ఎమ్బీయస్: అక్షయపాత్ర వివాదం సశేషమే..

2020 అక్టోబరులో అక్షయపాత్ర ఫౌండేషన్‌ వ్యవహారశైలిపై ఆడిట్ కమిటీ సభ్యుడు రాసిన లేఖ బహిర్గతం కావడంతో, వివాదం చెలరేగి దానిలోని ఇండిపెండెంటు ట్రస్టీలందరూ రాజీనామా చేశారు. దాంతో ట్రస్టు చైర్మన్ ఆ నలుగురి స్థానంలో…

2020 అక్టోబరులో అక్షయపాత్ర ఫౌండేషన్‌ వ్యవహారశైలిపై ఆడిట్ కమిటీ సభ్యుడు రాసిన లేఖ బహిర్గతం కావడంతో, వివాదం చెలరేగి దానిలోని ఇండిపెండెంటు ట్రస్టీలందరూ రాజీనామా చేశారు. దాంతో ట్రస్టు చైర్మన్ ఆ నలుగురి స్థానంలో ముగ్గుర్ని వేసుకుని ఆడిటర్ చేసిన ఆరోపణలపై విచారణ చేసే బాధ్యతను వారిలో యిద్దరికి నవంబరు 20న అప్పగించారు. ఆ ఇద్దరి సభ్యుల కమిటీ విచారణ పూర్తి చేసి ఫిబ్రవరి 2న ఒక మధ్యంతర నివేదిక సమర్పించింది కానీ దాని వివరాలు ఫౌండేషన్ బయట పెట్టలేదు.

స్టాట్యుటరీ ఆడిటర్స్ ఐన ఎర్నెస్ట్ అండ్ యంగ్, కెపిఎంజీ నుంచి కూడా వివరాలు రావాలంటున్నారు. అది మార్చిలో రావచ్చు అంటున్నారు. అప్పటిదాకా అంతా గోప్యమే. అసలీ కమిటీ వేసినప్పుడే కర్ణాటకకు చెందిన బిజెపి ఎమ్మెల్సీ లహర్ సింగ్ సిరోయా అభ్యంతర పెట్టారు. ‘ట్రస్టు కార్యకలాపాలలో అక్రమాలు జరిగాయనే ఆరోపణ వచ్చినపుడు ట్రస్టీల చేతనే విచారణ జరిపిస్తామంటే ఎలా? బయటివాళ్ల చేత చేయించాలి కానీ’ అంటూ. కానీ అక్షయపాత్ర ఆ సూచనను పట్టించుకోలేదు.

అక్షయపాత్ర ఫౌండేషన్ ఒక స్వతంత్ర సామాజిక సంస్థ. అది ఇస్కాన్ నిధులతో నడుస్తుందని చాలామంది అనుకుంటారు కానీ అది పొరబాటు. ఇస్కాన్‌తో సంబంధం లేని అనేకమంది సామాజిక ప్రముఖులు దాని స్థాపనలో, నిర్వహణలో పాలు పంచుకున్నారు. నిజానికి ప్రభుత్వం సబ్సిడీల ద్వారా దానికి ప్రజాధనాన్ని సమకూరుస్తోంది కాబట్టి ప్రత్యక్ష దాతలకూ, సిఎస్‌ఆర్ పథకం కింద విరాళమిస్తున్న కార్పోరేట్లకే కాదు, పన్నులు చెల్లిస్తున్న దేశప్రజలందరికీ దానిలో భాగం వుంది. 2018-19 నాటి ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ స్టేటుమెంటు ప్రకారం దాని ఆదాయం రూ.521 కోట్లు, ఖర్చు రూ. 516 కోట్లు. దానికి ఉన్న ఆస్తులు  (ఎసెట్స్) రూ.439 కోట్లు.

రూ. 248 కోట్లు (అంతకు ముందు ఏడాది రూ. 352 కోట్లు) విరాళాల ద్వారా రాగా రూ. 217 కోట్లు (అంతకు ముందు ఏడాది రూ. 247 కోట్లు) ప్రభుత్వ సబ్సిడీల ద్వారా వస్తోంది. ఫౌండేషన్ సమకూర్చే భోజనం ఖర్చుని 41శాతం దాతలు భరిస్తూండగా 59శాతం ప్రభుత్వం భరిస్తోంది. ఉన్న పరిస్థితి యిది కాగా ఫౌండేషన్ మట్టుకు యిది తమ అంతర్గత వ్యవహారమని, బయటివాళ్లకు ఎవరికీ జవాబు చెప్పనక్కరలేదనీ భావిస్తున్నట్లు కనబడుతోంది. ప్రభుత్వం కూడా దీనిపై యిప్పటివరకు న్యాయవిచారణకు ఆదేశించలేదు. నిజానికి కేంద్రం, అనేక రాష్ట్రాలు ప్రభుత్వపాఠశాలలోని మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు అప్పగించి వున్నారు కాబట్టి వారు కూడా దీన్ని సీరియస్‌గా తీసుకుని వుండాల్సింది.

