ఎమ్బీయస్‌ : 2017పై నోట్ల రద్దు ప్రభావం

2016 కంటె 2017లో దేశ ఆర్థికపరిస్థితి దిగజారిందన్నది వాస్తవం. ధరలు పెరిగాయి. నిరుద్యోగం పెరిగింది. ఉత్పత్తి రంగం, చిన్న వ్యాపారస్తులు, కార్మికులు, కర్షకులు, అసంఘటిత రంగంలో ఉన్న వారందరూ బాగా దెబ్బ తిన్నారు. ఇప్పటిదాకా…

2016 కంటె 2017లో దేశ ఆర్థికపరిస్థితి దిగజారిందన్నది వాస్తవం. ధరలు పెరిగాయి. నిరుద్యోగం పెరిగింది. ఉత్పత్తి రంగం, చిన్న వ్యాపారస్తులు, కార్మికులు, కర్షకులు, అసంఘటిత రంగంలో ఉన్న వారందరూ బాగా దెబ్బ తిన్నారు. ఇప్పటిదాకా కోలుకోలేదు.  దీనికి కారణాలుగా నోట్ల రద్దు, జిఎస్‌టి అని చెప్పడానికి సందేహం అక్కరలేదు. వాటి వలన చాలా మేలు జరిగిందని పాలకపక్షం చెప్పుకోవచ్చు. నోట్ల రద్దు ప్రకటించిన నవంబరు 8 ని 'కాలా ధన్‌ విరోధ్‌ దివస్‌' పండగగా జరపవచ్చు. కానీ వారు అనుకున్నది లేదా బయటకు చెప్పినది ఒకటి, జరిగినది మరొకటి. సరైన ఏర్పాట్లు చేయకుండా తలపెట్టిన దుస్సాహసం అది అని గ్రహించకుండా జిఎస్‌టి రూపంలో మరో భారీ ప్రయోగం చేశారు. గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా వాటి పట్ల ప్రజావ్యతిరేకత తెలియవచ్చింది కాబోలు, జిఎస్‌టిలో సంస్కరణలు చేపట్టారు. ఇవి ఎంతకాలం సాగుతాయో ఎవరికీ తెలియదు. 

తిరగబడలేదేం? – నోట్లరద్దు, జిఎస్‌టి లోపభూయిష్టమైతే, ప్రజలకు నష్టం వాటిల్లి వుంటే దేశంలో తిరుగుబాటు రాలేదెందుకు? అని కొందరు ప్రశ్నిస్తారు. తిరుగుబాట్లు అంత త్వరగా వచ్చేయవు. ఇంగ్లీషు వాళ్లు పాలించిన శతాబ్దం తర్వాత కానీ తిరుగుబాటు ఊపందుకోలేదు. అందుచేత ఇంగ్లీషువాళ్లు అన్నాళ్లూ అద్భుతంగా పాలించేశారని అనగలమా? అలాగే యుపి ఎన్నికల్లో అద్భుత విజయం సాధించడమే నోట్ల రద్దు గొప్ప ప్రయోగమనడానికి దాఖలా అని కొందరంటారు. ఎన్నికలలో విజయమే కొలబద్ద అయితే 2009లో కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఏ ప్రభుత్వం గతంలో కంటె ఎక్కువ సీట్లు తెచ్చుకుంది. 2004-2009 మధ్య కాంగ్రెసుది నికార్సయిన పాలన అని కూడా ఒప్పుకోవాలిగా! ఇప్పుడు గుజరాత్‌లో కూడా బిజెపి గెలుస్తుందంటే దానికి కారణం ప్రతిపక్షాలు బలహీనంగా ఉండడమే తప్ప కేంద్ర ఆర్థిక విధానాలు అమోఘంగా ఉన్నాయని కాదు. గుజరాత్‌లో 150 సీట్లు తెచ్చుకుంటానన్న ధీమాతో గోదాలోకి దిగిన బిజెపి, యిప్పుడు 100- 120 మధ్య ఊగుతోందంటున్నాయి కొన్ని సర్వేలు. దీనికి కారణం తన విధానాల వలన చిన్న వ్యాపారులు, రైతులు కుదేలవడమే అని బిజెపి గ్రహిస్తే దేశానికి అంతకంటె మేలు యింకొకటి లేదు.

