''ఈ బ్యాంకు ఆఫ్ ఇంగ్లండ్‌కు ఎలాగైనా సరే టోకరా వేసి లక్ష పౌండ్లు సంపాదించాలి.'' అన్నాడు ఆస్టిన్ బిడ్వెల్. ఈ మాట అన్నది 1872 ఏప్రిల్‌లో! ఆనాటి లక్ష పౌండ్ల విలువ యీనాటి లెక్కల్లో అయితే కోటి పౌండ్లకు పైనే. అప్పటికి ఆస్టిన్ వయసు 26, పక్కనే ఉన్న అతని అన్నగారు జార్జి వయసు 33, తోడుగా ఉన్న స్నేహితుడు జార్జి మేక్డానెల్ వయసు 27. ముగ్గురూ అమెరికా నుంచి లండన్‌కు వచ్చి ఊరు చూస్తున్నారు. రాత్రి డిన్నర్ ఎక్కడ చేద్దామాని తిరుగుతూంటే త్రెడ్నీడిల్ వీధిలో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ హెడాఫీసు కనబడింది. దాన్ని చూడగానే ఆస్టిన్ యీ మాట అన్నాడు. మర్నాడు విండ్సర్ కోట చూస్తూండగా మేక్(డానెల్)కు పూనకం వచ్చింది. ''నిన్న నువ్వన్నది నిజం ఆస్టిన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ దగ్గర బోల్డంత డబ్బు మూలుగుతోంది. మనం తలా లక్ష పౌండ్లు కొట్టేసినా దానికేమీ తేడా ఏమీ తెలియదు.'' అన్నాడు.
జార్జికి ఒళ్లు మండింది – '1694లో నెలకొల్పిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ అంటే దుర్భేద్యమైన కంచుకోట లాటిది. దూరడమే కష్టం, ఇక దాన్ని ఎవడూ బోల్తా కొట్టించడమంటే జరిగే పని కాదు. మనం ఊరికే పగటికలలు కనడం వేస్టు.'' అని తీసిపారేశాడు. కానీ ఆ రాత్రి తాము బస చేసిన హోటల్లో మళ్లీ తమ్ముడూ అతని స్నేహితుడు ఎవర్ని ఎలా మోసం చేయాలా అని చర్చిస్తూంటే, అతను గదిలో ఉన్న ఫైర్ ప్లేస్‌లో ఎగసి పడుతున్న మంటల కేసి చూస్తూ ''మీరు మధ్యాహ్నం అన్న బ్యాంకు ప్లాను అసాధ్యమైనది కాదు. కానీ దానికి ముందుగా ఆ బ్యాంకులోకి కస్టమరుగా ప్రవేశించాలి. ఖాతాలో అనేక లావాదేవీలు జరిపి, వాళ్ల విశ్వాసాన్ని చూరగొనాలి. బ్యాంకు సిస్టమ్‌లో ఏదైనా లొసుగు ఉంటే దాన్ని కనిపెట్టాలి. మనకు అనువుగా వాడుకోవాలి.'' అన్నాడు.
అతని పద్ధతి అంతే. దేనికీ తొందరపడడు. ఓపిగ్గా, క్రమ పద్ధతిలో ఒక ప్రణాళిక రచిస్తాడు. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో హోల్‌సేల్ వ్యాపారస్తుల దగ్గర ఎవరెవరో తనకు తెలుసని చెప్పి వారి నమ్మకాన్ని సంపాదించి, అరువు మీద వస్తువులు తీసుకునేవాడు. అమ్మేసుకుని డబ్బు చేసుకునేవాడు. తర్వాత మొహం చాటేసేవాడు. ఇలా బాగానే డబ్బు పోగేశాడు కానీ ఒకసారి పట్టుబడిపోయాడు. కోర్టు రెండేళ్ల జైలుశిక్ష వేసింది. నాలుగు నెలలు పోయాక మరో నలుగురితో కలిసి జైల్లోంచి పారిపోయి న్యూయార్క్‌కి వచ్చి తమ్ముడు ఆస్టిన్ ఎక్కడున్నాడాని చూడబోయాడు.