అక్షయపాత్ర స్థాపించిన కొద్ది నెలలకే 2000 జూన్‌లో బెంగుళూరులో 1500 మంది స్కూలు పిల్లలకు భోజనం అందించడంతో ప్రారంభించి ప్రస్తుతం 12 రాష్ట్రాలు, 2 యుటిలలో 18 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్నభోజనం అందిస్తోంది. దీన్ని ప్రధానంగా ఆదరిస్తున్న రాష్ట్రాలు గుజరాత్, కర్ణాటక. అక్కడ నాలుగేసి లక్షల మంది పిల్లలకు భోజనం సమకూరుస్తోంది. దేశం మొత్తం మీద 52 కిచెన్లు నిర్వహిస్తూ అక్కణ్నుంచి స్కూళ్లకు పంపుతోంది.

స్కూల్లోనే వండిపెడితే ఫ్రెష్‌గా, వేడిగా వుంటుందని, యిలా ఎక్కణ్నుంచో పంపితే తాజాగా వుండదని అభ్యంతరాలు వచ్చినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అక్షయపాత్ర యిచ్చే భోజనంలో కోడిగుడ్డు వుండదు సరి కదా, ఉల్లి, వెల్లుల్లి కూడా వాడరు. చప్పటి, చల్లటి భోజనాన్ని పిల్లలు తినకుండా వదిలేస్తున్నారని, దాని బదులు స్కూల్లోనే వండించాలని సూచనలు వచ్చాయి. అయినా స్కూల్లో వండించే తలకాయనొప్పి మనకెందుకు, వీళ్లకు అప్పగించేస్తే వదిలిపోతుంది కదాని ప్రభుత్వాల ఆలోచన. దాంతో యీ ఫౌండేషన్ విస్తరిస్తూ పోయింది.

రాజీనామా చేసిన నలుగురు ట్రస్టీలలో మొదటివారు వ్యవస్థాపక ట్రస్టీలలో ఒకరైన అభయ్ జైన్. ఈయన ఫిబ్రవరిలోనే చేశారు. ఈయన గతంలో ఆదిత్య బిర్లా గ్రూపులో పనిచేశారు. ప్రస్తుతం మణిపాల్ గ్రూపులో పనిచేస్తున్నారు. అక్టోబరులో రాజీనామా చేసినవారిలో ఇన్ఫోసిస్‌లో సిఎఫ్‌ఓగా పనిచేసిన మోహన్‌దాస్ పై (ఈయన కూడా వ్యవస్థాపక ట్రస్టీ), అదే ఉద్యోగంలో పనిచేసిన వి బాలకృష్ణన్ (2006 నుంచి ట్రస్టీ) క్రిస్‌కాపిటల్ సహవ్యవస్థాపకుడు రాజ్ కొండూరు (ఈయన 2002 నుంచి ట్రస్టీ) ఉన్నారు. మోహన్‌దాస్ పై ఇస్కాన్‌కు, అక్షయపాత్రకు చాలా ప్రచారం చేసిన వ్యక్తి. అయినా ‘‘ఇటీవల ఫౌండేషన్ సొంత సభ్యుల మెజారిటీ బలం చూసుకుని స్వతంత్ర ట్రస్టీల సూచనలు బేఖాతరు చేయడం ఎక్కువైంది.’’ అని ఆరోపిస్తూ తప్పుకున్నారు.

వీళ్ల ఆవేదనకు మూలకారణం విప్రోలో సిఎఫ్‌ఓగా పనిచేసి, అక్షయపాత్ర ఇంటర్నల్ ఆడిట్ కమిటీలో సభ్యుడిగా వున్న సురేశ్ సేనాపతి రాసిన లేఖ. 2019 నుంచి ట్రస్టు కార్యకలాపాలను సమీక్షించిన ఆడిట్ కమిటీ చాలా లోపాలను ఎత్తి చూపింది. ముఖ్యంగా ఇస్కాన్, టచ్‌స్టోన్ ఫౌండేషన్ అక్షయపాత్రను వాడుకుంటున్న విధానం గురించి! ఇస్కాన్ మొదటినుంచి ఏదో ఒక రకమైన వివాదాలను ఎదుర్కుంటూనే వుంది.

