కాంగ్రెసు చేతిలోంచి పుదుచ్చేరి జారిపోయాక ప్రస్తుతం మిగిలినవి మూడే రాష్ట్రాలు – ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్. వీటిలో 8 నెలల్లో రాబోయే ఎన్నికలలో మూడోది చేజారిపోయే సూచనలు యిప్పుడే కనబడుతున్నాయి. అదే జరిగితే నింద మోయవలసినది అమరీందర్‌ను అణచి, సిద్దూని నెత్తి కెక్కించుకున్న రాహుల్, ప్రియాంకలే! కాంగ్రెసు అధిష్టానానికి మొదటి నుంచి వున్న దౌర్భాగ్యం ఏమిటంటే – రాష్ట్ర కాంగ్రెసు నాయకులు బలంగా వుండి, స్వతంత్రంగా వ్యవహరిస్తే ఓర్చుకోలేదు. వాళ్లు బలపడకుండా వుండడానికి నిరంతరం అసమ్మతిని ఎగదోస్తూనే వుంటారు. ఎమ్మెల్యేల మద్దతుందా, ప్రజల ఆదరణ వుందా అన్నది ప్రశ్న కాదు, తాము చెప్పినప్పుడు కూర్చుని, లేవమన్నపుడు లేస్తున్నాడా లేదా అనేదే వాళ్లకు కావలసినది. తమకు జీహుజూర్ అననివాళ్లని పార్టీలోంచి పంపేసేదాకా వాళ్లకు నిద్రపట్టదు.
దేశంలో అనేక రాష్ట్రాలలో బలమైన ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయంటే అది కాంగ్రెసు చలవే! వాటి స్థాపకులు తమ పార్టీలో వుండగా అవమానించి బయటకు పంపేదాకా అధిష్టానం నిద్రపోదు. ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ పోగానే మెజారిటీ ఎమ్మెల్యేలు జగన్‌ను బలపరుస్తారని నిరూపణ కాగానే, అతన్ని తొక్కేసేదాకా ఊరుకోలేదు. అతను తిరగబడితే కేసులతో వేధించి, జైలుకి పంపించింది. చివరికి ఏమైనా బావుకుందా అంటే ఆంధ్ర రాష్టం మొత్తంలో ఖాళీ అయిపోయింది. తెలంగాణలో ఎప్పటికి పుంజుకుంటుందో తెలియదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి 33 మంది ఎంపీలు తెచ్చుకున్న పార్టీకి యిప్పుడు 3 రావడం గగనంగా వుంది. అంతెందుకు ఆసాంకు చెందిన హిమాంత బిశ్వశర్మ, తరుణ్ గొగోయ్‌పై ఫిర్యాదు చేద్దామని వెళితే రాహుల్ ఎపాయింట్‌మెంటే యివ్వలేదు. ఇచ్చాక కూడా కుక్కపిల్లతో ఆడుతూ కూర్చున్నాడు కానీ, శర్మ మాటలు వినలేదు. దెబ్బకి అతను పార్టీ బయటకు వచ్చేసి, బిజెపిలో చేరి, యీ రోజు ఈశాన్య రాష్ట్రాలన్నిటిలోనూ బిజెపి పతాకం ఎగిరేట్లా చేయగలిగాడు.
ఎక్కడైనా కాంగ్రెసు నెగ్గిందా అంటే దానికి కారణం ప్రజల్లో పలుకుబడి సంపాదించుకున్న స్థానిక నాయకుల వలన! రాహుల్ లేదా ప్రియాంకా ప్రచారానికి వస్తే వచ్చే సీట్లు కూడా పోతున్నాయి. ఇన్ని చూస్తూ కూడా రాహుల్‌కు అహంభావం పోలేదు. పంజాబ్‌లో అమరీందర్ సొంత ప్రతిభతో నెగ్గి, తనను సంప్రదించకుండానే ప్రభుత్వాన్ని నడిపేస్తున్నాడని దుగ్ధ. అతన్ని ఎలాగైనా తీసేయాలి, కనీసం తగ్గించాలి అని కంకణం కట్టుకున్నాడు. అమరీందర్ 2002-07 మధ్యలో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది. 2004లో కాంగ్రెసు నెగ్గాక, పంజాబ్ కాంగ్రెసు నాయకులు కొందరు అమరీందర్‌పై సోనియాకు ఫిర్యాదులు మొదలుపెట్టారు. 2005లో అమరీందర్ వెళ్లి సోనియాను కలిశాడు. అహ్మద్ పటేల్, మన్‌మోహన్ సింగ్ అమరీందర్‌కు బాసటగా నిలిచారు. సోనియా అసమ్మతివాదులను కట్టడి చేసింది.