ఆస్టిన్ అతని కంటె సాహసాలు చేసి ఉన్నాడు. తండ్రి చేసే చిన్న కిరాణా వ్యాపారం అతనికి నచ్చలేదు. పంచదార వ్యాపారంలో షేర్బ్రోకర్ల వద్ద చేరాడు. చురుకైన వాడు కాబట్టి షేరు మార్కెట్ గుట్టుమట్లు తొందరగానే గ్రహించాడు. అక్కడే అతనికి ఎడ్ వీడ్స్ అనే స్నేహితుడు దొరికాడు. త్వరత్వరగా డబ్బు సంపాదించాలన్న యావలో అతగాడు యితన్ని మించినవాడు. వాళ్ల నాన్నకు డబ్బుంది. ఆ పెట్టుబడితో యిద్దరూ కలిసి షేర్ బ్రోకరేజి వ్యాపారం పెట్టారు. అమెరికాలో అప్పుడే అంతర్యుద్ధం ముగిసి, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. జనాలు ఎడాపెడా షేర్లు కొంటున్నారు. బ్రోకర్ కమిషన్ కింద వీళ్లకు రాబడి బాగానే ఉండేది. అయితే యిద్దరికి విలాసాలు ఎక్కువ. పగలు సంపాదించిన డబ్బంతా రాత్రి జూదశాలల్లో, వ్యభిచార గృహాల్లో తగలేసేవారు. చివరకు డబ్బంతా అయిపోవడంతా ఎడ్ వ్యాపారం మూసేసి యూరోప్‌కు తరలిపోయాడు. ఆస్టిన్ దగ్గర చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో అతనికి అండర్వ(ర)ల్డ్ నుంచి ఓ ఆఫర్ వచ్చింది.
వాళ్ల దగ్గర దొంగిలించిన కొన్ని బాండ్స్ ఉన్నాయి. యూరోప్‌కు వెళ్లి వాటిని అమ్మి డబ్బు పట్టుకుని రావాలి. అందంగా, పొడుగ్గా, దర్జాగా, చూడగానే పెద్దింటి బిడ్డలా కనబడే ఆస్టిన్ తన మాటల్తో యూరోప్‌లో వాళ్లని బోల్తా కొట్టించడం ఈజీ. అతని షేర్ మార్కెట్ నేపథ్యంతో అవతలివాళ్లు యితన్ని నమ్మడం తథ్యం. సవ్యంగా చేసుకుని వస్తే అన్ని ఖర్చులు పోను 13 వేల డాలర్లు కమిషన్‌గా యిస్తారు. నిజానికి ఆస్టిన్ అప్పటిదాకా చట్టవిరుద్ధమైన పనులేవీ చేయలేదు. కానీ జూదశాలల్లో తన తెగింపు, దూకుడు చాలాకాలంగా గమనించి వాళ్లు తనకీ ఆఫరిస్తున్నారని అతనికి అర్థమైంది. వాళ్లడిగిన పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుని వచ్చి ఆ డబ్బు జేబులో వేసుకున్నాడు. ఇప్పణ్నుంచి న్యాయమార్గాల్లో వెళ్లడం దండగ అనుకున్నాడు. సరిగ్గా అదే టైములో అన్నగారు కూడా వచ్చి చేరడంతో యిద్దరూ లండన్‌కి వెళ్లి అదృష్టాన్ని పరీక్షిద్దామనుకున్నారు.
ఆస్టిన్ తమతో బాటు మేక్(డానెల్)ను కూడా తీసుకెళదామన్నాడు. అతను బోస్టన్‌కు చెందిన జమీందారీ కుటుంబానికి చెందినవాడు. ఐదు భాషలు అనర్గళంగా మాట్లాడగలడు. సంభాషణా చాతుర్యం ఉన్నవాడు. ఎవరినైనా ఆకర్షించ గలడు. హార్వార్డ్‌లో చేరి, రెండో సంవత్సరంలో చదువు మానేశాడు. స్టాక్‌బ్రోకర్ వ్యాపారం చేస్తానంటూ తండ్రి యిచ్చిన 10 వేల డాలర్లను తగలేశాడు. ఒక్క చెక్కుపై దొంగ సంతకం చేసినందుకు 22వ యేట జైలుకి వెళ్లాడు. రెండేళ్లలో బయటకు వచ్చాడు కానీ జైల్లోనే జార్జి ఏంజిల్స్ అనే అతని వద్ద ఫోర్జరీలో శిష్యరికం చేసి, ఆ కళలో నిష్ణాతుడై పోయాడు. ఎటువంటి విపత్కర పరిస్థితిలో నుంచైనా సరే, కబుర్లు చెప్పి బయట పడగల సామర్థ్యం ఉండడంతో అతనికి ఆత్మవిశ్వాసం ఎక్కువై పోయి, ఏదైనా సరే ముందు పని చేసేసి, తర్వాత ఆలోచించడం నేర్చుకున్నాడు. అందుకే అతన్ని చూస్తే జార్జికి భయం.