మోదీ 'థింక్‌ బిగ్‌' – జిఎస్‌టి యింకా సంస్కరణలకు గురవుతోంది కాబట్టి దాని చరిత్ర నడుస్తోందనే అనాలి. నోట్ల రద్దయితే ముగిసిన అధ్యాయం. 50 రోజుల్లో పరిస్థితి గాడిన పడుతుందని, కాకపోతే తనను ఏమైనా అనవచ్చని మోదీ నాటకీయంగా చెప్పారు. అందువలన 2017 జనవరి 1 నుంచి లెక్క ప్రారంభమైందనుకోవాలి. 2017 ముగుస్తోంది కాబట్టి నోట్ల రద్దు లక్ష్యాలేమిటి, ఏ మేరకు అవి నెరవేరాయి అనేది చూడాలి. అనేక గణాంకాలు, సమీకరణాలు వేసి చూస్తే తేలేది యిది మోదీ జింగోయిజం తప్ప వేరొకటి కాదు. ఏదో ఒకటి గ్రాండ్‌గా చేసి చూపాలన్న తపనతో చేసిన దుస్సాహసం. మోదీది ఎప్పుడూ 'థింక్‌ బిగ్‌'. స్విస్‌ బ్యాంకు నుంచి బ్లాక్‌మనీ ప్రతీ వాళ్ల ఖాతాలో 15 లక్షలు వేస్తానన్న ప్రామిస్‌ అలాటిదే. తనకు 56 అంగుళాల ఛాతీ ఉంది కాబట్టి పాక్‌, చైనాలను బెదరగొట్టేస్తానన్న స్వప్నమూ అలాటిదే. బుల్లెట్‌ ట్రైన్స్‌, స్మార్ట్‌ సిటీలు, స్వచ్ఛ గంగాలు, సర్జికల్‌ స్ట్రయిక్స్‌ – యివన్నీ చూపించి ప్రజలకు కళ్లు మిరిమిట్లు గొల్పడమే అతని స్ట్రాటజీ. దానిలో భాగంగానే నోట్ల రద్దు తలపెట్టడం జరిగింది. నిజానికి అది బృహత్‌ యజ్ఞం. రిజర్వ్‌ బ్యాంక్‌, ఆర్థిక శాఖ ఎంతో బాగా ప్లాన్‌ చేసి, చేయవలసినది. ఏ ఆర్థిక మంత్రో ప్రకటించవలసిన పథకం యిది. కానీ మోదీయే లైమ్‌లైట్‌లో ఉండదలిచారు. అందుకే నాటకీయంగా ఆయనే ప్రకటించాడు. 

ఆపరేషన్‌కు సిద్ధంగా ఉన్నారా? – ఏదైనా ఆపరేషన్‌ తలపెట్టినపుడు పేషంటు బిపి, సుగర్‌ సరైన స్థాయిలో ఉన్నాయో లేదో చూసుకుని మొదలుపెడతారు. ఆపరేషన్‌ మొదలుపెట్టేశాక రక్తపరీక్షలు చేయరు. ఇంట్లోంచి పందికొక్కును తరిమివేయాలనుకున్నపుడు యింటికున్న అన్ని కన్నాలూ మూసేసి, ఒక్క తలుపు మాత్రం తెరిచి, కఱ్ఱ చేత పట్టి వేటాడతారు. వెతకడం మొదలుపెట్టాక కన్నాల కోసం వెతకరు. నోట్ల రద్దు సూచనకు రఘురామ్‌ రాజన్‌ ఒప్పుకోకపోవడం అందరికీ విదితమే. ఆయన స్థానంలో రిజర్వ్‌ బ్యాంక్‌  గవర్నరుగా వచ్చిన ఊర్జిత్‌ పటేల్‌కు కూడా సాధకబాధకాలు తెలిసే ఉంటాయి. అయినా మోదీ ఆయనను అదిలించి ముందుకెళ్లి ఉండాలి. ఒకవేళ 'నోట్ల రద్దును యీ దశలో హ్యేండిల్‌ చేయలేము, యిదీ యథార్థ పరిస్థితి' అని ఊర్జిత్‌ మోదీకి చెప్పి వుండకపోతే ఆయనే దోషి. అలాటివాణ్ని నియమించి వాళ్లు లెంపలేసుకోవాలి. రిజర్వ్‌ బ్యాంకు ఏ విధంగా సన్నిద్ధంగా లేదో చూదాం. 2014 మే 23 నాటికి అంటే ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చేనాటికి రూ.13.70 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో (క్యాష్‌ ఇన్‌ సర్క్యులేషన్‌) ఉన్నాయి. నోట్ల రద్దు చేసేనాటికి దాని విలువ 31% పెరిగి 17.97 లక్షల కోట్లయింది. రద్దు ముందే ప్లాన్‌ చేసి ఉంటే ఆర్‌బిఐ యిలా పెరగనిచ్చేదా? 500, 1000 నోట్లవి మాత్రమే లెక్క తీసుకుంటే నవంబరు 8 నాటికి వాటి విలువ 15.44 లక్షల కోట్లు. ఇవి కాక 5 లక్షల కోట్ల విలువైన 500, 1000 నోట్లు ఆర్‌బిఐ వద్ద ఉన్నాయి. త్వరలో రద్దు చేయబోయే నోట్లను ఆర్‌బిఐ ఎందుకు ముద్రించి ఉంటుంది? వాటికి బదులు 100 రూ.ల నోట్లనే ముద్రించి పెట్టుకునేది కదా!

