ఏసా, గణేశా?.. వ్యాసంలో నేను జగన్ యతి అంటే కోర్టులు ప్రతి అంటాయి అని రాస్తే కొందరు మండిపడ్డారు – కోర్టులు తప్పు చేస్తున్నాయంటారా? అలా అంటే కంటెప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది జాగ్రత్త అంటూ! మొదటిగా తెలుసుకోవలసినది యతి-ప్రతి అంటే ఔనన్నది కాదనడం తప్ప, ఒకరిది కరక్టు, మరొకరిది కాదు అనే అర్థంలో కాదు. ‘ఆ మొగుడుపెళ్లాలు ఎప్పుడూ కొట్టుకు ఛస్తూంటారు. ఒకరు యతి అంటే మరొకరు ప్రతి అంటారు.’ అని పలుకుబడి. యతి అన్నవాళ్లది న్యాయం, ప్రతి అన్నవాళ్లది అన్యాయం అనే భావం ఎక్కడా లేదు. ఒకరి మాటను మరొకరి ఖండించుకుంటారనే అర్థం.
జగన్ ప్రభుత్వానికి కోర్టుల నుంచి పడిన అక్షింతలు, మొట్టికాయలు, (కొన్ని ఛానెల్స్ ప్రకారం చెంపదెబ్బలు) నాకు తెలిసి మరే ప్రభుత్వానికీ పడి వుండవు. ఎన్టీయార్‌కూ యీ యిబ్బంది వుండేది. ఏ కొత్త తరహా ఆలోచన చేసినా, పథకం పెట్టినా కాంగ్రెసు వాళ్లు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చేవారు. ఇప్పుడు ఆ పని టిడిపికి చేపట్టింది. కొన్నిసార్లు ప్రత్యక్షంగా, చాలాసార్లు పరోక్షంగా అభిమానుల చేత కేసులు వేయిస్తోంది. అప్పటికీ, యిప్పటికీ తేడా ఏమిటంటే జజ్‌లు తీర్పులో విమర్శించేది కొంతే అయినా, వ్యాఖ్యలు మాత్రం చాలా తీవ్రంగా చేస్తున్నారు. టిడిపి అనుకూల ఛానెల్స్ ఆ వ్యాఖ్యలనే తీర్పులుగా స్క్రోలింగ్‌లో చూపిస్తున్నాయి. ఇది అన్యాయం, ఏమైనా వుంటే తీర్పులో పెట్టండి, మేం కంటెస్ట్ చేస్తాం అని వైసిపి నాయకులు అభ్యంతర పెట్టినా, జజ్‌లు వినటం లేదు.
ఇక కోర్టు ధిక్కారం మాటకు వస్తే, ఒకటి గుర్తు పెట్టుకోండి. తీర్పుతో ఎవరైనా విభేదించవచ్చు, విమర్శించవచ్చు. వాది, ప్రతివాదుల్లో యిద్దరిలో ఒకరు ఆ తీర్పుతో విభేదిస్తారు కాబట్టే, పై కోర్టుకి వెళతారు. కింది కోర్టు జజ్ తన మైండ్ సరిగ్గా అప్లయి చేయలేదు అని విన్నవించుకుంటారు. కొన్ని కేసుల్లో పైకోర్టు అవును ఆ జజ్ అలాగే చేశాడు అని అంగీకరించి, తీర్పును మారుస్తుంది. అందువలన తీర్పుపై మనం వ్యాఖ్యానించవచ్చు. అయితే తీర్పిచ్చిన న్యాయాధికారికి ఉద్దేశాలు అంటగడితే కోర్టు ధిక్కారం అవుతుంది. ఉద్దేశాలు అంటగట్టడంతో వూరుకోకుండా వాటిని నిరూపించ గలిగితే మాత్రం ధిక్కారం కింద రాదు. ఇక కొంతమంది కోర్టు యిచ్చిన ఏయే తీర్పులు సమంజసంగా తోచాయో, ఏవేవి తోచలేదో జాబితా యివ్వండి అంటూ మెయిల్స్ రాశారు. బోల్డు కేసులున్నాయి, అన్ని కేసుల గురించి రాయడం ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి కొన్నిటి గురించి నా అభిప్రాయాలు రాస్తాను. ఇవి నా వ్యక్తిగత అభిప్రాయాలు కాబట్టి వీటితో మీరు ఏకీభవిస్తే ఏకీభవించవచ్చు, విభేదిస్తే విభేదించవచ్చు.
