ప్రతి పరాజయం మనకు పాఠాలు నేర్పుతూ ఉంటుంది. తర్వాతి పోరాటానికి సమాయత్తం చేస్తుంది. దిల్లీలో ఓటమి తర్వాత బిజెపి బెంగాల్ సమరానికి సమాయత్తమౌతోంది. ఇంకో రెండు నెలల్లో మునిసిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. వాటిలో మమతకు గట్టి పోటీ యివ్వగలిగితే 2021 ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలలో ధీమాగా ఎదుర్కోవచ్చు. దానిలో గెలవడమే ప్రతిష్ఠాత్మకమైన విషయం. బెంగాల్ దిల్లీ వంటి 7 ఎంపీల రాష్ట్రం కాదు, అంతకు 6 రెట్లు పెద్దది. దిల్లీ ఓటమికి ప్రధాన కారణాల్లో అరవింద్ కేజ్రీవాల్‌కు సరైన ప్రత్యర్థిని చూపలేకపోవడం ఒకటి. అసెంబ్లీ ఎన్నికలు కూడా మోదీ, అమిత్ పేర్లతోనే గెలిచేస్తామన్న ధైర్యం సన్నగిల్లుతోంది. గతంలో యుపిలో ముఖ్యమంత్రి ఎవరో చెప్పకపోయినా గెలిచారు. మోదీ యిక్కడికి సిఎంగా రారు కదా అని ఓటర్లనడిగినా, ‘అన్నీ మోదీ చూసుకుంటారు’ అని ఓటర్లు సమాధాన మిచ్చారు. కానీ యిటీవల ఎన్నికలలో ‘కేంద్రంలో మోదీ ఉండనీ, రాష్ట్రంలో మాకు నచ్చినవాడు ఉండనీ’ అంటున్నారు. అందువలన అసెంబ్లీ ఎన్నికలలో దీటైన ప్రతిపక్ష నాయకుణ్ని చూపడం అత్యవసరం అవుతోంది.
బిజెపి బెంగాల్‌ను గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. ప్రస్తుతం కమ్యూనిస్టులు అధికారంలో లేకపోయినా వామపక్ష భావజాలం అలుముకున్న బెంగాల్‌ను రైట్ వైపుకి తిప్పడం ఘనవిజయమే అవుతుంది. త్రిపురలో అది సాధించారు. కేరళలో శ్రమిస్తున్నారు కానీ యిప్పటిదాకా ఫలితం దక్కలేదు. బెంగాల్‌కు వచ్చేసరికి యిద్దరు శత్రువులున్నారు. తాము బలం పుంజుకోకుండా మమతా బెనర్జీని బలహీనపరిచి వదిలేస్తే, చేవ చచ్చి జీవచ్ఛవంగా ఉన్న కమ్యూనిస్టులకు జీవం పోసినట్లవుతుంది. కమ్యూనిస్టులను తలెత్తుకోకుండా దెబ్బ కొట్టాలంటే మమతతో చేతులు కలపడం ఒక మార్గం. గతంలో వాజపేయి అది చేశారు. కానీ మోదీకి, మమతకు వ్యక్తిగతంగా అస్సలు పడటం లేదు. మన చంద్రబాబు లాగానే మమత మోదీ పేరెత్తితేనే శివాలెత్తిపోయారు. ఆంధ్రలో చంద్రబాబుకు ఎన్నికల సమయంలో దిగ్బంధం చేసి తెఱచిరాజు చెప్పినట్లే మమతను కూడా చేయడానికి మోదీ సిద్ధంగా ఉన్నారు.
