ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. భాజపాతో తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని కొందరు, ఆయన ఇప్పటికే దేశంలోని భాజపాయేతర ముఖ్య పార్టీల అధినేతలు అందరితోనూ టచ్ లో ఉన్నారని కొందరు, త్వరలోనే ఢిల్లీ వేదికగా చంద్రబాబునాయుడు చక్రం తిప్పబోతున్నారని కొందరు.. ఇలా రకరకాలుగా.. వ్యాఖ్యానాలుచేసి.. కేంద్రంలో మోడీ సర్కారుకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే సంకేతాలు ఇవ్వడానికి ఇటీవలి కాలంలో తెలుగుదేశానికి చెందిన చాలా మంది నాయకులు ప్రయత్నించారు.
అలా బెదిరింపు వచనాల వల్ల కేంద్రంలో కాస్త కదలిక వస్తుందని… వారు భయపడి ఏపీకి కేటాయింపులు పెంచే అవకాశం ఉండొచ్చునని ఎవరికైనా అనిపించి ఉండొచ్చు. కానీ.. అదంతా భ్రమే !
దేశంలో భారతీయ జనతా పార్టీ హవా ఏ కొంతైనా తగ్గుతున్న నేపథ్యం ఉంటే ఇలాంటి బెదిరింపులకు మోడీ సర్కారు జడుస్తుందేమో గానీ.. ఇలా ఎన్నడూ లేని రీతిలో ఈశాన్య రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల కంచుకోటలో కూడా భాజపా కాషాయపతాకం ఎగురవేయడం అనేది అనూహ్యమైన విజయాలుగానే పేర్కొనాలి. ఇన్ని విజయాలు నమోదు చేస్తున్నప్పుడు.. ఇక అసలు వారు ఎలాంటి బెదిరింపులకైనా ఎందుకు జడుసుకుంటారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలపై నీళ్లు చిలకరించే విజయాలు ఇవి.
ఏపీ ప్రయోజనాల విషయంలో మోడీ చాలా కటువుగా వ్యవహరిస్తున్నారనే మాట వాస్తవం. అయితే ఎందుకు అలా వ్యవహరిస్తున్నారనేందుకు సంబంధించి హేతువులే ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. ఏపీ ప్రజలకు తాను ఇచ్చిన మాట మోడీకి గుర్తుండదని అనుకోవడానికి వీల్లేదు. కానీ.. ఆయన చేయదలచచుకోవడం లేదు. ఎందుకు?
ఇప్పుడు ప్రజలు రెండో కోణంలో కూడా ఆలోచించాల్సిన అగత్యం ఏర్పడుతోంది. చంద్రబాబునాయుడు ఎన్ని రంకెలు వేస్తున్నా మోడీ పట్టించుకోవడం లేదు. ఏపీకి ఏ ఒక్క రూపాయి ఇచ్చినా చంద్రబాబు ప్రభుత్వం ఆధ్వర్యంలో దుర్వినియోగం మాత్రమే జరుగుతుందనే స్థిరాభిప్రాయం మోడీ సర్కారుకు ఏర్పడిందా..? అలాంటి దుర్వినియోగాన్ని కట్టడి చేయడానికి ఏకంగా అసలేమీ విడుదల చేయకుండా బిగపడుతున్నారా? అనేది ఇప్పుడు ప్రజల కొత్త సందేహంగా మారుతోంది.