భార్యాభర్తలా? అన్నదమ్ములా?

తెలంగాణ ఉద్యమసమయంలో ఉద్యమనాయకులందరూ ఆంధ్ర-తెలంగాణ బంధాన్ని కలహాల కాపురం, బలవంతపు కాపురం, మేం అమాయక పెళ్లాలు, గడుసు మొగుడితో వేగలేం, అందుకే విడాకులు అడుగుతున్నాం అంటూ వచ్చారు. అలా అంటూనే విడిపోయి అన్నదమ్ముల్లా కలిసుందాం…

తెలంగాణ ఉద్యమసమయంలో ఉద్యమనాయకులందరూ ఆంధ్ర-తెలంగాణ బంధాన్ని కలహాల కాపురం, బలవంతపు కాపురం, మేం అమాయక పెళ్లాలు, గడుసు మొగుడితో వేగలేం, అందుకే విడాకులు అడుగుతున్నాం అంటూ వచ్చారు. అలా అంటూనే విడిపోయి అన్నదమ్ముల్లా కలిసుందాం అన్నారు. రెండు ప్రాంతాల మధ్య బంధాన్ని ఎలా నిర్వచించారో నాకైతే అర్థం కాలేదు. ఉమ్మడి కుటుంబంలో అన్నదమ్ములు విడిపోయాక, కాస్త మొహాలు మాడ్చుకున్నా, వ్యవహారాలు, వ్యాపారాలు, శుభాశుభకార్యాలు కలిసి చేస్తూంటారు. ఉమ్మడి బంధువుల వద్ద తమకు అన్యాయం జరిగిందని పితూరీలు చేస్తూ వుంటారు కానీ  బయటకు మాత్రం నవ్వుతూ కనబడతారు. మా అన్న, మా తమ్ముడు అంటూ వుంటారు. అదే భార్యాభర్తలైతే విడాకులకు కోర్టు ఎక్కినపుడు దారుణంగా నిందించుకుంటారు. వాదనల సమయంలో తమ తరఫు న్యాయవాదుల సలహా మేరకు అన్యాయపు ఆరోపణలు, వైల్డ్ ఎలిగేషన్స్ చేస్తారు. ‘మా ఆయనకు కోపం వచ్చినపుడు తిట్టేవాడు, అతని తరహా నచ్చక విడాకులు పుచ్చుకుంటున్నాను’ అని భార్య తన లాయరుకి చెపితే ‘అలా చెపితే కొంప మునిగిపోతుంది, ఆయన తిట్టేవాడు, కొట్టేవాడు, సిగరెట్టు పెట్టి కాల్చేవాడు’ అని చెప్పు, లేకపోతే జడ్జిగారు విడాకులు మంజూరు చేయడు’ అని అబద్ధాలాడిస్తాడు. ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం జరిగినపుడు ఇలాంటి అబద్ధాలు ఎన్నో చెప్పి విభజన సాధించారు. విడాకులు తీసుకున్న భార్యాభర్తలు మొహామొహాలు చూసుకోవడానికి ఇష్టపడరు. ఒకనాటి ఇష్టమంతా వెగటుగా మారిపోతుంది. మధ్యలో పిల్లలు వున్నారంటే వాళ్లకు చచ్చే అవస్తగా వుంటుంది. కస్టడీ ఒకరికి ఇచ్చి, విజిటింగ్ రైట్స్ ఇంకోరికి ఇస్తారు కదా. బయటకు తీసుకెళ్లినపుడల్లా ‘నీకు తెలియదు కానీ మీ అమ్మ ఇలాంటిది, మీ నాన్న ఇలాంటివాడు’ అలా చెప్పిచెప్పి పిల్లల మనసులు కలుషితం చేస్తారు. విభజన తర్వాత ఆంధ్ర, తెలంగాణ విడిపోయిన అన్నదమ్ముల్లా వున్నారా? విడిపోయిన భార్యాభర్తల్లా వున్నారా?

పోలవరం పేచీ ఏ మేరకు లాభిస్తుంది?

