తెలుగు సమాజంలో డ్రగ్ బాగానే వేళ్లూనుకుందని తెలిసివచ్చింది. తెలంగాణలో జరుగుతున్నది మాత్రమే వెలుగులోకి వస్తూండగా రెండు రాష్ట్రాలకూ దీన్ని ఎలా వర్తింపచేస్తారనవచ్చు కానీ ఆంధ్రలోనూ యిలాటి విచారణ మొదలుపెడితే అక్కడా అనేక పెద్ద చేపలు బయటపడవచ్చు. హైదరాబాదు కల్చర్ మాత్రమే యిలా అఘోరించింది అనుకోవడానికి లేదు, యితర నగరాలలో స్కూళ్లకు కాలేజీల్లో కూడా వ్యాపించే వుంటుంది. డబ్బున్నవాళ్ల పిల్లల దగ్గర్నుంచి పేరుమోసిన ఇంటర్నేషనల్ స్కూలు పిల్లల దాకా దీనికి అలవాటు పడ్డారని తేలింది. డబ్బున్నవాళ్ల పిల్లలకు తైనాతీలుగా మధ్యతరగతి యువతీయువకులు వుంటారు. వాళ్లకీ యీ జబ్బు అంటివుంటుంది. సిరి అబ్బదు కానీ చీడ అబ్బడం ఎంతసేపు! కారు యాక్సిడెంట్లు చూడండి, ధనిక యువకుడు జోరుగా నడుపుతూ దేన్నో గుద్దేసి గుటుక్కుమంటాడు. రాచపీనుగ తోడు లేకుండా పోదన్నట్లు పక్కన అతని కంటె తక్కువ స్థాయి వాళ్లు – కనీసం ఒకడైనా – వుంటాడు. డ్రగ్ మహమ్మారి జడలు విప్పుకుని నాట్యమాడుతున్న సంగతి తెలిసివచ్చాక కుటుంబసభ్యులు జాగ్రత్తపడతారు. డ్రగ్ వాడకందార్ల లక్షణాలు తెలుసుకుని, అవి తమ పిల్లలలో, సన్నిహితుల్లో వున్నాయా అని పట్టిపట్టి చూస్తారు. వీలుపడితే బుద్ధి మరల్చాలని చూస్తారు. ఎంతో కొంత మేలు తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడీ విచారణలు చేపట్టడంలో గల ఉద్దేశం గురించి కొందరు ప్రశ్నిస్తున్నారు. మియాపూర్ భూకుంభకోణం నుండి దృష్టి మరల్చడానికి అంటున్నారు. ఇంటర్నేషనల్ స్కూళ్ల పేర్లు బయటపెట్టలేమని అడగకుండా సినిమావాళ్లను ముందుకు తెచ్చారంటున్నారు. సినీప్రముఖుల జోలికి పోకుండా ఒక వర్గాన్నే టార్గెట్ చేశారంటున్నారు. కొన్నాళ్లు పోయాక రాజీ కుదిరి మొత్తం కేసు నీరు కార్చేస్తారని అనుమానపడుతున్నారు. ఇవన్నీ నిజమే కావచ్చు. గత అనుభవాలు మనకు అవే చెపుతున్నాయి. భూ కబ్జాల విషయంలో వ్యక్తిగత స్థాయిలో మనం చేయగలిగేది ఏమీ లేదు – వివాదాస్పద భూములను కొనకుండా వుండడం తప్ప! డ్రగ్స్ విషయంలో చేయగలం. మనం వాటి జోలికి పోకుండా, కుటుంబసభ్యులను కూడా కాపాడుకోగలం. ఈ విచారణలు తెలుగు సమాజానికి ఒక వేకప్ కాల్‌గా పనికి వచ్చాయి.
