ఎమ్బీయస్‌: అంకోర్‌ వాట్‌ పునరుద్ధారకుడికి అవార్డు

ఆగస్టు 31న రామన్‌ మెగసెసే అవార్డు అందుకోబోతున్న వారిలో ప్రొఫెసర్‌ యోషియాకి ఇషీజావా అనే 79 ఏళ్ల జపాన్‌ దేశస్తుడు కూడా ఉన్నారు. కంపూచియాలోని అంకోర్‌ వాట్‌ అనే 12వ శతాబ్దం నాటి పురాతన…

ఆగస్టు 31న రామన్‌ మెగసెసే అవార్డు అందుకోబోతున్న వారిలో ప్రొఫెసర్‌ యోషియాకి ఇషీజావా అనే 79 ఏళ్ల జపాన్‌ దేశస్తుడు కూడా ఉన్నారు. కంపూచియాలోని అంకోర్‌ వాట్‌ అనే 12వ శతాబ్దం నాటి పురాతన హిందూ దేవాలయాన్ని పునరుద్ధరించడానికి ఆయన నడుం బిగించినందువలననే ఆయనకీ పురస్కారం లభిస్తోంది. ఆయన జపాన్‌ దేశస్తుడు, పని చేసినది కంపూచియాలో, పైగా హిందూ దేవాలయం గురించి – యీ మూడిటికి లింకెలా కుదిరింది అంటే చరిత్ర పుటలు తిరగేయాల్సి వస్తుంది. కాంబోడియాగా, యిటీవల కంపూచియాగా పిలువబడుతున్న దేశానికి మనదేశానికి క్రీ.పూ. 4 వ శతాబ్దం నుంచి రాకపోకలున్నాయి. అప్పట్లో మన వర్తకులు అక్కడకు వెళ్లి వ్యాపారం చేశారు.

ఆ దేశాన్ని కా(క)ంభోజ రాజ్యంగా మన పుస్తకాల్లో పేర్కొన్నారు. హిందూమతాన్ని, సంస్కృతాన్ని అక్కడ ప్రచారం చేశారు. క్రీ.శ. 5 వ శతాబ్దంలో బౌద్ధమతాన్నీ ప్రచారం చేశారు. క్రమేపీ దండయాత్రలూ జరిగాయి. క్రీ.శ. 802లో పల్లవరాజైన రెండవ సూర్యవర్మ అక్కడ ఖ్మే(ర్‌) రాజ్యాన్ని స్థాపించాడు. అది 600 ఏళ్లపాటు సాగింది. 12వ శతాబ్దంలో రెండవ సూర్యవర్మ యశోధరపురమనే తన రాజధానిలో అంకోర్‌ వాట్‌ అనే పెద్ద వైష్ణవాలయాన్ని 400 ఎకరాల్లో నిర్మించాడు. కట్టడానికి 30 ఏళ్లు పట్టింది. ప్రపంచంలో యింత పెద్ద దేవాలయసమూహం లేదు. ప్రస్తుతం ఆ దేశంలో 95% మంది జనాభా తెరవాడ శాఖకు చెందిన బౌద్ధాన్ని పాటిస్తున్నా, యీ హిందూ కట్టడాన్ని అలాగే వుంచారు. ప్రపంచ సాంస్కృతిక వారసత్వపు స్థలాల్లో ఒకటైన దీన్ని ఏటా 20 లక్షలకు పైగా విదేశీ యాత్రికులు దాన్ని చూడడానికి వస్తూ వుంటారు. 

ఈ లోగా ఆ దేశంలో రాజకీయపరంగా చాలా మార్పులు వచ్చాయి. 15 వ శతాబ్దంలో ఆయుత్తయా వంశీకులు సింహాసన మెక్కారు. వారి కాలంలో దేశం బలహీనపడి సామంత రాజ్యంగా నడిచింది. 1863లో ఫ్రాన్సు దీన్ని తన రక్షణలోకి తీసుకుంది. రాజ్యాన్ని విస్తరించింది. కంబోడియా ప్రజలు ఫ్రెంచ్‌ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించడంతో 1953లో వాళ్లకు స్వాతంత్య్రం యిచ్చి తప్పుకుంది. పొరుగున వున్న వియత్నాం నుంచి కూడా ఫ్రాన్సు తప్పుకున్నాక కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టడానికి అమెరికా వియత్నాంపై యుద్ధానికి దిగింది.

ఆ క్రమంలో 1969 నుంచి 1973 వరకు కంబోడియాపై కూడా బాంబులు వేసింది. వియత్నాం కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా కంబోడియాలో ఖ్మే రూజ్‌ పేరుతో కమ్యూనిస్టు పార్టీ 1968లో వెలసింది. క్రమేపీ బలపడింది. కంబోడియా జాతీయత పేరుతో అంతర్యుద్ధంలో నెగ్గి 1975లో అధికారానికి వచ్చింది. పోల్‌ పాట్‌ అనే నాయకుడు దేశాధినేతగా అవతరించి నియంతగా బలపడి నాలుగేళ్ల పాటు అతి క్రూరంగా పాలించాడు. 