2007 అసెంబ్లీ ఎన్నికలలో అమరీందర్ ప్రభుత్వం ఓడిపోయి అకాలీదళ్-బిజెపి ప్రభుత్వం వచ్చింది. వారి పరిపాలన అరాచకంగా సాగడంతో రాష్ట్రప్రజల్లో అసంతృప్తి పెరిగింది. 2017 అసెంబ్లీ ఎన్నికలలో అమరీందర్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు వచ్చాడు. కానీ రాహుల్‌కి, ప్రియాంకాకు అమరీందర్ నచ్చలేదు. వాళ్ల కాండిడేట్ నవజ్యోత్ సింగ్ సిద్దూ! అతనూ అమరీందర్‌లాగానే పాటియాలా ప్రాంతానికి చెందిన జాట్ శిఖ్కు. క్రికెటర్‌గా దశాబ్దానికి పైగా చాలా పేరు తెచ్చుకుని, 1999లో టీవీ కామెంటేటర్‌గా, హోస్ట్‌గా మారాడు. బిజెపిలో చేరి 2004లో అమృతసర్ నుంచి ఎంపీగా నెగ్గాడు. సిద్దూకి హాస్యచతురత వుంది, వాక్చాతుర్యం వుంది, ఆకర్షణీయమైన రూపం వుంది. కానీ అదుపులేని ఆవేశం, ఆగ్రహం ఉన్నాయి. 1996లో క్రికెట్ టీము కెప్టెన్‌తో బహిరంగంగా పేచీ పడ్డాడు. 1988లో వెహికల్ పార్కింగ్ విషయంలో ఒక ముసలాయనతో పేచీ పడి కొడితే ఆయన చనిపోయాడు. అది కేసు కావడంతో 2006 పంజాబ్ హైకోర్డు అతనికి శిక్ష వేసింది. దాంతో అతను ఎంపీ పదవికి రాజీనామా చేశాడు. 2007లో ఉపఎన్నికలో మళ్లీ నెగ్గాడు.
ఈ లోపునే 2006లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అవినాశ్ రాయ్ ఖన్నాను కొట్టాడు. పెద్ద గొడవ అవబోయింది కానీ అరుణ్ జేట్లే సర్దిచెప్పడంతో గొడవ సద్దు మణిగింది. 2014 పార్లమెంటు ఎన్నికలలో బిజెపి సిద్దూని తన అమృతసర్ నియోజకవర్గాన్ని జేట్లేకు యిమ్మనమంది. సణుగుతూనే యిచ్చాడు. కానీ అమరీందర్ చేతిలో జేట్లే ఓడిపోయాడు. 2016లో బిజెపి సిద్దూకి రాజ్యసభ సీటు యిచ్చి ఊరుకోబెట్టింది. కానీ కొన్ని నెలల తర్వాత అతను కోపగించుకుని రాజీనామా చేసి, పార్టీలోంచి బయటకు వచ్చేశాడు. అతనికి గ్లామర్ వుందని, పంజాబీ యువతలో క్రేజ్ వుందని అనుకున్న రాహుల్ అతన్ని కాంగ్రెసులో చేర్చుకుని, 2017 అసెంబ్లీ ఎన్నికలలో అమృతసర్ (ఈస్ట్) నుంచి పోటీ చేయడానికి టిక్కెట్టిచ్చాడు. అతను నెగ్గాడు కూడా.