మొదటగా వినాయక మండపాల కేసు గురించి – తీర్పు చాలా మటుకు బాగుంది. పబ్లిక్ ప్లేసుల్లో పెట్టకూడదు అని స్పష్టంగా చెప్పడంతో హడావుడి చేస్తున్న బిజెపి, టిడిపిలు చల్లబడ్డాయి. లేకపోతే యీపాటికి అల్లకల్లోలం చేసేసి వుండేవి. కోర్టు తీర్పులకు అంత విలువ వుంటుంది కాబట్టే అవి సమంజసంగా వుండాలని కోరుకుంటాం. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం గురించి తెలంగాణ హైకోర్టు చూడండి, ఎంత బాగా అడిగిందో! ‘హుస్సేన్ సాగర్‌లోనే నిమజ్జనం చేయాలని ఏ పురాణంలో వుంది, ఇంతెత్తు చేయాలని, అదీ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తోనే చేయాలని ఏ శాస్త్రంలో వుంది? పై ఏడాదికల్లా ప్రత్యామ్నాయం చూపిస్తాం, యీ ఏడాదికిలా కానిచ్చేయండి అంటూ ప్రతీ ఏడాది చెప్తున్నారు. ఈసారి ఏ ఏర్పాటు చేస్తున్నారు?’ అని నిలదీసింది. దానికి సమాధానం హైదరాబాదు కార్పోరేషన్ దగ్గరా లేదు, తెలంగాణ ప్రభుత్వం దగ్గరా లేదు. కోర్టులదేముంది, చివరి నిమిషంలో చచ్చినట్లు అనుమతిస్తాయి అనే ధీమాతో కూర్చున్నాయి. హైకోర్టు యిలా మొండికేయడంతో సుప్రీం కోర్టుకి పరిగెట్టారు.
సుప్రీం కోర్డు వాళ్లని రక్షించింది. ఈసారికి పోనీయండి అంది. ఇది ప్రతీ ఏడాది హైకోర్టు చేస్తున్నదే, యీసారి సుప్రీం చేసింది. సుప్రీం అదనంగా చెరువు పాడై పోతోంది, పర్యావరణ రక్షణకు ప్రభుత్వానికి ఖర్చవుతోంది వంటి వ్యాఖ్యలు చేసింది కానీ ఆ నోటితోనే ఆ ఖర్చును వినాయక కమిటీలు భరించాలి అని అనలేదు. వాతావరణాన్ని కలుషితం చేసినవారికి, చేయనివారికి స్వచ్ఛభారత్ పేర వడ్డించారు కదా, పనిగట్టుకుని కలుషితం చేసినవారికి యీ మినహాయింపు దేనికి? ఈసారి యిన్ని అడుగుల విగ్రహం పెడతాం అని కమిటీవాళ్లు ముందే ప్రకటించినపుడు ‘కుదరదు, చిన్నదే వుండాలి, మట్టిదే వుండాలి’ అని ప్రభుత్వం వారికి ముందుగానే ఎందుకు చెప్పలేదు? ఇప్పుడీ కాలుష్య ప్రక్షాళణ భరించాల్సింది పన్ను చెల్లింపుదారులే కదా! ఈ తీర్పు వలన ‘బరాబర్ హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేసి తీరతాం’ అనే బిజెపి హుంకరింపుల నుండి తెలంగాణ ప్రభుత్వానికి రాజకీయంగా రక్షణ లభించింది తప్ప, భూమాతకు ఊరట కలగలేదు.