కొత్త నోట్లు రెడీగా ఉన్నాయా? – 500, 1000 రద్దు చేసి వాటి స్థానంలో 2000 రూ.ల నోట్లు తెద్దామని ఆర్‌బిఐ అనుకున్నపుడు ఆ మేరకు అంత విలువున్న 2 వేల నోట్లు తన దగ్గర పెట్టుకోవాలి కదా! రద్దు చేసిన వాటి విలువ 15.44 లక్షల కోట్లయితే, నవంబరు 8 నాటికి ఆర్‌బిఐ వద్ద ఉన్న 2 వేల నోట్ల విలువ 4.9 లక్షల కోట్లు మాత్రమే. అంటే 10.5 లక్షల కోట్ల నోట్ల కొరతన్నమాట.  రద్దు చేసిన నోట్లలో 65% బ్యాంకుల్లోకి తిరిగి రావని, మూడోవంతు విలువున్న నోట్లు ముద్రిస్తే చాలని ఆర్‌బిఐ ఆశ పడిందా? (అలా అయితే ఆ లెక్క దారుణంగా చీదేసింది. 99% నోట్లు వెనక్కి వచ్చేశాయి) ఒకవేళ అలా కాక నిజంగా డబ్బు అవసరం పడితే ఎలా అని ఆలోచించి ప్లాన్‌ బి సిద్ధంగా పెట్టుకుందా? దేశంలో ఉన్న నాలుగు ప్రెస్సులూ డబుల్‌ షిఫ్ట్‌ పనిచేసినా రోజుకి ఆరున్నర కోట్ల నోట్ల కంటె ఎక్కువ ముద్రించ లేవు. గడువడిగిన 50 కాదు, 57 రోజుల తర్వాత జనవరి 6 న చూస్తే ఆర్‌బిఐ ప్రింటు చేసి పంపిణీ చేయగలిగినది 1.5 లక్షల కోట్లు మాత్రమే. అంటే రద్దు చేసిన నోట్ల విలువలో 42% మాత్రమే ఆర్‌బిఐ చలామణీలోకి తేగలిగింది. అందుకే నోట్ల కొరత ఏర్పడి అవస్థలు పడ్డాం. ఇక 500 రూ.ల నోటైతే ప్రకటన చేసిన 15 రోజుల తర్వాత నవంబరు 23 నుంచే ముద్రణ ప్రారంభించారు!

పంపిణీ ఎలా చేద్దామనుకున్నారు? – నోట్లు ముద్రించగానే సరి కాదు, జనంలోకి పంపిణీ చేయాలి. బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారానే పంపిణీ జరగాలి. దేశంలోని 1.40 లక్షల బ్యాంకు బ్రాంచీలలో 90 వేలున్న నగరాల వరకు ఫర్వాలేదు కానీ గ్రామీణ ప్రాంతాలకు ఎలా చేరుద్దామనుకున్నారో భగవంతుడికే తెలియాలి. భారత జనాభాలో 69% మంది 6 లక్షల గ్రామాల్లో ఉన్నారు. అక్కడ 49 వేల బ్యాంకు బ్రాంచీలున్నాయి. అంటే 12 గ్రామాలకు ఒకటి అన్నమాట. 12 గ్రామాల ప్రజలు నగదు కోసం ఒకే బ్రాంచి మీద ఎగబడాల్సి వచ్చింది. ఇక ఎటిఎంల సంగతికి వస్తే మొత్తం 2.20 లక్షల ఎటిఎంలలో 40 వేలు అంటే 18% మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. విద్యుత్‌ సరఫరా, ఇంటర్నెట్‌ లభ్యత యివన్నీ లెక్క వేసుకుంటే ఎటిఎంల వద్ద కొల్లేటి చాంతాడంత క్యూలు ఎందుకు ఏర్పడ్డాయో, అలాటి క్యూలలో 100 మంది వరకు ఎందుకు చనిపోయారో అర్థమవుతుంది.

రద్దు చేసిన నోట్ల సైజులోనే కొత్తవి తయారు చేయించి ఉంటే ఫరవాలేక పోయేది. సైజు మారడంతో ఎటిఎం ట్రేలు మార్చవలసి వచ్చింది. అది జరగడానికి టైము పడుతుంది. క్షేత్రస్థాయి వాస్తవాలు యిలా ఉన్నాయని నిర్వహణాసామర్థ్యానికి పేరుబడిన భారత రిజర్వ్‌ బ్యాంకు ఉన్నతాధికారులకు తెలియదా? నోట్ల రద్దు వంటి భారీ కార్యక్రమం సవ్యంగా సాగదని ఊహించలేదా? ఊహించినా ప్రధానికి చెప్పడానికి భయపడ్డారా? ఎటిఎం సంక్షోభం తలెత్తాక నవంబరు 14 న అంటే ప్రకటనకు 6 రోజుల తర్వాత టాస్క్‌ ఫోర్స్‌ను నియమించారు. వాళ్లు అప్పటికప్పుడు ఎటిఎంలు సృష్టించలేరు. కొత్త నోట్లకు అనుగుణంగా ట్రేలు మార్చనూ లేరు. బ్యాంకులకు ఎలాటి ఆదేశాలివ్వాలన్న దానిపై కూడా కసరత్తు జరగలేదు. అందుకే 50 రోజుల్లో 66 నోటిఫికేషన్లు, ప్రకటనలు వెలువడ్డాయి. ఇంత గందరగోళంగా ఏ ప్రభుత్వ కార్యక్రమమూ సాగలేదు. 

