గత ఎన్నికల కంటె 10% ఎక్కువగా 2014 పార్లమెంటు ఎన్నికలలో 16.8% ఓట్లు తెచ్చుకున్న దగ్గర్నుంచి బిజెపికి బెంగాల్‌పై ఆశ పుట్టింది. ఏడు ఈశాన్యరాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలో, కాంగ్రెస్సో రాజ్యం చేస్తూ వచ్చాయి. ఇప్పుడు మోదీ కన్ను వాటిపై పడింది. వాటిని జయించాలంటే బెంగాల్లో గట్టి బేస్ వుండాలి. అసెంబ్లీ ఎన్నికలు 2016లో వున్నాయి కానీ, మునిసిపల్ ఎన్నికలు వచ్చే ఏడాదే వున్నాయి. ఈ లోపున మమతకు ప్రత్యామ్నాయం మేమే అని చూపించుకోవాలి.
''మమత ఏం చేసింది? సింగూర్‌లో భూమి కోల్పోయిన రైతులకు తిరిగి యిప్పించలేదు, గత మూడేళ్లలో డజను పరిశ్రమలు మూతపడ్డాయి. అరడజను టీ గార్డెన్లు మూతబడ్డాయి. 2013 నాటికి 282 పారిశ్రామిక వివాదాలు పెండింగులో వుంటే ఏడాది కాలంలో పరిష్కారమైనవి 20 మాత్రమే.'' అని రాష్ట్ర బిజెపి ఏకరువు పెడుతోంది. ప్రతీ ఏడూ జులై 21 న తృణమూల్ భారీ బహిరంగసభ ఏర్పరచే విక్టోరియా హౌస్ మైదానంలో నవంబరు 30 న మీటింగు పెట్టుకుంటామని బిజెపి జులై 22 న పోలీసులకు అభ్యర్థన పంపింది. వాళ్లు ఉలకలేదు, పలకలేదు. నెలలు గడిచిపోతూండడంతో బిజెపి సమావేశానికి 10 రోజుల ముందు మూడుసార్లు కోర్టుకి వెళ్లింది.
చివరకు 28న తీర్పు వీరికి అనుకూలంగా వచ్చింది. ఆ సభలో అమిత్ షా మమతపై విరుచుకుపడ్డాడు బర్ధమాన్ పేలుళ్ల నిందితుల కొమ్ము కాస్తోందని, బంగ్లాదేశీయుల అక్రమ వలసను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూనే '1200 మంది సింగూరు రైతుల సంక్షేమం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన మమత యిప్పుడు శారదా చిట్ ఫండ్ స్కామ్‌లో 17 లక్షల మంది నాశనమైతే ఏమీ చేయదెందుకు?' అని అడిగాడు.
ఎమ్బీయస్ ప్రసాద్