నా దృష్టంతా అభిమానుల మీదే-బోయపాటి

ఎమోషన్లు, యాక్షన్ సీన్లు, భారీ తారాగణం, ఇలా కొన్ని ఎలిమెంట్స్ తో తన మార్కు సినిమా అనే ఇమేజ్ ను స్వంతం చేసుకున్న దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. సరైనోడు, జయజానకీ నాయక సినిమాల అనంతరం…

ఎమోషన్లు, యాక్షన్ సీన్లు, భారీ తారాగణం, ఇలా కొన్ని ఎలిమెంట్స్ తో తన మార్కు సినిమా అనే ఇమేజ్ ను స్వంతం చేసుకున్న దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. సరైనోడు, జయజానకీ నాయక సినిమాల అనంతరం చేస్తున్న సినిమా వినయ విధేయరామ. మెగా హీరో రామ్ చరణ్-హిట్ హీరోయిన్ కైరా అద్వానీల కాంబినేషన్. మరొ కొన్నిగంటల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో బోయపాటితో ముచ్చట్లు ఇవి.

వినయ విధేయ రామ.. జయ జానకీ నాయక.. అక్కడ నుంచి వచ్చిందా? ఇంకేదైనా విషయం వుందా?
సౌండింగ్ అలా వుందంటే ఒప్పుకుంటాను. కానీ జయజానకీ నాయక సినిమాలో హీరోకి ఆ అమ్మాయి అంటే ఇష్టం. ఆ అమ్మాయి దూరమైపోతే, ఏదో ఒకటి చేసేయలేదు. ఎక్కడవున్నా ఆ అమ్మాయి క్షేమం తన బాధ్యత అనుకున్నాడు. జానకీ నాయకుడు జయం సాధించాడు. ఇక ఇక్కడ వినయ విధేయరామ. వినయం వుంది.. విధేయం వుంది. కానీ తేడావస్తే రాముడంతటి వీరుడే. అన్నదమ్ముల జోలికివస్తే ఇంక చీల్చి చెండాడేస్తాడు.

వాస్తవానికి మీరు చిన్న చిన్న పదాలు టైటిళ్లగా పెట్టేవారు. ఇప్పుడు మారినట్లున్నారు.
పెద్ద హీరోల సినిమాలకు టైటిల్ పెట్టడం అంటే అంత సులువుకాదు. ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేసి, లోగో డిజైన్ చేసి, చరణ్ కు, చిరంజీవి గారికి చూపించా. ఆయన వెంటనే చాలా బాగుందమ్మా అన్నారు. ఆ లోగో, అందులో ఎర్రటి క్లాత్, కుంకుమ ఇవన్నీ కూడా డిటైల్డ్ గా వివరించాను.

లోగోలో ఇన్ని డిటైల్స్ దాగున్నాయని ప్రేక్షకులు గుర్తిస్తారా? సినిమా ముందు అయినా, తరువాత అయినా?
వాళ్లు గుర్తిస్తారా? లేదా? అన్నది కాదు నాకు, నా మటుకు నా వర్క్ లో పెర్ ఫెక్షన్ వుందా లేదా అన్నదే చూస్తాను.

హీరో రామ్ చరణ్ ఈ సినిమా చేయడానికి ప్రోత్సహించిన పాయింట్ ఏమిటి?
వాస్తవానికి ఈ కథ నాలుగేళ్ల క్రితం చెప్పాను. చేసేద్దాం అంటే కాదు, మరో రెండేళ్లు ఆగాలి అన్నాను. ఆయన ఎందుకు అని అడిగారు అనుమానంగా. మరేంలేదు, ఫేస్ లో మరింత గ్రోత్ రావాలి. అన్నాను. తరువాత మరో రెండు స్క్రిప్ట్ లు చెప్పినా, ఇదే చేద్దాం ఎప్పటికైనా అన్నారు. రంగస్థలం టైమ్ లో పూర్తి స్క్రిప్ట్ వినిపించా.

అంతలా నచ్చడానికి ఈ స్క్రిప్ట్ లో ఏముంది?
ఫ్యామిలీ అనుబంధాలు, అన్నదమ్ములు, వదినలు, అన్నదమ్ముల కోసం ఎంతకైనా తెగించి, ఎంతవరకైనా వెళ్లే హీరో క్యారెక్టరైజేషన్.