అలా పనికి రావడానికి దోహదపడినది సినీరంగ ప్రముఖుల్లో కొందరి పేర్లు బయటకు రావడం. ఫైనల్‌గా వారి పేర్లు సాక్షులుగా రానీయండి, లేదా ఇన్‌ఫార్మర్లగా రానీయండి – ఏ విధంగానైతేనేం డ్రగ్ వాడకం గురించి విస్తృతంగా చర్చ జరిగింది. గతంలో కూడా ఐపిఎస్ అధికారి కొడుకు పట్టుబడ్డాడని, ఒక తారడి సోదరుడు పట్టుబడ్డాడని, చిన్నవాడే ఐనా తారడే పట్టుబడ్డాడని వార్తలు అడపాదడపా వచ్చాయి కానీ ప్రజలు పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం పెద్దపెట్టున ఎవేర్నెస్ వచ్చింది. ఇలాటి ఎవేర్నెస్ ఎయిడ్స్ విషయంలో తేవడానికి కోట్లాది రూపాయల ఖర్చుతో పులిరాజాకు ఎయిడ్స్ వచ్చిందా వంటి కాంపెయిన్ చేపట్టాల్సి వచ్చింది. టీకాల గురించి అవగాహన పెంచాలన్నా అమితాబ్ బచ్చన్‌కు డబ్బిచ్చి బ్రాండ్ ఎంబాసిడర్‌గా పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏ ఖర్చూ లేకుండా అలాటి కాంపెయిన్ జరిగిపోయింది. అనేకమంది సినీప్రముఖులు 'మేం డ్రగ్స్ తీసుకోం', 'మాకు అవి ఎలా వుంటాయో కూడా తెలియదు', 'గతంలో తీసుకున్నా మంచిది కాదని తెలిసి మానేశాం', 'మాది సాంప్రదాయకమైన కుటుంబం, డ్రగ్స్ వంటి నీచవ్యాపారాలు చేయం', 'పబ్ వ్యాపారం చేసినా, చెడ్డపేరు వస్తుందని బయటకు వచ్చేశాం', 'చట్టవిరుద్ధమైన పనులు అస్సలు చేయం', 'డ్రగ్స్ నిరోధప్రచారానికి చేయూత నిస్తాం' వంటి ప్రకటనలు చేసి, తమ అభిమాన సినీతారలు కూడా డ్రగ్స్ అంటే అసహ్యించుకుంటారనే సందేశాన్ని అభిమానుల మనసుల్లో నాటుకునేట్లా చేయగలిగారు. సినీజనం బాంగ్కాక్ వంటి ప్రదేశాలకు పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు దాకా చచ్చీచెడీ రాసుకోవడానికో, అక్కడి లొకేషన్స్ వెతుకుతూ యిన్‌స్పిరేషన్ పొందడానికో వెళతారు తప్ప విలాసాల కోసం వెళ్లరని తేటతెల్లం చేసేట్లు చేశారు. ఇంతకంటె పాజిటివ్ డెవలప్మెంట్ వుంటుందా? ఇలాటి పాజిటివ్ పబ్లిసిటీ కోసమే ఎక్సయిజ్వాళ్లు సినిమాజనాల పేర్లు ఉత్తిపుణ్యాన యిరికించారని అనే అనుమానం నాకు అణుమాత్రం కూడా లేదు.
