బాపు: నేనూ – సంగీతం – 2

బడే పాటను తక్కువగానే ఉపయోగించుకున్నా మెహదీహసన్‌ పాటలను బాగానే ఉపయోగించుకున్నాను. షా ఎన్‌షా గజల్‌ శ్రీ మెహదీ హసన్‌ సంగీతాన్ని కూడా మిత్రులు పి.బి.శ్రీనివాస్‌ గారే పరిచయం చేశారు. రెండు ఇ.పి. రికార్డ్స్‌ తెచ్చిపెట్టారు. …

బడే పాటను తక్కువగానే ఉపయోగించుకున్నా మెహదీహసన్‌ పాటలను బాగానే ఉపయోగించుకున్నాను. షా ఎన్‌షా గజల్‌ శ్రీ మెహదీ హసన్‌ సంగీతాన్ని కూడా మిత్రులు పి.బి.శ్రీనివాస్‌ గారే పరిచయం చేశారు. రెండు ఇ.పి. రికార్డ్స్‌ తెచ్చిపెట్టారు. 

అవి విని పిచ్చెత్తి పోయింది – మధ్యాహ్నం పూట పాకిస్తాన్‌ రేడియో పెట్టుకుని గజల్‌ వచ్చినపుడల్లా టేప్‌ చేసుకునే వాణ్ణి. (అపుడు క్యాసెట్‌లు లేవు – స్పూల్‌ టేపులే) ఆయన కంఠానికి అడ్డొస్తోందని మధ్య వచ్చే లింక్‌ మ్యూజిక్‌ పాజ్‌ పెట్టి డిలీట్‌ చేసి పాట మాత్రం రికార్డు చేసుకునే వాణ్ణి. మెల్లిగా వారినీ వీరినీ అడిగి దొరికేవన్నీ పోగుచేసేశాను. కీ||శే|| దాశరథి గారు హైదరాబాదులో మోహన్‌ హెమ్మాడి అనే రసికుణ్ణి పరిచయం చేశారు. ఆయన మెహ్‌ాదీ గారి కెనడా అమెరికా మొ||దేశాల్లోని ప్రయివేట్‌ మెహఫిల్స్‌ (అంటే ఇళ్లల్లో  రాత్రిపూట కబుర్లు చెబుతూ పాట సోయగాలని ఎక్స్‌ప్లేన్‌ చేస్తూ సాగించే బుల్లి ఇన్‌ఫార్మల్‌ కచేరీలు) టేపులు – అద్భుతమైనవి – ఇచ్చారు. ఇలా నూటయాభై గంటల దాకా సంపాదించాను. బొమ్మలు వేస్తున్నపుడు (సినిమాలు తీసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ చేసేటపుడు తప్ప ఎప్పుడూ బొమ్మలు వేస్తూనే ఉంటాను) మిగతా సంగీతంతోబాటు మెహదీ హసన్‌ సంగీతం ఎక్కువగా వినడం అలవాటు. ఎపుడూ నిత్యనూతనంగా వుంటాయి.

ఓ మారు కీ||శే|| ఓలేటి వెంకటేశ్వర్లు గారు (వారికి ఛోటా గులాం ఆలీఖాన్‌ అని బిరుదు) మాయింటి కొచ్చి మెహదీ గజల్స్‌ పెట్టమన్నారు. గంటసేపు మాటా పలుకూ లేదు. కళ్లు మూసుకుని వింటున్నారు. ఒక గజల్‌ వింటూ 'ఇది ఏ రాగమండీ?' అని అడిగాను. ఆయన కళ్లు తెరిచి 'వానికి రాగం ఏమిటీ? వాడు పాడుతూంటే రాగం వెనక చక్కా వస్తుంది' అని మళ్లీ కళ్లు మూసుకుని వినడం మొదలెట్టారు.