పార్లమెంటు ఎన్నికలలో బిజెపి అనూహ్యంగా 42లో 18 సీట్లు, 40% ఓట్లు సంపాదించింది. ఆ ధైర్యంతో మమతను పదవీభ్రష్టురాలిని చేయడమే తక్షణలక్ష్యంగా పెట్టుకుని అమిత్ దూకుడుగా ఉన్నాడు. అది గ్రహించి మమత దూకుడున్నరగా ప్రవర్తిస్తోంది. బెంగాల్ గవర్నరు, ముఖ్యమంత్రి యిద్దరూ హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలలో గెలిచిన అసెంబ్లీ సిగ్మెంట్లయినా బిజెపి 2021లో తప్పక సంపాదిస్తుందని ఎవరూ గ్యారంటీగా చెప్పలేరు. అంతకంటె ఎక్కువ సంపాదించాలని బిజెపి పట్టుదల. కలకత్తాలో మమతను ఢీకొనడానికి దానికి దొరికిన కాండిడేట్ దిలీప్ ఘోష్! ప్రస్తుతం రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు. అయితేగియితే భావి ముఖ్యమంత్రి. ఈ దిలీప్ ఘోష్ గురించి మన తెలుగు మీడియాలో పెద్దగా రాలేదు, ఏదైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు తప్ప! అతని గురించి తెలుసుకుంటే మమతకు సాటి రాగలిగేవాడో కాదో ఒక అంచనాకు రావచ్చు.
దిలీప్ 55 ఏళ్లవాడు. స్కూలు చదువయ్యాక పాలిటెక్నిక్ చదివానని ఎన్నికల అఫిడవిట్లో రాశాడు కానీ ఆ కాలేజీ వాళ్లు అబ్బే లేదన్నారు. చిన్నప్పుడే ఆరెస్సెస్‌లో చేరాడు. అండమాన్, నికోబార్ దీవుల్లో సంఘ్ తరఫున పనిచేశాడు. 2014లో అతన్ని బిజెపిలోకి తీసుకుని వచ్చారు. 2015లో రాష్ట్ర అధ్యక్షుణ్ని చేశారు. 2016 అసెంబ్లీ ఎన్నికలలో ఖడ్గపూర్ సదర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెసు దిగ్గజం గ్యాన్ సింగ్ సోహన్పాల్ని ఓడించాడు. 2019లో మేదినీపూర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి 89 వేల మెజారిటీతో తృణమూల్ అభ్యర్థిపై గెలిచాడు. పార్లమెంటు ఎన్నికలలో లభించిన ఘనవిజయం తన ఆధ్వర్యంలోనే జరిగిందని అతను చెప్పుకుంటాడు. ఆ విజయంలో మోదీ భాగమెంతో, దిలీప్ భాగమెంతో ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే.
విభజనకు ముందు బెంగాల్లో హిందూ, ముస్లిం మతకలహాలు తీవ్రంగా జరిగినా, స్వాతంత్య్రానంతర రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలేవీ మతాన్ని, రాజకీయాన్ని కలపలేదు. మమత ముఖ్యమంత్రి అయ్యాక ముస్లింలను కమ్యూనిస్టు నుంచి దూరం చేయడానికై వారిని బుజ్జగించడం మొదలుపెట్టింది. బిజెపి ఆ విషయాన్ని హైలైట్ చేస్తూ, హిందూ ఓటర్లను సంఘటితం చేసింది. హిందూత్వ నినాదంతో బిజెపి తృణమూల్‌ను, కమ్యూనిస్టులను యిద్దర్నీ ఓడించ వచ్చనుకుంటోంది. అందువలన దిలీప్ వంటి సంఫీుయుణ్ని అధ్యక్షుడిగా ఎంచుకుంది. బెంగాల్లో మామూలుగానే హింసా రాజకీయాలు ఎక్కువ. గత రెండు దశాబ్దాలుగా అది మరీ పెరిగింది. తృణమూల్ హింసను ఉపయోగించే అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా తమ గూండాలను, పోలీసులను ఉపయోగిస్తోంది.