వారెవరో చెప్పినట్లు సినిమారంగం వారినే టార్గెట్ చేశారనడం తప్పు. వారు టార్గెట్ చేసినవారిలో సినిమావారు కూడా ఉన్నారనడం కరక్టు. మరి తక్కినవారి పేర్లు యింతగా చర్చకు రాలేదేం అంటే అదే సినిమావాళ్ల అదృష్టం, దురదృష్టమూనూ. సినిమావాళ్లకు సంబంధించినది ప్రతీదీ న్యూసే. మీదీ, నాదీ పుట్టినరోజైతే యింట్లో వాళ్లు డబ్బులిచ్చి పేపర్లో యాడ్ వేయించాలి. సినిమావాళ్లదైతే షూటింగు టైములో కేక్ కట్ చేస్తారు. రోజంతా టీవీలో చూపుతారు. పేపర్లో వ్యాసాలు వేస్తారు. గ్రామానికి దత్తత తీసుకున్నవారు చాలామంది వుండవచ్చు. సినిమా తారలు తీసుకున్నవాటినే కవర్ చేస్తారు. నెగటివ్ న్యూసూ అంతే! ఏదో గృహహింస కేసుందనుకోండి, ఫలానా తారామణి ఆడపడుచు మొగుడిపై కేసు అని లింకు పెడతారు. ఈ విషయం వర్మగారికి తెలీదనుకోవడానికి లేదు. ఆయనకి అంత పేరు రావడానికి మీడియాయే కారణం. ఏటా అనేక సినిమాలు విజయం పొందుతాయి. కానీ ''శివ'' సక్సెస్ కాగానే దీని డైరక్టరు సినిమాలే తింటాడు, సినిమాలే తాగుతాడు, సినిమాలే పీలుస్తాడు… అంటూ మీడియా హోరెత్తించేసింది. సినిమా చూడనివారికి కూడా ఆయన పేరు తెలిసింది. ఆయన సినిమాల ద్వారా సృష్టించిన సంచలనం కన్నా చేసిన వ్యాఖ్యల ద్వారా సృష్టించే సంచలనం ఎక్కువ. ఆయనేం మాట్లాడినా మీడియా సీరియస్‌గా తీసుకుని ప్రచారం చేస్తోంది కాబట్టే ఆయన చలామణీలో వున్నారు. ఆయన సినిమా వ్యక్తి కాబట్టే మీడియా సీరియస్‌గా తీసుకుంటోంది. ఈ డ్రగ్స్ అంశంపై కూడా వేలాదిమంది ఏదో ఒక వ్యాఖ్యానం చేసే వుంటారు. కానీ వర్మ కామెంట్స్‌ను ప్రచారంలోకి తెచ్చి, దానిపై చర్చిస్తున్నారంటే కారణం – ఆయన సినిమా వ్యక్తి కావడం చేతనే!
మీడియా అతి చేస్తుంది అన్న విషయమూ అందరికీ తెలిసినదే. ఆ విషయాన్ని పూరీ జగన్నాథ్‌తో సహా అనేకమంది డైరక్టర్లు తమ సినిమాల్లో ఎత్తిచూపించి ఎత్తిపొడిచారు కూడా. ఈ విషయంలోనూ యథావిధిగా అతి చేసింది. కానీ యిదొక్కటేనా, అంతకుముందు శిరీషది హత్యా, ఆత్మహత్యా అంటూ వారాల తరబడి చంపుకుతిన్నారు. నాలుగు రోజులుగా విక్రమ్ గౌడ్వి సొంతకాల్పులా, పరాయికాల్పులా అని చర్చకు పెట్టారు. ప్రతీ రెండు నెలల కోసారి బోరులో పిల్లవాడి కథనం ఎలాగూ వుంటుంది. పెద్దగా పేరు తెలియనివాళ్ల గురించే యింత చేస్తూన్నపుడు సినిమా డైరక్టర్లు, హీరోల గురించి సమాచారం దొరికితే వదిలిపెడతారా? తెలిసినా, తెలియకపోయినా ఊహించి మరీ రాస్తారు. ఈ మాత్రం దానికి అకున్ సభర్వాల్‌ను వర్మ తప్పుపట్టడం దేనికి? ఆయన గతంలో సినిమాల్లో వేషాలకై ప్రయత్నించి దొరక్క, భంగపడి సినీరంగంపై కసి పెట్టుకున్నాడనుకోవడానికి ఆధారాలేమీ లేవు. నిజానికి సినిమారంగం సంఘంలోని అనేక వ్యవస్థలను విమర్శిస్తుంది. చాలా నెగటివ్‌గా చూపిస్తుంది. పోలీసుల్లో ఏ 