ఇక ఎపి హైకోర్టు చెప్పినదేమిటి? పబ్లిక్ స్థలాల్లో పెట్టుకోకూడదు కానీ ప్రయివేటు స్థలాల్లో పెట్టుకోవచ్చట. గుళ్లలో పెట్టారంటే అర్థముంది. ఒక వూళ్లో సూపర్ బజార్లో పెట్టారని టీవీలో చూశాను. అతని దుకాణానికి పబ్లిసిటీ వస్తుందని పెట్టి వుండవచ్చు. అది పబ్లిక్ ప్లేస్ కింద వస్తుందా, ప్రయివేటు ప్లేస్ కింద వస్తుందా? ఒక దుకాణానికి అంతమంది ఒకేసారి వస్తే కరోనా ప్రమాదం వుండదా? తర్వాత 5 జంటలు కూర్చుని ఒకేసారి చేసుకోవచ్చు అన్నారు. కరోనా సామాజికదూరం రెండు గజాలు శ్రేష్ఠమని మోదీగారు చెప్తారు. కనీసం 3 అడుగులు అని తక్కినవారంటారు. ఒక జంట పక్కపక్కన కూర్చున్నా దానికి 4 అడుగులు పడుతుంది. దాన్నుంచి మరో జంట 3 అడుగుల దూరంలో కూర్చోవాలి.
అలా 5 జంటలు అర్ధచంద్రాకారంలో వరుసగా కూర్చోవాలంటే విగ్రహం నుంచి 10 అడుగుల దూరంలో కూర్చోవాలి. అప్పుడు విగ్రహం పాదాల మీద అక్షింతలు సమర్పించడం కాదు, విసరాల్సి వస్తుంది. రెండు వరసల్లో కూచుంటారనుకుంటే వెనక వున్న జంటలకు మరీ దూరమై పోతుంది. దానికి బదులు రెండు జంటల్ని అనుమతిస్తే పోయేది. ఇంతకీ విగ్రహాలు పెట్టగానే సరికాదు, వాటిని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేయడంలోనే వుంది సమస్య. దాని గురించి కోర్టు ఏమీ చెప్పినట్లు లేదు. భక్తులు కోవిడ్ నిబంధనలను పాటించేట్లా చూడవలసిన బాధ్యతను పోలీసుల మీద పెట్టింది. కోళ్ల పందాలప్పుడూ యిలాగే ప్రవచిస్తారు. అంతమంది జనాల్ని నియంత్రించడానికి తగినంతమంది పోలీసులున్నారా? పైగా భక్తులు ఆవేశంలో వున్నపుడు ఆపితే ఆగుతారా? విగ్రహాల ఎత్తుని కానీ, మెటీరియల్‌ని కానీ నిర్దేశించలేదు. ప్రాక్టికల్ డిఫికల్టీస్ పరిగణించకుండా యిచ్చిన యీ తీర్పు నాకు పాక్షికంగానే నచ్చింది.
ఇక గుంటూరు సంగం డెయిరీ విషయంలో వచ్చిన తీర్పుల గురించి. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శుద్ధ తప్పు చేసింది. ఒక కోఆపరేటివ్ సొసైటీని ప్రయివేటు ట్రస్టుగా మార్చి తప్పు చేశారని భావిస్తే, అలా ఎందుకు చేశారని, ప్రభుత్వభూములను ఎందుకు వాడుకున్నారని సంజాయిషీ అడిగి వుండాల్సింది. దానికి వాళ్లు చెప్పే కారణాలు చెప్పేవారు. వాటికి ప్రభుత్వం కన్విన్స్ కాకపోతే, మళ్లీ సొసైటీగా మార్చేయడానికి మీ అభ్యంతరాలేమిటి చెప్పండి అని అడగాలి. వాళ్లు కోర్టుకి వెళితే తీర్పు వచ్చేదాకా ఆగాలి. అదేమీ చేయకుండా ఒక ప్రయివేటు సంస్థను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం తప్పు. ఆ విషయం అప్పుడే రాశాను. పైగా స్వాధీనం చేసుకోవడం కూడా చైర్మన్‌ను అరెస్టు చేసి, రోజువారీ వ్యవహారాలను ఆదరాబాదరాగా తెనాలి సబ్ కలక్టరుకి అప్పగించేయడం కక్షపూరితంగా అనిపించింది తప్ప పాడిరైతుల సంక్షేమం కోసం అనిపించలేదు. మే నెలలోనే సింగిల్ జజ్ ప్రభుత్వాన్ని తప్పుపట్టి జీవోను సస్పెండ్ చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళితే సెప్టెంబరు 1న వాళ్లు జజ్ చర్యను సమర్థించి, ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ కొట్టేశారు.