ముందే చెప్పి ఉంటే? – ముందే చెప్పి వుంటే లక్ష్యం భగ్నమయ్యేదని, రహస్యం బట్టబయలు అయ్యేదని కొంతమంది వాదిస్తారు. ఇప్పుడు మాత్రం ఏమైంది? రాత్రికి రాత్రి బంగారం కొనుగోళ్లు జరగలేదా? ఎవరు కొన్నారు, ఎలా కొన్నారు అని ప్రభుత్వ ఏజన్సీలు అడగడం మానేస్తాయా? బాంకు ఖాతాల్లో డిపాజిట్టు చేసిన డబ్బు ఎక్కడిది అని అడగరా? ఇంత పెద్ద ఆపరేషన్‌లో కొన్ని లీకులు సహజం. సాధారణంగా యిలాటి వాటిల్లో అన్నీ సిద్ధంగా పెట్టుకుని తేదీ మాత్రం కొందరికి మాత్రమే చెపుతారు. గత ప్రభుత్వాలు బ్యాంకుల జాతీయకరణ వంటి ఎన్నో చర్యలు చేపట్టాయి. వాటిని చివరివరకు రహస్యంగానే ఉంచారు. అంతమాత్రం చేత తగిన ఏర్పాట్లు చేయకుండా పోలేదు. అవి ఆచరణలో విఫలం కాలేదు. బజెట్‌ తయారీ కూడా రహస్య ప్రక్రియే. ఎన్నో మంత్రిత్వ శాఖలు పాలు పంచుకుంటాయి. అయినా చివరిదాకా రహస్యంగా ఉంచగలుగుతున్నాయా లేదా? వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే రహస్యం మాట ఎత్తుతున్నారు.

బ్లాక్‌ మనీ అరికట్టారా? – నవంబరు 8 నాటి ప్రకటనలో మోదీ ప్రకటించిన మూడు లక్ష్యాలలో నల్లధనం అరికట్టడం మొదటిది – ఈ ఏడాది నవంబరు 8ని కూడా బిజెపి వారు నల్లధనం వ్యతిరేక దినంగా నిర్వహించారు. నల్లధనం నగదు రూపంలో మాత్రమే ఉందని అనుకోవడం అవివేకం, స్విస్‌ బ్యాంకుల్లో లక్షల కోట్ల బ్లాక్‌ మనీ ఉంటుందని అందరికీ తెలుసు. అక్కడకు నగదు రూపంలో వెళుతోందా? అని ఆర్థికవేత్తలు ప్రశ్నించారు. కరక్టే కదా. నల్లధనం ఉన్నవాళ్లు బంగారం, వజ్రాలు, ఆభరణాలు కొంటారు, షేర్లు కొంటారు, బినామీల పేర్లతో ఆస్తులు కొంటారు, భూములు, యిళ్లు కొని కొన్న ధర కంటె తక్కువ విలువ చూపిస్తారు. షెల్‌ కంపెనీలు పెట్టి, డబ్బును అటూయిటూ తిప్పుతారు. ఇవి అందరికీ తెలుసు.

ఈ మార్గాలను మూసివేయకుండా కేవలం నగదుపైనే విరుచుకు పడితే విజయం ఎలా సాధిస్తారు? నిజానికి కాష్‌ రూపంలో ఉన్న బ్లాక్‌ మనీ 6% మాత్రమే! ఇది ఇన్‌కమ్‌టాక్స్‌ దాడులు జరిగినపుడు తెలియవస్తూ ఉంటుంది. 2016 నవంబరు-2017 మార్చి మధ్య ఇన్‌కమ్‌టాక్స్‌ వారు పట్టుకున్న బ్లాక్‌ మనీ (దీన్ని అన్‌డిస్‌క్లోజ్‌డ్‌ వెల్త్‌, వెల్లడించని ఐశ్వర్యంగా వ్యవహరిస్తారు) రూ.19 వేల కోట్లు. దీనిలో రూ.12 వేల కోట్లు దాడుల (సెర్చ్‌ అండ్‌ సీజర్‌) ద్వారా దొరికింది. రూ.7 వేల కోట్లు సర్వేల ద్వారా దొరికింది. దీనిలో వెయ్యి కోట్లు మాత్రమే నగదు, బంగారం రూపంలో ఉంది. (ఇన్‌కమ్‌టాక్స్‌ శాఖ వీటిని విడివిడిగా చూపదు) అంటే 5% కంటె తక్కువ. ఎసిబి దాడులంటూ టీవీల్లో చూపించినప్పుడు చెప్తూంటారు, బంగారం యిటికలే ఉన్నాయి అని. ఆ విధంగా చూస్తే నగదు వాటా యింకా తక్కువే ఉంటుంది. ఈ దాడుల్లోనే వాళ్లకు ఫలానా చోట యిళ్లున్నాయి, ఫ్లాటులున్నాయి అంటూ ఎక్కువగా చెప్తారు. అవీ బ్లాక్‌మనీ నెలకొని ఉన్న స్థావరాలు. నగదులో ఉన్నదెంతని యీ ప్రక్రియ మొదలుపెట్టారు?

