తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు .. ఓ రకంగా చెప్పాలంటే ‘బొమ్మరిల్లు ఫాదర్’ టైపు. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ఏయే వేదికల మీద ఏం మాట్లాడాలో, ఎంతసేపు మాట్లాడాలో, ఏయే అంశాలు మాట్లాడకూడదో సమస్తం ఆయనే డిసైడ్ చేసేసి ఆ మేరకు వారికి ట్రైనింగ్ ఇచ్చి, ఆ తర్వాతే బరిలోకి వదులుతారు.
దాంతో తెలుగుదేశానికి చెందిన ప్రతినాయకుడు కూడా.. కీ ఇచ్చిన మరబొమ్మల్లాగా ‘కీ’ పనిచేసినంత సేపు మాట్లాడి తర్వాత సైలెంట్ అయిపోతూ ఉంటారు. పొరబాటున- ఎక్కడైనా ఎవడైనా ఒక నాయకుడు స్వతంత్రించి మాట్లాడడం జరిగిపోయిందంటే గనుక.. చంద్రబాబునాయుడు తక్షణం రంగంలోకి దిగి వారిని సెట్ రైట్ చేసేస్తారు. కాస్త తలంటుపోసి.. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా (అంటే కీ ఇప్పించుకోవడం అన్నమాట) ఎవరు మాట్లాడినా సహించేది లేదంటూ ఒక నానిపోయిన నినాదం వినిపిస్తారు.
కానీ ఇప్పుడు చంద్రబాబునాయుడు కాస్త ప్రాక్టికల్ గా వ్యవహరించాల్సిన తరుణం వచ్చింది. కేంద్రంతో సంబంధాల విషయంలో ఆయన దృక్పథం పార్టీలోని యువరక్తం దృక్పథం వేర్వేరుగా ఉంటున్నాయి. తన భావజాలానికి తన బలహీనతలకు అందరినీ బలిపెట్టడం ఎందుకు? కనీసం ఈ ఒక్క విషయంలో ఎవరికి వారిని స్వేచ్ఛగా, వారి ఆత్మప్రబోధానుసారం పనిచేయడానికి అనుమతించవచ్చు కదా.. అనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.
కేంద్రం చేసిన వంచనకు ఇప్పటికే ప్రజలకు మొహం చూపించలేం అనే ఉద్దేశంతో కొందరు ఎంపీలు ఉన్నారు. దీనికంటె తమ పదవులకు రాజీనామా చేసేయడం బెటర్ అని అంటున్నారు. రాజీనామాల గురించి చెబుతున్న ఎంపీల్లో కొందరు ఏదో గండం దాటడానికి అలా నటిస్తున్నప్పటికీ.. సిన్సియర్ రాజీనామా చేసే ఆలోచనలో కూడా కొందరు ఉన్నారు. అలాంటి వారిని తాను నియంత్రించకుండా.. వారి ఇష్టానుసారం చేయడానికి చంద్రబాబు అనుమతించాలి.
దీనివల్ల చంద్రబాబునాయుడుకు బహుళ ప్రయోజనాలు సిద్ధిస్తాయి.
1) పార్టీని తాను మోనార్క్ లాగా నడపకుండా అందరి అభిప్రాయాలకు విలువ ఇస్తున్నట్లు ఎస్టాబ్లిష్ అవుతుంది.
2) తెదేపా ఎంపీలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లి నెగ్గితే.. కేంద్రం మీద ఎంత ప్రజాగ్రహం ఉన్నదో.. స్పష్టంగా ఎన్నికల సాక్షిగా తెలియజెప్పి.. కేంద్రం వంచన చేస్తున్నదని చాటినట్లు అవుతుంది.
3) మేం రాజీనామాలు చేస్తాం అంటూ ఇన్నాళ్లూ మాటలు చెప్పి.. తీరా ఇప్పుడు మేం రాజీనామాలు చేసేస్తే.. పార్లమెంటులో రాష్ట్రం గురించి మాట్లాడే వాళ్లెవరుంటారు? అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టినట్టు ఉంటుంది. వైకాపా కంటె తమకే ఎక్కువ చిత్తశుద్ధి ఉన్నట్లు నిరూపించుకోవడమూ సాధ్యం అవుతుంది.
ఇన్న ప్రయోజనాలు దక్కాలంటే.. ఆయన పెద్దగా శ్రమించాల్సిన అందరినీ ఒత్తిడి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎంపీలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నానని, ఎవరి ఇష్టానుసారం వారు నిర్ణయాలు తీసుకోవచ్చునని అంటే చాలు.. ఎంపీల్లో రాజీనామా చేస్తాం అని నిజాయితీగా చెబుతున్న వారెవరో, ఆ పరిస్థితి రాదనే నమ్మకంతో ప్రగల్భాలతో బుకాయిస్తున్న వారెందరో కూడా తేలిపోతుంది.