కోర్టులో యిది నిలవదని ప్రభుత్వానికి ముందే తెలిసి వుంటుంది. అయినా తాము స్వాధీనం చేసుకుని, రికార్డులన్నీ తిరగేస్తే కంపెనీలో జరిగాయని అనుకుంటున్న అవకతవకలకు సాక్ష్యాలు దొరుకుతాయని అలా చేసి వుంటారు. అనుకున్నట్లుగానే కోర్టు యీ స్వాధీనం చెల్లదని చెప్పేసింది. డెయిరీ మళ్లీ ట్రస్టుకి వెళ్లిపోయింది. కానీ కథ యింతటితో ముగుస్తుందని నేననుకోను. దానిలోని అక్రమాలపై విచారణ జరిపామని చెప్పి, కంపెనీపై కేసులు నడపవచ్చు. తమ చేతిలో వున్న సమయంలో చేజిక్కించుకున్న ఖాతా పుస్తకాలను ఆధారంగా కోర్టుకి సమర్పించవచ్చు.
ఇక అమరరాజా బ్యాటరీస్ విషయంలో – ఆ కంపెనీ వాతావరణాన్ని కలుషితం చేసిందంటే నేను ఆశ్చర్యపోను. పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలే కాలుష్యం గురించి పట్టించుకోనప్పుడు ప్రయివేటు సెక్టార్ వాళ్లు పట్టించుకుంటారా? వాళ్లకు లాభాలే ముఖ్యం. తమ ఫ్యాక్టరీ నుంచి వెలువడిన వ్యర్థాలను గాలిలోకో, నీటిలోకో, భూమిలోకో వదిలేస్తారు. వాటిని ట్రీట్ చేయడం ఖర్చుతో కూడుకున్న పని. అంతకంటె చెకింగ్‌కు వచ్చిన ప్రభుత్వాధికారులకు, సంబంధింత మంత్రికి, స్థానికి ఎమ్మెల్యేకి లంచాలిచ్చి చవకలో పోనిస్తారు. ఫ్యాక్టరీపై గట్టి చర్యలు తీసుకుంటే, దానిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడే ఆ ప్రాంత ప్రజలు మెచ్చరనే భయం కూడా ప్రభుత్వానికి వుంటుంది. తమ ఆరోగ్యం పాడై పోతోందని ప్రజలు ఫిర్యాదు చేస్తూనే వుంటారు, అలా అని చర్యలు తలపెడితే గోలపెడతారు. ఫ్యాక్టరీ యజమానులు దీన్ని ఎడ్వాంటేజిగా తీసుకుంటారు. అమరరాజా వారు తాము కలుషితం చేయడం లేదని గట్టిగా నమ్మితే తత్సంబంధిత ఐఎస్ఓ సర్టిఫికేషన్నో, అంతర్జాతీయ సంస్థల గుర్తింపునో ఒక ప్రకటన ద్వారా పబ్లిక్‌తో పంచుకోవచ్చు.
కానీ వారు అలా చేయలేదు సరికదా, తమను పరీక్షలకు గురి చేయడానికి పొల్యూషన్ కంట్రోలు బోర్డుతో సహకరించలేదట. మే మొదటివారంలో కేసు ప్రారంభమైంది. ఎపిపిసిబితో సహకరించండి అని హైకోర్టు జులై 27న వాళ్లకి చెప్పవలసి వచ్చింది. అబ్బే సహకరిస్తున్నాం అని కంపెనీ వాదించింది కానీ కోర్టు నమ్మినట్లు లేదు. అందుకే అలా చెప్పవలసి వచ్చింది. కంపెనీ కలుషితం చేస్తోందని అనుకుని, కాస్త ముందుకు వెళ్లి ఆలోచిద్దాం. ఆ ఒక్క కంపెనీయే చేస్తోందా? తక్కిన కంపెనీలేవీ చేయడం లేదా? మరి వాటిపై చర్యలేవి? జగన్ వస్తూనే అక్రమంగా కట్టిన ప్రజావేదికను కూల్చివేసినపుడు నేను హర్షించాను. అక్రమాలను సరిచేసేందుకు యిది నాంది అనుకున్నాను. కానీ అదే భరతవాక్యం అయింది. కృష్ణా కరకట్ట మీద తక్కినవాటి జోలికి పోలేదు.