1% మాత్రమే వెనక్కి రాలేదు – నోట్ల రద్దు కారణంగా 5,6 లక్షల కోట్ల రూ.ల విలువైన నోట్లు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రాకుండా ఉంటాయని, ఆ మేరకు నల్ల ధనం రద్దయినట్లేనని ప్రభుత్వం భావించింది అంటారు. అది నిజమే అయితే రద్దు చేసిన నెల్లాళ్లకే వాళ్లకు దిమ్మ తిరిగి ఉండాలి. వెనక్కి ఎంత వచ్చింది అని మీడియా అడుగుతూ పోయేసరికి డిసెంబరు 13 న చెప్పారు – డిసెంబరు 10 నాటికి రద్దు చేసిన రూ.15.44 లక్షల కోట్ల విలువైన నోట్ల స్థానంలో రూ.12.44 లక్షల కోట్లు వెనక్కి వచ్చేశాయి అని. ఇంకా డిసెంబరు 31 దాకా టైముంది కాబట్టి, తక్కినది కూడా వచ్చేయవచ్చని అందరికీ అర్థమైంది. ప్రకటన రాగానే కొందరు అమాయకులు కంగారుపడి నోట్లు పారేశారు కానీ అతి త్వరలోనే వాటిని వైట్‌ చేసుకోవడం ఎలాగో మార్గాలు నుక్కున్నారని ఆర్‌బిఐకు అర్థమయ్యి అప్పణ్నుంచి మౌనం పాటించడం మొదలుపెట్టింది.

తర్వాత ఎన్నిసార్లు అడిగినా, నోట్ల లెక్కింపు జరుగుతోంది అంటూ చెప్పసాగింది. మెకనైజేషన్‌ యీ స్థాయిలో పెరిగాక కూడా నోట్ల లెక్కింపు నెలల తరబడి సాగిందంటే హాస్యాస్పదంగా లేదా? యుపి ఎన్నికల కోసం ఆపారని అనుకున్నారు. చివరకు 2017 ఆగస్టులో జూన్‌ 30 వరకు ఉన్న వార్షిక నివేదిక ప్రకటించినప్పుడు 99% అక్షరాలా 15.28 లక్షల కోట్లు వెనక్కి వచ్చేశాయి అని ఒప్పుకోక తప్పలేదు. అంటే లక్ష్యం పూర్తిగా దెబ్బ తినిపోయింది. నగదు రూపంలో ఉన్న బ్లాక్‌మనీలో 99% లాండరింగ్‌ జరిగి, బ్యాంకు సిస్టమ్‌లోకి వచ్చేసింది. ఈ ప్రయోగానికై ముద్రించిన కొత్త నోట్ల ముద్రణా వ్యయం 2016-17లో దాదాపు 8 వేల కోట్లు. అంతకు ముందు ఏడాది అది మూడున్నర కోట్లు. ఇతర ఖర్చులూ అవీ కలుపుకుని చూస్తే తడిసిమోపెడైంది. 2015-16 సం.లో ప్రభుత్వానికి రూ.66 వేల కోట్ల సర్‌ప్లస్‌ బదిలీ చేయగలిగిన ఆర్‌బిఐ 2016-17 సం.లో సగం కంటె తక్కువ 31 వేల కోట్లు మాత్రమే చేయగలిగింది. 

బాంకుల్లోకి డబ్బు రావడం వలన మేలు కలిగిందా? – భారీ ఎన్‌పిఏ (మొండి బకాయిలు) కారణంగా బ్యాంకులు నిధులు లేక విలవిల్లాడుతున్నాయని, యీ డబ్బు రావడం వలన వాటికి నిధుల కొరత తీరిపోయిందని కొందరు ఆనందపడుతున్నారు. ఈనాడు బ్యాంకులను పీడిస్తున్న సమస్య నిధులు లేకపోవడం కాదు. అప్పిచ్చి డబ్బు సంపాదిద్దామంటే సరైన ఋణగ్రహీత దొరక్కపోవడం. దిగుమతులు ఎక్కువై పోయి, ఉత్పత్తిరంగం కుదేలైంది. నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి చర్యల వలన చిన్న వ్యాపారాలు సగానికి సగం పడిపోయాయి. వర్కింగ్‌ కాపిటల్‌ కొరత వాళ్లని యింకా బాధిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ లేక రైతులూ నష్టపోయారు. బడా వ్యాపారస్తులు భారీ ఋణాలు ఎగ్గొట్టి దర్జాగా తిరుగుతున్నారు. దానాదీనా బ్యాంకుల ఆదాయం తగ్గిపోయింది. డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించారు. ఇప్పుడు మొండి బకాయిలను సర్దడానికి డిపాజిటర్ల డబ్బు కూడా స్వాహా చేస్తాయనే వార్తలు ప్రబలంగా వస్తున్నాయి. 

బాంకుల్లోకి రప్పించడమే లక్ష్యమా? – 99% వెనక్కి వచ్చేసిందని తెలిశాక, క్యాష్‌ అంతటినీ బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తేవడమే తన లక్ష్యమని, అది నెరవేరిందని బిజెపి నాయకులు కొందరు చెప్పసాగారు. దానికి యింత హంగామా ఎందుకు? చిదంబరం ఆర్థికమంత్రిగా ఉండగా ఫలానా తేదీలోగా 2005కి ముందు ప్రచురించిన నోట్లన్నీ బ్యాంకుల్లో జమ చేయాలని, లేకపోతే చెల్లవని ప్రకటించాడు. అప్పుడు అందరూ తమ వద్ద డబ్బుని బ్యాంకుల్లోకి తెచ్చేశారు. ఏ యిబ్బందీ లేకుండా జరిగిపోయింది. బ్యాంకుల్లోకి వచ్చాక వాళ్ల పని పట్టాం.

