''బాపుకు బాష్పాంజలి''లో ''హాసం''కై బాపు సంగీతకారుల గురించి వ్యాసం రాశారని రాశాను కదా. అది చదవాలని చాలామంది పాఠకులు కోరారు. ఇది ప్రచురించేనాటికి (2002 ఫిబ్రవరి) ''హాసం'' పత్రిక అంతగా ప్రజల్లోకి వెళ్లలేదు. ఈ వ్యాసం వేరే ఎక్కడా ప్రచురించినట్లుగా కూడా లేదు. మన పాఠకుల కోసం బాపుగారికి కృతజ్ఞలతో, ''హాసం'' సౌజన్యంతో ఆ నాటి వ్యాసాన్ని క్రింద యిస్తున్నాను –
నాకు ఖాన్ సాహెబ్ శ్రీ బడేగులాం ఆలీ సంగీతాన్ని పరిచయం చేసినది మిత్రులు శ్రీ పి.బి.శ్రీనివాస్. నాకు సంగీతంతో శాస్త్రీయంగా ఏవిధమయిన పరిచయం, జ్ఞానం లేక పోయినా -వెంటనే బడేగారి టుమ్రీలు 78 ఆర్.పి.యమ్. మొత్తం సెట్టు కొనిపించేశారు. మూడు నిమిషాల్లో రాగప్రస్తారం యావత్తూ బడే ఎలా చెప్పారో పి.బి.యస్. పాడి వినిపించేవారు. అంతే కాదు, ఆయన గురించి నాకు కొన్ని విశేషాలు చెప్పి ఆసక్తి రేకెత్తించారు.
బడే మద్రాసులో విడిది చేసినపుడు విడిదికి మధ్యాహ్నం జి.యన్.బి., యమ్.యల్. వసంతకుమారి మొ|| హేమాహేమీలు చేరేవారట. ఖాన్ సాహెబ్ నిద్ర లేచివచ్చి అందరికీ స్వహస్తాల తో టీ, పాన్ ఇచ్చి ఒళ్లో సుర్ మండల్ అమర్చుకుని కూచునేవారట. వచ్చిన వారు అపూర్వ రాగాల ఆరోహణ, అవరోహణ చెప్తే, కొంతమంది తెచ్చిన పాటలను ఆ రాగాల్లో అప్పటికప్పుడు వరస కట్టి పాడేవారట. (ఆయన 'సబ్రంగ్' అనే పేరుతో పాటలు రాశేవారు).
ఆయన ఒకసారి ఓ బుల్లి సంస్థానంలో మరింత బుచ్చి రాజుగారి సమక్షంలో రాత్రి గాన కచేరీ చేశారట. పొద్దున్నే రాజాగారి దర్శనార్థం వెళ్ళారు. గంట తరువాత దర్శనం దొరికి లోనికెళ్లారు.
రాజాగారు 'ఏవిటి సంగతి?' అన్నారు. 'అదే.. బయలుదేరుతున్నా' అన్నారు బడే.
రాజాగారు- 'శుభం.. వెళ్లు' అన్నారు. 'రాత్రి పాడినందుకు ఏదైనా ఇనాం ఇస్తారేమోననీ…' అని బడే నసిగారట.
రాజాగారు తెల్లబోయి – 'ఇది బావుంది – విన్నందుకు నువ్వు నాకు ఇవ్వాలి – వెళ్లెళ్లు' అన్నారట.
మరోమారు టాంగా ఎక్కుతూంటే బండి వాడు -'సామీ వెనకాలే ఉండి అటే ఎక్కండి – ముందుకి మాత్రం రావద్దు. గుర్రం మిమ్మల్ని చూస్తే బెదురుద్ది' అన్నాట్ట. (ఖాన్ సాహెబ్ భారీ శరీరంతో పెద్ద పెద్ద మీసాల్తో వుండేవారు). ఇవి వారే స్వయంగా చెప్తూ తెగ నవ్వేవారుట.
ఆ రికార్డులు అన్నీ విన్నాక బడే అభిమానులం కాకుండా ఉండడం మా తరమా? శివాజీ గణేశన్ సోదరుని పెళ్లి కార్యక్రమంలో ఖాన్ సాహెబ్ కచేరీ పెట్టారు. నేనూ రమణ గారూ కుర్రాళ్లం – ఎలా లోనికి వెళ్లడం? గేటు దగ్గర నించుని, కారు దిగి ఓ పెద్ద కుటుంబం లోపల కెడుతూంటే వారి వెనకాలే – గేట్‌క్రాష్ చేసేశాము.