20% (ఉదాహరణకి చెప్తున్నా) మందో చెడ్డవాళ్లుంటే, 80% మంది చెడ్డవాళ్లున్నట్లు, ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులందరూ దుర్మార్గులేనని, నిజాయితీగల పోలీసు అధికారి భార్యాబిడ్డలు అర్ధాంతరంగా చావడం ఖాయమని చూపిస్తుంది. అలాగే వైద్యరంగం, రాజకీయరంగం. ప్రతీ రంగంలోని చెడును ఎగ్జాగరేట్ చేసి చూపిస్తుంది. మరి తన దగ్గరకి వచ్చేసరికి సెన్సిటివ్ అయిపోతే ఎలా? మీడియా సినీరంగంలో డ్రగ్స్ సమస్యను ఎగ్జాగరేట్ చేస్తూందని ఫిర్యాదు చేస్తే ఎలా? సినిమావాళ్లందరూ డ్రగ్ ఎడిక్ట్స్ అని నిజానికి మీడియా చెప్పలేదు. వేలాది కుటుంబాలు సినిమా పరిశ్రమలో వున్నాయని చిన్నపిల్లవాడికి కూడా తెలుసు. అలాటప్పుడు నోటీసులు వచ్చిన డజను మంది, భవిష్యత్తులో అందుకోబోయే రెండు, మూడు డజన్ల మంది మాత్రమేనా సినీమావాళ్లు? తక్కిన వేలాదిమంది కాదా? ఐటీ వాళ్లలో కూడా డ్రగ్స్‌కు అలవాటు పడినవారున్నారు పిలుస్తామంటున్నారు. అప్పుడు ఐటీవాళ్ల పరువు పోతోంది, వాళ్లనే టార్గెట్ చేశారు అంటూ అజీజ్ ప్రేమ్‌జీ స్టేటుమెంట్లు యిస్తారా? సినిమా వాళ్లకే ఎందుకీ ఉలుకు?
నోటీసులు పంపించినపుడు ఎక్సయిజ్ డిపార్టుమెంటువారు సమాచార సేకరణ కోసమే అంటూ పిలిచారట. విచారణ అయిన తర్వాత యిప్పుడు వారిని సాక్షులుగా పిలుస్తామంటున్నారు. కానీ విచారణ ప్రారంభమైనపుడు వాళ్లు నిందితులన్నంత హడావుడి మీడియా చేసింది. లోపల ఏం జరిగిందో కళ్లారా చూసినట్లు 'మొదట్లో ధీమాగా మాట్లాడారు, వీడియోలు చూపించేసరికి బేజారయ్యారు. ఏడిచేశారు. సినిమా యిండస్ట్రీలో పలువురి పేర్లు చెప్పేశారు..' యిలా చెప్పుకుపోయారు. నిజంగా ఆ వ్యక్తి ఏమీ చెప్పకపోయినా, వీళ్ల పుణ్యాన యిండస్ట్రీలోని యితరులకు శత్రువైపోతాడు కదా. దాన్ని ఎక్సయిజ్ శాఖ అఫీషియల్‌గా ఖండించలేదు. సదరు వ్యక్తులూ ఖండించలేదు. లోపల ఏం జరిగిందో ఇతర శాఖల నుంచి వచ్చిన అధికారులు లీకులు యిస్తున్నారనే అనుమానంతో కొందర్ని తప్పించారనే వార్తలు మాత్రం వచ్చాయి. ట్రయల్ బై మీడియా సాగుతోందని, దాన్ని ఖండించటం అకున్ సభర్వాల్ నైతిక బాధ్యత అనీ వర్మ ఎత్తిచూపారు. విచారణకు హాజరైనవారు 'ఫలానా పత్రికలో రాసినది తప్పు, వాళ్లు యివే అడిగారు, నేను యింతే చెప్పాను' అని వివరంగా చెప్పలేదు. 'వాళ్లు సమాచారం అడిగారు, నాకు తెలిసినది చెప్పాను' అని ముక్తసరిగానే చెప్పారు. వర్మ యీ విషయాన్ని ఎత్తిచూపలేదు. ఏది ఏమైనా వర్మ వ్యాఖ్యల తర్వాత అకున్‌తో సహా ఎక్సయిజ్ శాఖ వారు స్పందించారు. కాస్త వివరణ యిచ్చారు. నేను గమనించినంత వరకు మీడియా కూడా కాస్త నిమ్మదించింది. ఒకటి రెండు ఛానెళ్లు తప్ప లోపల జరిగిన విషయాలంటూ కథనాలు యివ్వడం బాగా తగ్గించాయి. ఇది వర్మ వ్యాఖ్యానం సాధించిన పాజిటివ్ ఎఫెక్ట్.