రాగం గురించి ఓ తమాషా చెప్పాలంటే మెహదీ ఫేమస్‌ గజల్‌ ఒకటి 'అబ్‌ కె హం బిఛడే' చరిత్ర చెప్పాలి. దాని రాగం ఆయనకే తెలీదట! ఒకనాడు రేడియో స్టేషన్‌లో 'భూపాలీ' రాగం పాడి టాక్సీలో హోటల్‌కి వచ్చారు. భోయనం మరో గంట ఆలస్యం అని విని సుర్‌ మండల్‌ తీసి మీటారు. భూపాలీ శృతి చేసినది మరోలా పలికింది! కారు కుదుపు వల్లనేమో!  ఆయన మాటల్లో ''తీవ్ర్‌ సే కోమల్‌ హోగయా ధైవత్‌!'' దానికి జఫర్‌ గజల్‌ ''అబ్‌ కె హం బిఛ్‌డే'' జోడించి ఆలాపిస్తే భావం అద్భుతంగా కుదిరిందిట! రాత్రంతా అదే పాడుతూ కూచున్నారట. 

మద్రాసు వచ్చిన సి.రామచంద్ర గారిని కలుసుకున్నపుడు ఆయన చెప్పారు- ఆయనా మొదటి సారి ఆ గజల్‌ విని మతిపోయి లూప్‌లాగా అదే మరల మరల వేసి వింటూ వుండిపోయారట. ఇంటివాళ్లు నిజంగా మతి పోయిందనుకుని ఆస్పత్రిలో చేర్పించారట.

''స్నేహం'' సినిమాలో 'మామ' 'పల్లె మేలుకుందీ రేపల్లె మేలుకుందీ వెలుగు మేలుకుందీ మీగడ పెరుగు మేలుకుందీ' అనే సినారే రచన- యస్‌.పి.బాలు పాట ఈ ఛాయలోనే వరస చేశారు (ముఖ్యంగా పాట ముందు ఆలాపన). 

అలాగే ''స్నేహం''లోనే 'పోనీరా పోనీరా' అనే ఆరుద్ర రచన యస్‌.పి.బాలు గానం, మెహదీ గారి 'రోషన్‌' అనే పట్‌దీప్‌ గజల్‌ ఛాయలో చేశారు. 

'నవ్వు వచ్చిందంటే కిలకిల' పాట (బాలు గారిది – ఆరుద్ర రచన) 'చల్‌ చల్‌రే' అనే మెహదీ పాట ఛాయ. 

''బాత్‌ కరనీ' అనే జఫర్‌ ఆలీ 'పహడీ' గజల్‌ ''ముత్యాల ముగ్గు''లో 'ఏదో ఏదో అన్నదీ' ఛాయ. 

మళ్లీ 'రాధా కళ్యాణం'లో మెహదీ గారి 'గుంఛయే' అనే పాట ఛాయ-సినారే బాలు గారు 'కలనైనా' – ప్రొడ్యూసర్‌ 'వద్దు మొర్రో క్లాసికల్‌' అని నెత్తి కొట్టుకుంటున్నా పెట్టించేశాను.

''స్నేహం''కు సంగీతం సమకూర్చిన 'మామ' (కె.వి.మహదేవన్‌) తన గురించి గాని తన సంగీతం గురించి గానీ ఎప్పుడూ ఏమీ మాట్లాడే వారు కారు. ఈ రాగం ఏమిటి మామా! అనడిగితే 'నాకేమీ తెలీదు- నాకు 
వచ్చిందే ఆరు రాగాలు' అనేవారు. అంత మోడెస్ట్‌! ''స్నేహం'' ఒక్కదాని గురించే -'దీనిలో పాటలు బావున్నాయి కదూ బాపూ' అనేవారు. ఇంకో తమాషా చెబుతాను.