2017 ఎన్నికల్లో కాంగ్రెసు నెగ్గడానికి ప్రధాన కారణం, ఆట్టే మాట్లాడితే ఏకైక కారణం – అమరీందర్. అకాలీదళ్-బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకత వున్న మాట నిజమే కానీ, ఆప్ ఒక బలమైన ప్రత్యమ్నాయంగా కనబడుతోంది. అమరీందర్ ప్రశాంత కిశోర్‌ను సలహాదారుగా పెట్టుకుని, హైటెక్ పద్ధతుల్లో ప్రచారం సాగించాడు. సోనియా, రాహుల్ బొమ్మలు పెట్టుకోలేదు. ‘కెప్టెన్‌దీ సర్కార్’ అనే నినాదంతో తనను తానే ప్రొజెక్టు చేసుకుంటూ ఎన్నికలలో పోరాడాడు, 83 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలను గెలిపించాడు. ఈ ధీమాకు కారణం 2014లో మోదీ హవా దేశాన్ని ఊపేసి, సీనియర్ కాంగ్రెసు నాయకులనేకమంది పోటీ చేయడానికి దడిసినపుడు, తను నిలబడి అరుణ్ జేట్లేను ఓడించాడు. మరో యిద్దరు కాంగ్రెసు ఎంపీలు గెలవడానికి దోహదపడ్డాడు. 2019లో మోదీకి గతంలో కంటె ఎక్కువ సీట్లు వచ్చినపుడు కూడా పంజాబ్ నుంచి 13 మందిలో 8 ఎంపీలను గెలిపించాడు. కాంగ్రెసుకు మొత్తం 52 మంది ఎంపీలుంటే వారిలో వీళ్లు 15% అన్నమాట.
తన వలననే కాంగ్రెసు గెలిచిందన్న అహం అతనికి వుంది. హై కమాండ్ ప్రమేయం లేకుండా గత నాలుగేళ్లగా ప్రభుత్వాన్ని నడుపుతూ వచ్చాడు. అది రాహుల్‌కి కంటగింపుగా వుంటూ వచ్చింది. కానీ అమరీందర్‌కు సోనియా ఆశీస్సులుండడంతో ఏమీ చేయలేక ఊరుకున్న అతనికి సిద్దూ అనువుగా గోచరించాడు. క్రమశిక్షణ, టీముతో కలిసి పనిచేయడం అంటే తెలియని సిద్దూ రాహుల్ అండతో చిత్తమొచ్చినట్లు ప్రవర్తించాడు. 2018 ఆగస్టులో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ అధ్యక్షుడైనప్పుడు ప్రమాణస్వీకారానికి వెళ్లివచ్చాడు. ఇమ్రాన్ అంటే క్రికెట్ రోజుల స్నేహితుడు అనుకోవచ్చు. అక్కడితో ఆగకుండా అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కమార్ జావేద్ బాజ్వాను కౌగలించుకున్నాడు. ఇది కాంగ్రెసు ఎమ్మెల్యేలు అనేకమందిని మండించింది. ముఖ్యంగా హిందూ ఎమ్మెల్యేలను!
2019 పార్లమెంటు ఎన్నికలలో సిద్దూ తన భార్యకు టిక్కెట్టు యిప్పించుకుందామంటే అమరీందర్ అడ్డుపడ్డాడు. దాంతో సిద్దూకి కోపం వచ్చి మరీ ఎదురు తిరగడంతో అమరీందర్ అతని మంత్రిత్వ శాఖ మార్చాడు. దాంతో కినిసి సిద్దూ కాబినెట్ నుంచి రాజీనామా చేశాడు. చేసిన కొద్ది రోజులకే 2019 నవంబరులో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్‌లో వున్న కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా నుంచి ఇండియాకు కారిడార్ తెరిచినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వద్దంటున్నా వెళ్లి, ఆ ఫంక్షన్‌లో పాల్గొనడమే కాక, పాక్ ప్రభుత్వాన్ని తెగ మెచ్చుకున్నాడు. ఆ విధంగా తను అమరీందర్ కంటె గొప్ప శిఖ్కునని చూపించుకుందామని చూశాడు. తర్వాత అమరీందర్ ఈ కారిడార్ ఐఎస్ఐ టెర్రరిస్టులకు రహదారిగా మారిందని విమర్శించినపుడు కాదంటూ వాదనకు దిగాడు. అమరీందర్‌ను యిరుకున పెట్టడానికి గురుగ్రంథ సాహెబ్ పేజీలు చింపిన కేసు విషయంలో అతనికి చిత్తశుద్ధి లేదంటూ బహిరంగ విమర్శలు చేశాడు. 2015లో అకాలీ దళ్ అధికారంలో వుండగా శిఖ్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ సాహెబ్‌లో 10 పేజీలు చింపివేసి కనబడ్డాయి. డేరా బాబా (రామ్ రహీమ్) అనుచరుల పనే అది అని అనుమానాలున్నాయి. నిరసన ప్రదర్శనలలో కొందరు శిఖ్కులు అల్లర్లకు తెగబడ్డారు. పోలీసు కాల్పులలో ఇద్దరు చనిపోయారు. దోషులను పట్టుకోలేక పోయిందంటూ ప్రతిపక్షంలో వున్న కాంగ్రెసు అకాలీ దళ్‌ను నిందించింది.
