నితిన్ గడ్కరీ విషయంలో పుకారు మరో రకమైన కథనం బయటకు వచ్చింది. దీని ప్రకారం – తన యింట్లో జరుగుతున్న బగ్గింగ్ గురించి నితిన్ ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ వద్ద వాపోయాడు. 'నా మీదే కాదు, యిద్దరు సీనియర్ మంత్రుల మీద, పార్టీలోని ముఖ్య నాయకుల మీద కూడా యీ రకమైన నిఘా వేసి వుంచారు' అని చెప్పాడు. అంతా విని భాగవత్ 'దీని గురించి పత్రికల్లో కథనాలు వస్తే మాత్రం అలాటిది ఏమీ లేదని నువ్వే కాదు, ఆ యిద్దరు మంత్రులు కూడా చెప్పాలని నా మాటగా వాళ్లకు చెప్పు. ఇన్నాళ్లకు పార్టీ అధికారంలోకి వచ్చింది. నాయకుల్లో ఒకరిపై మరొకరికి నమ్మకం లేదని బయటకు పొక్కిందంటే ప్రతిష్ట అడుగంటుతుంది. త్వరలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో దెబ్బ తింటాం.' అని చెప్పారు. దీని తర్వాత అనుకున్నట్టుగానే పత్రికలో కథనం వచ్చింది. అలాటిది ఏదీ దొరకలేదు అని నితిన్ అంటూండగానే 'దొరికింది, కానీ అది అమెరికా పెట్టింది' అన్నాడు సెన్సేషనలిజం మీదనే బతికే సుబ్రహ్మణ్యస్వామి. ఓ యింటెలిజెన్సు అధికారిని దీని విషయమై అడిగితే 'అమెరికావాళ్లు తలచుకోవాలే కానీ యిలాటివి వాళ్ల కెందుకు? ఫర్లాంగు దూరంలో వున్న సెల్‌ఫోన్ కూడా క్లోన్ చేయగల సరంజామా వాళ్లకుంది' అన్నాడట.
ఆరెస్సెస్ యీ ప్రభుత్వాన్ని కాపాడుకుందామని చూస్తూనే మోదీ-అమిత్ మొత్తం డామినేట్ చేయడం పట్ల అసంతృప్తిగా వుంది. మోదీ, ఆరెస్సెస్‌ల మధ్య సఖ్యత గుజరాత్ ఎసెంబ్లీ ఎన్నికలలో కూడా అంతగా లేదని, యీ సారి ఎన్నికలలోనే అతనికి దన్నుగా నిలిచిందని అందరికీ తెలుసు. వాజపేయి హయాంలో పిఎంఓపై ఆరెస్సెస్‌కు పట్టు వుండేది. ఇప్పుడు అది పోయింది. అమిత్ పార్టీ అధ్యకక్షుడవుతూనే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, అసాంలలో పార్టీ అధ్యకక్షులను మార్చేశాడు. ఆరెస్సెస్ నాయకులు మొహం చిట్లించినా అవినీతిపరుడిగా ముద్రపడిన ఎడ్యూరప్పను పార్టీలోకి తీసుకున్నాడు. ఇదంతా మోదీ ఆదేశాల మేరకే జరుగుతోందని అందరికీ తెలుసు. జాతీయ కౌన్సిల్లో మోదీ మాట్లాడుతూ అమిత్‌ను 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా అభివర్ణించాడు. 'గుజరాత్లో ప్రారంభమైన మా భాగస్వామ్యం వలననే యిక్కడ విజయం సిద్ధించింది' అన్నాడు.
ఆరెస్సెస్ ఆలోచనాధోరణి దీనికి విరుద్ధంగా వుంది. యుపిఏ అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభమైన అన్నా హజారే వుద్యమంలో తాము పాలు పంచుకుని, కాంగ్రెసు అవినీతిని అందరి దృష్టికీ తేవడం చేతనే దానికి ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదిగిందని, ఆ విషయాన్ని విస్మరించకూడదని దాని అభిప్రాయం. మోహన్ భాగవత్ రక్షాబంధన్ కార్యక్రమంలో మాట్లాడుతూ ''కొందరు పార్టీ కారణంగానే యీ విజయం సిద్ధించిందంటున్నారు. మరి కొందరు వ్యక్తుల కారణంగా సిద్ధించిందంటున్నారు. ఈ పార్టీ, యీ వ్యక్తులు యింతకుముందు కూడా వున్నారు. అప్పుడెందుకు గెలవలేకపోయారట? జరిగినదేమిటంటే సామాన్యప్రజలు మార్పు కోరుకున్నారు. మార్పు తెచ్చుకున్నారు.'' అన్నారు.