తృణమూల్ నాయకులు నిస్సిగ్గుగా తమ కండబలాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వీర్భూమ్ నియోజకవర్గంలో అయితే అనువ్రత మండల్ అనే తృణమూల్ నాయకుడు నాకు అడ్డు వస్తే చంపేస్తా అంటూ కండల్ని ప్రదర్శించాడు. రెండు రోజుల క్రితమే కీర్తిశేషుడైన తపస్ పాల్ అనే మరో ముఖ్య నాయకుడు ‘పార్టీకి ఓట్లేయని వాళ్ల యిళ్లకు కుర్రాళ్లను పంపి, వాళ్ల ఆడవాళ్లపై అత్యాచారం చేయిస్తా’ అని బెదిరించాడు. ఎన్నో ఊళ్లల్లో కమ్యూనిస్టు పార్టీ నాయకుల యిళ్లపై, పార్టీ ఆఫీసులపై దాడి చేసి ధ్వంసం చేయడంతో వారంతా నిస్సహాయులై తృణమూల్‌కు దాసోహమంటూ పార్టీలో చేరిపోయారు. ఓటర్లను భయభ్రాంతులను చేయడంలో దిట్ట అయిన తృణమూల్‌కు వ్యతిరేకంగా బిజెపి కార్యకర్తను తయారు చేయాంటే వాళ్లను రెచ్చగొట్టాలి. అందువలన దిలీప్ హింసను ప్రేరేపిస్తూ తీవ్రపదజాలం ఉపయోగిస్తూ వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. గతంలో వామపక్ష నాయకులు అనిల్ బాసు, వినయ్ కొంగార్ మమతను ఉద్దేశించి అసభ్యకరమైన భాష ఉపయోగించారు. ఇప్పుడు దిలీప్ స్థాయి పెంచాడంతే.
దిలీప్ వ్యాఖ్యలు కొన్ని వింటే అతను ఎలాటి వ్యక్తో కొంత తెలుస్తుంది. 2016 మేలో జాదవ్‌పూర్ యూనివర్శిటీ విద్యార్థినులను ఉద్దేశించి ‘‘వాళ్లు మగపిల్లలు ఎప్పుడు దొరుకుతారా అని చూస్తూ ఉంటారు.’’ అన్నాడు. 2019 జూన్‌లో నోబెల్ బహుమతి గ్రహీత, ‘భారతరత్న’ బిరుదాంకితుడు అమర్త్య సేన్ ఓ యూనివర్శిటీలో మాట్లాడుతూ ‘‘బెంగాల్లో ‘మా దుర్గా’ అనడమే రివాజు తప్ప ‘జై శ్రీరామ్’ కాదు. ఇప్పుడది జనాల్ని చావబాదడానికి ఉపయోగించడం దురదృష్టకరం. బెంగాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు ఎప్పుడూ జరిగేవి కావు. ఇప్పుడే మొదలుపెట్టారు.’’ అన్నాడు. దానికి దిలీప్ మండిపడుతూ ‘‘విదేశాల్లో ఉండిపోవడం వలన ఆయనకు బెంగాల్ సంస్కృతి తెలియదు. ఆయన అక్కడే వుండిపోవడం దేశానికి మంచిది.’’ అన్నాడు. అమర్త్య సేన్ యుకెలో ఉంటున్నా, పుట్టుక, చదువు, ఉద్యోగం, 39 ఏళ్లవరకు జీవితం అంతా యిక్కడే!
2019 ఆగస్టులో దిలీప్ ‘నేను చంపడం మొదలుపెడితే తృణమూల్ కార్యకర్తల కుటుంబాలు తుడిచిపెట్టుకు పోతాయి’’ అన్నాడు. తృణమూల్ కార్యకర్తలపై, పోలీసులపై హింసాత్మకంగానైనా సరే ప్రతీకారం తీర్చుకోండి అని పార్టీ కార్యకర్తలకు ఉద్బోధించాడు. 2019 సెప్టెంబరులో జాదవ్‌పూర్ యూనివర్శిటీలోని వామపక్ష విద్యార్థి సంఘసభ్యులను జాతివిద్రోహులు, టెర్రరిస్టులు అన్నాడు. మా పార్టీ ‘బాలాకోట్ తరహా సర్జికల్ స్ట్రయిక్ చేసి కమ్యూనిస్టులను తరిమివేస్తుంది’ అని హెచ్చరించాడు. 2019 నవంబరులో వర్ధమాన్‌లో గోకులాష్టమి సందర్భంగా మాట్లాడుతూ ‘విదేశీ ఆవులు ఆంటీలు, భారతీయ ఆవుల పాలల్లో బంగారం ఉంటుంది. అందుకే అవి పచ్చరంగులో ఉంటాయి.’ అన్నాడు. 2019 డిసెంబరులో ‘మీడియాకు న్యూస్ కావాలి కాబట్టి మా పార్టీ ప్రజల్ని ఆందోళన చేయమంటుంది’ అన్నాడు.