2017లో తాము ప్రభుత్వంలోకి, 2018లో వచ్చాక సిట్ వేసింది. ‘సిట్ అవసరం ఏముంది? సాక్ష్యాలను బలహీనపరిచేశాక..?’ అంటాడు సిద్దూ. ఈ ఏడాది ఏప్రిల్‌లో హైకోర్టు సిట్ పనితీరుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటిదాకా దోషులు శిక్షింపబడలేదు. 2017 దళితులలో పలుకుబడి వున్న డేరా బాబా ఎన్నికలలో కాంగ్రెసుకు మద్దతు యిచ్చాడు కాబట్టే అమరీందర్ చొరవ తీసుకోవటం లేదనే అనుమానాలున్నాయి. ఇప్పుడు సిద్దూ దాన్ని అలుసుగా తీసుకుని దోషులను ఎందుకు శిక్షించలేదంటూ రగడ మొదలుపెట్టాడు. ‘అధికారంలోకి వచ్చిన తొలి ఆర్నెల్లలోనే యీ పని చేయాల్సింది, దిగిపోబోతూన్న యీ ఆర్నెల్లలో చేయడమేమిటి?’ అని గొడవ చేస్తున్నాడు. సిద్దూ యిలా అంటూండగానే డేరా బాబాతో కలిసి అతను దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయి. దాంతో కాస్త సైలెంటు అయ్యాడు.
కానీ తక్కిన విషయాల్లో ఆగలేదు. తమ ప్రభుత్వాన్నే ఎడాపెడా విమర్శిస్తూ ప్రకటనలు గుప్పించాడు. పంజాబ్‌లో విద్యుత్ కొరత పీడిస్తోంది. వేసవిలో రోజులో కొన్ని గంటలు కరంటు వుండటం లేదు. ‘దీని కంతా కారణం అకాలీదళ్- బిజెపి హయాంలో హెచ్చుధరకు ప్రయివేటు విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్న దీర్ఘకాలిక ఒప్పందాలు. వాటిని రద్దు చేయకుండా అమరీందర్ ఎందుకు ఊరుకున్నాడు? ఆప్ వాళ్లు తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా యిస్తామంటున్నారు. అదేదో మనమే యివ్వాలి. నిరంతర విద్యుత్, అదీ రూ.3.50కే యివ్వాలి. ప్రస్తుతం యిస్తున్న రూ.9 వేల కోట్ల సబ్సిడీ చాలదు.’ అంటూ డిమాండు చేశాడు. తన పార్టీ ప్రభుత్వాన్ని లాండ్, శాండ్, డ్రగ్ మాఫియాలో చేతులు కలిపిందని, ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేదని తిట్టడంతో ఆగకుండా యితర పార్టీలను మెచ్చుకోసాగాడు. ‘సాధ్యాసాధ్యాలు తెలియకుండా మాట్లాడుతున్నాడు. పార్టీ వదిలిపెట్టి ఆప్‌లో చేరడానికి అతను చేస్తున్న ప్రయత్నమిది.’ అని అమరీందర్ కొట్టిపారేశాడు. కానీ సిద్దూ జోరు తగ్గించలేదు. నిరంతరం గొడవ చేస్తూనే వచ్చాడు.