అది సాధించే ప్రయత్నంలో ఆయన శ్రుతి పెంచి అకున్‌పై అమరేంద్ర బాహుబలి అంటూ సెటైర్లు వేశారు. పైగా స్కూలు పిల్లల పోలిక తెచ్చారు. స్కూలు పిల్లలను కూడా 12 గంటల పాటు విచారిస్తారా అంటూ అర్థం లేని ప్రశ్న వేశారు. ఎవరినెంత సేపు విచారించాలో పోలీసులకు నేర్పాలా? పైగా పూరీ కాని, సుబ్బరాజు కానీ బయటకు వచ్చి 'మాకు ఓపిక లేకపోయినా మమ్మల్ని ఎక్కువసేపు కూర్చోపెట్టేశారు' అని ఫిర్యాదు చేశారా? సాయంత్రం కాగానే అధికారులు అడిగే వుంటారు – కొనసాగిద్దామా? మళ్లీ యింకో రోజు వస్తారా? అని. మళ్లీమళ్లీ యీ నెగటివ్ పబ్లిసిటీ దేనికి, కానిచ్చేద్దాం అనుకుని వీళ్లు సరేననివుంటారు. ఆడవాళ్లు, పిల్లల విషయంలో తప్పకుండా కన్సెషన్లు వుంటాయి. స్కూలు పిల్లలతో పోలిక తేవడం అసంగతంగా వుంది. వాళ్లు చిన్నపిల్లలు. వీళ్లు ప్రాజ్ఞులు. మంచిచెడ్డలు తెలిసినవారు. పిల్లల పేర్లు బయటపెడతారా అని వర్మ అడగలేదు కానీ అకునే చెప్పారు – బయటపెట్టం. వాళ్ల భవిష్యత్తు పాడు చేయం – అని. ఏ తల్లయినా, ఏ తండ్రయినా హర్షించే విషయమది. స్కూలు పిల్లల పోలిక తేవడంతో కాబోలు అకున్‌కు ఒళ్లు మండి డిఫమేషన్ కేసు వేసే విషయం పరిశీలిస్తా జాగ్రత్త అన్నారు. డిపార్టుమెంటు చేస్తున్న పనికి అవరోధం కలిగిస్తున్నందుకు కేసు పెడతాం అంటూ ఆ శాఖ రిటైర్డ్ అధికారి అంటే, దానికి వర్మ దీటుగా సమాధానం చెప్పారు – విచారణ తీరుతెన్నులపై ఒక పౌరుడిగా నేను వ్యాఖ్యానిస్తే ఆ మాత్రానికే పని ఆగిపోతుందా? అని. డిపార్టుమెంటు వారి బెదిరింపులేవీ కార్యరూపం ధరించలేదు.
వర్మ అక్కడితో ఆగితే బాగుండును. ఎక్కడెక్కడికో వెళ్లిపోయారు. విచారణ జరిగి బయటకు వచ్చాక చార్మీ మరీ అందంగా కనబడిందట. ఆవిడ వెళ్లింది బ్యూటీ పార్లర్కా? సినీతారలు తమ అందాన్ని పెంచుకోవాలంటే ఎక్సయిజ్వారి విచారణకు వెళ్లాలా? అకున్ టీము అధికారుల కంటె సినిమా తారలు ఎక్కువ ఆరోగ్యంగా వున్నారన్నారు. మెడికల్ రిపోర్టులు చూశారా? చూపులకైతే సినిమా తెరమీద కనబడేవాళ్లు వాళ్ల ఫిజిక్ మేన్‌టేన్ చేసి తీరాలి. అధికారులకు ఆ బాధ లేదు. అకున్ టీమును ఎవరూ పట్టించుకోరన్నారు. అన్నిటి కంటె పెద్ద జోకు – తెలంగాణ పరువు పోయిందట. హైదరాబాదు యింత బ్యాడా అని బొంబాయివాళ్లు అడుగుతున్నారట. అక్కడికేదో బొంబాయి పుణ్యక్షేత్రమైనట్లు! అక్కడి అండర్‌వరల్డ్ గురించి బోల్డు సినిమాలు తీసిన వర్మ చెప్పలేకపోయారా – మీకంటేనా? అని. అక్కడి సినిమాతారలు పేవ్మెంట్లపై నిద్రపోతున్నవారిపై కార్లు ఎక్కించే ఘనులు, ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు కొనే టైపు. వాళ్లు వచ్చి వెక్కిరిస్తూంటే సమాధానం తట్టలేదా వర్మగారికి? డ్రగ్స్ విషయంలో అక్కడా యిలాటి విచారణ మొదలుపెడితే యింకెన్ని బయటపడతాయో! హైదరాబాదు విషయానికి వస్తే సినిమా వాళ్లను విచారణకు పిలిస్తేనే పరువు పోతుందా? ఇక్కడ జరిగే లాండ్ మాఫియా, యిసుక మాఫియా, ఐసిస్ సంబంధాలు యివన్నీ బయటపడినప్పుడు పరువు పోలేదా? సినిమావాళ్లు యిక్కడి భూములు, చెరువులు కబ్జా చేసినపుడు, సినిమా నిర్మాణంలో వుండగానే యూనిట్‌వాళ్లు లీకులు చేసినప్పుడు పరువు పోలేదా? ఇవి జరిగినప్పుడు బొంబాయివాళ్లు ముక్కు మీద వేలేసుకోలేదా? ఇప్పుడే మేలుకొన్నారా?
ప్రతిపక్షాలు భూకుంభకోణాలు బయటపెట్టినప్పుడల్లా ప్రభుత్వాలు 'మన రాష్ట్రం బ్రాండ్ యిమేజి పెంచి పెట్టుబడులు ఆకర్షిద్దామని మేం ప్రయత్నిస్తూ వుంటే యివన్నీ ప్రస్తావించి ఆ యిమేజికి భగ్నం కలిగిస్తున్నారు' అని కోప్పడుతూ వుంటారు. ఇప్పుడు వర్మగారి వ్యవహారమూ అలా తయారైంది. మరి బెజవాడ మీద సినిమా తీసినపుడు ఆంధ్ర పరువు పోతుందని, రక్తచరిత్ర తీసినపుడు అనంతపురం పరువు పోతుందని ఆయన ఆలోచించలేదా? ఏదో ఒకలా విషయం బయటపడుతోంది. ఎంతో కొంత మేరకు క్షాళన జరుగుతుంది, కాకపోయినా కొత్తవాళ్లు యీ బిజినెస్‌లోకి రావడానికి జంకుతారు అని సామాన్య పౌరుడు సంతోషిస్తాడు. ఈ విచారణ చేపట్టి ఎక్సయిజ్ డిపార్టుమెంటు అఘాయిత్యాలు చేస్తోందన్న కలర్ యివ్వడం అనవసరం. వాళ్లు అవసరమనుకున్న సందర్భాల్లో బ్లడ్ శాంపుల్స్ యిస్తారా లేదా అని అడిగే తీసుకున్నారు. ఇస్తే అనుమానం తీరిపోతుంది కదానుకున్నవారు యిచ్చారు. ఎందుకివ్వాలి అనుకున్నవారు యివ్వలేదు. వాళ్లవాళ్ల యిష్టం. పౌరహక్కులకు విఘాతం ఏమీ కలగలేదు. కొందరు తెలియదు అనే సమాధానాలతోనే నెట్టుకొచ్చారట. వాళ్లనీ డిపార్టుమెంటు వాళ్లు గద్దించినట్లు లేదు. చెప్పిన సమాధానాలు రికార్డు చేసుకుని పంపించారు. లోపలికి వెళ్లినవారు అమాయక గిరిజనులు కాదు. ఏ సందర్భంలో డైలాగులు ఏ మేరకు చెప్పాలో, ఎలా చెప్పాలో నేర్పగలిగినవారు, నేర్చుకున్నవారు. పైగా అతి ఖరీదైన లాయర్లను పెట్టుకుని తర్ఫీదు పొందివచ్చినవారు. అది ఎక్సయిజు వాళ్లకీ తెలుసు. వాళ్ల జాగ్రత్తలో వాళ్లుంటారు.
