దాంప‌త్యం నిల‌బ‌డ‌టానికి ప్రేమ ఒక్క‌టీ స‌రిపోతుందా?

బాధ్య‌త‌ల‌ను పంచుకోవ‌డం అనేది అరేంజ్డ్ మ్యారేజ్ లో క‌న్నా ప్రేమ వివాహంలో మ‌రింత కీల‌కం

అరేంజ్డ్ మ్యారేజ్ లో ల‌వ్ ఉంటుందా? దాంప‌త్యం నిల‌బ‌డ‌టానికి ప్రేమ ఒక్క‌టే సరిపోతుందా? అనేవి చిన్న ప్ర‌శ్న‌లు ఏమీ కావు! అరేంజ్డ్ మ్యారేజ్ అనేది .. అన్ని ర‌కాల అరెంజ్ మెంట్స్ జ‌రిగాకా… జ‌రిగే పెళ్లి కావొచ్చు! కులం, గోత్రం, ఆస్తిపాస్తులు వీట‌న్నింటితో పాటు అంద‌చందాల బేరీజులు వేసుకునే పెద్ద‌లు కుదిర్చిన పెళ్లిళ్లు జ‌ర‌గొచ్చు!

ఇండియాలో ఇప్ప‌టికీ నూటికి 90 శాతం పెళ్లిళ్లు ఇలానే జ‌రుగుతూ ఉన్నాయి. వంద‌కు ప‌ది ప్రేమ పెళ్లిళ్లు కూడా జ‌రుగుతున్నాయో లేదో మ‌రి! అలాగ‌ని ప్రేమించుకోర‌ని కాదు, ప్రేమ‌ల‌న్నీ పెళ్లి వ‌ర‌కూ రావ‌నేది అంద‌రికీ తెలిసిన సంగ‌తే! ఒక‌వేళ ప్రేమించుకుని.. పెళ్లి చేసుకున్నా.. ఆ ప్రేమ ఒక్క‌టే వారి దాంప‌త్య బంధం కొన‌సాగ‌డానికి స‌రిపోతుందా? అంటే.. దానికీ స‌మాధానం సుల‌భ‌మే! ప్రేమ ఒక్క‌టే దాంప‌త్య జీవిత బంధానికి స‌రిపోదు! ప్రేమ లేక‌పోతే ఏమీ లేద‌నడం సుల‌భ‌మే కానీ.. ప్రేమ ఒక్క‌టీ ఉన్నంత మాత్రానా.. మ‌నిషి దాంప‌త్య బంధంలో కొన‌సాగ‌డానికి అర్హ‌త క‌లిగిన‌ట్టుగా కాదు!

ప్రేమించుకుని లేచి పోయి పెళ్లిళ్లు చేసుకునే వాళ్లు కూడా క్ర‌మంగా త‌గ్గుతున్నారు! గ‌తంలో చ‌దువు సంధ్య‌లు అంతంత మాత్రంగా క‌లిగిన వారిలో ఇలాంటి లేచిపోయి పెళ్లిళ్లు చేసుకుని.. మ‌రో ఊరికి వెళ్లి కాపురాల‌ను పెట్టే సాహ‌సాలు చేసే వాళ్లు క‌నిపించే వారు. అయితే ప్ర‌స్తుత ద్ర‌వ్యోల్బ‌ణ స్థాయిని బ‌ట్టి.. ఇలాంటి సాహ‌సాలు చేసే వాళ్లు కూడా త‌గ్గిపోతూ ఉన్నారు.

ప్రేమించుకున్నామ‌ని గుట్టుగా ఎవ‌రికీ తెలియ‌కుండా ఏ ఊటీకో, కొడైకెనాల్ కో తిరిగేసి.. మ‌ళ్లీ న‌గ‌రానికి వ‌చ్చి ఎవ‌రి హాస్ట‌ల్స్ లో వాళ్లు ఉండే వాళ్లు చాలా మందే ఉంటారేమో కానీ, అర్జెంటుగా పారిపోయి పెళ్లి చేసుకోవ‌డానికి మాత్రం ప్రేమ‌లో ఉన్న వాళ్లు కూడా ఆచితూచే స్పందిస్తూ ఉన్నారు. మ‌రీ ఇద్ద‌రికీ స్థిర‌మైన ఉద్యోగాలు ఉన్నాయంటే త‌ప్ప ప్రేమ‌లు పెళ్లిగా మార‌డం లేదు అంత తేలిక‌గా! ఇద్ద‌రికీ స్థిర‌మైన ఆదాయం లేక‌పోతే, క‌నీసం ఒక్క‌రికైనా స్థిర‌మైన ఆదాయం లేక‌పోతే.. ఏ ప్రేమ జంటా అంత అమాయ‌కంగా పెళ్లి వైపు చూసే రోజులు పోయిన‌ట్టుగా ఉన్నాయి. మ‌రీ అమాయ‌కులు అయితే త‌ప్ప ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం లేదు!

