ఇన్నాళ్లు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు చాలా ఉగ్గబట్టుకుని ఉన్నారు. ఒకవైపు కాషాయ పార్టీ నాయకులు కొందరు చంద్రబాబునాయుడును, తెలుగుదేశం పాలనను ఎడాపెడా తిడుతూ వచ్చిన సందర్భాల్లో ప్రతిస్పందించడానికి, తిరిగి బీజేపీని తిట్టడానికి తమ పార్టీ అధినేతే ముందరి కాళ్లకు బంధం వేస్తూ వచ్చిన సమయంలో.. తెలుగు తమ్ముళ్లు నోళ్లకు తాళాలు వేసుకుని ఉండిపోయారు.
ఇప్పుడు సాక్షాత్తూ అధినేత ఎగబడి తిట్టండి అంటూ లాకులు ఎత్తేసేసరికి తెలుగుతమ్ముళ్లంతా రెచ్చిపోతున్నారు. భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసిందంటూ ముమ్మరంగా ప్రచారం చేయడంలో నిమగ్నమై ఉన్నారు.
మొత్తానికి విజయసాయిరెడ్డి తాజా ప్రకటన కూడా తెలుగుదేశం నాయకులు బాగా రెచ్చిపోతుండడానికి ఒక కారణంగా పలువురు భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రత్యేకహోదా ఇస్తుందనే నమ్మకం ఉందని, తాము ఆ పార్టీకి అనుకూలంగానే ఉంటాం అని విజయసాయి ఒక టీవీ చర్చలో చెప్పారు.
ఎన్డీయే నుంచి తెలుగుదేశం బయటకు రాకపోవడానికి కూడా అదే కారణం అని పలువురు భావిస్తున్నారు. తాము బయటకు వస్తే.. వెంటనే వారితో జట్టు కట్టడానికి వైకాపా సిద్ధంగా ఉంటుంది గనుక.. వారికి ఎంట్రీ లేకుండా చేయాలనేది బాబు ప్లాన్. అదే సమయంలో.. భాజపా మీద రాష్ట్రవ్యాప్తంగా బురద చల్లి, ఆ పార్టీని భయంకరమైన నమ్మకద్రోహానికి పాల్పడిన దుర్మార్గపు పార్టీగా మారుమూల ప్రాంతాల్లో ప్రజలు కూడా నమ్మేంత వరకు ఎన్డీయేలో కొనసాగాలని.. ఆ తరువాత.. భాజపాతో జట్టు కడితే.. ఎవ్వరైనా సర్వనాశనం అయిపోతారు అనేంత పరిస్థితిని కల్పించిన తర్వాత.. ఎన్డీయే నుంచి బయటకు రావాలని.. ఆ రకంగా వాళ్లతో జట్టుకట్టడానికి వైకాపా కూడా భయపడేలా చేయాలని, ఇప్పటి ఒప్పందాల మేరకు వైకాపా వారితో జట్టు కట్టినా.. ఆ పార్టీ కూడా నష్టపోయే పరిస్థితిని సృష్టించాలని తెలుగుదేశం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి బాబు వ్యూహాన్ని అమలు చేసే బాధ్యతను, భాజపా మీద బురద చల్లే యజ్ఞాన్ని తెలుగుదేశం దళాలంతా సమానంగా పంచుకుని చెలరేగుతున్నట్లుగా కనిపిస్తోంది.
-కపిలముని