ఓసారి నడియాలో పార్టీ ర్యాలీ నిర్వహిస్తూ ఉంటే ఒక ఆంబులెన్సుకి దారి యివ్వాల్సి వచ్చింది. దానిలో పేషంటు ఉన్నా దిలీప్ ‘ఆంబులెన్సుకు దారి యివ్వం, వేరే దారిలో వెళ్లమను’ అన్నాడు. ఇది ఘోరం, అమానుషం కదా అంటే ‘ఇవన్నీ తృణమూల్ వాళ్ల ట్రిక్కు, వాళ్లు కావాలని ర్యాలీని భగ్నం చేయడానికి దీన్ని యిటు పంపించారు’ అన్నాడు. 2020 జనవరిలో ‘బెంగాల్ జాతివిద్రోహులకు నిలయం అయిపోయింది.’ అన్నాడు. సిఏఏను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసేవారిని వెన్నెముక లేని దెయ్యాలుగా, అమ్మానాన్నా ఆచూకీ తెలియని పరాన్నభుక్తులుగా వర్ణించాడు. యుపిలో చూడండి మా ప్రభుత్వం వాళ్లను కుక్కల్లా కాల్చి పారేసింది. ఇక్కడా అలా చేయాలి అని పిలుపు నిచ్చాడు. ఇది చాలా వివాదాస్పదమైంది. బెంగాల్ నుంచి బిజెపి కేంద్రమంత్రిగా ఉన్న గాయకుడు బాబుల్ సుప్రియో ‘‘దిలీప్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. యుపిలో అలా ఏమీ జరగలేదు’’ అని ట్వీట్ చేశాడు. బిజెపి రాజ్యసభ ఎంపీ స్వపన్ దాస్‌గుప్తా ఆ వ్యాఖ్యను రీట్వీట్ చేశాడు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రకుమార్ బోస్ ‘ఈ దేశంలో భయోత్పాత రాజకీయాకు తావు లేదు’ అని ప్రకటించాడు. కానీ దిలీప్ తగ్గలేదు. ‘‘మాకు బెంగాల్లో అధికారమిస్తే అలాగే చేస్తాం’’ అని పునరుద్ఘాటించాడు.
పత్రికల వాళ్లు దిలీప్‌ను అతని వ్యాఖ్య గురించి అడిగారు. ‘‘అవును, అమిత్ షా నన్ను కాస్త జాగ్రత్తగా మాట్లాడమని సలహా యిచ్చిన మాట నిజం. నేను చెప్పాను- వాళ్లు 92 మంది మన కార్యకర్తలు 92 మందిని చంపేస్తే, నేను బేలూరు మఠానికి వెళ్లి ధ్యానం చేస్తూ కూర్చోలేను అని. సిఏఏ ఆందోళనకారులను కుక్కలను కాల్చినట్లు కాల్చేయాలి అని నేనడంతో తప్పేముంది? గత ప్రభుత్వాలు నక్సలైట్లను, గూర్ఖా ఉద్యమకారులను చంపలేదా? ఎవరో కొందరు మేధావులు, భద్రలోక్ (పెద్దమనుషులు) మాత్రం నా నోరు చెడ్డదని విమర్శిస్తున్నారు. వీధుల్లో ఉండే కార్యకర్తలకు మాత్రం మహా హుషారుగా ఉంది. ‘‘దాదా, భలే అన్నావ్.’’ అంటున్నారు. నా వ్యాఖ్యల కారణంగా నన్ను ముఖ్యమంత్రిగా చూపటం లేదని, బయట నుంచి ఎవర్నో తీసుకునివచ్చి పెడతారని కొందరంటున్నారు. ఎవరైనా సరే, ఆకాశం నుంచి ఊడిపడరు. పార్టీలోంచే ఎంపిక చేస్తారు. ఈ బెంగాల్ ప్రజలకు అవినీతి గురించి పట్టటం లేదు. నారదా, శారదా స్కాములున్నా 2016లో తృణమూల్‌ను గెలిపించారు. ఎందుకు? రెండు రూపాయలకు బియ్యం యిస్తోంది, ఇంటికో సైకిలు యిస్తోంది, విద్యార్థులకు స్టయిపెండ్ యిస్తోంది.. యిలాటి కారణాల చేత. పరిస్థితి మారాలి. మారాలంటే నా బోటివాడు యిలాగే ఉండాలి.’’ అని జవాబిచ్చాడు.
