ఎమ్బీయస్‌ : మోదీ సూపర్‌మ్యాన్‌ యిమేజ్‌ – 3/4

ప్రభుత్వంలో, పార్టీలో తను తప్ప యితర నాయకులందరూ అవినీతిపరులని, పార్టీని, దేశాన్ని వాళ్ల చేతుల్లోకి పోనిస్తే అనర్థం జరుగుతుందనే అభిప్రాయం జనాల్లో కలిగించే ప్రయత్నంలో మోదీ వున్నారు. పార్టీ అధ్యకక్షుడిగా తన నమ్మినబంటును తెచ్చి…

ప్రభుత్వంలో, పార్టీలో తను తప్ప యితర నాయకులందరూ అవినీతిపరులని, పార్టీని, దేశాన్ని వాళ్ల చేతుల్లోకి పోనిస్తే అనర్థం జరుగుతుందనే అభిప్రాయం జనాల్లో కలిగించే ప్రయత్నంలో మోదీ వున్నారు. పార్టీ అధ్యకక్షుడిగా తన నమ్మినబంటును తెచ్చి కూర్చోబెట్టారు. అతనికి చట్టపరంగా చిక్కులు వుంటే వాటిని తప్పించారు. అతనికి మేలు చేసిన చీఫ్‌ జస్టిస్‌ పరమశివంను గవర్నరు పదవితో సత్కరించారు. ఇదెక్కడి చోద్యం, యీ అనైతికచర్యను ఎలా సమర్థించుకుంటాం? అని పార్టీలో ఎవరు మొత్తుకున్నా వినలేదు. 'నా యిష్టం' అనే ధోరణే కనబడింది. గవర్నర్లను యిష్టం వచ్చినట్లు మార్చారు. అదేమిటంటే – యుపిఏ చేయలేదా? అనే వాదన. 'అయితే యుపిఏకు చేసిన సత్కారమే మనకూ చేస్తే? ప్రతిపక్షంలో వుండగా మనం చేసిన వాదన వేరు, అధికారంలోకి వచ్చాక చేస్తున్న వాదన వేరు. ఇక కాంగ్రెసుకు, మనకు తేడా ఏముంది?' అని పార్టీలో ఎవరైనా ప్రశ్నించడానికి కూడా వీల్లేకుండా మొత్తం పార్టీని మోదీ-అమిత్‌ తమ గుప్పిట్లో తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడానికి గాను బిజెపి అధినాయకత్వం వుపయోగిస్తున్న ఉపాయం – పుకార్లు. బిజెపిలో తనకు పోటీగా వున్న సంజయ్‌ జోషిని పక్కకు తప్పించడానికి మోదీ యిదే ట్రిక్కు వుపయోగించాడని అందరూ అంటారు. ఆరెస్సెస్‌ నుండి బిజెపిలోకి మోదీతో బాటు వచ్చి ఎదిగిన సంజయ్‌ జోషిపై బ్లూ ఫిల్మ్‌ సిడిలు చలామణీలోకి వచ్చాయి. అవి చూపించి అతన్ని దింపేశారు. తర్వాత అవి బూటకమైనవని తేలింది. కానీ అతను యిప్పుడు అనామకుడై పోయాడు.

ప్రస్తుతం షికార్లు చేస్తున్న పుకార్లలో కథనాలు ఏమైనా అవి యిచ్చే సందేశం ఒక్కటే – 'మోదీ ఒక్కడే స్వచ్ఛమైనవాడు. అతను తినడు, యింకోర్ని తిననివ్వడు, అవినీతిపరులను అస్సలు సహించడు, ఎక్కడ ఏ ఆకు కదిలినా, ఏ కరెన్సీ నోటు రెపరెపలాడినా అతనికి తెలిసిపోతుంది. ఖబడ్దార్‌ అనే వార్నింగ్‌ వెళ్లిపోతుంది.' ఈ పుకార్లలో కొన్ని – 1.'హోం మంత్రి కుమారుడు పంకజ్‌ సింగ్‌. మా నాన్నతో చెప్పి మీకు కావలసిన పని చేసిపెడతాను అని చెప్పి అతను ఒక వ్యాపారస్తుడి వద్ద డబ్బు (ఈ మొత్తమెంతో కచ్చితంగా ఎవరూ చెప్పటం లేదు రూ. 50 లక్షల నుండి 5 కోట్ల దాకా ఏదైనా కావచ్చు) తీసుకున్నాడు. ఇంకో వెర్షన్‌ ఏమిటంటే ఢిల్లీలోని పోలీసు ఆఫీసర్లు తమ పోస్టింగులకై అతనికి యీ డబ్బు యిచ్చారు. అంతే, చారచకక్షువైన మోదీకి యీ సంగతి తెలిసిపోయింది. రాజ్‌నాథ్‌ సింగ్‌ను పిలిచి నీ కొడుకుని చక్కదిద్దుకో అని వార్నింగ్‌ యిచ్చాడు. ఇంకో కథనం ప్రకారం మోదీ పంకజ్‌ను డైరక్టుగా పిలిచి తండ్రి చెడ్డపేరు తేవద్దు అని చివాట్లు వేసి, నువ్వు పుచ్చుకున్న ప్రతీ పైసా వెనక్కిచ్చేయ్‌ అని హెచ్చరించాడు. ఆ సమయంలో ఆ వ్యాపారస్తులు పక్కగదిలోనే వున్నారు. వాళ్లకు వినబడేట్టే మోదీ చెప్పాడు.' 