బెంగుళూరు ఇస్కాన్ అయితే భక్తిని వ్యాపారంగా మార్చేశారన్న ఆరోపణను తిప్పికొట్టలేక పోయింది. అక్కడ దేవుడి దర్శనం కాగానే వెంటనే బయటకు వచ్చేయలేము. వాళ్ల కమ్మర్షియల్ స్టాల్స్ అన్నీ దాటుకుని బయటకు రావడానికి కనీసం అరగంట పడుతుంది. అక్కడ పుస్తకాలు, విగ్రహాలు, అగరవత్తుల నుంచి సమస్త తినుబండారాల దాకా అమ్మకానికి పెడతారు. ఈ వ్యాపారమంతా ఇస్కాన్, టచ్‌స్టోన్ ఫౌండేషన్ అనే మరో ట్రస్టు ద్వారా నిర్వహిస్తుంది. ఈ టచ్‌స్టోన్‌కి రెస్టారెంట్లు కూడా వున్నాయి.

స్కూలు పిల్లలకు అన్నం పెడతామంటూ అక్షయపాత్ర ఫౌండేషన్‌ను 2000 సం.రంలో పెట్టడంతో ఇస్కాన్ పద్థతులు నచ్చనివారు కూడా దాన్ని గౌరవించసాగారు. దానికి యిచ్చిన విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపు వుంది. అనేక కార్పోరేట్లు తమ సిఎస్‌ఆర్ (కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) స్కీము కింద దీనికి విరాళాలు యిస్తున్నారు. ఎవరికైనా అన్నదానం చేస్తే పుణ్యం వస్తుందనే ఫీలింగు వుంటుంది. మనంతట మనం వండించి పెట్టలేం కాబట్టి అక్షయపాత్రకు యిచ్చేస్తే సరిపోతుంది కదాని చాలామంది విరాళాలు పంపుతారు.

అందువలన దీన్ని ముందు పెట్టుకుని ఇస్కాన్ లాభపడసాగిందని ఆడిట్ రిపోర్టు చెప్పింది. నిజానికి ఇస్కాన్ మతపరమైన సంస్థ. అక్షయపాత్ర స్వతంత్ర ఎన్‌జిఓ. ఇస్కాన్ బెంగుళూరు శాఖ నడిపే మధుపండిట్ దాస, చంచలపతి దాస అక్షయపాత్రకు చైర్మన్, వైస్ చైర్మన్‌లుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి రెండిటి మధ్య వున్న రేఖను తుడిపేశారు. ఇస్కాన్ ఖర్చులన్నీ అక్షయపాత్ర ఖాతాలో రాసేస్తున్నారు. అక్షయపాత్రకు కేటాయించిన ప్రభుత్వభూముల్లో ఇస్కాన్ గుళ్లు కట్టిందన్న ఆరోపణలూ వున్నాయి.

అంతేకాదు, అక్షయపాత్ర విరాళాలు సేకరించడానికి వెళ్లామంటూ దాని తాలూకు వాహనాల్లో వెళ్లి, విరాళం యిస్తామనగానే ‘ఇస్కాన్‌కూ యివ్వండి, ఇస్కాన్‌కు ముప్పావలా యిచ్చి, అక్షయపాత్రకు పావలా యివ్వండి’ అంటున్నారుట. రాజస్థాన్‌లో కొన్ని చోట్ల అక్షయపాత్ర పేర వసూలు చేసిన నిధులు వాళ్లకు యివ్వలేదు. ఇచ్చినచోట చాలా ఆలస్యంగా యిచ్చారు. భవనాలకు అద్దె కట్టేది అక్షయపాత్ర, ఉండేది ఇస్కాన్ ఉద్యోగులు. ఇలా విద్యుత్ వినియోగం, ఫ్యూయల్ వినియోగం అన్నిట్లోనూ విడివిడిగా రికార్డులు మేన్‌టేన్ చేయకుండా సొమ్ము అక్షయపాత్రది, సోకు ఇస్కాన్‌ది చేసేశారు. అక్షయపాత్ర కిచెన్లను, స్టోర్లలో వున్న సామాన్లను టెంపుల్ ట్రస్టు యూనిట్ ప్రెసిడెంట్లు యథేచ్ఛగా వాడేసుకుంటున్నారు. దేనికీ లెక్కాపత్రం లేదు. ఇప్పుడీ ఆడిట్ అవసరం కూడా ఎందుకు పడిందంటే గత రెండేళ్లగా విజిల్‌బ్లోవర్స్ (పొరపాటు జరుగుతోందని ముందుగానే హెచ్చరించేవారు) ఫౌండేషన్ యూనిట్ ప్రెసిడెంట్లను హెచ్చరిస్తూనే వున్నారు. అయినా వాళ్లు పట్టించుకోలేదు.

