సాధారణంగా మనకు పండుగ అంటే ఒక వేడుక చేసుకోవడం. అందరమూ కలిసి ఉత్సాహంగా గడపడం. ఎప్పుడో ద్వాపర యుగంలో లోకాన్ని పట్టిపీడిస్తూ ఉండిన నరకాసురుడు అనే లోక కంటకుడిని నిర్జించినందుకు మనం ఇన్ని యుగాలుగా ఇంకా పండగ చేసుకుంటున్నాం. మరి మన చుట్టూ ఉన్న సమాజంలో ప్రస్తుతం చెలరేగుతున్న లోకకంటకుల సంగతి గమనించేదెవరు? పండగ చేసుకునే మూడ్ లో బహుశా ఇది మనకెవ్వరికీ పట్టకపోవచ్చు. లోక కంటకులు అంటే రౌడీలు, గూండాలు మాత్రమే కాదు.
అమ్మాయిలను ప్రేమ పేరుతో వేధిస్తూ వారి చావులకు కారణమౌతున్న యువతరం, విద్యార్థుల మీద ర్యాంకుల పేరుతో ఒత్తిడి పెంచి… వారిని బలిపశువుల్ని చేస్తున్న ప్రెవేటు కళాశాలల యాజమాన్యాలు.. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా స్వార్థపూరిత వైఖరితో దుర్మార్గపు పాలన సాగించే పాలకులు, అంతకంటె మోసపూరితమైన మాటలతో, వారి స్థానంలో తాము అధికారంలోకి వచ్చేయాలనే కోరిక తప్ప, ప్రజల కష్టాల కోణం గురించి పట్టించుకోని నాయకులు…. ఇలాంటి అనేక వర్గాలకు చెందిన వారంతా ఒక్కొక్కరూ ఒక్కొక్క నరకాసురుడే.
అయితే తమాషా ఏంటంటే.. ఈ పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి.. మనకు విముక్తి ప్రసాదించడానికి ఒక సత్యభామ మరియు ఒక శ్రీకృష్ణుడు వస్తారని మనం చూస్తుంటాం. కానీ మనం భగవంతుడినే గనుక విశ్వసించేట్లయితే.. అదే భగవంతుడు మనం అంతరంగంలో కూడా ఉన్నాడనే వాస్తవాన్ని మనం అర్థం చేసుకోలేం.
ఇలాంటి సమాజంలోని నరకాసురుల్ని నిర్మూలించే అవకాశాలు మనకు తరచూ వస్తుంటాయి.
కానీ మనం ఎప్పటికప్పుడు వాటిని ఉపేక్షిస్తూ ఉంటాం. మనం ఖచ్చితంగా తలచుకుంటే.. దుష్ట పాలకులు గద్దె ఎక్కే రోజులు రావు, నాయకుల్లో మోసాలతో బతికి పోవచ్చుననే ధోరణి ఏర్పడదు. పాలక వ్యవస్థను చక్కదిద్దినప్పుడు సమాజంలో ప్రబలిన మిగిలిన రుగ్మతలు కూడా ఒక్కొక్కటిగా సమసిపోతాయి. కానీ ఈ వాస్తవాలను మనం పట్టించుకోం. పట్టించుకుంటే.. బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని మనకు భయం. మన విధిని మనం సక్రమంగా నిర్వర్తించాల్సి వస్తుందని భయం.
ఈ దీపావళి సందర్భంగా.. మనలో అలాంటి భయాల చీకట్లు తొలగిపోవాలి. స్వచ్ఛత, సచ్ఛీలత, సరైన సామాజిక విలువల పట్ల ప్రేమ, ధైర్యం ఇవన్నీ కోటి దీపాల కాంతులుగా ప్రభవించాలి. అప్పుడే మనకు నిజమైన దీపావళి కాగలదని ఆకాంక్షిస్తూ…
పాఠకులు అందరికీ ‘గ్రేటాంధ్ర’ దీపావళి శుభాకాంక్షలు.