ఈ డబ్బు మీకెక్కడ వచ్చిందని నిలదీసి, వాళ్ల ముక్కు పిండి టాక్సులు చేశాం అని గొప్పలు చెప్పుకున్నారు అధికార పక్షం వారు. దాని గురించి చెప్పుకునే ముందు యీ ఆపరేషన్‌ వలన బయట పడిన బ్లాక్‌మనీ ఎంతో చూద్దాం. 2012-13లో 30 వేల కోట్లు (దాడుల్లో దొరికినది 10, సర్వేల్లో దొరికింది 20) 2013-14లో 101 వేల కోట్లు (దాడుల్లో 11, సర్వేల్లో 90), 2014-15లో 23 వేల కోట్లు (దాడుల్లో 10, సర్వేల్లో 13), 2015-16లో 21 వేల కోట్లు (దాడుల్లో 11, సర్వేల్లో 10) నోట్ల రద్దు తర్వాత 2016 నవంబరు – 2017 జూన్‌ మధ్య అంటే 8 నెలల్లో పట్టుబడింది 19 వేల కోట్లు (దాడుల్లో 12, సర్వేల్లో 7) గతంలో ఏడాదిలో బయటపడ్డది 8 నెలల్లోనే బయటపడింది అనుకున్నా భారీ స్థాయి అయితే కాదని ఒప్పుకోలేం. 

టాక్స్‌ బేస్‌ ఏ మేరకు పెరిగింది? – ఇక దాడుల వలన, బ్యాంకింగ్‌ సిస్టమ్‌లోకి డబ్బు వచ్చేయడం వలన టాక్స్‌ బేస్‌ పెరిగింది, కొత్తగా పన్ను కట్టే వాళ్లు ఎక్కువయ్యారు అని చెప్పుకునే దాని గురించి చూడబోతే – నోట్ల రద్దు తర్వాత ఎంతమంది కొత్త పన్ను చెల్లింపుదార్లు చేరారు అని అడిగితే ప్రభుత్వం ఒక్కోసారి ఒక్కో అంకె చెపుతూ వచ్చింది. ఆర్థిక శాఖ యిచ్చిన గణాంకాలే చూదాం. 2014-15 సం.లో కొత్తగా చేరిన టాక్సు చెల్లింపుదారులు 78 లక్షలు, 2015-16కి అది 100 లక్షలైంది. అంటే గతేడాది కంటె 27.6% పెరిగిందన్నమాట. ఆగస్టు 2017లో పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు సమాధానంగా 2016-17కి అది 126 లక్షలయిందని ప్రభుత్వం చెప్పింది. అంటే 26% వృద్ధి అన్నమాట. ఏప్రిల్‌- అక్టోబరు మధ్య 7 నెలల్లో గత ఏడాది సరాసరి ప్రకారం చూస్తే ఓ 60 లక్షల మంది అప్పటికే చేరి ఉండవచ్చు. నోట్ల రద్దు లేకపోయినా ఆ 26% పెరిగేదేమో అనే సందేహం వస్తుంది. సుమారు రెండు లక్షల అనుమానిత ఖాతాలున్నాయని, వారి బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తున్నామని, దీన్ని యింకా పెంచుతామని ప్రభుత్వం అంటోంది. ఇది అంత సులభమైన వ్యవహారం కాదు.

ఎన్నో రెట్ల సిబ్బంది కావాలి, వారు నిజాయితీగా పనిచేయాలి, చార్టెర్‌డ్‌ ఎక్కౌంటెంట్ల కంటె తెలివిగా వ్యవహరించాలి. జిఎస్‌టి వైఫల్యానికి కారణాల్లో చెకింగ్‌ చేసే క్షేత్రస్థాయి సిబ్బంది కొరత ఒకటి. ఇక నిజాయితీ మాటకి వస్తే నోట్ల రద్దు సమయంలో కింది స్థాయిల్లో బాంకు సిబ్బంది కష్టపడి పనిచేసినా, పైపైనే నోట్లు చేతులు మారిపోయాయి. నోట్ల కట్టలు ప్రెస్‌ నుంచి ప్రయివేటు బ్యాంకులకు, అక్కణ్నుంచి బడాబాబుల యిళ్లకు చేరిపోయాయి. ధనికుడెవ్వడూ క్యూలలో కనబడలేదని బీదవారు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఇక రూల్సును ఏర్పాటు చేయడంలో, వాటిని వంచడంలో, లోపాలను కనిపెట్టి తమ కనుగుణంగా మలచుకోవడంలో అధికారులు ఘనులు. వారి కంటె ఘనులు చార్టెర్‌డ్‌ ఎకౌంటెంట్లు అని నోట్ల రద్దు సమయంలో స్పష్టంగా రుజవైంది. బ్లాక్‌ మనీ అంతా వైట్‌ అయిపోయింది. అందువలన నోట్ల రద్దు కారణంగా ఆదాయపు పన్ను ఏ మేరకు పెరుగుతుంది అనేది వేచి చూడవలసినదే. పెరిగినా నోట్ల రద్దు లేకుండా వేరే రకాలుగా టాక్స్‌ బేస్‌ పెంచే మార్గాలు ఉపయోగించుకోవచ్చు కదా అన్న ప్రశ్న ఎదురవుతుంది.