లోపల విచారణ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. మొదట్లో బయటకు వచ్చిన వార్తల ప్రకారం – నోటీసులు అందుకున్నవారు లోపలకి వెళ్లి తమకేమీ తెలియదనడం, అప్పుడు డిపార్టుమెంటు వాళ్లు సిసిటివి ఫుటేజిలు, వాట్సప్ మెసేజులు చూపి ప్రశ్నించడం జరిగింది. ఇది నిజమే అయితే డిపార్టుమెంటు బాగా హోం వర్కు చేసుకునే యీ కసరత్తు మొదలెట్టిందనుకోవాలి. ఇదంతా యిద్దరు ముగ్గురు డ్రగ్ వ్యాపారస్తుల డేటా ప్రకారం తవ్వి తీసినది. ఈ నెట్‌వర్క్‌లో యింకా ఎందరు కెల్విన్లు వున్నారో, వాళ్ల దగ్గర ఎంత డేటా వుందో తెలియదు. కెల్విన్ ఈవెంట్ మేనేజరు కూడా కాబట్టి ఆ పేరు చెప్పి చాలామంది ఆ హోదాలో మాత్రమే తెలుసన్నారుట. తక్కినవారి విషయంలో యీ యీవెంటు మేనేజ్మెంటు వెసులుబాటు వుంటుందో లేదో తెలియదు. ఏది ఏమైనా ఎక్సయిజ్వాళ్లు ఏవో తంటాలు పడుతున్నారు. ఇప్పటిదాకా ఎవరి పౌరహక్కులకూ భంగం కలిగించలేదు. అయినా వర్మగారు వారిపై పగబట్టారు. అకున్ సభర్వాల్‌తో పోలిస్తే చార్మీ బిగ్గర్ హీరో అంటూ అకున్ను తీసిపారేశారు. అసలు వాళ్లిద్దర్నీ ఏ విధంగా పోలుస్తాం? ఇద్దరి వృత్తులూ వేరు. డ్రగ్ వ్యతిరేక ర్యాలీని వర్మ వెక్కిరించారు. అలాటివి పనికిమాలినవి, ప్రజలపై ప్రభావాన్ని కలిగించవు, అవి చూసి ఎవరూ డ్రగ్స్ మానరు అన్నారు. ప్రజల్లో అవగాహన కలిగించే నిమిత్తం అనేక అంశాలపై ర్యాలీలు నిర్వహిస్తూనే వుంటారు. వాటివలన ప్రయోజనం ఏ మేరకు వుందో ఎవరూ రిసెర్చి చేసినట్లు లేదు. డ్రగ్స్ అలవాటైనవారు మానలేరు, సరే, కొత్తవారు అలవాటు చేసుకోకపోవచ్చు కదా అని ఎందుకు ఆలోచించకూడదు? అకున్ సినిమావాళ్లనే టార్గెట్ చేశాడట. గొడవ వస్తోందని తక్కినవాళ్లను కూడా చేస్తున్నామని చెప్పారట. వాళ్ల ఫైళ్లు చూశారా వర్మ? ఎందుకొచ్చిన ఊహాగానాలు? డ్రగ్స్ మీదే ఎందుకీ ఫోకస్? మద్యం మీద ఎందుకు చేయకూడదు? ఆదాయం పోతుందనా? అని చక్కటి ప్రశ్నలు వేసి ఆపకుండా మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమించండి అని తన అభిమానులకు పిలుపు నిచ్చి వుంటే సంతోషించేవాణ్ని.