అక్కడొక్కచోటేనా, కళ్లు విప్పార్చి చూస్తే ఊరూరా అక్రమ కట్టడాలు, చెరువులు ఆక్రమించిన ఎస్టేట్లు కనబడతాయి. రెండున్నరేళ్లయినా వాటిపై చర్యలు లేవేం? అంటే యీ దిద్దుబాటు చర్యలు సెలెక్టివ్‌గా వుంటాయా? కులపరంగా యీ వివక్షత వుందని నేను నమ్మను. గల్లావారు తప్ప తక్కిన కమ్మ పారిశ్రామికవేత్తలెవరూ వాతావరణ కాలుష్యానికి పాల్పడటం లేదని నేననుకోవటం లేదు. ఇది పార్టీ పరమైన కక్ష అని, అదీ వైయస్ అనుయాయులుగా వుండి, టిడిపిలోకి వెళ్లినందుకు శిక్ష అనీ అనుకుంటున్నాను. ఇక్కడ దుర్మార్గమేమిటంటే, కాలుష్యం జరుగుతోందని తెలియగానే లేదా అనుమానం రాగానే నోటీసు యిస్తారు. కొంత గడువు యిచ్చి సరి చేసుకోండి అంటారు. కాకపోతే చర్యలు తీసుకుంటారు. కానీ అమరరాజా విషయంలో ఏకంగా కరంటు కట్ చేసేశారు. అది విచిత్రం.
కంపెనీ వెంటనే కోర్టుకి వెళ్లి అది ఆపించుకుంది. కోర్టు సమంజసంగా ప్రవర్తించింది. వారికి గడువు యిచ్చింది. ఆ తర్వాత కంపెనీ చిత్రవిచిత్రంగా ప్రవర్తించింది. తాము తమిళనాడుకి తరలి వెళ్లిపోతున్నట్లు, స్టాలిన్ మీదే ఆలస్యమని అన్నట్లు లీక్‌లు యిచ్చింది. కాలుష్యభరితమైన పరిశ్రమను ఆంధ్ర తరిమివేస్తే నువ్వు వాటేసుకుంటావా? అని అక్కడి ప్రతిపక్షం వాళ్లు యాగీ చేయరా? ఇప్పటికే అక్కడ స్టెరిలైట్ గొడవ నడుస్తోంది. కంపెనీ తమాషాగా లీకులిచ్చి వూరుకుంటే దానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ‘మీరు వెళ్లేదేమిటి? మేమే దణ్ణం పెట్టి పొమ్మంటున్నాం.’ అంటూ అనుచితంగా స్పందించారు. ‘సరిదిద్దుకోమంటే, వెళ్లిపోతారంటేమిటి?’ అనాల్సింది పోయి, పరిశ్రమలను పొమ్మంటున్నాం అని గర్వంగా చెప్పుకోవడం ఎంత తెలివితక్కువ స్టేటుమెంట్? తర్వాత సరిదిద్దుకోవాలని చూశారు కానీ డామేజి జరిగిపోయింది. పరిశ్రమలు తెచ్చేది చేతకాదు కానీ, వున్నవాటిని వెళ్లగొట్టడం వచ్చు అనే సంకేతం వెళ్లింది. సహజంగా స్థానికులు ఆందోళన పడ్డారు.