తనకు తగిన స్థానం యివ్వకపోతే ఆప్ పార్టీలోకి దూకేస్తాను అని బ్లాక్‌మెయిల్ చేస్తున్న సిద్దూని ఎలాగైనా తృప్తిపరచమని రాహుల్ అమరీందర్‌పై ఒత్తిడి తెచ్చాడు. ఉపముఖ్యమంత్రిని లేదా రాష్ట్ర అధ్యక్షుణ్ని చేయమన్నాడు. ఏం చెప్పినా, అమరీందర్ ‘అతనూ నేనూ ఒకే కులం, ఒకే ప్రాంతానికి చెందినవాళ్లం. ఇప్పటికే మొత్తం 13 మంది రాష్ట్ర ఎంపీలలో 8 మంది జాట్ శిఖ్కులున్నారు. ఇతర కులాల వాళ్లు ఆగ్రహంగా వున్నారు. రెండు ప్రధాన పదవులు మా వాళ్లకే యిస్తే దళితులు దూరమవుతారు. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా వున్న సునీల్ జాఖడ్ 2017లో, 2019లో పార్టీకి ఘనవిజయాలు చేకూర్చాడు. అతన్నెలా మారుస్తాం?’ అని వాదిస్తూ వచ్చాడు. కావాలంటే మంత్రి పదవి యిస్తాను కానీ, ఉపముఖ్యమంత్రిని చేయనన్నాడు.
రాహుల్ అతని తోక కత్తిరించడానికి పూనుకున్నాడు. సిద్దూ, అమరీందర్‌ల మధ్య విభేదాలు పరిష్కరించడానికంటూ ముగ్గురు సభ్యుల కమిటీని పంజాబ్ పంపాడు. వాళ్లు యిక్కడ చర్చలు జరుపుతూండగానే 12 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీలను దిల్లీకి పిలిచి మంతనాలాడాడు. అమరీందర్ అంటే పడనివాళ్లు కొంతమంది వున్న మాట వాస్తవమే కానీ వాళ్లు సిద్దూ అభిమానులు కారు. సిద్దూ అకాలీదళ్ వాళ్లని మించి శిఖ్కు జపం చేయడంతో హిందూ ఎమ్మెల్యేలు అమరీందర్‌కు మద్దతుగా నిలబడ్డారు. తక్కినవారిలో కొందరు సిద్దూ క్యాంప్‌కు వెళ్లిపోతామంటూ బెదిరించారు. వారికి చెక్ పెట్టడానికి జూన్‌లో అమరీందర్ ఆప్ నుంచి యిద్దరు ఎమ్మెల్యేలను, పంజాబ్ ఏక్తా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేను కాంగ్రెసులోకి చేర్పించాడు. ఇద్దరు ఎమ్మెల్యేలను ఆకట్టుకోవడానికి వాళ్ల పిల్లలకు ప్రభుత్వోద్యోగాలు యిచ్చాడు అమరీందర్. అదేమంటే ‘వాళ్ల తాతలు ఖలిస్తాన్ ఉద్యమం సమయంలో దాన్ని ఎదిరిస్తూ అమరులయ్యారు కాబట్టి…’ అని సంజాయిషీ యిచ్చాడు.
అమరీందర్‌కు ముకుతాడు వేయడంలో రాహుల్‌కు ప్రియాంక తోడైంది. సోనియా సైలెంటై పోయింది. అడగ్గాఅడగ్గా అమరీందర్‌కు జులై 6న ఎపాయింట్‌మెంట్ యిచ్చింది. కమిటీ నివేదిక ప్రకారం అంటూ అధిష్టానం అమరీందర్ అభీష్టానికి వ్యతిరేకంగా సిద్దూని రాష్ట్ర అధ్యక్షుణ్ని చేసింది. అతను పంజాబ్ తిరిగి వస్తూనే తన యింట్లో డిన్నర్ యిచ్చి, అధిష్టానం నా వెనక వుంది అని ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోసాగాడు. రాబోయే ఎన్నికలలో టిక్కెట్ల పంపిణీ కూడా తన యిష్టప్రకారమే జరగాలని పట్టుబడతాడు. అమరీందర్ 79 ఏళ్ల వృద్ధుడు, తను 57 ఏళ్లవాడు కాబట్టి, యువత తనను చూసే ఓటేస్తారని ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటించాలని అడగవచ్చు. కాంగ్రెసు పార్టీ యీసారి ముఖ్యమంత్రి పేరు చెప్పకుండా ఎన్నికలకు వెళ్లాలని అమరీందర్‌ను ఆదేశించవచ్చు. దానికి అమరీందర్ ఏమేరకు సమ్మతిస్తాడో చూడాలి. ఇమేజి ప్రకారం చూస్తే సిద్దూ అతనికి సాటి రాడు.
