తాను పాలన సాగించినంత కాలమూ.. చంద్రబాబునాయుడు ఒక చిత్రమైన స్ట్రాటజీని అనుసరించేవాళ్లు. తన ప్రభుత్వం అచేతనంగా మారిన ఏ చిన్న సమస్య వచ్చినా చాలు.. వెంటనే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అభివృద్ధికి అడ్డు పడుతున్నదంటూ నిందలు వేసేవారు. చీమ చిటుక్కుమంటే చాలు.. వైకాపా రాష్ట్రాభివృద్ధికి వ్యతిరేకంగా, అడ్డుపడుతూ దుష్ప్రచారం చేస్తున్నదని ఆరోపణలు గుప్పించేవారు. ఇప్పుడు జగన్మోహనరెడ్డి కేబినెట్లోని మంత్రులు కూడా అచ్చంగా చంద్రబాబు టెక్నిక్ నే ఫాలో అవుతున్నారు. కొన్ని రంగాల్లో స్తబ్ధత గురించి వాస్తవకారణాల్ని అన్వేషించే ప్రయత్నం చేయకుండా.. చంద్రబాబు చేసే దుష్ప్రచారం మీద నిందలు వేసేస్తున్నారు.
అయిదేళ్ల పాలనకాలంలో చంద్రబాబు ఎన్నెన్ని విధాలుగా పాలనలో విఫలం అయ్యారో ఎవరికీ తెలియని సంగతి కాదు. పారిశ్రామికవేత్తలతో సమ్మిట్ లు నిర్వహించేవారు, ఒప్పందాలు చేసుకునే వారే తప్ప.. వాస్తవాలు గ్రౌండ్ అయినవి చాలా తక్కువ. అనేక విధాలుగా మాయ చేస్తూ గడిపారు. ఏ విషయంలో తమ వైఫల్యం బయటపడిపోయినా కూడా.. జగన్మోహనరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్రం గురించి దుష్ప్రచారం చేస్తున్నారు, పెట్టుబడులు రాకుండా చేస్తున్నారు. పెట్టుబడులు పెట్టేవారిని భయపెడుతున్నారు.. అంటూ ఆడిపోసుకునే వాళ్లు.
అప్పుడు చంద్రబాబు ప్రవర్తించిన తీరుతో పోల్చుకుంటే.. ఇపుడు గౌతం రెడ్డి మాట్లాడుతున్న మాటలకు ఏమాత్రం తేడా లేదు. రాష్ట్ర ఐటీ రంగంలో స్తబ్దత నెలకొని ఉండగా.. చంద్రబాబునాయుడు, తెదేపా చేస్తున్న ప్రచారం వల్లనే.. ప్రభుత్వ వాణిజ్యం, వ్యవహారాలు దెబ్బతింటున్నాయని గౌతంరెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేసుకుంటూ రోజులు గడిపేసేట్లయితే.. ఇక పాత ప్రభుత్వానికి, కొత్త ప్రభుత్వానికి తేడా ఏముంది?
జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఐటీ ఒక్కటే కాకుండా, యావత్ పారిశ్రామిక రంగానికి ఇస్తున్న ప్రోత్సాహం ఏమిటో సంబంధిత మంత్రులు, అధికారులు సమర్థంగా చెప్పగలగాలి. ఆ రకంగా పెట్టుబడులను ఆకర్షించగలగాలి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అంతే తప్ప.. కాసింత గందరగోళం కనపడగానే.. మసిగుడ్డ కాల్చి చంద్రబాబు మీద పారేద్దాం అనుకుంటే ఎలా? ఆయనలాగానే ప్రవర్తిస్తే ఎలా?