అన్నా… బాగున్నావె…
నువ్వెప్పుడూ బాగానే ఉంటావన్నా. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ తెలంగాణ గురించే ఆలోచిస్తావుంటావుగదా… నీ ఆలోచనలకు తగ్గట్టుగా తెలంగాణ వచ్చేస్తావుండాది. కాబట్టి నీ ఆనందం మాటల్లో చెప్పలేని విధంగా ఉండాలి… కానీ నీ మాట తీరులో ఏదో తేడాగొడతావుండాదే… ఎందుకంటే ఈరోజు నువ్వోమాటన్నావు… ఆంక్షలతో ఉండే తెలంగాణ మాకొద్దేవొద్దు అని. అదేందన్నా అట్టా అనేసినావు…?
ఎన్నేళ్లబట్టి నువ్వ తెలంగాణగావాలా అని పోరకాడినావు…? ఇన్నాళ్లకి నీ పోరాటానికి పలితం వస్తావుంటే… వ్వొద్దు అనేస్తావుండావేందన్నా…? ఆంక్షలు ఉంటే వొద్దంటావుండావు. బాగానేవుండాదన్నా… అయినా అసలు నువ్వన్నా నిజవైన నాయకుడివి. ఆడ సీమాంధ్రలోగూడా నాయకులు ఉన్నారు… దేనికన్నా… ఉప్పుకా… ఊరగాయకా… దేనికి ఉపయోగం? తెలంగాణగావాలంటూ నువ్వు అన్నేళ్లబట్టి యాగీజేస్తానేవుండావు. నీ యాగీ బరించలేకో… లేకపోతే నిజంగా తెలంగాణ ఇయ్యాలనో మొత్తానికి ఏవైతేనేం… కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చేయడానికి బిల్లును తయారుజేసేసింది. కానీ ఏదోవొక కొర్రీబెట్టేట్టు కనిపిస్తావుండాది. కాబట్టే నువ్వు అట్టాగైతే ఒద్దంటావుండావు.
అన్నా నీమాదిరిగా కోరిన కొండమీదే వానగురవాల అని పట్టుబట్టేటిగుంటేనా… సీమాంధ్ర నాయకుల్లో నీలాటోడు ఒక్కడుణ్ణా సాలన్నా… ఒక్క రాష్ట్రవేంకర్మా… మొత్తం దేశాన్నంతాగూడా… సమైక్యంగా ఉంచేమాదిరిగా పోరాటాలు జెయ్యరా… కానీ నీబోటోడు సీమాంధ్రలో లేడన్నా… నీకు నువ్వేనన్నా…
అన్నా నువ్వు ఈరోజు జెప్పిన మాటమీదే నిలువన్నా… రేప్పొద్దున నువ్వనుకున్నట్టు ఏవన్నా బిల్లులో ఆంక్షలుగనక ఉంటే… నువ్వు బిల్లును ఎనక్కి పంపించేసేట్టు సూడన్నా… తెలంగాణ నాయకులందరితోగూడా ఈమాట జెప్పి ఆళ్లని ఒప్పించేసేయ్. బిల్లు ఎనక్కి ఎల్లిపొయ్యి… మళ్లీ కొత్తగా నువ్వుగోరినట్టుగా… ఆంక్షలు లేకుండా ఉండే తెలంగాణ ఇచ్చేమాదిరిగా కొత్త బిల్లు తయారై ఒస్తేనే… నువ్వు ఒప్పుకోవాల. అందాకా… నువ్వు నీ పట్టు గట్టిగా బిగించన్నా… ఇదేమాటమీదే ఉండన్నా… నిన్నుజూసి సీమాంధ్రలో ఉండే జనాలకంతా… అసలు ఈడ నాయకుడు అనేవోడు ఉండాడా… అనే సందేహం రావాల… అట్టా నువ్వు కోరిన సంపూర్ణ తెలంగాణ వొచ్చేదాకా పోరాడన్నా… అందాకా నీ పట్టు వొదలకుండా ఉండాలని కోరుకుంటావుండానన్నా…! ఉంటానన్నా.
-ప్రేమతో
కపిలముని