’’విభజనను ఆపగల’’ హీరో ఉన్నాడా?

అవి కేవలం ప్రతిజ్ఞలా? అవి ధీరోదాత్త సమరభేరీ నినాదాలా? అవి ఉత్తుత్తి ప్రగల్భాలా? అవి గతిలేని దింపుడు కళ్లెం ఆశలా? చేతకాని వాళ్లంతా కాడి దించేశారు, ‘మరేటి సేత్తాం’ అంటున్నారు. ‘విభజనను వ్యతిరేకిస్తూ ఓటేత్తాం…

అవి కేవలం ప్రతిజ్ఞలా?
అవి ధీరోదాత్త సమరభేరీ నినాదాలా?
అవి ఉత్తుత్తి ప్రగల్భాలా?
అవి గతిలేని దింపుడు కళ్లెం ఆశలా?
చేతకాని వాళ్లంతా కాడి దించేశారు, ‘మరేటి సేత్తాం’ అంటున్నారు. ‘విభజనను వ్యతిరేకిస్తూ ఓటేత్తాం సరే, ఏటి కాబోతాదీ?’ అంటూ అపశకునాలు పలుకుతున్నారు. కానీ యావత్తు జాతి అంతే నిర్వీర్యం అయిపోయిందని అనుకోవడం పొరబాటు! భ్రమ! తప్పు!! నేరం!!

సమైక్యరాష్ట్ర కాంక్షను బలంగా ప్రతిబింబిస్తున్న వారు ఇంకా మిగిలే ఉన్నారు. ‘విభజన తుపానును ఆపుతా.. ఆటంబాంబును మళ్లిస్తా’ అంటున్న ముఖ్యమంత్రి కిరణ్… ‘రాజ్యాంగ ఆర్టికల్ 3 సవరించడం, ఆ ప్రకారం విభజన జరగా’లనడం ద్వారా తెలంగాణ కు గండికొట్టగలం అనుకుంటున్న జగన్… పైకి ఎన్ని మాటలు చెబుతున్నా ‘భాజపాతో జతకట్టి కాంగ్రెస్ ఎలా తెలంగాణ ఇచ్చినా, దాన్ని వారు అడ్డుకునేలా చూడా’లని కోరుకుంటున్న చంద్రబాబు.. ‘అసలీ రాజకీయ నాయకులే చేతకాని వాళ్లు.. మా ఉద్యోగుల సత్తా చాటుతాం.. సమైక్యంగా ఉంచుతాం’ అంటూ సమ్మెపథంలో ఉన్న అశోక్‌బాబు.. ఇలాంటి వారు అనేకులు ఉన్నారు. ఇంకా సమైక్యజపమే చేస్తున్నారు. 

ఎటొచ్చీ అయోమయంలో పడిపోతున్నది ప్రజలే. వాతావరణం చూస్తే చీలిక అనివార్యం అన్నట్లు కనిపిస్తోంది. నేతావరణం చూస్తోంటే రకరకాల భయాలు, ఆశలు వెల్లువెత్తుతున్నాయి. 

కానీ వీరిలో అసలు నిజమైన హీరో ఉన్నాడా?
ఎట్‌లీస్టు 2014 ఎన్నికలోగా జరగకుండా… విభజన ప్రక్రియ ఆగడం అనేది సాధ్యమా?
లేదా,
‘ఈడ మగాడు లేడ్రా బుజ్జీ’ అని సరిపెట్టుకోవాల్సిందేనా?
సంభావ్యతలపై ‘గ్రేట్‌ఆంధ్ర’ సాధికారిక విశ్లేషణ!

పన్నెండో రీల్ నడుస్తున్నది ఇప్పుడు. 

ఇక శాసనసభ, మరియు లోక్‌సభలలో చర్చలు, ఓటింగ్ రూపంలో యాంటీ క్లయిమాక్స్, ఆతర్వాత రాష్ట్రం ఏర్పాటు అనే క్లయిమాక్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. మరి కొన్ని వారాల్లో సినిమా ప్రదర్శన పూర్తయిపోయి.. శుభం కార్డు పడిపోతుంది. సినిమా ఎలా ఉన్నా సరే, సినిమా ఏ జోనర్‌కుచెందిన దైనా.. ఎలా ఉండినప్పటికీ.. చివర్లో పడే ఎండ్ కార్డును మాత్రం ‘శుభం కార్డు’ అనాల్సిందే.  ఆవెంటనే ఇంతసేపు సినిమాలో కామెడీని ఆనందించిన వాళ్లూ, యాక్షన్ ఎపిసోడ్స్‌తో రంజిల్లిన వారూ, ఎమోషనల్ సీన్లకు కన్నీళ్లు పెట్టుకున్న వారూ అందరూ నెమరు వేసుకుంటూ, ముక్కులు చీదుకుంటూ.. తమ తమ ఇళ్లకు వెళ్లిపోవాల్సిందే. మధ్యలో ఒకసినిమాకు వచ్చాం చూశాం పోతున్నాం. ఈ భావావేశం దిగిపోయాక మరింకేమీ మిగిలి ఉండదు. జీవితాలన్నీ యథావిధిగా సాగిపోతుంటాయి. 

