Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇకపై ఆన్ లైన్ వ్యవస్థ ద్వారానే టిక్కెట్లు

ఇకపై ఆన్ లైన్ వ్యవస్థ ద్వారానే టిక్కెట్లు

ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థపై మంత్రి పేర్ని నాని మరోసారి స్పష్టత ఇచ్చారు. సినీ పెద్దల ఆమోదం మేరకే ఏపీలో ఆన్ లైన్ వ్యవస్థను తీసుకొస్తున్నట్టు తెలిపారు. అందరి మద్దతుతో, అత్యంత పారదర్శకతతో ఈ విధానం అమలవుతుందన్నారు.

"సినిమా ఆపేక్షను ఎందుకు సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు ప్రశ్నించే అవకాశం లేకుండా.. ప్రభుత్వ నిర్ణయించిన రేట్ల ఆధారంగా సినిమా హాళ్లలో టిక్కెట్లు ఇచ్చేలా ఆన్ లైన్ వ్యవస్థను తీసుకొస్తున్నాం. ఈ నిర్ణయానికి అన్ని వైపుల నుంచి సానుకూల మద్దతు వచ్చింది. తొందర్లోనే ఆంధ్రప్రదేశ్ లో ఆన్ లైన్ వ్యవస్థ ద్వారా అత్యంత పారదర్శకంగా ప్రజలకు వినోదాన్ని అందిస్తాం."

ఈ విధానం అమల్లోకి వస్తే ఇకపై మొదటి రోజు వసూళ్లు, ఫస్ట్ వీకెండ్ వసూళ్లలో కాకి లెక్కలుండవు. ఏ థియేటర్ లో ఎంత కలెక్షన్ వచ్చిందనే విషయం పారదర్శకంగా ఉంటుంది. అంతేకాదు.. మొదటి రోజు ఎక్కువ ధరకు టిక్కెట్లు అమ్ముకునే వెసులుబాటు కూడా ఉండదు. ఈరోజు ఇండస్ట్రీకి చెందిన కొంతమంది వ్యక్తులతో నిర్వహించిన సమావేశంలో.. ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరింది. చట్టాన్ని అతిక్రమించి వ్యాపారం చేస్తామంటే కుదరదని ఈ సందర్భంగా మంత్రి సున్నితంగా హెచ్చరించారు.

"చట్టాన్ని అతిక్రమించి వ్యాపారం చేస్తామంటే కుదరదు. ఇకపై వినోద రంగంలో ఏదైనా పారదర్శకంగా జరగాల్సిందే. చిరంజీవి విజ్ఞప్తిని కూడా పరిశీలిస్తాం. జగన్ కు చిరంజీవి అంటే అభిమానం, సోదరభావం ఉంది. ప్రజలకు మంచి చేసే విధంగా ఎవరు ఏ సలహాలు ఇచ్చినా పరిశీలిస్తాం. ఇక బెనిఫిట్ షోలకు సంబంధించి ఈరోజు సమావేశంలో ఎవ్వరూ బెనిఫిట్ షోలు కావాలని అడగలేదు."

ఈరోజు సమావేశంలో మంత్రితో సి.కల్యాణ్, దిల్ రాజు, డీవీవీ దానయ్య, ఆదిశేషగిరిరావు లాంటి ప్రముఖులు పాల్గొన్నారు. వీళ్లతోపాటు పలువురు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు. ఆన్ లైన్ వ్యవస్థకు ఆమోదం తెలిపిన సభ్యులు.. థియేటర్లలో వందశాతం ఆక్యుపెన్సీ, రోజుకు 4 షోలు, కరెంట్ బిల్లులు, బి-సి సెంటర్లలో టికెట్ రేట్లపై తమ సమస్యల్ని మంత్రికి వివరించారు. వీటిపై సానుకూలంగా స్పందిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు సి.కల్యాణ్.

తాజా సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ సినిమా టిక్కెట్ ధరలు సవరించడానికి ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకరించింది. అటు బెనిఫిట్ షోల విషయంలో మాత్రం ఏకరీతిన కాకుండా.. సినిమా బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. టిక్కెట్ రేట్లు పెంచినా, ఇప్పుడున్న రేట్లను యథాతథంగా కొనసాగించినా.. ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థను అమల్లోకి తీసుకురావడం మాత్రం ఖాయమని తేలింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?