రాను రాను మీరు ఒక ప్యాట్రన్ అనే చట్రంలో ఇరుక్కుపోయి సినిమాలు చేస్తున్నట్లు అనిపించడం లేదా?
కాదు. నేను మొదటి నుంచి ఇప్పటివరకు చేసిన సినిమాల సబ్జెక్ట్ లు అన్నీవేరు వేరు. అయితే మేకింగ్ లో ఓ స్టయిల్ వుంటే వుండి వుండొచ్చు. అది కేవలం యాక్షన్ సీన్లే కాదు. ఉమ్మడి కుటుంబాలు, ఉన్నతమైన మహిళా పాత్రలు ఇలాంటివి అన్నీ కామన్ గా కనిపించి వుండొచ్చు.

ఇక్కడ మీకు ఓ పాయింట్ చెప్పాలి. ఎక్కడెక్కడి నుంచి డబ్బులు ఖర్చుచేసి, శ్రమ పడి అభిమానులు సినిమా ఫంక్షన్ కు వస్తారు. వాళ్లను చూసినపుడల్లా నాకు నా బాధ్యత గుర్తుకు వస్తుంది. వాళ్లే నా టార్గెట్. అంత శ్రమకు ఓర్చి, హీరోల మీద అభిమానం కురిపించే వారిని రంజింపచేయడం అన్నది నా ఫస్ట్ కర్తవ్యం. ఆ తరువాతే మరేదయినా? నాకు తీయాలనిపించే సబ్జెక్ట్ లు కొన్ని వున్నాయి. అయితే అవి ఇప్పుడేకాదు.

మీ సినిమాల నిర్మాణ వ్యయం అదుపు తప్పడం, లేదా మార్కెట్ ను మించడం లాంటి సంగతులకు మీరేమంటారు?
నా సినిమాలకు కచ్చితంగా ఎక్కువ ఖర్చు అవుతుంది. అందులో సందేహంలేదు. అయితే ముందు ఇచ్చిన బడ్జెట్ కు రూపాయి దాటనివ్వను.

మీరు లోకేషన్లు కూడా ఎక్కువ ఎంచుకుంటారు అనుకుంటాను? ముఖ్యంగా వైజాగ్ మీ సెంటిమెంట్ లోకేషన్ గా మారినట్లుంది.
నాకు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధ్యదైవం అందువల్ల ఒక్క షాట్ అయినా అక్కడ తీస్తాను. నా సినిమాల్లో ఆ ప్రస్తావన వుంటుంది. ఇక లొకేషన్లు అంటారా? అవి కూడా సినిమాను ఎలివేట్ చేసేవే. హంసల దీవిలో అంత కష్టపడి, ప్రాణాలకు తెగించి తీసాం. ఇప్పుడు అందరూ హంసల దీవి గురించి మాట్లాడుతున్నారు.

అక్కడ టూరింజం పెరిగింది. ఈ సినిమాలో గుజరాత్ లోని ద్వారక, అజర్ బైజాన్ లాంటి వైవిధ్యమైన లొకేషన్లలో తీసాం. ఈ స్పాట్ ల్లో కూడా చాలా రిస్క్ చేసి షూటింగ్ చేసాం. ఏమయినా ఇదంతా అల్టిమేట్ గా సినిమా కోసమే.

కథ, దర్శకత్వంతో పాటు నిర్మాణ వ్యవహారాలు, ఫైట్ల చిత్రీకరణ లాంటి వాటి మీద కూడా మీరు దృష్టి పెడతారనుకుంటాను.
నేను ప్లాన్ చేసుకోవడం వల్ల పని సలువు అవుతుంది. నిర్మాత హ్యాపీగా వుంటారు. అందుకే అవన్నీ చూస్తాను. ఇక ఫైట్లు అంటారా? ఏ విధంగా డిజైన్ చేస్తే పవర్ ఫుల్ గా వుంటుందో అన్నది ఐడియా వుంది కాబట్టి, నేనే దగ్గర వుండి చేయించుకుంటాను.

ఈ సినిమాకు రామ్ లక్ష్మణ్ పని చేయలేదు.. కారణం.
కారణం ఏమీ లేదు ప్రత్యేకంగా. వాళ్లు వేరే ప్రాజెక్టుల్లో బిజీగా వున్నారు. నాకు ఈ సినిమాను ఎలాగైనా సంక్రాంతికి తేవాలి. అటు ఇటు వర్క్ చేస్తే, అవుట్ పుట్ సరిగ్గా రాదు. కనల్ కన్నన్ కూడా యాక్షన్ సీక్సెన్స్ లో మాస్టర్. మీరే చూస్తారు సినిమాలో. పైగా ఒకే ఫైట్ మాస్టర్స్ అయితే మొనాటమీ వచ్చే ప్రమాదం వుంది.