ముగ్గురూ కలిసి తమ వద్ద ఉన్న 40 వేల డాలర్లతో లండన్‌కు చేరి, మారుపేర్లతో ఓ మామూలు హోటల్లో దిగి, మోసానికి మార్గాలేమున్నాయాని వెతకసాగారు. అవేళ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌పై కన్నేసిన తర్వాత జార్జి తన పథకాన్ని వివరించాడు. ''మెయిన్ బ్రాంచ్ కంటె బర్లింగ్టన్ గార్డెన్స్‌లో ఉన్న వెస్టర్న్ బ్రాంచ్ చిన్నది. మనలో ఒకరు ఆ బ్యాంకుకు ధనికుడైన కస్టమరుగా పరిచయం కావాలి. ఏదో భారీ వ్యాపారం చేస్తున్నట్లుగా బిల్డప్ యిచ్చి, డబ్బు వేస్తూ తీస్తూ ఉండాలి. కానీ బ్యాంకులో ఖాతా తెరవాలంటే ఎవరైనా పరిచయం చేయాలి. మనం ఊరికి కొత్తవాళ్లం. ఎవరు పరిచయం చేస్తారు? ఎవర్ని నమ్మించగలమో బ్యాంకుకి వచ్చే పోయే ఖాతాదారులను కొన్నాళ్లు పరిశీలిద్దాం.'' అన్నాడు.
ఆ ప్రకారమే బ్యాంకు దగ్గర కొన్ని రోజులపాటు కాపు వేశారు. ముగ్గుర్ని ఎంపిక చేసుకున్నారు – కళ్లజోళ్ల షాపతను, భారతదేశం నుంచి వస్తువులు దిగుమతి చేసుకునే వ్యాపారస్తుడు, ఒక సూట్ల షాపతను. ఈ ముగ్గుర్నీ పరీక్షించి చూద్దామనుకున్నారు. అయితే వాళ్ల దగ్గరకు, బ్యాంకు మేనేజరు వద్దకు కస్టమరుగా ఎవరు వెళ్లాలి? మేక్ సంభాషణా చాతుర్యం ఉన్నా, బహుళభాషి ఐనా, ఆస్టినే బెటరన్నాడు జార్జి. అతనిలో హుందాతనం ఉంది. నిదానంగా ఆలోచించి పనులు చేస్తాడు. రిస్కు ఎక్కువైనా ఆస్టిన్ సరేనన్నాడు. బాగా ధనవంతుడిలా డ్రెస్ చేసుకుని ముందుగా కళ్లజోళ్ల షాపతను వద్దకి వెళ్లి ఖరీదైన కళ్లద్దాలు కొన్నాడు. ''నా ప్రేయసికి యిస్తున్నా. ఆ బాక్స్ మీద 'టు లేడీ మేరీ' అని చెక్కించండి. ఇదిగో 100 పౌండ్ల అడ్వాన్సు, రేపు వచ్చి తక్కినది యిచ్చి సరుకు తీసుకుంటా' అన్నాడు. షాపతను సరేనన్నాడు కానీ ఆస్టిన్ మనసు ఎందుకో కానీ కీడు శంకించింది. ఇతని వలన పని కాదనిపించింది. పోతేపోయాయి వంద పౌండ్లు అనుకుని, మర్నాడు ఆ షాపుకేసే వెళ్లలేదు. మర్నాడు దిగుమతి దారుడి దగ్గరకు వెళ్లి ఒక తెల్ల సిల్కు శాలువా, ఒంటె వెంట్రుకలతో చేసిన కంబళీ బేరం చేసి 100 పౌండ్లు అడ్వాన్సు యిచ్చాడు. ఇక్కడా అదే రకం శంక కలగడంతో ఆ వంద పౌండ్లూ వదులుకున్నాడు.