'మార్పు ఎలా వస్తానేం, మోదీ అసాధ్యుడు, సహచరుల అవినీతే కాదు, అసమర్థత కూడా సహించడు' అని ప్రజలు అనుకోవాలి అనే లక్ష్యంతోనే వ్యవహారాలు నడుస్తున్నాయి. రోజూ పొద్దున్నే 8.30 కల్లా మోదీ ఆఫీసుకి వచ్చేస్తాడు. ఆ పాటికి సీనియర్ ఆఫీసర్లందరూ అక్కడ వుండాల్సిందే. ఆ తర్వాత పిఎంఓ నుండి మంత్రుల ఆఫీసులకు ఫోన్లు వెళ్తున్నాయట. వాళ్ల సెల్ఫోన్లకు కాదు. ఆఫీసులోని ల్యాండ్‌లైన్‌కు. అక్కడ ఎవరైనా ఎత్తకపోయినా, ఎత్తిన అసిస్టెంటు ఆఫీసరు యింకా రాకపోయినా దాని అర్థం – ఆఫీసరు ఆ టైముకి రాలేదు, అంటే మంత్రిగారు కూడా రాలేదు. ఎవరైనా అసిస్టెంటు ఫోన్ తీస్తే 'ఆ ఆఫీసరు రాగానే పిఎంఓకు ఫోన్ చేయమని చెప్పండి' అని పెట్టేస్తారంతే. మంత్రుల విషయంలో ల్యాండ్లైన్లకు చేయడం లేదు సెల్‌ఫోన్‌కే చేస్తున్నారు. కానీ దాని ద్వారా తాము ఎక్కడున్నామో యీజీగా కనుక్కోగలమన్న ఫీలింగ్ వాళ్లను అనీజీ చేస్తోంది.
మన్మోహన్ సింగ్ కూడా త్వరగానే ఆఫీసుకి వచ్చేవారు కానీ తన పెర్శనల్ స్టాఫ్ తప్ప తక్కినవారు కూడా అదే టైముకి రావాలని అనుకునేవారు కాదుట. ఇద్దరితోనూ పనిచేసిన ఒక అధికారి మాటల్లో ''మన్మోహన్ అధికారాన్ని డెలిగేట్ చేసేవారు కానీ బాధ్యతను కాదు. మోదీ బాధ్యతను డెలిగేట్ చేస్తారు. అధికారం ఆయన దగ్గరే వుంటుంది. ప్రతి మంత్రి ప్రజలకు డైరక్టుగా బాధ్యుడు కావాలని మన్మోహన్ ఆలోచన. మోదీ ఉద్దేశంలో ప్రతి మంత్రి తనకు బాధ్యుడై వుండాలి, తను ప్రజలకు బాధ్యుడై వుండాలి.'' సమావేశాల్లో కూడా మోదీ హెడ్మాస్టర్లో వేదిక మీద కుర్చీలో కూర్చుంటే శ్రోతలు చేతుల్లేని కుర్చీల్లో కూర్చుంటున్నారు. ముందుకు ఆనడానికి డెస్క్‌లు కూడా లేవు. బడిపిల్లల్లా బుద్ధిగా కూర్చోవాలంతే. మంత్రిత్వశాఖలు ప్రెస్ రిలీజ్లు విడుదల చేయవచ్చు కానీ మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టడం మోదీకి యిష్టం వుండదట. మొన్న ఉపాధ్యాయదినం నాడు మోదీ స్కూలు పిల్లలలందరినీ ఉద్దేశించి మాట్లాడారు. ఇకపై ఆకాశవాణి ద్వారా ప్రతివారం ప్రజలతో ముఖాముఖీ నెరపుతారట. ఏ మంత్రిత్వశాఖకు చెందిన వ్యవహారమైనా సరే, మోదీయే జవాబు చెప్తారన్నమాట.
స్వాతంత్య్ర దినోత్సవం నాడు తొంభై కోట్ల మంది సెల్‌ఫోన్ వాడకందారులకు ప్రధానమంత్రి నుండి డైరక్టుగా శుభాకాంక్షలు ఎస్సెమ్మెస్ రూపంలో అందాయి, హోం మంత్రి నుండి కాదు. 50,000 ఢిల్లీ పోలీసులకు మరో సందేశం. జనధన్ యోజనా ప్రవేశపెట్టినపుడు మోదీ నుంచి దేశంలోని యావన్మంది ఆఫీసర్లకు మోదీ నుండి ఈమెయిల్. ఆర్థికమంత్రి నుండి కాదు. మోదీ-ప్రజలు, బస్, మధ్యలో యింకెవ్వరూ అక్కరలేదు. నియంతలు తయారయ్యే విధానం యిదే. మన సువిశాల భారతదేశంలో, థాబ్దాలుగా నెలకొన్న ప్రజాస్వామ్యంలో, విభిన్న ప్రభావాలకు లోనయ్యే వివిధ రాష్ట్రాలను ఒకే వ్యక్తి, ఒకే పార్టీ తన అధీనంలోకి తెచ్చుకోవడం మహా కష్టం. అప్పుడప్పుడు హవా వీస్తూ వుంటుంది. అంతలోనే మందగిస్తుంది. ఇది తెలిసి కూడా సూపర్‌మ్యాన్ యిమేజి కోసం మోదీ తాపత్రయపడుతున్నారు. ఎన్టీయార్ ఉదాహరణతో మొదలుపెట్టాను కాబట్టి, ఆయనతోనే ముగించాలి. విజేతగా ప్రారంభమైన ఎన్టీయార్ రాజకీయజీవితం పరాజయభారంతో ముగిసింది. తన కుటుంబీకులే వెన్నుపోటు పొడవగా, తను నిలబెట్టిన అగస్త్యభ్రాతలు పాదరక్షలు విసరగా, ఏ ఆత్మాభిమానం నినాదంతో అందర్నీ ఆకట్టుకున్నారో, అదే ఆత్మాభిమానంతో కుమిలి, ఆభిజాత్యం గాయపడి, రోషంతో విషాదనాయకుడిగా జీవితం ముగించవలసి వచ్చింది. చరిత్ర పాఠాలు చెపుతూనే వుంటుంది. మనం నేర్చుకోవాలంతే! (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2014)