అమరీందర్ పటియాలా రాజవంశీకుడు. ఇండియన్ ఆర్మీలో ప్రతిష్ఠాత్మకమైన పదవులు నిర్వహించాడు. యుద్ధాల గురించి అనేక పుస్తకాలు రాశాడు. పరిపాలనలో అనుభవజ్ఞుడు. ఎమ్మెల్యేలకు అందుబాటులో వుండడని, కొందరు అధికారులను చుట్టూ పెట్టుకుని పరిపాలిస్తాడన్న పేరు వున్నా, అవినీతిపరుడన్న చెడ్డపేరు రాలేదు. 117 స్థానాల్లో 45 స్థానాల్లో హిందువులు ఫలితాలు తారుమారు చేయగలరు. అమరీందర్ హిందువులకు ఆప్తుడు. ఇక సిద్దూ తింగరి మనిషి. ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. హుందాతనం అనే మాటకు వర్ణక్రమమే తెలియదు. అమరీందర్ కాంగ్రెసునే అంటిపెట్టుకుని వుండగా, సిద్దూ 12 ఏళ్ల పాటు బిజెపిలో వుండి, ఆప్‌లో ఆల్మోస్ట్ చేరబోయి, కాంగ్రెసులో చేరిన వ్యక్తి. ఏ ఉద్మయాల్లో పాల్గొన్నవాడు కాదు. ప్రజల్లో తిరిగినవాడు కాడు. అత్యాశాపరుడు. పార్టీ క్రమశిక్షణ బొత్తిగా పాటించని మనిషి. తన అహం చల్లార్చుకోవడానికి రాహుల్ అతన్ని ఉపయోగించుకుంటున్నాడు తప్ప అతనికి పాలనానుభవమూ పెద్దగా లేదు.
బెంగాల్ ఎన్నికల తర్వాత కూడా ప్రశాంత కిశోర్‌ను ‘మీరు హేండిల్ చేసిన ఎన్నికలలో అన్నిటి కంటె క్లిష్టమైనది ఏది?’ అని అడిగితే ‘2017 పంజాబ్’ అని చెప్పాడు. రాహుల్‌ను అటువైపు తొంగి చూడనీయకుండా, అమరీందర్ పూర్తి సహకారం అందించడం చేతనే ఆ విజయం సాధ్యమైందని అనుకోవాలి. ఇప్పుడు అమరీందర్ పార్టీలోంచి బయటకు వెళ్లిపోయి ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నా, పార్టీలోనే వుండి ప్రాధాన్యత కోల్పోయినా ఫలితాలు ఎలా వుంటాయో తెలియదు. అకాలీ దళ్‌కు యిప్పటికీ గ్రామాల్లో బలం వుంది. సాగు చట్టాల విషయంలో బిజెపితో విభేదించి, పొత్తులో నుంచి బయటకు వచ్చేసి, జాట్ శిఖ్కులకు మళ్లీ చేరువైంది. పైగా జనాభాలో వున్న 30% దళితులను మంచి చేసుకోవడానికి బియస్పీతో పొత్తు పెట్టుకుందామని చూస్తోంది. ఆప్‌కు కూడా కొన్ని ప్రాంతాల్లో బలం వుంది. ఈ పరిస్థితుల్లో 2022 ఎన్నికలలో పంజాబ్‌లో కాంగ్రెసుకు మెజారిటీ వస్తుందని అనుకోవడానికి లేదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2021)