ఇక మూడోవాడు ఎడ్వర్డ్ గ్రీన్. ఖరీదైన ప్రాంతంలో సూట్లు, కోట్లు అమ్మే దుకాణం నడుపుతూ డబ్బు బాగా గడించినతను. ఆస్టిన్ చక్కగా డ్రెస్ చేసుకుని, సిగారు తాగుతూ అతని షాపు కెళ్లి 'ఇదిగో అబ్బాయ్, చూడూ నాకు యీ ర్యాక్లోంచి యీ సూటు గుడ్డ కావాలి, ఆ ర్యాంకులోంచి ఆ హేట్ కావాలి…'' అంటూ హంగు చేశాడు. యజమాని గ్రీన్ స్వయంగా వచ్చి అతనికి చూపించాడు. మొత్తం 7 కొన్నాడు. ఆ తర్వాత నైట్గౌన్లు అన్నాడు. అన్నీ బాగా ఖరీదైనవే. తర్వాత టైలరు కొలతలు తీస్తూండగా ఆస్టిన్ మాట కలిపాడు. తన పేరు ఫ్రెడరిక్ వారెన్ అనీ, యిక్కడ వ్యాపారావకాశాలు ఎలా వున్నాయో చూడడానికి అమెరికా నుంచి వచ్చాననీ చెప్పాడు. 'మీతో పాటు డబ్బు అదీ బాగా తెచ్చుకుని ఉంటారు. ఎవరైనా రిఫరెన్సు యిస్తే బ్యాంక్ ఖాతా తెరవడంలో సాయపడతాను' అన్నాడు గ్రీన్. 'అబ్బే, అక్కరలేదు, ఎక్కువ రోజులుండను. మీకు క్యాష్‌లోనే చెల్లిస్తాను.' అన్నాడు. బిల్లులో తన అడ్రసు 'కేరాఫ్ గోల్డెన్ క్రాస్ హోటల్' అని రాశాడు. అది పేరున్న హోటలు. ఎందుకైనా మంచిదని ఆస్టిన్ కొత్త పేరుతో అక్కడో గది తీసుకుని పెట్టుకున్నాడు.
ఆ తర్వాతి రెండు వారాల్లో రెండుసార్లు మళ్లీ వచ్చాడు. ఇంకా కొన్ని బట్టలు ఆర్డరు యిచ్చాడు, యింకా కొన్ని కబుర్లు చెప్పాడు. తర్వాత ఓ శనివారం పొద్దున్న వచ్చి 'లార్డ్ క్లాన్కార్టీ అనే ప్రముఖుడితో కలిసి ఐర్లండ్ వెళుతున్నా. మీ బిల్లు పూర్తిగా చెల్లించేస్తా' అన్నాడు. 150 పౌండ్లు యివ్వాల్సి ఉంటే 500 పౌండ్ల నోటు యిచ్చాడు. ఇచ్చిన చిల్లరను చూడకుండానే కోటు జేబులో కుక్కుకుని వెళ్లబోతూ గుమ్మం దగ్గర వెనక్కి తిరిగి 'అవునూ, నా దగ్గర కొంత క్యాష్ ఉంది. ఐర్లండ్‌కు తీసుకెళ్లడం దేనికి? మీ దగ్గర దాస్తారా? వచ్చాక తీసుకుంటా..' అన్నాడు. గ్రీన్ సరే నన్నాడు కానీ ఆస్టిన్ వెయ్యి పౌండ్ల కంటె విలువైన నోట్ల కట్ట బయటకు తీసేసరికి కంగారు పడ్డాడు. 'అబ్బే, అంతైతే కష్టం. మీరు చక్కగా బ్యాంకులో వేసి వెళ్లవచ్చు కదా' అన్నాడు.
