాలు. ఎఫ్ 2 ను బాలీవుడ్ లో నిర్మిస్తున్నారు. కానీ వేరే దర్శకుడు పని చేస్తారు.
-కరోనా టైమ్ లో చాలా మంది సినిమాలు చూడడం, వెబ్ సీరిస్ లు చూడడం చేస్తుంటారు. మరి మీరు.
నేనూ చూస్తున్నా. జంధ్యాల గారి సినిమాలు, పాత సినిమాలు
-అదేంటీ సినిమా జనాలు నెట్ ఫ్లిక్స్ లో కొరియా సినిమాలు, విదేశీ సినిమాలు చూస్తారు ఎక్కువగా?మరి మీరు ఇలా?
అవి చూడకూడదు అని కాదు. చూడను అని కాదు. కానీ నేను ఏం సినిమా తీస్తున్నాను. దానికి మంచి ఇన్ పుట్స్, మంచి ఐడియాలు, మంచి కిక్ ఇచ్చే సినిమాలు చూడాలి. నాకు జంధ్యాల గారి హెల్ధీ కామెడీ అంటే ఇష్టం. అందుకే అవి చూస్తున్నాను.
-మళ్లీ మహేష్ బాబుతో సినిమా అని వినిపిస్తోంది.
టూ ఎర్లీ అండీ..మహేష్ బాబుతో సినిమా అంటే ఆనందమేగా. కానీ అవన్నీ మీతో పంచుకోవడానికి ఇంకా చాలా టైమ్ వుంది. ముందు ఎఫ్ 3 ని థియేటర్లలోకి రానివ్వండి.
-మళ్లీ మరోసారి సంక్రాంతికి వస్తారా?
చూద్దాం. ఈ కరోనా కలకలం తగ్గాలి. అసలు ఇండస్ట్రీ ఎలా వుంటుందో?ఎప్పటికి కుదుటపడుతుందో చూడాలి. అప్పుడు మిగిలినవి.
-విఎస్ఎన్ మూర్తి.