షెల్‌ కంపెనీల వ్యవహారం – హవాలా ఆపరేషన్స్‌, షెల్‌ కంపెనీల ద్వారా నిధుల తరలింపు, బ్లాక్‌ మనీని దేశం బయటకు పంపి, దాన్నే విదేశీ పెట్టుబడులుగా చూపించడం – యివన్నీ ఎప్పణ్నుంచో జరుగుతున్న వ్యవహారం. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేటు, యితర ఏజన్సీలు వాటిని వెంటాడుతూనే ఉంటాయి. ఈ సెప్టెంబరులో 2 లక్షల షెల్‌ కంపెనీలను డి-రిజిస్టర్‌ చేసింది ప్రభుత్వం. చాలా ఖాతాలలో రెండేళ్లగా లావాదేవీలే లేవు. నోట్ల రద్దుకి సంబంధం లేకుండానే యీ విషయాలు కనుక్కోవచ్చు. అందువలన వీటికి గుర్తింపు రద్దు చేయడాన్ని నోట్ల రద్దు విజయానికి ఉదాహరణగా చెప్పడానికి లేదు. అలాగే రూ.800 కోట్ల బినామీ ఆస్తులను పట్టుకున్నామన్నారు. వాటిని కూడా ఐటీ రిటర్న్‌స్‌ చూసి కనిపెట్టవచ్చు.

మోదీ తన స్వాతంత్య్రోత్సవ ఉపన్యాసంలో 18 లక్షల మందికి ఆదాయాన్ని మించిన ఆస్తులున్నాయని అన్నారు. బ్యాంకు ఖాతాలకు పాన్‌ అనుసంధానం చేయడం, ఆధార్‌ అనుసంధానం చేయడం వంటి చర్యల ద్వారా యివన్నీ బయటపడతాయి. ఇవన్నీ నగదేతర వ్యవహారాలు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లోకి వచ్చిన రూ.1.75 లక్ష కోట్ల డిపాజిట్ల విషయంలో అనుమానాలు ఉన్నాయని అదే ఉపన్యాసంలో మోదీ అన్నారు. తిరిగి వచ్చిన 15.28 లక్షల కోట్లలో యిది 11.5%. అంటే 88.5% పెర్‌ఫెక్ట్‌లీ ఓకే అన్నమాట. 5-6 లక్షల కోట్ల బ్లాక్‌మనీ వెనక్కి రాదనుకున్నది, చివరకు యిలా తేలింది. ఇక యిది కూడా ప్రభుత్వానికి సందేహం ఉంది. ఇన్‌కమ్‌టాక్స్‌, సేల్స్‌ టాక్స్‌ బకాయిలు అంటూ పెద్ద పెద్ద మొత్తాలు ప్రకటిస్తారు. చివరకు వసూలయ్యేది తక్కువే ఉంటుంది. ఎందుకంటే అంత కట్టనక్కరలేదని చెల్లింపుదారులు ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా ఒప్పించగలుగుతారు. అందువలన యీ 1.75 లక్షల కోట్ల విషయంలో కూడా అంతిమంగా టాక్స్‌ నెట్‌లోకి వస్తుందో వేచి చూడాలి. 

దొంగ నోట్లు, ఉగ్రవాదం – రద్దు ప్రకటనలో మోదీ చెప్పిన మరో లక్ష్యం దొంగనోట్లను పట్టుకోవడం. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అంచనా ప్రకారం 2011- 15 మధ్య దేశంలో చలామణీలో ఉన్న దొంగ నోట్ల విలువ రూ.400 కోట్లు. మొత్తం రూ.18 లక్షల కోట్ల విలువైన నోట్లలో యిది ఎంత తక్కువ శాతమో చూడండి. అమెరికా, యూరోప్‌ లలో యింతకంటె ఎక్కువ శాతం ఉంది. దీనిలో ఏటా 25-45 కోట్లు పట్టుబడుతున్నాయి. బ్యాకింగ్‌ సిస్టమ్‌లో 30 కోట్లు బయటపడుతున్నాయి. నోట్ల రద్దు జరిగిన 2016-17లో పట్టుబడ్డ దొంగ నోట్ల విలువ రూ.44 కోట్లు. కొత్త నోట్లు విడుదలైన 15 రోజుల్లోనే దొంగ నోట్లు మార్కెట్‌లోకి వచ్చేశాయని అందరికీ తెలుసు. అందువలన యీ లక్ష్యం ఏ మేరకు నెరవేరినట్లు? మోదీ చెప్పిన మూడో లక్ష్యం – టెర్రరిస్టులకు నిధులు అందకుండా చేయడం. టెర్రరిస్టులకు నిధులు క్యాష్‌ రూపంలో అందుతున్నాయని ఎవరనగలరు? విదేశాల్లో కూర్చుని ప్లాన్లు వేసే వారికి ఆన్‌లైన్‌లో వెళ్లవా? బెల్జియం, ఫ్రాన్సు డిజిటల్‌ లావాదేవీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. రెండూ టెర్రరిస్టు బాధిత దేశాలే. నోట్ల రద్దు తర్వాత కశ్మీర్‌లో ఉగ్రవాదం పెరిగిందో లేదో నిదర్శనాలు అక్కరలేదు. వాళ్లను అణచలేక, గత ప్రభుత్వాలలాగానే వాళ్లతో మంతనాలు మొదలుపెట్టారు. కశ్మీరు నుంచి సైన్యాన్ని ఉపసంహరించలేదు. కేరళలో శబరిమలతో సహా దేశంలో అనేక ప్రాంతాలు టెర్రరిస్టు భయాన్ని ఎదుర్కుంటున్నాయి. 