అమ్మయ్య, సమయం వచ్చింది కదానుకుని 'కానీ నాకు యిక్కడ బ్యాంకు ఖాతా లేదే!' అన్నాడు ఆస్టిన్. 'పదండి, యీ వీధి చివరే మా బ్యాంకు ఉంది. నేను పరిచయం చేస్తాను.' అన్నాడు గ్రీన్. శనివారాలు బ్యాంకు మేనేజర్లు సెలవులో ఉంటారు. సబ్మేనేజరే బ్యాంకు నడుపుతాడు. గ్రీన్ పరిచయం చేయడం వలన సబ్‌మేనేజరు 'ఫ్రెడరిక్ వారెన్' పేర ఉన్న ఖాతా తెరవడానికి సంకోచించలేదు. ఆస్టిన్ వెంటనే రకరకాల నోట్లలో ఉన్న 1200 పౌండ్లు ఖాతాలో వేశాడు. పైగా అమాయకంగా మొహం పెట్టి 'వచ్చే వారం నాకు యింకో బిజినెస్ ట్రాన్సాక్షన్ నుండి యింకా ఎక్కువ డబ్బు వచ్చేది ఉంది. అప్పుడు కూడా యీయన్ని వెంటపెట్టుకుని వచ్చి జమ చేయాలా?' అని అడిగాడు. 'భలేవారే, అలాటిదేమీ లేదు. మీ అంతట మీరే డబ్బు వేయవచ్చు, తీయవచ్చు' అంటూ 50 చెక్కులున్న చెక్కు పుస్తకం ఒకటి చేతిలో పెట్టారు.
ఇక అప్పణ్నుంచి జార్జి సలహా మేరకు ఆస్టిన్ అ ఖాతాలో విపరీతంగా లావాదేవీలు జరిపాడు. తమ ముగ్గురి వద్ద ఉన్న డబ్బుని భారీ మొత్తంలో రకరకాలుగా వేయడం, తీయడంతో వారెన్ పేర ఎంత పెద్ద మొత్తం వచ్చినా వెళ్లినా ఆ బ్యాంకు సిబ్బందికి మామూలే అయిపోయింది. కానీ జార్జి 'వారెన్‌ను యింకా పెద్దవాడిగా ఎస్టాబ్లిష్ చేయాలంటే మన దగ్గరున్న డబ్బు చాలదు. ఏవైనా నేరాలు చేసి డబ్బు గడించాలి. యూరోప్‌లో మిగతా దేశాల్లో కూడా మన ప్రతాపం చూపించాలి. దానికి బ్యాంకింగు వ్యవస్థనే ఉపయోగించుకోవాలి.' అన్నాడు. లండన్‌లోని బ్యాంకు ఆఫ్ సౌత్ అండ్ నార్త్ వేల్స్‌కు వెళ్లి 300 పౌండ్లిచ్చి ఆ మేరకు బెర్లిన్‌లోని ఒక బ్యాంకు పేర ఒక ఎల్సి (లెటర్ ఆఫ్ క్రెడిట్) తీసుకున్నారు. దానితో బాటు ఆ బ్యాంకు మేనేజరు దగ్గర్నుంచి పరిచయపత్రం కూడా. ప్రయాణాలు చేసేవారు డబ్బు తమ వద్ద ఉంచుకోవడం కష్టం కాబట్టి, యిలాటి పత్రాలు కొనుక్కుంటారు. గమ్యస్థానం చేరాక వీటిని చూపించి ఆ పరిమితి లోపున దఫదఫాలుగా స్థానిక కరెన్సీలో డబ్బు తీసుకుని ఖర్చు పెట్టుకుంటారు. ఈ పత్రం సొంతదారు యితనే అని ధృవీకరించడానికి ఆ పరిచయ పత్రం పనికి వస్తుంది. దానిలో ఉన్న సంతకాన్ని పోల్చి చూసి అవతలివాళ్లు డబ్బు యిస్తూంటారు.
ఇలా ఒక ఎల్సి తీసుకున్నాక, మాస్టర్ ఫోర్జర్ అయిన మేక్ దేశవిదేశాల్లో ఉన్న రకరకాల బ్యాంకుల పేర రకరకాల మొత్తాలకు నకళ్లు తయారుచేశాడు. తమ దొంగ పేర్ల మీదుగా పరిచయ పత్రాలు కూడా తయారయ్యాయి. అవతలివాళ్లు పెద్దగా సందేహపడకుండా చిన్న చిన్న మొత్తాలకే రాశాడు. సందేహం వస్తే యివి నిజమైనవా కావా అని ఒక్క టెలిగ్రాఫ్ యిస్తే చాలు. యూరోప్‌లోని పొరుగు దేశాలు కాబట్టి వెంటనే జవాబు వస్తుంది. అందుకని ఆ జాగ్రత్త. అవి పట్టుకుని ముగ్గురూ విడివిడిగా ఐదు దేశాలకు వెళ్లి వాటిని ఎన్‌క్యాష్ చేసుకున్నారు. ఇలా 8 వేల పౌండ్లు పోగుపడ్డాయి.
(సశేషం) – ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2018)
[email protected]