టాలీవుడ్ లో నిర్మాతలు లేరు

బివివిఎస్ఎన్ ప్రసాద్ అనే కన్నా చత్రపతి ప్రసాద్ అంటే టక్కున గుర్తుకు వస్తారు. ఇండస్ట్రీలో ఆయన అనుభవం వయస్సు ముఫై ఏళ్లకు పైగానే. నిర్మాత వస్తున్నారు అంటే హీరోలు కుర్చీల్లోంచి లేచి కూర్చునే రోజుల…

బివివిఎస్ఎన్ ప్రసాద్ అనే కన్నా చత్రపతి ప్రసాద్ అంటే టక్కున గుర్తుకు వస్తారు. ఇండస్ట్రీలో ఆయన అనుభవం వయస్సు ముఫై ఏళ్లకు పైగానే. నిర్మాత వస్తున్నారు అంటే హీరోలు కుర్చీల్లోంచి లేచి కూర్చునే రోజుల నుంచి హీరోల కోసం నిర్మాతలు కుర్చీలు తెచ్చే రోజుల వరకు అన్నీ చూసారు.

ఆస్తులు అమ్ముకున్నారు కానీ కూడబెట్టుకోలేదు..అయినా సినిమాలు తీయడం మానలేదు. ఆయన సినిమాల జాబితాలో బ్లాక్ బస్టర్లు వున్నాయి, నిరాశపర్చినవీ వున్నాయి. అయినా చెత్త సినిమా తీసారని ఏనాడూ అనిపించుకోలేదు.

చత్రపతి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చినా, అత్తారింటికి దారేది సినిమా లీక్ అయిపోయినా, దోచేయ్ నిరాశ పర్చినా, నాన్నకు ప్రేమతో ప్రశంసలు అందుకున్నా ఆయన మాత్రం అచ్చంగా నిండు కుండనే..తొణకరు బెణకరు. తరువాతి సినిమా ఏంటీ అని పని మొదలెట్టేస్తారు. అలాంటి బివిఎస్ఎన్ పెద్ద సినిమాల ప్లానింగ్ కు టైమ్ గ్యాప్ రావడంతో రెండు మీడియం సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి ఇంట్లో దెయ్యం..నాకేం భయ్యం ఈవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయనతో ఇంటర్వూ.

మీకు సినిమా వ్యాపారమా? వృత్తినా?

రెండూ కాదు. పిచ్చి. అంతే. అదే కాకపోతే, ఇప్పటికి ఇంకా ఇలా సినిమాలు తీస్తూ కూర్చోను. 

సినిమాల్లో ఏమాత్రం సంపాదించారు?

ఎంత పోగొట్టుకున్నారు అని అడగండి. ఇక్కడ సంపాదించింది ఏం లేదు. పెద్దలు ఇచ్చిది అమ్ముకున్నదే ఎక్కువ. 

మరి అయినా ఇంకా ఎందుకు తీస్తూ వుండడం?

చెప్పానుగా. సినిమాలంటే పిచ్చి. అందుకే శోభన్ బాబు నుంచి ప్రారంభించి, ఇప్పటి వరకు తీస్తూనే వున్నా. ఇంకా ఎన్నాళ్లు తీస్తానో నాకే తెలియదు. 

నిర్మాత అని అనుకోగానే మీకు ఎలా వుంటుంది?

నిర్మాత. అది నిన్నటి మాట. ఇప్పుడు ఇండస్ట్రీలో నిర్మాతలు ఎవరున్నారండీ బాబూ? బిజినెస్ మెన్ లే వున్నారు. ఒకప్పుడు నిర్మాత అంటే సినిమా ప్లానింగ్ అంతా చేసుకుని, హీరోల డేట్స్ తెచ్చుకుని, దగ్గర వుంచి మ్యూజిక్ సిట్టింగ్స్ నుంచి ఫైనల్ కట్ వరకు అన్నింటా తను వుంటూ, తను చూసుకుంటూ వుండేవాడు. ఇప్పుడు అన్నీ పోయాయి. మారిపోయాయి. నిర్మాత బిల్లులు ఫే చేయడం తప్ప, చేయడానికి ఇక్కడ ఏమీ లేదు. 

నిజం నిష్టూరంగా వుంటుంది. పాపం,ఎంతో మంది మేం నిర్మాతలమని కథలు పట్టకుని మా దగ్గరకు వస్తారు. మేమేం చేయాలి? వింటాం..బాగుంటాయి అనుకుందాం. కానీ వ్యవహారం మన చేతిలో వుండదు కదా? హీరోలు, డైరక్టర్లు ప్రాజెక్ట్లు ప్లాన్ చేసి, కథ ఫిక్స్ చేసి, మనకు ఇస్తే, మనం ప్రాజెక్టు దొరికింది అని అనుకోవడం తప్ప ఇక మన ప్రాజెక్టులు మూవ్ చేసే పరిస్థితి లేదు కదా? 

ఈ పరిస్థితికి కారణం హీరోలేనా?

అలా ఎందుకు అనుకోవాలి? సినిమా నిర్మాణంపై అవగాహన లేని వారు కూడా నిర్మాతలు అవుతున్నారు. ఇది వ్యాపారంగా భావించి వస్తున్నారు. వాళ్లకు సినిమా ఇవ్వడం వరకు ఒకె. కానీ వాళ్లకు వ్యవహారాలు అప్పగించి, తేడా వస్తే, హీరో కెరీర్ పాడయిపోతుంది. ఒక్క ఫ్లాప్ వస్తే, కొన్నాళ్లు ఖాళీ అయిపోయే పరిస్థితి. దాంతో హీరోలు తమ సినిమాల విషయంలో ఈ బిజినెస్ మెన్ లను నమ్ముకోలేక, తమ జాగ్రత్తలు తాము తీసుకుని, తమ ఫ్రాజెక్టులు తాము సెట్ చేసుకుంటున్నారు. 

