బాబుగారూ.. ఈ పలాయనవాదంతో ప్రయోజనం లేదు!

చంద్రబాబునాయుడు గారు పలాయనవాదాన్ని ఆశ్రయిస్తున్నారు. ఒకరు ఒక మాట అన్నప్పుడు..  ఆ అభిప్రాయంతో విభేదిస్తున్న విషయాన్ని స్పష్టంగా తెలియజెప్పగలిగిన అవకాశం ఉండికూడా.. మిన్నకుండిపోయి.. ఒక రోజు గడచిన తర్వాత.. ఆ మాటలు నన్ను బాధించాయి..…

చంద్రబాబునాయుడు గారు పలాయనవాదాన్ని ఆశ్రయిస్తున్నారు. ఒకరు ఒక మాట అన్నప్పుడు..  ఆ అభిప్రాయంతో విభేదిస్తున్న విషయాన్ని స్పష్టంగా తెలియజెప్పగలిగిన అవకాశం ఉండికూడా.. మిన్నకుండిపోయి.. ఒక రోజు గడచిన తర్వాత.. ఆ మాటలు నన్ను బాధించాయి.. అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం.. ‘ఎప్పుడూ తగాదాలు పెట్టుకోవడం ఎందుకు అనే ఉపేక్షిస్తున్నా’.. అంటూ తనలోని అచేతనత్వానికి మంచితనపు ముసుగు తగిలించుకోవడం ఇవన్నీ కూడా పలాయనవాదం కిందికే వస్తాయి. కానీ.. ఇలాంటి పలాయనవాదం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం కలుగదని ప్రభుత్వాధినేత తెలుసుకోవాలి.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆంధ్రా పాలకులు తెలంగాణను దోచుకున్నారని.. అనడం చంద్రబాబునాయుడును బాధించిందిట. ఆ కామెంట్ ఒక్కటే కాదు. ఏపీలో పర్యటించిన నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ అన్నమాటలు కూడా చంద్రబాబును బాధించాయట. కేసీఆర్ అనిన మాటలు ఎక్కడో కార్యక్రమంలో జరిగాయనే అనుకుందాం.

మరి రాజీవ్ కుమార్ తో భేటీ సంగతేమిటి? ఆయన ఆంద్రప్రదేశ్ గురించి తాను చేయగలిగిన వెటకారపు కామెంట్స్ అన్నింటినీ.. చంద్రబాబునాయుడుతో భేటీ అవుతు, ఆయనతో కలిసి ప్రెస్ మీట్ లలో పాల్గొంటూ.. దాదాపుగా ఆయన సమక్షంలోనే చేశారు. కానీ.. కాస్త ముందు వెనుకగా.. చంద్రబాబునాయుడు చేసినదేమిటి? ఎంచక్కా ఆయనకు శాలువాలు కప్పి, జ్ఞాపికలు ఇచ్చి సత్కరించారు.

అంతకు మించిన ప్రభుత్వ లాంఛనాలతో.. సకుటుంబ సపరివార సమేతంగా ఆయనకు తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శన భాగ్యాన్ని కూడా కల్పించారు. ఏదో దైవదర్శనానికి వచ్చి.. దానికి ముందుగా.. ఏపీ మీద , వారి బతుకు మీద, వారి దీన స్థితి మీద నాలుగు వెటకారపు మాటలు చెప్పి వెళ్లడానికి వచ్చినట్లుగా నీతిఆయోగ్ రాజీవ్ కుమార్ వ్యవహరిస్తే.. తీరా ఆయన వెళ్లిపోయిన రెండోరోజున చంద్రబాబునాయుడు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

అసంతృప్తిలో కూడా ఇంత అసంబద్ధతా? కేసీఆర్ ఎక్కడో ఏదో కామెంట్ చేస్తే.. హైదరాబాదులో తన పాలనలో చేసిన అభివృద్ధికి మన్నన దక్కకుండా పోయిందే.. అని చంద్రబాబునాయుడు మధనపడిపోతున్నారు. అది ఆయన వ్యక్తిగత విలాపం.. పైగా పెద్దగా విలువలేని రాజకీయ విమర్శ.

అదే సమయంలో రాజీవ్ కుమార్ మాటలు అలాంటివి కాదు. అవి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవమానకరమైన మాటలు. ఆయన స్థాయికి హోదాకు తగని చెత్త వెటకారాలు. ‘కనకపు సింహాసనమున…’ సామెత చందంగా ఆయనను ప్రధాని నరేంద్రమోడీ తీసుకువచ్చి… తన నెత్తిన పెట్టుకోవచ్చు గాక..! కానీ తనవి చిన్న బుద్ధులే అని రాజీవ్ కుమార్ నిరూపించుకున్నారు. ఆయన వ్యాఖ్యలను కూడా అప్పటికప్పుడు ఖండించకుండా.. ఆయన వెళ్లిపోయిన తర్వాత రెండు రోజులకు ‘బాధపడడం’ అనేది ఏ రకంగా ఉచితమైన పనో.. చంద్రబాబునాయుడు తర్కించుకోవాలి.

ఇప్పటికైనా ఆయన సత్వరంగా సక్రమమైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికీ న్యాయం చేయకపోతే… సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సిందే.. అనే సన్నాయి నొక్కులతో ఆత్మవంచన చేసుకోవడం, కాలహరణం చేయడం దండగ. ఇన్నాళ్లూ తాము మోసం చేస్తున్నట్లుగా ‘తెలియకుండా’ మోసం చేస్తున్న వాళ్లయితే.. తెలియజెపితే సరిపోతుందని అనుకోవచ్చు.

తమ మోసం వారికి (కేంద్రానికి) తెలుసు. తెలిసీ మోసం చేస్తున్న వాళ్లు.. నాలుగేళ్లుగా న్యాయం చేయడం గురించి పట్టించుకోని వాళ్లు… హఠాత్తుగా ఇప్పుడు పట్టించుకుంటారనే గ్యారంటీ ఏమిటి? వెంటనే కోర్టును ఆశ్రయించడం గురించి చంద్రబాబు చర్యలు తీసుకోవాలి. అలా కోర్టును ఆశ్రయించడంలో ప్రత్యేకహోదా అంశాన్ని కూడా జత కలపాలి. ఈ విషయంలో ఎంతగా జాప్యం చేస్తే.. ఆయన రాష్ట్రానికి అంతగా ద్రోహం చేస్తున్నట్లుగా భావించాలి.

-కపిలముని
[email protected]