జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కీలకమైన అస్త్రాన్ని తన అమ్ములపొదిలో నుంచి బయటకు తీసింది. రాష్ట్రంలో ప్రతి ఏటా లెక్కకు మిక్కిలిగా నమోదవుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసే విధంగా, నిర్దిష్టమైన చట్టాలు, చర్యలతో ఉపక్రమించబోతోంది. ప్రభుత్వ చట్టాలను అతిక్రమించే ఏ విద్యా సంస్థను కూడా ఉపేక్షించేది లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గట్టిగానే హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను గౌరవించలేని విద్యాసంస్థలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోవచ్చు అని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు జూనియర్ కళాశాలలు అనేది ఒక పెద్ద మాఫియా గా తయారైన సంగతి అందరికీ తెలిసిందే. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులను బలిపశువులుగా మార్చడంతో పాటు, వారి తల్లిదండ్రులను నిలువు దోపిడీకి గురి చేసి బికారులుగా మారుస్తున్నారు. ఈ ప్రైవేటు జూనియర్ కళాశాలలో విద్యార్థులపై ఉండే ఒత్తిడిని తట్టుకోలేక, ప్రతి ఏటా ఎంతమంది అసువులు బాస్తున్నారో లెక్కేలేదు. ఇలాంటి అరాచక పోకడలు అన్నింటికీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫుల్స్టాప్ పెట్టనుంది.
తాజాగా జూనియర్ కళాశాలల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఖరాఖండీగా ప్రభుత్వం అనుసరించనున్న ధోరణిని స్పష్టం చేశారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు కూడా ఇంటర్మీడియట్ విద్యా బోధనకు అనుమతులు తీసుకుని, వాస్తవంలో ఎంసెట్ ఐఐటి నీట్ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ సెంటర్ లాగా వాటిని నడుపుతున్నారు. కేవలం రెండు నెలల కాలంలో మొక్కుబడిగా ఇంటర్మీడియట్ చదువు సిలబస్ చెప్పేసి, మిగిలిన అన్ని రోజులు పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసే నెపంతో దారుణమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఈ వక్ర మార్గాలను కూడా ప్రభుత్వం గుర్తించింది. ఇకమీదట కళాశాలలో క్రమం తప్పకుండా ప్రభుత్వ అధికారుల తనిఖీలు ఉంటాయని యాజమాన్యాలు విధిగా సహకరించి తీరాల్సిందేనని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ విద్యా వ్యవస్థను, ప్రైవేటు సంస్థలతో పోటీ పడే విధంగా పటిష్టం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం, ఇంటర్మీడియట్లో విద్యార్థుల గైర్హాజరీ లను తగ్గించే ప్రయత్నం చేయడం అన్ని ఆ కోవకే వస్తాయి. దాంతోపాటు… ప్రైవేటు విద్యాసంస్థల అరాచకత్వాన్ని కూడా కళ్లెం వేసినట్లయితే.. రాష్ట్రంలో విద్యా వాతావరణం బాగుపడుతుంది. విద్యార్థులు మార్కులు, ర్యాంకులు తెచ్చుకోవడమే జీవితంగా బతకకుండా… నిజమైన జ్ఞానార్జన మార్గాలను తెలుసుకునే ఆస్కారం ఏర్పడుతుంది.