డిజిటలైజేషనే అసలు లక్ష్యమా? – నోట్ల రద్దు ప్రకటించిన ఒక వారానికే యివన్నీ అనుభవంలోకి వచ్చాయి. వెంటనే హుందాగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఉంటే సరిపోయేది. కానీ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లింది. నోట్ల రద్దు లక్ష్యాలను మార్చి చెప్పసాగింది. మా అసలు లక్ష్యం డిజిటలైజేషన్‌ వైపు దేశాన్ని నడిపించడం అనే పల్లవి అందుకుంది. అది అంత సులభమా? బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు, గూగుల్‌ వారి 2016 జులై నివేదిక ప్రకారం 2015లో కన్స్యూమర్‌ చెల్లింపులలో 78% క్యాష్‌ చెల్లింపులు కాగా 22% మంది మాత్రమే నగదేతర సాధనాల్లో చెల్లించారు. ఎందువలన విద్యుత్‌ సౌకర్యం యింకా భారత గ్రామాలన్నిటికీ చేరలేదు. సౌకర్యం ఉండగానే సరికాదు, సరఫరా కూడా ఉండాలి.

పరిమిత గంటలు మాత్రమే విద్యుత్‌ యివ్వగలుగుతున్నారు. ఇక యింటర్‌నెట్‌ సౌకర్యం మాట చెప్పనే అక్కరలేదు. నగరాల్లోనే 35% యిళ్లల్లో యింటర్‌నెట్‌ సౌకర్యం ఉంది. మొబైల్‌ ఫోన్‌ వాడకం పెరిగింది, ఎవరి చేతిలో చూసినా సెల్‌ఫోనే కదా అంటున్నారు. గ్రామాల్లో 68%కి మాత్రమే సెల్‌ఫోన్‌ ఉంది. ఇది కూడా దేశమంతా ఒకేలా లేదు. ఒడిశాలో యిది 29%, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 44%. సెల్‌ఫోన్లున్నా వాటిలో స్మార్ట్‌ ఫోన్ల వాటా తక్కువే. సిగ్నల్‌ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. సకల సౌకర్యాలు ఉన్నా యింటర్‌నెట్‌ ద్వారా ట్రాన్సాక్షన్లు చేయడం చాలామందికి తెలియదు. తెలిసినవారికి కూడా నమ్మకం తక్కువ. సైబర్‌ క్రైమ్‌లు విపరీతంగా జరుగుతున్నాయని, ఆ క్రిమినల్స్‌ను పట్టుకోలేకపోతున్నారనీ వార్తలు వస్తూ ఉంటే ధైర్యం ఎలా వస్తుంది?

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యుపిఐ) చెల్లింపులు 74% పెరిగాయని అంకెలు చెప్తున్నారు. మొత్తం రిటైల్‌ ఎలక్ట్రానిక్‌ పేమెంట్స్‌ 14 లక్షల కోట్లు. వాటిలో యుపిఐ వాటా 0.3%. దానిలో ఎంత వృద్ధి చెందినా ఏ మూలకు వస్తుంది? నోట్ల రద్దు తర్వాత క్యాష్‌ వాడకం తగ్గిందని అంటున్నారు. 2016 ఆగస్టులో మొత్తం జనాభా ఎటిఎంలలో విత్‌డ్రా చేసిన మొత్తం రూ.2.19 లక్షల కోట్లు. 2017 ఆగస్టులో యీ అంకె రూ.2.35 లక్షల కోట్లు! అంటే పెరిగిందన్నమాట. దీనికి కారణం నాబోటి వాళ్లే. నేను గతంలో యింట్లో ఎక్కువ డబ్బు పెట్టుకునేవాణ్ని కాను.

ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ చేస్తూనే సాధ్యమైనంతవరకు కార్డు వాడుతూ యింటి అవసరాలకు అప్పుడప్పుడు విత్‌డ్రా చేసేవాణ్ని. నోట్ల రద్దు తర్వాత బ్యాంకులపై నమ్మకం పోయింది. ఎప్పుడు ఏ ఎటిఎం పని చేస్తుందో తెలియదు. చాలా చోట్ల కార్డులు వాడనీయటం లేదు. అందువలన పెద్ద మొత్తంలో క్యాష్‌ విత్‌డ్రా చేసి యింట్లో పెట్టుకుంటున్నాను. ఆన్‌లైన్‌ లావాదేవీలకు, కార్డ్‌ లావాదేవీలకు కన్సెషన్‌ యిచ్చి ఉంటే, జనాలు వాటి వైపు మొగ్గేవారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించలేదు, యింకా ఆలోచించటం లేదు. డిజిటలైజేషన్‌ వైపు ప్రజలను ఆకర్షించటం లేదు. ఈ విధంగా నోట్ల రద్దు అన్ని విధాలా విఫలమై సామాన్య ప్రజలకు కడగండ్లు మాత్రమే మిగిల్చింది. గుజరాత్‌ ఎన్నికలలో ప్రతికూల ఫలితాలు వస్తే, ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెడుతుందని ఆశించవచ్చేమో!

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌
[email protected]