అది ఆదాయపు పన్ను శాఖ చెవులకు చేరిందంటే ప్రమాదం. అక్షయపాత్రకు వచ్చే విరాళాలకు మినహాయింపు యిస్తోంది కాబట్టి విరాళాలు సద్వినియోగం అవుతున్నాయో లేదో ఆ శాఖ వచ్చి తనిఖీ చేయవచ్చు. అప్పుడు యీ అక్రమాలు బయటపడ్డాయంటే ఫౌండేషన్‌కి, ట్రస్టీలకు అప్రదిష్ఠ. అందుకే అంతర్గత ఆడిట్ రిపోర్టు రాగానే భయపడి స్వతంత్ర ట్రస్టీలు రాజీనామా చేసి తప్పుకున్నారు. నిధులతో బాటు అక్షయపాత్ర కిచెన్ల నిర్వహణపై కూడా ఫిర్యాదులు రావడంతో ఆడిట్ కమిటీ ఆ దిశగానూ పరీక్షించింది. సాధారణంగా అక్షయపాత్ర అనగానే శుచిగా, శుభ్రంగా వండుతారని అందరికీ అభిప్రాయం. చాలా కిచెన్లలో చెమట్లు కారిపోతున్నాయట. వంటకు ఉపయోగించే నీరు శుభ్రంగా లేదట. అనేక కిచెన్లకు ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్ (వ్యర్థపదార్థాలను శుభ్రపరిచి బయటకు వదిలే వ్యవస్థ) లేదట.

అక్షయపాత్ర తమ కిచెన్‌లలో వండించి స్కూళ్లకు ఆహారం పంపుతుంది. నియమిత వేళకు పంపడం, చేరేవరకు వేడిగా వుంచడం వంటి విషయాల్లో స్టాండర్డయిజేషన్ లేదట. ఒక్కో చోట ఒక్కోలా వుంటోందట. ఇలాటి భోజనానికి యితరుల కంటె అక్షయపాత్ర ఎక్కువ వసూలు చేస్తోంది అని ఆడిటర్లు రాశారు. ఈ ఆడిట్ రిపోర్టు మాట ఎలా వున్నా, నాకు తెలిసున్నది చెప్తాను. మా శాంతా-వసంతా ట్రస్టు ద్వారా హైదరాబాదులోని కొన్ని ప్రభుత్వాసుపత్రులలో రోగులకు సహాయకులుగా వచ్చినవారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తూంటాం. కొన్నేళ్లగా అక్షయపాత్ర భోజనం రేటు క్రమంగా పెంచుకుంటూ పోయారు. క్వాంటిటీ తగ్గిస్తూ పోయారు. ప్రస్తుతం 100 మందికి భోజనం కావాలంటే 120 మీల్స్ ఆర్డరివ్వాల్సి వస్తోంది. లేకపోతే సరిపోవటం లేదు. ఉల్లి, వెల్లుల్లి వేయకపోవడంతో రుచి సమస్య ఎలాగూ వుంది. ప్రత్యామ్నాయ సంస్థ ఏదీ కనబడకపోవడంతో వాళ్లనే కొనసాగిస్తున్నాం.

రాజీనామా చేసిన ట్రస్టీలు సాధారణ వ్యక్తులు కారు. అక్షయపాత్ర ఖ్యాతికి మచ్చ తెచ్చే యిలాటి ప్రముఖుల ఆరోపణలు వచ్చినపుడు స్వతంత్ర వ్యవస్థ చేత ఆడిట్ చేయించి తమ నిజాయితీని చూపించుకోవలసిన అవసరం ఆ ఫౌండేషన్‌కు వుంది. అయితే వాళ్లు వెళ్లిన ట్రస్టీల స్థానంలో కెవి చౌదరి (సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మాజీ చైర్మన్), కేంద్ర ఎచ్‌ఆర్‌డిలో సెక్రటరీగా చేసి రిటైరైన అనిల్ స్వరూప్, ఐఐటిబి-మోనాష్ రీసెర్చి అకాడమీకు సిఇఓగా వున్న ఎమ్‌ఎస్ ఉన్నికృష్ణన్లను నియమించారు. చౌదరి, ఉన్నికృష్ణన్‌లతో ఓ కమిటీ వేసి, యీ ఆరోపణల సంగతి చూడండి. అన్నారు. వాళ్లే ఫిబ్రవరి 2న మధ్యంతర నివేదిక యిచ్చారు కానీ ఫౌండేషన్ దాన్ని బయటపెట్టకుండా తమ రెగ్యులర్ ఆడిటర్లు ఏం చెప్తారో చూడాలంటోంది. ఎప్పటికైనా వాస్తవాలు బయటకు వస్తాయో రాదో తెలియదు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2021)
[email protected]