''సమ్మర్‌ ఆఫ్‌ 47'' అనే హాలీవుడ్‌ సినిమా థీమ్‌ మ్యూజిక్‌ నాకు మహా ఇష్టం. 'పెళ్లి పుస్తకం' సినిమాకి క్లయిమాక్స్‌ మ్యూజిక్‌గా బావుంటుందని 'మామ'కి వినిపించాను. ఆయన శ్రీ పుహళేంది గారికి వినిపించమన్నారు. ఆయన నవ్వి – 'సరే అలాక్కానీ' అన్నారు.  'నాకు ఈ మ్యూజిక్‌ వినగా వినగా ఇంకా ఇంకా బావుంటుంది ఎంచేతంటారు' అన్నా. 

పుహళేంది గారు – అవి మన 'సారమతి' రాగం ఛాయలు. అందుకే మీకు హత్తుకుని ఉంటుంది అన్నారు. 'మోక్షము గలదా భువిలో' అన్న త్యాగరాజ కృతి సారమతి. ఈ సందర్భంలోనే  ఆర్కయిస్ట్రయిజేషన్‌ గురించి ఇంకో సంగతి చెప్తాను –

'వంశవృక్షం' సినిమాలో – సోమయాజులు గారు పచ్చి ఛాందస సాంప్రదాయకుడు. యంగ్‌ విడో అయిన కోడలు (ఒక పిల్లాడి తల్లి) మారు పెళ్లి చేసుకుంటుంది. మావగారి కిష్టం లేదు. కోడలు (జ్యోతి) ఒకరోజు పట్నంనుంచి మావగారి గ్రామం వస్తుంది – కన్నబిడ్డను తీసుకుని వెళ్లడానికి. ఆ రోజే తన మొదటి భర్త తద్దినం చేస్తూ వుంటారు. ఇంటిల్లిపాదీ ఆమెను అసహ్యించుకుంటారు గానీ మావగారు ఆదరిస్తాడు. తనకు తన పసిబిడ్డ కావాలని అడుగుతుంది. 

ఆయన – ''చూడమ్మా -నాకు ఆ మనుమడు తప్ప వారసుడు లేడు. ఇహ పుట్టరు. నా ఇంటి పేరు నిలబెట్టేది వీడొక్కడే! నువ్వు మళ్లీ పెళ్లి చేసుకున్నావు కనుక నీ ఇంటిపేరు వేరయింది. నువ్వు ఈ బిడ్డని తీసికెళ్లిపోతే నీ కొత్త ఇంటి పేరే వస్తుంది వాడికి. నా వంశం అంతరించిపోతుంది. కానీ తల్లిగా నిన్ను గౌరవించి డెసిషన్‌ నీకే వదులుతున్నాను. పైన బిడ్డ పడుకుని వున్నాడు. నీ ఇష్టం అయితే తీసికెళ్లు'' అని పైకి పంపుతారు. 

పసిబిడ్డ నిద్రపోతూ వుంటాడు. పక్కనే వచ్చి పడుకుంటుంది. దుఃఖం పొంగుకొస్తుంది. మావగారి విశాల హృదయం గుర్తుకొచ్చి వెక్కివెక్కి ఏడుస్తుంది. చివరికి బిడ్డని తీసుకోకుండా వెళ్లిపోతుంది. 

ఈ ఘట్టానికి డైలాగులు లేవు (రచన రమణ గారు). కేవలం విజువల్స్‌. దీనికి మ్యూజిక్‌ ప్రాణం. నేను ''మిడ్‌నైట్‌ ఎక్స్‌ప్రెస్‌'' అనే సినిమా థీమ్‌ మ్యూజిక్‌ సరిగ్గా అతుకుతుందనుకున్నా, 'మామ'కి వినిపించాను.

ఆయన నవ్వేసి ''సరి బాపూ – కానీ ఈ ఆర్కెష్ట్రయిజేషన్‌ మనం చేయించలేము. ఒరిజినలే అతికించెయ్‌'' అన్నారు. (సశేషం) 

[email protected]

Click Here For Part-1