ఇలాటి వ్యాఖ్యల కారణంగా బిజెపి అధిష్టానం దిలీప్ని అధ్యక్షుడిగా తీసేస్తారు కాబోలు అనుకున్నారు. కాస్త జాగ్రత్తగా వుండు అని హెచ్చరించిందట కానీ తప్పు చేశావని మందలించలేదట. జనవరి రెండోవారంలో జరిగిన పార్టీ సమావేశంలో దిలీప్నే మళ్లీ అధ్యక్షుడిగా చేశారు. అదీ ఏకగ్రీవంగా! అటువంటి తరహా ఎగ్రెసివ్ రాజకీయాలే ఓట్లు తెస్తాయని బిజెపి ఆశ కాబోలు. దానితో దిలీప్‌కు మరింత ధైర్యం వచ్చింది. జనవరి 28న ‘షహీన్‌బాగ్‌లో అంత చలిలో ప్రదర్శలను నిర్వహిస్తున్నా ఎవరూ చావటం లేదేం? అమృతం ఏమైనా తాగారా?’ అని ఆశ్చర్యపడ్డాడు. సిఏఏను వ్యతిరేకిస్తున్న బ్యానర్ పట్టుకున్న ఒక మహిళను బిజెపి కార్యకర్తు వెక్కిరిస్తూ అల్లరి పెట్టారు. ఇదేమి సంస్కారం అని అడిగితే ‘వెక్కిరింతతో సరిపెట్టినందుకు ఆ అమ్మాయి సంతోషించాలి, దేవుడికి దణ్ణం పెట్టుకోవాలి.’ అన్నాడు.
బిజెపి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా దిలీప్ కాకపోతే వేరెవరు అనే ప్రశ్న ఉంది. ‘బాబుల్ సుప్రియోకు ఛాన్సుంది’ అంటున్నారు. కుక్కల్లా కాల్చడం విషయంలో దిలీప్‌ను అతను సమర్థించలేదు కానీ మరో విషయంలో అతని వ్యాఖ్య విని జనాలు కనుబొమ్మలెగరేశారు. ఒకమ్మాయి జాదవ్‌పూర్ యూనివర్శిటీలో డిగ్రీ తీసుకుంటూ సిఏఏ పట్ల నిరసనగా చట్టం ప్రతిని చింపివేసింది. బాబుల్ ఆమెను విమర్శించాడు. ఆమె భావప్రకటన హక్కును ఎందుకు విమర్శిస్తున్నావు? అని ఓ భారతీయ ముస్లిము అతన్ని ప్రశ్నిస్తే ‘ముందు నిన్ను నీ దేశానికి పంపేసి, ఆ తర్వాత జవాబిస్తాను’ అంటూ దురుసుగా సమాధానమిచ్చాడు బాబుల్. అతని అసలు పేరు సుప్రియా బరాల్. హిందీ, బెంగాలీ సినిమాల్లో పాటలు పాడుతూ పేరు తెచ్చుకున్నాడు. 2014లోనే రాజకీయాల్లోకి వచ్చి బిజెపిలో చేరాడు. అందువలన క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఉత్సాహపరిచి నడిపించడంలో అనుభవం లేదు.
అలాటి అనుభవం 65 ఏళ్ల ముకుల్ రాయ్‌కు ఉంది. యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లో కాకలు తీరిన యోధుడు. మమతకు కుడిభుజంగా ఉండి, ఆమెతో విభేదించి 2017 సెప్టెంబరులో బిజెపిలో చేరాడు. అప్పణ్నుంచి తృణమూల్ నుంచి నాయకులను బిజెపికి ఫిరాయింపచేసే పనిలోనే ఉన్నాడు. అతన్ని మమతకు పోటీగా ఎందుకు చూపటం లేదో తెలియదు. రెండు కారణాలు కావచ్చు. ఒకటి పార్లమెంటు ఎన్నికలు కాంగానే 143 తృణమూల్ ఎమ్మేల్యేలను తమవైపు లాక్కుని వస్తున్నానని గొప్పగా ప్రకటించుకున్నాడు. అది జరగలేదు. అందువన బిజెపి అధిష్టానానికి అతనిపై నమ్మకం తగ్గిందేమో. రెండో కారణం అతని తలపై శారదా చిట్ స్కామ్, నారదా స్టింగ్ కేసు వేళ్లాడుతున్నాయి. 2019 సెప్టెంబరులో సిబిఐ వాళ్లు నారదా విషయంలో విచారణకు పిలిస్తే యితను ఏదో సాకు చెప్పి తప్పించుకున్నాడు. అవినీతి ముద్ర వున్న యిలాటివాణ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపలేమని బిజెపి భావిస్తూ ఉండవచ్చు. అతనికి పార్టీలో పదవి ఏమీ లేదు.