అయితే ఆర్థిక స్థిర‌త్వం ఒక్క‌టే కూడా ప్రేమ‌కు అద‌న‌పు అర్హ‌త‌గా దాంప‌త్య బంధం కొన‌సాగ‌డానికి చాల‌ద‌ని అంటున్నారు రిలేష‌న్ షిప్ ఎక్స్ ప‌ర్ట్స్. ప్ర‌త్యేకించి ఒక్క‌రే సంపాదించే ప‌రిస్థితి ఉంటే, అది అమ్మాయే అయితే ఆ దాంప‌త్యం మ‌రింత దారుణంగా త‌యారు కావొచ్చ‌నేది ప్ర‌ముఖంగా వినిపించే అభిప్రాయం! అమ్మాయి సంపాదిస్తుంటే తాము రిలాక్స్ కావొచ్చ‌నే మ‌గ ప్రేమికులు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. త‌మ‌ది ప్రేమ కాబ‌ట్టి.. అమ్మాయి ఉద్యోగం చేసి తీసుకొస్తే తాము తాపీగా ఇంట్లో కూర్చుని ఏ ఆన్ లైన్ ర‌మ్మీనో ఆడి అనుభ‌వాన్ని సంపాదించుకుంటున్న వారూ క‌నిపిస్తారు! అయితే ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉండే అమ్మాయి త‌న బాధ‌ను అత‌డితో చెప్పుకోదేమో కానీ, ఆఫీసులో మ‌రొక అబ్బాయితో మాత్రం విడ‌మ‌రిచి చెప్పే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉంటాయ‌ని ఈ త‌ర‌హా పురుష‌పుంగ‌వులు తెలుసుకోవాలి!

ప్రేమలో ప‌డ‌టానికి రీజ‌న్లు ఎన్ని ఉన్నా, అప్పుడు ఎన్ని ఆక‌ర్ష‌ణ‌లు ఉన్నా.. ప‌ర‌స్ప‌రం అభిప్రాయాల‌ను గౌర‌వించుకోవ‌డం మాత్రం పెళ్లి త‌ర్వాత చాలా అవ‌స‌రం అనేది రిలేష‌న్ షిప్ ఎక్స్ ప‌ర్ట్స్ చెప్పే మాట‌! ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం కాబ‌ట్టి.. ప్ర‌తి దాన్నీ గ్రాంటెడ్ గా తీసుకుంటే, ఆ ప్రేమ క‌రిగిపోవ‌డానికి అవ‌కాశాలు పెరుగుతాయ‌నే వార్నింగ్ ఉందిక్క‌డ‌! ప్రేమ ఉంది కాబ‌ట్టి.. స‌ర్దుకుపోవ‌చ్చు! అయితే స‌ర్దుకుపోతున్నామ‌నే భావ‌న ఇన్న‌ర్ గా బిల్డ‌ప్ అవుతూ ఉంటుంది.

బాధ్య‌త‌ల‌ను పంచుకోవ‌డం అనేది అరేంజ్డ్ మ్యారేజ్ లో క‌న్నా ప్రేమ వివాహంలో మ‌రింత కీల‌కం! ప్రేమ వివాహాలు ప్ర‌ధానంగా తేడా కొట్టేది కూడా ఇక్క‌డే! ప్రేమించుకున్న రోజుల్లో ఎలాంటి మాట‌లు అయినా చెప్పుకుని ఉండ‌వ‌చ్చు. అయితే వివాహం త‌ర్వాత బోలెడ‌న్ని బ‌రువు బాధ్య‌త‌లు ప‌డ‌తాయి. బాధ్య‌త‌ల‌ను షేర్ చేసుకోవాల్సిన అవ‌స‌రాలు ఏర్ప‌డ‌తాయి. వీటిని అర్థం చేసుకుని న‌డుచుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రేమించుకున్నంత సుల‌భం కాదు ఈ బాధ్య‌త‌ల‌ను షేర్ చేసుకోవ‌డం అనేది మ‌రీ లేత వ‌య‌సులోనే పెళ్లి వైపు అడుగులు వేసే వారు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది!

డేట్ నైట్స్ ను, సెల‌బ్రేష‌న్స్ ను, టూర్ల‌ను ప్రేమించిన వారు చాలా ఎక్స్ పెక్ట్ చేసే అవ‌కాశం ఉంది. అరేంజ్డ్ మ్యారేజ్ లో ఇలాంటి ష‌ర‌తులు ఉండ‌వేమో కానీ, ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్లు పార్ట్ న‌ర్ నుంచి ఇలాంటి చాలా ఎక్స్ పెక్ట్ చేస్తారు. ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాల‌నుకునే వారికి ఇలాంటి స్వ‌భావం చాలా ఎక్కువ‌గా ఉంటుంది కూడా! అయితే ఒక్క‌సారి పెళ్లి అయిపోయింది కాబ‌ట్టి.. ఇక అవ‌న్నీ తూచ్ అంటే మాత్రం తేడాలు రావొచ్చు!

అడాప్ట‌బులిటీ, పేషెన్స్.. ప్రేమ‌కు తోడు ఈ రెండూ కూడా చాలా కీల‌కం! ఓపిక ఉండాలి, ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టుగా మ‌న‌సును, శ‌రీరాన్నీ అల‌వ‌రుచుకోవాలి! ఇవి ఉన్న‌ప్పుడే అది ప్రేమ వివాహం అయినా ప‌రిఢ‌విల్లుతుంది. అలా కాకుండా.. ప్రేమించుకున్నాం కాబ‌ట్టి, పెళ్లి చేసుకున్నాం కాబ‌ట్టి.. ఆ త‌ర్వాత లైఫ్ డ్రీమీ అనుకునేస్తే చాల‌దు!

3 Replies to “దాంప‌త్యం నిల‌బ‌డ‌టానికి ప్రేమ ఒక్క‌టీ స‌రిపోతుందా?”

Comments are closed.