కానీ.. చీల్చేవారికి ముచ్చట అదేరీతిగా ఉండొచ్చు గానీ.. అనుభవించే వారికి, విలపించేవారికి, ఆర్తారావాలతో పలవరించే వారికి.. అలాంటి అనేకానేకమందికి రాష్ట్ర విభజన అనేది అంత సింపుల్ అంశం కాదే. సినిమాలా తీసిపారేయదగ్గ అంశం  కాదు గనుకనే, వారింకా ఆశగా ఎదురుచూస్తున్నారు. కాకపోతే అందరి కోరిక ఒక్కటే..  2014 ఎన్నికల్లోగా రాష్ట్రం రాకుండా ఆపేయగలిగితే చాలు.. ఇక ఆ తర్వాత రావడం అనేది అంత ఈజీ కాదు అనే అంతా అనుకుంటున్నారు. 

తెలుగు సినిమాల్లో ‘మన కష్టాలు తొలగించడానికి ఎవడో ఒకడు వస్తాడమ్మా.. దేవుడు ఎక్కడో ఒకచోట పుట్టించే ఉంటాడు’ అనే డైలాగు రాగానే.. హీరోగారు ఎంట్రీ ఇచ్చినట్లుగా.. ఇప్పుడు ఏ హీరో అయినా వస్తాడేమో అని చూస్తున్నారు. వచ్చేవాళ్లు లేకపోయినా.. ఉండేవాళ్లలోనే ఎవరు తమను తాము హీరోగా నిరూపించుకుంటారోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాష్ర్ట విభజనను స్పష్టంగా అడ్డుకుని.. తద్వారా సమైక్య హీరోగా నిరూపించుకునే అవకాశాలు ఇంకా కొందరికి మిగిలి ఉన్నాయి. వారు తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి అలాంటి అవకాశం చాలా భిన్నంగా ఉంది. ఎలాగంటే.. హీరోలుగా నిరూపించుకోవడానికి ఆశపడుతున్న నాయకులు కొందరున్నారు. అయితే ఆపగల అవకాశం మాత్రం ఒకరి తర్వాత ఒకరికి రాబోతున్నది. అంటే ఏదశలో ఆగిపోయింది అనే దాన్ని బట్టి.. క్రెడిట్ చాలా స్పష్టంగా వారికే దక్కుతుంది. అంతే తప్ప.. ఆగిపోగానే.. మావల్లే ఆగిపోయింది అని ప్రతి ఒక్కరూ టముకు వేసుకోవడానికి ఈ వ్యవహారంలో అవకాశం లేదు. అదెలాగో.. ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయో.. ఎవరి సమర్థతలు , సంభావ్యతలు ఎలా ఉన్నాయో చూద్దాం.

కిరణ్ : మాటలు చా..లా ఎక్కువ! ఛాన్సులు చా..లా తక్కువ!!

రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగుతుంది అనే నమ్మకం ఏ కొందరికి అయిన ఉంటే గనుక.. దానికి సంబంధించిన తొలి అవకాశం మాత్రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడి దక్కబోతోంది. ఇప్పుడు ఎటూ డిసెంబరు 4వ తేదీకి బిల్లు కేబినెట్ ఆమోదం పొందబోతున్నదని తేలిపోయింది. రాష్ట్రపతి వద్దకు వెళ్లగానే రాష్ట్ర శాసనసభకు చర్చ నిమిత్తం రావొచ్చు. రెండో వారం తర్వాత వస్తుందని అనుకుంటున్నారు. ఎటూ ఎంత నీచంగా సమయం కేటాయించినా పది రోజుల వ్యవధి ఇస్తారనేది అంచనా. ఏది ఎలా ఉన్నా డిసెంబరు 20లోగా శాసనసభ సమావేశమై తీరాల్సిందేనని ఇంకో లెక్క! ఈ నేపథ్యంలో డిసెంబరు 20 నాటికి శాసనసభలో చర్చకు రావడం కిరణ్‌కు ఉన్న ఛాన్సు. శాసనసభ తమ చర్చను మాత్రమే పంపవచ్చు గాక.. కానీ ఆ దశలో జరిగే వ్యవహారంతోనే విభజన బిల్లు ఆగేస్థాయి రగడ సృష్టిస్తే గనుక.. ఆ క్రెడిట్ కిరణ్‌కు దక్కుతుంది. నిజానికి శాసనసభలో సీమాంధ్రకు చెందిన అన్ని పార్టీల ప్రతినిదులు విభజనకు వ్యతిరేకంగానే గళం విప్పి తమ తమ మనుగడకోసం తపన పడే అవకాశం ఉంది. 