రామ్ చరణ్ ను రాంబోలా చూపించడం కనల్ కన్నన్ అయిడియానా? మీదా?
నాదే. ఆ పాయింట్ చరణ్ కు నాలుగేళ్ల క్రితం కథ చెప్పినపుడే చెప్పాను. అయితే రాంబో అని అంటున్నారు కానీ, అదేమీ ఇన్సిపిరేషన్ కాదు. మీకు లుక్ అలా కనిపిస్తోందంతే. సినిమాలో సీక్వెన్స్ మొత్తం చూస్తే వేరుగా వుంటుంది.

మీ సినిమాలను బయట ఊరమాస్ సినిమాలు అని అనే విషయం మీ దాకా వచ్చిందా? మీరు ఎలా ఫీలవుతారు?
ఎవరో అంటే నేనేం పట్టించుకోను. నావి ఊరమాస్ సినిమాలు కాదు. క్లాస్ టచ్ తో వున్న మాస్ సినిమాలు. నా సినిమాల్లో హ్యూమన్ వాల్యూస్, బంధాలు అనుబంధాలు, మెసేజ్ అన్నీ వుంటూ మాస్ టచ్ వుంటుంది. అందువల్ల అవి క్లాస్ టచ్ తో వున్న మాస్ సినిమాలు.

బన్నీకి మాంచి మాస్ సినిమా ఇచ్చేసారు. ఇప్పుడు చరణ్ కు. హ్యాపీనా?
బన్నీ సినిమాను నేను ఎప్పటికీ మరిచిపోను. బన్నీ ఇచ్చిన ప్రోత్సాహం, ఆ సినిమా అవన్నీ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. ఇక చరణ్ కూడా హ్యాపీనే. అప్పుడే మరో సినిమాకు లైన్ కూడా చెప్పాను.

మెగాస్టార్ తో అలాగే మహేష్ బాబుతో సినిమాలు అన్నవి ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఎప్పటికి మెటీరియలైజ్ అవుతాయి?
మెగాస్టార్ సైరా చేస్తున్నారు. ఆ తరువాత వన్ బై వన్ లెక్కలు వేసి, జోనర్లు చూసుకుని  చేస్తారు. అందువల్ల ఎప్పుడు మన జోనర్ వస్తే అప్పుడు చేయాలి. మహేష్ బాబుతో కాస్త త్వరగానే వర్కవుట్ అయ్యే అవకాశం వుంది.

వినయ విధేయ సినిమా అడియో పట్ల సంతృప్తిగా వున్నారా?
హండ్రెడ్ పర్సంట్. ఈ పాటలు అన్నీ సినిమాలో చిత్రీకరణతో చూస్తే మరో మెట్టు పైన వుంటాయి. మీరే చూస్తారుగా.

మీ గత సినిమాల్లో మాదిరిగానే ఈ సినిమాలో విలన్ పాత్రకు కూడా పేరు వస్తుందా?
ఈ సినిమాలో వివేక్ ఓబరాయ్ పాత్ర ఓ రేంజ్ లో వుంటుంది. అతని నటన కూడా అలాగే వుంటుంది.

కెరీర్ లో బ్రేక్ కోసం చూస్తున్నవారిని భలేగా ఎంచి పట్టుకుంటారు. ఏమిటి కారణం?
కారణం ఏమీలేదు. నేను యూట్యూబ్ లో, వాట్స్ అప్ ల్లో ఫోటొలు చూడను. నాకంటూ ఓ ఆల్బమ్ తయారుచేసి పెట్టుకున్నాను. నటలు అవసరం అయినపుడు అది చూసుకుని, ఎంచుకుంటూ వుంటానంతే.

వినయ విధేయ రామ.. సినిమా గురించి సూటిగా చెప్పాలంటే..?
సంక్రాతి పండగ సినిమా ఇది. భోగి. సంక్రాంతి.. కనుమ. ఈ మూడు పండగల ఒకేసారి వచ్చినా వాటి వైనాలు వేరు. ఆ మూడింటి కలయికలా వుంటుంది ఈ సినిమా. భోగినాటి సందళ్లు, సంక్రాంతి నాటి విందు భోజనం, కనుమనాటి సరదాలు అన్నీ కలబోసిన సినిమా ఇది. పండగతో పాటు సినిమాను కూడా ఎంజాయ్ చేయమని కోరుతాను ఫ్రేక్షకులను. అంతే.

-విఎస్ఎన్

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌… ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?

హరికృష్ణ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సింది