నేను లా కాలేజీలో చదువుతున్నప్పుడు పక్కన అన్నామలై చెట్టియార్ హాల్లో కచేరీ చేసి శ్రోతల్ని ఉర్రూతలూగించారు. ప్రథమంగా మన సాంప్రదాయం ప్రకారం 'హంసధ్వని రాగమ్' అని అనౌన్స్ చేసి పాడారు. మరోసారి కృష్ణగాన సభలో 'సునియో నందకుమార' అని భైరవిలో పాడి హాలంతటినీ పాములను ఆడించినట్లు – కళ్లు మూయించి – ఊగించగా నేను చూశాను.
నేను 'ఎఫిషియెంట్ పబ్లిసిటీస్' అనే ఏడ్ కంపెనీలో పనిచేస్తున్నపుడు (' 63 ప్రాంతాలలో) జరిగినదోటి గుర్తొస్తోంది. ఈ కంపెనీ క్లయింటయిన బెస్ట్ కంపెనీ మేనేజర్ గారు సంగీత ప్రియుడు. ఆ రోజుల్లో టేప్ రికార్డర్ (స్పూల్ టేప్)లలో మేటయినవి ఆయన వద్ద రెండు వుండేవి. ఇటు కర్నాటకం అటు హిందుస్థానీ కచేరీలు రికార్డ్ చేసి వుంచుకునేవారు. గొప్ప కలెక్షన్ వుండేది. నేను బడే భక్తుణ్ణని తెలుసు.
ఒక రోజు ఫోన్ చేసి – 'ఒక కొత్త టేపు తీసుకుని మా యింటికి రా' అన్నారు. వెంటనే ఒక స్పేర్ టేప్ కొని వారింటికి పరిగెట్టాను. ఆయన-'నేను ఖాళీ టేపులు కావలసివచ్చి కొన్ని చెరిపేస్తున్నా, నువ్వు గుర్తొచ్చావు. ఎరేజ్ చేద్దామనుకున్న వాటిలో ఒక బడే గులాం ఆలీ టేపుంది. అందువల్ల ఆ కొత్త టేపు ఇచ్చి ఈ బడే టేపు తీసుకో' అన్నారు.
నా ఆనందం చెప్పనక్కరలేదు. టేపు ఇస్తూ 'నేనింకా ఏదైనా డబ్బివ్వమంటారా' అనడిగాను. మన, ''అక్కర్లే-నీ ముఖంలో వెలిగే ఆనందం చూశా, అది చాలు'' అన్నారు.
బడే గులాం ఆలీ ఆఖరి రోజుల్లో హైదరాబాద్ బషీర్‌బాగ్ బేగం గారింట్లో ఉండి అక్కడే కైవల్యం పొందారు. అపుడు ('68లో) హైదరాబాద్‌లో 'బంగారు పిచిక' తీస్తున్నాము. ఆయన పోయిన సంగతి అసలు తెలీదు. ఏదో కొట్టు కెళితే సరుకు కట్టిన పాకెట్ మీద న్యూస్ చదివి గుండె ఝల్లుమంది.
బేగం గారింట్లో ప్రయివేట్‌గా పాడిన స్పూల్ టేప్స్ వున్నాయని విని పరిచయాలు చేసుకుని ఆవిణ్ణి కాపీ చేసి యిమ్మని ప్రార్థించాను. వెళ్ళినపుడల్లా ఎంతో తియ్యగా కబుర్లు చెప్పి బుల్లి క్రిస్టల్ గ్లాసుల్లో జాస్మిన్ టీ ఇచ్చి మాయ చేసేది గానీ ఖాన్ సాహెబ్ సంగీతం మాత్రం ఇవ్వలేదు. ఆవిడ ఇపుడు లేదని విన్నాను. ఆవిడని బషీర్ బాగ్ బేగం అంటారు. ఆ వీధికి బడే గులాం ఆలీఖాన్ పేరుపెట్టారు స్మృతి చిహ్నంగా!
''అందాల రాముడు'' సినిమాలో జనతా కాలనీలో బామ్మ గారింటికి లత కారులో వచ్చినపుడు మధ్యాహ్నం పూట రేడియోలోంచి నేపథ్యంలో ఖాన్ సాహెబ్ బడే గులాం ఆలీ గారి 'యాద్ పియా' టుమ్రీ వినిపిస్తూ ఉంటుంది. గమనించక పోయివుంటే ఈ సారి గమనించండి. (సశేషం)