అయితే బహుధా జరుగుతున్న ప్రచారం ప్రకారం శాసనసభలో సుదీర్ఘ ప్రసంగం తరువాత పదవికి రాజీనామా వంటి చర్చలకు ముఖ్యమంత్రి  సిద్ధమైతే గనుక.. ఆయన కు హీరో క్రెడిట్ దక్కుతుంది. శాసనసభ రద్దు అంత సులభం కాకపోవచ్చు గానీ.. ఆయన మరియు ఆయన కోటరీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే గనుక.. వారంతా ఒకేసారి రాజీనామాలు చేసి.. కాస్త రభస చేయవచ్చు. పాలకపక్షాన్ని చీల్చి తాము కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటిస్తే గనుక.. విభజన బిల్లు వ్యవహారం మరో కొత్త మలుపు తీసుకుంటుంది. ఏతావతా అందరూ లక్ష్యిస్తున్నది మాత్రం నెరవేరుతుంది. విభజన బిల్లు మీద చర్చల్లో జాప్యం తప్పదు. అందరూ కోరుకుంటున్నట్లుగా 2014 ఎన్నికల లోగా రాష్ట్రం రెండు ముక్కలు కాకుండా ఆపినట్లు అవుతుంది. అదొక్కటే తన హామీగా ప్రజలకు పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి కిరణ్ ఆ పని చేయగలిగిన వ్యక్తిగా హీరోగా ప్రొజెక్టు అవుతారు. 

జగన్ : సవరణ పేరుతో సంచలనం చేసేయాలని…

తెలంగాణ బిల్లు అనేది ఎటూ శాసనసభ అంచెదాటి పార్లమెంటు వరకు రావడం అనేది గ్యారంటీ. అందుకే జగన్‌కు రెండో దశలో మాత్రమే తన హీరోయిజాన్ని నిరూపించుకునే ఛాన్సుంది. అయితే పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటు బిల్లు కంటె ముందు.. అలాంటి నిర్ణయానికి దూకుడైన చర్యలు తీసుకుంటున్న కేంద్ర సర్కారుకు అలాంటి అధికారాలను దఖలు పరుస్తున్న ఆర్టికల్ 3 మీద చర్చను తెరపైకి తేవాలనేది ఆయన కోరిక. ఆర్టికల్ 3 అనేది కేంద్రానికి ‘సింపుల్ మెజారిటీతోనే’ విశృంఖల మరియు విపరీతమైన నిర్ణయాలు తీసుకునేందుకు అనుమతించే పరిస్థితి కనిపిస్తున్నది గనుక.. ముందుగా దాన్ని సవరించాలనే జగన్ డిమాండు. దానికోసమే ఆయన దేశవ్యాప్తంగా అన్ని పార్టీల వారిని కలిసి అందరి ఏకాభిప్రాయం సాధించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఆయన మాటకు ఆయా పార్టీల మద్దతు దక్కితే గనుక.. తెలంగాణ బిల్లు కేంద్రం ప్రవేశపెట్టినప్పుడు.. దాని కంటె ముందు ఆర్టికల్ 3 మీద చర్చ జరగాల్సిందేనని ఇతర పార్టీలు పట్టుబడితే గనుక.. అది జగన్ విజయం అవుతుంది. అప్పుడు జగన్ హీరో అవుతారు. 

ఆర్టికల్ 3 అనేది ఇచ్చే విసృతతాధికారాలు ఎవ్వరికీ ఆమోదయోగ్యమైనవి, ప్రజాస్వామికమైనవి కాదు గనుక.. దాని సవరణ గురించి ముందుగా చర్చ జరిగితే ప్రభుత్వం వీగిపోక తప్పదు. ఇక పార్లమెంటులో తెలంగాణ బిల్లు వచ్చినా కూడా దానికి మూడింట రెండొంతుల మెజారిటీ అనివార్యం అవుతుంది. అలా అయినంత మాత్రాన తెలంగాణ ఏర్పాటు పూర్తిగా ఆగిపోతుందని చెప్పలేం. ఎందుకంటే.. భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణకు పూర్తి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో.. బిల్లు నెగ్గవచ్చు గాక.. కానీ అది రాష్ట్ర ఏర్పాటులో రెండో అంకంగా మారుతుంది. 