2. ఎన్టీయార్‌ తన సహచరమంత్రిపై నిఘా పెట్టినట్లే, మోదీ కూడా తన పార్టీ సీనియర్‌ నాయకుడు, అవినీతి ఆరోపణలపై అధ్యక్షపదవిని పోగొట్టుకుని యిప్పుడు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిగా వున్న నితిన్‌ గడ్కరీ యింట్లో చాటుగా వినే (బగ్గింగ్‌) పరికరాలను పెట్టించాడు. 3. అరుణ్‌ జైట్లీకి సన్నిహితుడు పెట్రోలియం మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్‌ ఒక పారిశ్రామికవేత్తతో కలిసి తాజ్‌ హోటల్‌లో (ఢిల్లీలో అని కొందరు ముంబయిలో అని మరికొందరు అంటున్నారు) టీ/బ్రేక్‌ఫాస్ట్‌/భోజనం సేవిస్తూండగా అంతలో అతని సెల్‌ఫోన్‌ మోగింది. 'తిన్నది చాలు కానీ యిక లే, పద' అని హెచ్చరించింది ఆ గొంతు. దెబ్బకు ధర్మేంద్రుడి పంచేంద్రియాలు చచ్చుబడ్డాయి. మళ్లీ కలుద్దాం అని చెప్పి బయటకు వచ్చేసాడు. 4. కోల్‌, పవర్‌ సహాయమంత్రి పీయూష్‌ గోయల్‌ విదేశాలు వెళ్లి కూతుర్ని చూడబోయాడు. ప్రయాణసన్నాహాల్లో వుండగానే అతనికి కబురు వచ్చింది – తిరుగుళ్లు కట్టిపెట్టి, పని చూసుకో,లేకపోతే లీవు అప్లికేషన్‌తో బాటు రాజీనామా పత్రం కూడా సమర్పించు' అని. 5. రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌కు హెచ్చరిక వెళ్లింది, 'మీ అబ్బాయి చిరాగ్‌ వ్యవహారం బాగాలేదు, చక్కదిద్దుకో' అని.' 6. ఇన్ఫర్మేషన్‌ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ కెన్యాలో సమావేశానికి వెళుతూ జీన్స్‌, టీషర్టు వేసుకుని ఎయిర్‌పోర్టుకి వెళుతూంటే ఫోన్‌ వచ్చింది 'మన భారతీయ సంస్కృతి మర్చిపోకు. ఇంటికి తిరిగి వెళ్లి యీ బట్టలు మార్చుకుని కుర్తా పైజమా వేసుకో' అని. 7. హోం శాఖ సహాయమంత్రి కిరెన్‌ రిజ్జూ పదవీస్వీకారం చేసిన తర్వాత గువాహటి వెళ్లాడు. అక్కడ దిగగానే సెల్‌ఫోన్‌ మోగింది. ''మీరు ఊరు విడిచి వెళదామనుకున్నపుడు పిఎంఓకు చెప్పి వెళ్లడం మర్యాద'' అని గుర్తు చేసింది.

వీటిలో వాస్తవాల మాట ఎలా వున్నా వీళ్లంతా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారనీ, మోదీ లేకపోతే వీళ్ల చేతిలో దేశం భ్రష్టు పట్టిపోయిందని అందరూ నమ్మేట్లుగా ప్రచారం సాగిపోతోంది. టీవీ యింటర్వ్యూల్లో వీటి గురించి నాయకులను అడగసాగారు. తన యింట్లో ఏ బగ్గింగ్‌ ఎక్విప్‌మెంట్‌ దొరకలేదని నితిన్‌ చెప్పుకోవలసి వచ్చింది. జీన్స్‌ వేసుకోవద్దని తనకెవరూ చెప్పలేదని ప్రకాశ్‌ చెప్పుకోవలసి వచ్చింది. ఇక రాజ్‌నాథ్‌ విషయంలో పదిహేను రోజుల్లో అయితే పుకారు మరింత బలపడి, దేశమంతా చక్కర్లు కొట్టి, రాజ్‌నాథ్‌కున్న క్లీన్‌ యిమేజిని చెడగొట్టసాగింది. మధ్యలో హెల్త్‌ చెకప్‌కై రాజ్‌నాథ్‌ ఆసుపత్రిలో చేరితే 'అదిగో మోదీకి తెలిసిపోయిందని భయపడి రాజ్‌నాథ్‌కు హార్ట్‌ ఎటాక్‌ వచ్చింద'న్నారు. పంకజ్‌ యుపి ఉపయెన్నికలలో టిక్కెట్టు నిరాకరించడానికి కూడా యిదే కారణం అన్నారు. ఇక రాజ్‌నాథ్‌కు ఒళ్లు మండిపోయి, మోదీ, షాల వద్దకు వెళ్లి యింటెలిజెన్సు వారి చేత దర్యాప్తు చేయించమని కోరేటంత వరకు వచ్చింది. చివరకు పిఎంఓ, అమిత్‌ షా యీ పుకారును ఖండించారు. 'ఎవరో కావాలని పుట్టిస్తున్న అబద్ధాలివి, ప్రభుత్వం యిమేజి చెడగొట్టడానికి చేసిన ప్రయత్నాలు' అన్నారు వాళ్లు. ఖండనలను ఎందరు నమ్మారో తెలియదు కానీ జరగవలసిన డామేజి జరిగిపోయింది కదా. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