ఇవన్నీ జరిగాక తీరిగ్గా కంపెనీ అబ్బే మేమేమీ వెళ్లటం లేదు అని ప్రకటించింది. ఇంతకీ అది కలుషితం చేస్తోందా? తమపై పరీక్షలు జరపడానికి పొల్యూషన్ కంట్రోలు బోర్డును రానిస్తోందా లేదా? దిద్దుబాటు చర్యలు చేపడుతోందా లేదా? అవి పూర్తవడానికి ఎంతకాలం పడుతుంది? ఇవన్నీ కోర్టు తేల్చి, తను నియమించిన కమిటీ పర్యవేక్షణలో దిద్దుబాటు చేయించాలి. ఎందుకంటే ఎంత చేసినా ప్రభుత్వం వేధిస్తోందని కంపెనీవారు ఆరోపించవచ్చు. దీనితో బాటే కోర్టు ప్రభుత్వాన్ని అడగాలి – ఈ ఒక్క కంపెనీయే కలుషితం చేస్తోందా? రాష్ట్రంలో తక్కిన కంపెనీల మాటేమిటి? ఓ శ్వేతపత్రం విడుదల చేసి, వాటిపై కూడా చర్యలు చేపట్టండి అనాలి. కానీ కోర్టు అలా చేయడం లేదు. పొల్యూషన్ కంట్రోలు బోర్డు యిచ్చిన నోటీసు అమలు కాకుండా ఇంకో 6 వారాలు స్టే యిస్తున్నాం అని ఆగస్టు 16న అంది. దాన్ని మళ్లీ పొడిగిస్తారేమో తెలియదు. వివాదం మేలో ప్రారంభమైంది, ఈ ఐదు నెలల సమయంలో పరిస్థితిని ఏ పాటి చక్కదిద్దారు అని అడగాలి కదా. సెప్టెంబరు 27న తదుపరి హియరింగు వుంది. అప్పుడైనా చెప్తారో లేదో! ఎందుకంటే యిక్కడ రాజకీయాల మాట ఎలా వున్నా ప్రజారోగ్యం దెబ్బ తింటోంది. రోగనిరోధక శక్తి తగ్గిందంటే కరోనా ప్రాణాలు తీయగలదు.
నేను యతి-ప్రతి అని రాయగానే జగన్ అన్నీ తప్పులే చేస్తున్నాడని, కోర్టులు ప్రజలను రక్షిస్తూంటే నేను అలా వ్యాఖ్యానించడం తప్పని కొందరు రాశారు. మరి జిల్లా పరిషత్ ఎన్నికల విషయంలో చూడండి, సింగిల్ జజ్ యిచ్చిన తీర్పు తప్పని డివిజన్ బెంచే చెప్పింది. ఇప్పుడు డివిజన్ బెంచ్‌ను నిందిస్తారా? ఆ సింగిల్ జజ్ ఎందుకలాటి తీర్పు యిచ్చారో మనకు అర్థం కాదు. ప్రధాన ప్రతిపక్షం ఎన్నికలను బహిష్కరించానని చెప్పుకుంది. ఇక ఎన్నికలు ఎలా పోయినా దానికి అఖ్కర్లేదు. ఎన్నికలు పూర్తయిపోయాయి. బోల్డంత ప్రజాధనం వ్యయమైంది. అవి చెల్లవు, మళ్లీ నిర్వహించమంటే ఎలా? చివరకు డివిజన్ బెంచ్ యీయన తీర్పు చెల్లదంది కాబట్టి ఆ ప్రమాదం తప్పింది కానీ ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల ఫలితాలు సెప్టెంబరు మూడోవారంలో తెలిశాయి.
కానీ ప్రజల తీర్పు అమలులోకి రావడానికి 5 నెలలు ఆలస్యమైంది కదా! దీనికి ఆ న్యాయమూర్తి చట్టాన్ని పొరపాటుగా అన్వయించడమే కారణం కదా! ఆ తీర్పు వెలువరిస్తూ ఆయన ఎన్నికల కమిషనర్ పట్ల ఉపయోగించిన భాష కూడా చాలా తీవ్రంగా వుంది. దాన్ని హర్షించగలమా? సింగిల్ జజ్తో నేను విభేదించాను, డివిజన్ బెంచ్‌తో ఏకీభవించాను. ఇలా ప్రతి కేసులోనూ మనకంటూ కొన్ని అభిప్రాయాలుంటాయి. అంశాలపట్ల మనం కామన్‌సెన్స్‌తో పరికిస్తాం, వాళ్లు రూల్సు చట్రం ద్వారా పరిశీలిస్తారు. కొన్ని సందర్భాల్లో అవి తప్పుతూంటాయని పైకోర్టులూ అంటూంటాయి. ఈలోగా మనం వారితో ఏకీభవించాల్సిన అవసరమేమీ లేదు. నా రచనలు, అభిప్రాయాలూ చూడండి, కొన్ని మీకు నచ్చుతాయి, కొన్ని నచ్చవు. ఇదీ అంతే!
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2021)