తొలి అంకంలో తన పరిధి మేరకు జగన్ సంపూర్ణంగానే అడ్డుకున్నట్లు అవుతుంది. అంటే జగన్ చెబుతున్న ఆర్టికల్ సవరణ జరిగితే ఆయన నిజంగా దేశానికంతా హీరోనే. అయితే జగన్ ఈ మధ్యలో సవరణ నెగ్గడం సంగతి ఎలా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా.. కేంద్రం విశృంఖలతకు దార్లు తీసే ఇలాంటి రాజ్యాంగపు అవకరాల గురించి.. సుదీర్ఘమైన ప్రసంగం చేసి.. తనను హీరోగా నిరూపించుకునేలా.. దేశం దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారన్నది గ్యారంటీ. రాష్ట్రం సంగతి ఎలా ఉన్నా.. తనను హీరోగా ప్రొజెక్టు చేసుకోవడం వరకు.. జగన్ ఇలాంటి నిర్దిష్టమైన స్కెచ్‌తో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. 

చంద్రబాబు : పరాన్నభుక్కు హీరోయిజం ఇది!

ఆయన సీమాంధ్ర తెలంగాణ తనకు రెండు కళ్లు అన్నా.. సీమాంధ్ర వారి భయాలను నివృత్తి చేసి తెలంగాణ ఇచ్చేయండి అని ప్రకటించినా.. మొత్తానికి.. చంద్రబాబు మదిలో ఆంధ్రప్రదేశ్‌కు తాను సీఎం కావాలనే కోరికే ఉన్నదని, ఆయన సమైక్యాన్నే కోరుకుంటున్నారని కొందరు సన్నిహితులు అంటుంటారు. పైగా గతంలో భాజపా సర్కారు ఉన్నప్పుడు వారి ద్వారా తెలంగాణ డిమాండును తొక్కిన చరిత్ర ఆయన సొంతం. తమాషా ఏంటంటే.. పైకి కనిపించకపోయినా.. ఇప్పుడు కూడా భాజపా ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుకోవడం అనేది చంద్రబాబు స్కెచ్ అని.. కొందరి అనుమానం. 

ఆ మాటకొస్తే చంద్రబాబుకు ఛాన్సు కచ్చితంగా మూడో దశలోనే వస్తుంది. అంటే తొలిదశలో కిరణ్, రెండో దశలో జగన్ ఫెయిలైతే మాత్రమే చంద్రబాబుకు తన హీరోయిజం చాటుకునే ఛాన్సు వస్తుంది. తెలంగాణ బిల్లు మీద లోక్‌సభలో ఓటింగు వరకు పరిస్థితి వచ్చేసిందంటే గనుక.. అప్పుడు చంద్రబాబు చక్రంతిప్పే అవకాశం ఉంది. ఇప్పటికే ‘సీమాంధ్రుల భయాల్ని ఆందోళనల్ని కూడా పరిష్కరించిన తర్వాత మాత్రమే విభజన విషయంలో ముందుకు వెళ్లాలి.. కాంగ్రెస్ తమ స్వార్థం కోసం ఎలా పడితే అలా విభజించేస్తాం అంటే మేం సహకరించేది లేదు’ అనే డైలాగులను ఆయన భాజపా నోటమ్మట పలికించడంలో కృతకృత్యులయ్యారు. దాన్ని కంటిన్యూ చేయించి.. భాజపా తీవ్రస్థాయిలో అడ్డం పడేలా.. కాంగ్రెస్ స్వార్థపూరిత, అధికార దాహార్తితో చేస్తున్న చీలికలాగా దీన్ని అభివర్ణిస్తూ ఆపార్టీని భ్రష్టు పట్టించాలనేది ఆయన ప్లాన్. అయితే పరిమిత సంఖ్యలో లోక్‌సభల ఎంపీలను కలిగిఉన్న తను చేయగలిగినది తక్కువే గనుక.. ఆయన భాజపాను తన చేతిలో టూల్‌లాగా వాడుకోదలచుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారంలో ఎక్కడా తన వేలిముద్రలు కూడా దొరక్కుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన ప్లాన్ ప్రకారం మూడో దశలో లోక్‌సభలో ఇది ఆగిపోతే.. అప్పుడు బహిరంగంగా తను క్రెడిట్ తీసుకోకుండానే.. బాహాటంగా తానే హీరోనని చెప్పుకోకుండానే.. దాని ద్వారా దక్కగల లబ్ధిని సొంతం చేసుకోవాలనేది ఆయన కోరిక. 