అందుకే హీరోలు కూడా నిర్మాతలుగా మారిపోతున్నారంటారా?

కావచ్చు. తమ కెరీర్ కోసం అన్నీ తామే దగ్గర వుండి చూసుకొవాల్సి వస్తున్నపుడు, ఆ కష్టం అంతా వేరే వాళ్లకు ఇవ్వడం ఎందుకు అన్న ఆలోచన కావచ్చు. నిర్మాత పడే కష్టం అంతా తామే పడుతున్నపుడు నిర్మాత అన్నవాడు కేవలం బిజినెస్ మన్ అయిపోయినపుడు, పార్ట్ నర్ షిప్ తీసుకోవడం తప్పేం కాదు కదా ?

మరి ఇప్పటికీ మీ పద్దతి ఎలా వుంది?

నేనయినా అంతేగా? ప్రాజెక్టు ఇవ్వడం వరకు హీరోలదే. కానీ నాకు ఇంకా ఆసక్తి, అనుభవం, ఆ సరదా వున్నాయి కాబట్టి, మొదట్నించీ అన్నీ దగ్గర వుండి చూసుకుంటాను. నాన్నకు ప్రేమతో సినిమా ఇన్ టైమ్ లో విడుదల కావడం వెనుక నేను కూడా ఎంత వర్క్ చేసానో యూనిట్ కు తెలుసు. ఆ మధ్య త్రివిక్రమ్ గారు అన్నారట. ప్రసాద్ నిర్మాత అయితే సినిమా చాలా హాయిగా చేయచ్చు..మిగిలిన విషయాలు ఏవీ డైరక్టర్ చూసుకో అక్కరలేదు అని. 

నాన్నకు ప్రేమతో ప్రాఫిట్ వెంచర్ యేనా?

నిర్మాతగా నాకు ప్రాఫిట్ నే. బయ్యర్లు కూడా మాగ్జిమమ్ హ్యాపీనే. ఎక్కడో ఒకటి రెండు చోట్ల చిన్న మార్జిన్ లోటు. అంతే. 

డైరక్టర్లు, హీరోలు ఎవరు సహకరిస్తే లాస్ వెంచర్లు తక్కువ వుంటాయి?

డైరక్టర్లే. హీరోలదేముంది? వాళ్లు ప్రాజెక్టు ఓకే చేసాక, పెద్దగా ఇన్ వాల్వ్ వుండదు. కానీ నిర్మాతను దృష్టిలో పెట్టుకుని, హీరో మార్కెట్ ను దృష్టి లో వుంచుకుని, ఖర్చు అదుపు దాటకుండా చేయగలిగిన సత్తా, అవకాశం ఒక్క డైరక్టర్ కే వుంటాయి. అందువల్ల నిర్మాత శ్రేయస్సు హీరోల మీద ఎంత వుందో, డైరక్టర్ల మీద కూడా అంతే ఆధారపడి వుంది. 

మరి భారీ సినిమాల నిర్మాతగా పేరు పడిన మీరు ఇప్పుడు చిన్న సినిమాలు చేయడం?

చిన్న సినిమా అని ఎవరు అన్నారు? ఇవి మీడియం రేంజ్ సినిమాలు. ఏడెనిమిది నుంచి పది కోట్ల సినిమాలను చిన్న సినిమాలు అని ఎలా అంటారు? పెద్ద సినిమా సెట్ కావడానికి టైమ్ పడుతుంది అనుకున్నపుడు ఖాళీగా ఎలా వుంటాం? మన బ్యానర్ ను నమ్ముకున్న స్టాఫ్ ను కూడా చూసుకోవాలి కదా? అదీ కాక మంచి కథలు రెండు దొరికాయి. అవి అల్లరి నరేష్ కు, శర్వాకు సూటబుల్ అనిపించింది స్టార్ట్ చేసాను. 

వరుణ్ తేజతో సినిమా చేస్తారని?

డిస్కషన్ లో వుంది. కొత్త దర్శకుడు మంచి కథ దొరికాయి.

నాన్నకుప్రేమతో లాంటి హిట్ ఇచ్చినా పెద్ద హీరోల ప్రాజెక్టులు ఏవీ దొరకలేదా?

హీరోల కమిట్ మెంట్లు వాళ్లకు వుంటాయి కదా? ఇప్పుడు కాకున్నా, మరో ఏడాదికన్నా ఎన్టీఆర్, రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి వాళ్లతో సినిమాలు చేయాలనే వుంది. చేస్తాననే నమ్మకం వుంది.

మీ వారసులు కూడా మీ బాటలోనే?

అమ్మాయిల పెళ్లిళ్లు చేసి, మీ బతుకు మీరు బతకండి అని పంపేసాను. అబ్బాయి నాలాగే సినిమాలే చేస్తా అన్నాడు. చేస్తున్నాడు. చూద్దాం. ఈ రంగంలో ఎన్నాళ్లు వుండాలని వుందో?

ఒకె ఆల్ ది బెస్ట్ అండీ

థాంక్యూ

విఎస్ఎన్ మూర్తి