సిబిఐ కానీయండి, సిట్ కానీయండి – విచారణాధికారులను ఎవర్ని చూసినా జాలి కలుగుతుంది. వాళ్లెంత కష్టపడి ఆధారాలు వెలికి తీసినా అంతిమలక్ష్యం నెరవేరుతుందని వారికే నమ్మకం వుండదు. మధ్యలోనే రాజీలు కుదిరిపోతాయి. 'ఎంత పెద్దవారైనా సరే, ఎవరినీ వదలం' అని గంభీరంగా ప్రకటనలు చేసే రాజకీయ నాయకులే స్వప్రయోజనాల కోసం కేసును నీరు కార్చేస్తారు. పెద్దవాళ్లు, అస్మదీయులు యిరుక్కుంటే కోర్టులు సైతం తగినన్ని సాక్ష్యాలు లేవంటూ నిందితులను విడిచిపెట్టేస్తాయి. ప్రాణాలకు తెగించి టెర్రరిస్టులను పట్టుకున్న సందర్భాల్లో కూడా మంత్రులు సైతం వచ్చి దబాయించి విడిపించుకుని పోతారు. విచారణ ఆలస్యమైన కొద్దీ సాక్షులు ఎదురు తిరుగుతారు. డ్రగ్ వ్యాపారం చేసేవారికి శిక్షలు తప్పవు, అందరికీ తెలుసు. సరదాకు సరఫరా చేసేవాళ్లకు…? వాడేవారికి….? వీటిలో స్పష్టత లేదు. ఏది మాదకద్రవ్యం అనే విషయంలో కూడా కొకైన్ కైతే ఒకలాటి శిక్ష, గంజాయికైతే మరో రకం శిక్ష అంటున్నారు. అకున్ ఐతే వాడినవారికి కూడా మూడేళ్ల శిక్ష అంటున్నారు. ఆయన స్టేటుమెంటుకు విలువ తగ్గిస్తూ కెసిఆర్ 'బాధితులకు (అనగా వ్యాపారం చేయకుండా కేవలం వాడేవారు అనుకోవాలి) శిక్ష ఉండదు' అన్నారు. ఇక అందరూ తాము బాధితులమే తప్ప బాధపెట్టేవారం కాదని క్లెయిమ్ చేస్తారు.
ఈ పరిస్థితుల్లో సైతం శ్రమదమాదులకోర్చి పనిచేసే విచారణాధికారులకు మనం ఫాన్మెయిల్స్ రాయకపోయినా, వారి నైతిక స్థయిర్యం దిగజార్చే పనులు చేయకుండా వుంటే చాలు. సినిమావాళ్లు మహామహా కలామ్‌నే పేరడీ చేసిపారేశారు. రేప్పొద్దున శకుని అగర్వాల్ అనే కామెడీ కారెక్టరును తయారుచేసి ఆడుకున్నా అడిగేవారు లేరు. ఈలోగా బాధ్యత ఎరిగిన జనం మౌనంగా వుంటే చాలు. మౌనంగా వుండేవారిలో వర్మ లేరు. చార్మీని ఝాన్సీ లక్ష్మీబాయితో పోల్చారు. అంటే ఆవిడ ఎక్సయిజ్వాళ్లపై యుద్ధానికి వెళ్లారా? వాళ్లామె శత్రువులా? ఏ రకంగా? వాళ్లిద్దరూ పరస్పరవిరుద్ధమైన లక్ష్యాలతో పనిచేస్తున్నారా? తన వ్యాఖ్యలతో విచారాణాధికారులను వెక్కిరిస్తూ ఆయన ఏం సాధిస్తున్నారో ఆయనకే తెలియాలి. 'నేనేమన్నా వాళ్లకు అడ్డుపడుతున్నానా? వాళ్ల పని వాళ్లను చేయమనండి. నా పాటికి నేను స్వతంత్ర పౌరుడిగా నా ఆలోచనలను వ్యక్తం చేస్తూనే పోతా' అంటారు వర్మ గడుసుగా. ఆయన మామూలు వ్యక్తి అయితే ఆయన మాటలను ఎవరూ పట్టించుకునేవారు కారు. ఒక స్థాయి గల వ్యక్తి కాబట్టే ఆ మాటలపై చర్చ జరుగుతోంది. వాటికి విస్తృత ప్రచారం లభిస్తోంది. ఫిల్మ్‌మేకర్‌గా కానీ, సామాజిక వ్యాఖ్యాతగా కానీ తన స్థాయిని, దానితో బాటు ఏర్పడిన బాధ్యతను వర్మ గారు గుర్తించటం లేదనదే నా బోటివాళ్ల బాధ.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2017)