కమ్యూనిజానికి సోషలిజం వంటి మెట్లు అవసరం లేదు, మొత్తం దేశాన్ని వ్యవసాయిక దేశంగా మార్చేస్తానంటూ నగరాల నుంచి జనాలను గ్రామాలకు తరలించాడు. అప్పటి జనాభా నాలుగోవంతు మంది అంటే 20 లక్షల మందిని చంపివేశాడు. నాస్తికత్వం పేరుతో 35 వేల బౌద్ధసన్యాసులను చంపివేశాడు. కానీ అంకోర్‌ వాట్‌ జోలికి రాలేదు. తమ దేశపు వారసత్వానికి ప్రతీకగా భావించి వదిలివేశాడు. అమెరికాతో యుద్ధంలో గెలిచిన వియత్నాం పొరుగున వున్న కంబోడియాలోని రాక్షసపాలనను తుదముట్టించడానికి దండెత్తింది. తన మద్దతున్న ప్రభుత్వాన్ని నెలకొల్పింది. అది 1991 వరకు నడిచింది.

1991లో జరిగిన పారిస్‌ శాంతి ఒప్పందం ప్రకారం కంబోడియాను 1992 నుంచి 1993 వరకు ఐక్యరాజ్యసమితి పాలించింది. ఎన్నికలు జరిపి ప్రభుత్వాన్ని ఏర్పరచి తప్పుకుంది. అయితే 1997లో హ్యూన్‌ సేన్‌ అనే కంబోడియన్‌ పీపుల్స్‌ పార్టీ నాయకుడు కుట్రతో ఆ ప్రభుత్వాన్ని తొలగించి అప్పణ్నుంచి ప్రధాని హోదాలో దేశాన్ని పాలిస్తున్నాడు. పేరుకు రాజు కూడా వున్నాడు. ఈ రాజకీయ సంక్షోభాల్లో యీ పురాతన దేవాలయాలను పట్టించుకునేవారెవరూ లేకపోయారు. ఎందుకంటే అక్కడ పూజాపునస్కారాలు ఎప్పుడో ఆగిపోయాయి. కేవలం ప్రాచీన కట్టడంగానే మిగిలింది. పాడుపడిన గుళ్లలాగే అక్కడా మొక్కలు మొలిచాయి, చెట్ల వేళ్లు శిల్పాలను కదిలించాయి, ఫంగస్‌ వ్యాపించింది, దొంగతనాలు జరిగాయి, అంతర్యుద్ధం ఛాయలు అక్కడా అలుముకున్నాయి. 

ఫ్రాన్సు ప్రభుత్వం 1908లో దాని సంరక్షణ కార్యక్రమం మొదలుపెట్టింది. 1960లలో పునరుద్ధరణ కార్యక్రమాలు సాగాయి. ఖ్మే రూజ్‌ పరిపాలనాకాలంలో అవన్నీ ఆగిపోయాయి. 1986 నుంచి 1992 వరకు ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా పర్యవేక్షణలో కొంత సాగింది. ఈ పనుల్లో కెమికల్స్‌, సిమెంటు వాడకం వలన సహజమైన ఆకృతి చెడిపోయిందని విమర్శలు వచ్చాయి. 1992లో యునెస్కో దాన్ని 'వరల్డ్‌ హెరిటేజ్‌ యిన్‌ డేంజర్‌' లిస్టులో పెట్టింది. 1994 నుంచి ఫ్రాన్సు, చైనా, జపాన్‌లు సంయుక్తంగా సంరక్షణ కార్యక్రమాలు మొదలుపెట్టాయి.

దీనిలో పెద్ద పాత్ర వహించినది ప్రొఫెసర్‌ ఇషీజావాదే. ఆయన జపాన్‌లోని సోఫియా యూనివర్శిటీలో 1961లో ఫ్రెంచ్‌ భాషలో డిగ్రీ తీసుకున్నాడు. 1968లో చుయువో యూనివర్శిటీ నుంచి ఓరియంటల్‌ హిస్టరీలో మాస్టర్స్‌ డిగ్రీ తీసుకున్నాడు. కంబోడియా సాహిత్యంలో, ప్రాచీన కంబోడియా శాసనాల్లో కృషి చేసి, 1977లో డాక్టరేటు కూడా పొందాడు. 1982లో సోఫియా యూనివర్శిటీలో ఫారిన్‌ స్టడీస్‌ విభాగంలో ప్రొఫెసరయ్యాడు. 2002 నుంచి అక్కడే డైరక్టరుగా వున్నాడు.

కంపూచియా ప్రాచీన వారసత్వాన్ని కాపాడుకునే బాధ్యత ఆ దేశస్తులే చేపట్టాలనేే పట్టుదలతో సియాం రీప్‌లో 1996లో సోఫియా ఆసియా సెంటర్‌ ఫర్‌ రిసెర్చి అండ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ను నెలకొల్పి వారిలో ఆ స్ఫూర్తి రగిలించాడు. ఖ్మే రూజ్‌ హయాంలో అనేకమంది మేధావులు, శిల్పులు, ఆర్కియాలజిస్టులు, పర్యావరణ శాస్త్రవేత్తలు చంపబడడంతో కొత్తవారికి తర్ఫీదు యిచ్చే పని యీయన చేపట్టాడు. గత 20 ఏళ్లలో అనేకమంది నిపుణులను తయారుచేసి అంకోర్‌ వాట్‌కు ప్రమాదాన్ని తప్పించాడు. అంతేకాదు తవ్వకాల్లో 274 బుద్ధవిగ్రహాలను వెలికి తీయడానికి కారకుడయ్యాడు. ఈ పునరుద్ధరణకే ఆయన కిప్పుడు సత్కారం జరుగుతోంది.

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌
[email protected]