ఏది ఏమైనా మమతను ఓడించడం అంత సులభమేమీ కాదు. ఆమె హయాంలో అభివృద్ధి, దానితో బాటు అవినీతి రెండూ జరిగాయి. రెండిటి ఫలితాలు పార్లమెంటు ఎన్నికలలో కనబడ్డాయి. అప్పణ్నుంచి ఆమె దిద్దుబాటు చర్యల్లో పడింది. ఈనాడు రాష్ట్రాల జిడిపి గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే 12.58 శాతంతో బెంగాల్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ మాట దిల్లీ ఎన్నిక చర్చ సందర్భంగా ప్రణయ్ రాయ్ (ఎన్డిటివి) చెపితే సాగరికా ఘోష్ అనే సీనియర్ జర్నలిస్టు ‘‘అవునా, బెంగాల్‌ను జిడిపి కోణంలో ఎప్పుడూ చూడమే!’’ అంటూ ఆశ్చర్యపడింది. ప్రణయ్ వెంటనే చందన్ మిత్రా కేసి తిరిగి ‘‘ఇలాటి బెంగాలీ ఫ్రెండ్స్ ఉండగా మీరు బెంగాల్ ఇమేజిని ఏ విధంగా ప్రొజెక్టు చేయగలుగుతారు?’’ అంటూ జోక్ చేశాడు. చందన్ జర్నలిస్టుగా, ‘‘పయొనీర్’’ ఎడిటర్‌గా ప్రముఖుడు. 2003లో బిజెపిలో చేరి రెండుసార్లు రాజ్యసభ ఎంపీ అయ్యాడు. 2018 జూన్‌లో ఆ పార్టీ వదిలేసి తృణమూల్‌లో చేరాడు.
అందరూ తృణమూల్‌ను వదిలి బిజెపిలో చేరుతున్న యీ రోజుల్లో మీరు రివర్స్‌లో నడిచారేమిటి అని అడిగితే ‘‘బెంగాల్‌కు బెస్ట్ ఆప్షన్ మమతాయే. సమీప భవిష్యత్తులో ఆమెను ఛాలెంజ్ చేయగలిగిన వారెవరూ లేరు.’’ అన్నాడు. అతనికి బెంగాల్లో ఏ మాత్రం పలుకుబడి లేదు. కానీ సగటు బెంగాలీ అభిప్రాయాన్ని అతని ఆలోచనలు ప్రతిబింబించవచ్చు. జ్యోతి బసు తర్వాత సిపిఎంలో అటువంటి కరిజ్మా వున్న నాయకుడు లేక పార్టీ అధికారం పోగొట్టుకుంది. ఇప్పుడు బెంగాల్లో మమతకు అలాటి కరిజ్మా ఉంది. ఆమెలో ఎన్నో లోపాలున్నా, దృఢమైన ఓటు బ్యాంకు, అనుచరగణం ఉంది. ఇది కాదనలేని సత్యం. అందుకే కమ్యూనిస్టులు కాడి పారేసి కూర్చున్నారు, దిల్లీలో అరవింద్‌ను చూసి కాంగ్రెసు వాళ్లు కాడి పారేసినట్లే! బిజెపి ఆమెను చిత్తు చేయాంటే ఆ పార్టీ తరఫున ఆమెకు దీటైన యిమేజి కలవారు ఉండాలి. ఉన్నారా అనేదే ప్రశ్న. –
-ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2020)