ఉద్యోగులు… అహరహమూ పోరుతున్న యోధులు!

రాష్ట్రం సమైక్యంగా ఉండడానికి ఉద్యోగులు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. అయితే రకరకాల రాజకీయ కారణాల వల్ల ఇప్పటికే ఉద్యమం రెండుసార్లు ఆగిపోయింది. నీరసపడింది. ఐక్యత కట్టు తప్పిపోయింది. అయితే దానికి వారు ఎలాంటి భాష్యాలు అయినా చెప్పుకోవచ్చు గాక.. కానీ ‘తాము తమ ఉద్యమంతో దీన్ని ఆపుతాం’ అని వారు ఘనంగా ప్రకటిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజన జరగబోయేది ఉండదని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

దానికి తగ్గట్లుగా వారు ఓ నిర్దిష్టమైన పోరాట ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. శాసనసభ కోసం తెబిల్లు వచ్చిన క్షణం నుంచి ఉధృతమైన సమ్మెతో రాష్ట్రాన్ని స్తంభింపజేయడానికి కంకణబద్ధులై కదులుతున్నారు. అయితే ట్రాజెడీ ఏంటంటే.. వారికి ప్రేక్షకపాత్ర తప్ప మరొక అవకాశం దక్కకపోవచ్చు. ఎంత ఉధృతంగా సమ్మె జరిగినా.. రాజకీయంగా లోక్‌సభకు బిల్లు వచ్చేసి పై మూడు దశల్లో చెప్పుకున్న అవాంతరాలేమీ ఎదురుకాకపోతే గనుక.. ఇక ఉద్యోగులు చేయగలిగేది ఏమీ ఉండదు. 

హీరోలే లేకపోతే.. 

హీరో (హీరోయిజం) లేని సినిమా ఉంటుందా? కష్టం. స్టోరీనే హీరోగా ఉండే సినిమాలు కూడా ఉంటాయి కదా! అనే సందేహం మనకు రావొచ్చు. అది నిజం. ఆ మాటకొస్తే.. ఇక్కడ ఈ రాష్ట్ర విభజన వ్యవహారంలో స్టోరీ చాలా పుష్కలంగా ఉంది. సీమాంధ్రుల వేదన, తెలంగాణ వారి డిమాండ్లు, ఒకవైపు ఆవేదనలు, మరొకవైపు అతిశయాలు ఇలాంటివి అనేకం ఉన్నాయి. అంటే కథ చాలా డెప్త్‌తో స్ట్రాంగ్‌గా ఉంది. కానీ.. సినిమాలో బలమైన విలనీ ఉంది. 

పైన చెప్పుకున్న నాలుగుదశల్లో హీరోలు నెగ్గాలన్నా… స్టోరీలోని డెప్త్ నెగ్గించాలన్నా.. వాటన్నింటినీ మించిన విలనీ ఇందులో ఉంది. ఆ విలన్ సోనియా మరియు కాంగ్రెస్ అధిష్ఠానం అంటే అతిశయోక్తి కాదు. తమాషా ఏంటంటే.. విభజనను నిరసిస్తున్న సీమాంధ్ర యావత్తూ సోనియాను విలన్‌గా గుర్తించడం ఒక ఎత్తు. అయితే.. ఎవరిని సంతుష్టుల్ని చేయడానికి కాంగ్రెస్ ఈ దుందుడుకు నిర్ణయానికి ఒడిగట్టినదో.. ఆ తెరాస కూడా వారిని విలన్‌గానే పరిగణించే పరిస్థితికి రావడం విశేషం. అవ్విధముగా ఉభయభ్రష్టత్వం చెందిన విలన్‌గా సోనియాగాంధీ మరియు కాంగ్రెస్ అధిష్ఠానం నిగ్గుతేలబోతున్నాయి. 

ఎవరో ఒకరు హీరోగా తేలితే.. ఇక విలన్ ఎంత బలంగా ఉన్నా మరుగున పడిపోయినట్లే. అంటే రాష్ట్ర విభజన ఆగితే.. పైన చెప్పుకున్న నాయకుల్లో ఎవరో ఒకరు విభజనను ఆపిన ధీరోదాత్తులుగా నిరూపణ అయితే ఓకే. కాకపోతే.. మాత్రం.. సోనియా విలనీ భారతదేశ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిక్షిప్తమవుతుంది. 

స్వర్ణాక్షరాలతో లిఖించబడే చరిత్ర కాదు అది…

యముని మహిషపు గంటల లోహమేదో.. దాంతో రాసిన చరిత్ర!

కపిలముని

[email protected]