పోలవరం నిర్వాసితుల గురించి అంశం తీసుకుందాం. ఆ ఏడు మండలాల గురించి అంత రగడ అవసరమా? అధికారంలోకి రాబోతూ బంద్ చేయించడం, కొత్త ఎసెంబ్లీలో తీర్మానం పాస్ చేయడం, ఢిల్లీకి వెళ్లి ఆందోళన చేస్తాననడం – ఏమిటిది? టి-బిల్లు పాస్ చేయించుకోవడానికిి, పోలవరం ప్రాజెక్టు కట్టితీరతామని ఆంధ్రులకు ధైర్యం చేకూర్చడానికి అధికారపక్షం కొన్ని హామీలు చేర్చవలసి వచ్చింది. దానికి అనుగుణంగానే ఆర్డినెన్సు వచ్చింది. 7 మండలాలు అంటే 7కే ఆర్డినెన్సు వచ్చింది. 70కి రాలేదు. భద్రాచలం గుడి చేర్చలేదు. 1956 నాటికి తెలంగాణలో ఏముందో అంతే ఇస్తాం, తక్కినదంతా ఆంధ్రేక అనలేదు. ‘అదంతా మాకు అనవసరం, మా రాష్ట్రం మాకు వచ్చేసింది కాబట్టి అగ్రిమెంటు సగమే అమలు చేస్తాం’ అంటే ఎలా? నిర్వాసితులు ఆదివాసులు, వారి జీవితం భగ్నమై పోతోంది వంటి పెద్దమాటలు ఎందుకు? విభజన సమయంలో ‘హైదరాబాదు ఆదాయం మొత్తాన్ని తెలంగాణకు ఇచ్చేస్తే ఆంధ్రరాష్ట్రానికి ఏమీ లేకుండా పోతుంది కదా’ అని అడుగుతూంటే ఉద్యమనాయకులందరూ ఒకే జవాబు ఇచ్చేవారు – ‘వాళ్లది వేరే రాష్ట్రం, వాళ్లు ఎలా పోతే మాకెందుకు?’ ఇప్పుడు ఆ గిరిజనులు కూడా ఆంధ్రరాష్ట్రానికి చెందినవాళ్లు. వాళ్లు మునిగినా, తేలినా, నష్టపరిహారం అందక విలవిలలాడినా వీళ్ల కెందుకు? అబ్బే మొన్నటిదాకా మా ఖమ్మంలో వున్నవారు కాబట్టి అంటారా! మరి ఎప్పణ్నుంచో వున్న ఆంధ్ర ఉద్యోగులను హైదరాబాదు విడిచి వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారే! ‘మీ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంకా ఇక్కడెందుకు? పొండి’ అంటున్నారే! తెలంగాణలో భద్రాచలంలోనే కాదు, అనేక చోట్ల గిరిజనులు వున్నారు, వారిని ఉద్ధరిస్తే చాలు. ‘అబ్బే వారి గోడు వినాలి. అక్కడ ప్రజాభిప్రాయం సేకరించి, అప్పుడు పోలవరం కట్టాలి’ అని కొందరు మేధావులు వాదిస్తున్నారు. రాష్ట్రం విడదీసేముందు, ప్రజాభిప్రాయం సేకరించారా? మీరెటు వుంటారు? అని ఖమ్మం వాసులను, యూటీ చేయమంటారా? అని హైదరాబాదు వాసులను అడిగారా?

పోలవరంకు అభ్యంతరం లేదు, కేవలం డిజైన్ మార్చమంటున్నాం అనే వాదన అర్థరహితం. 20 ఏళ్లగా ఎప్రూవ్ అయి వున్న డిజైన్ వీళ్లు చెప్పారని మార్చేస్తారా? వీళ్ల దగ్గరి ప్రాజెక్టు డిజైన్ మార్చమని వాళ్లు అడిగితే మారుస్తారా? అయినా అది ఆంధ్ర ప్రాజెక్టు, కేంద్రం బాధ్యత తీసుకుంది. మధ్యలో తెలంగాణకు ఏం పని? ‘రాష్ట్రం ఏర్పడ్డాక సరిహద్దులు మార్చడానికి కేంద్రానికి అధికారం లేదు. ఆర్డినెన్సు ద్వారా చేయలేదు, ఆర్టికల్ 3 ఉపయోగించాలి’ అని కొందరు లీగల్ పాయింట్లు లాగుతున్నారు. కోర్టు కెళితే వాళ్ల్లూ కూడా అదే చెప్పారనుకున్నా ప్రస్తుత పార్లమెంటు ఆ పని చేసేస్తుంది. కాంగ్రెసు, బిజెపి కలిసి కూడబలుక్కుని కదా విభజన విధానాన్ని ఫైనలైజ్ చేసినది! ఆర్డినెన్సు రూపొందించినది కాంగ్రెసు, పాస్ చేయించినది బిజెపి! ఇద్దరూ కలిసి ఆర్టికల్ 3 ద్వారా చేసి ఆ ముచ్చట కూడా తీర్చేస్తారు. మహా అయితే తెరాస, బిజెడి అడ్డుపడదామని చూస్తాయి. వాటి బలం ఎంత వుంది కనక! గెలవలేవమని తోస్తే యుద్ధం ఆరంభించనే కూడదు. కేవలం అక్కసుతో పోలవరం పేచీ పెట్టుకుంటున్నారనే అభిప్రాయం కలిగిస్తే తెలంగాణేక నష్టం. ‘పోలవరం బోర్డులో తెలంగాణ సభ్యుణ్ని అనుమతిస్తే ఇలాంటి చిక్కులే పెడతారు, పనిలో పనిగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా సభ్యులను కూడా చేర్చేస్తే ఇక ప్రాజెక్టు కట్టే పనే లేదు, కేంద్రానికి బోల్డు ఆదా’ అని ఆంధ్ర వాదించడం మొదలుపెడితే…!? 

విద్యుత్ సంక్షోభం

విడిపోతే విద్యుత్ సంక్షోభం తప్పదని కిరణ్ కుమార్ రెడ్డి చెబితే కెసియార్ ఎద్దేవా చేశారు. ఛత్తీస్‌గఢ్ నుండి కొనుక్కుంటాం అంటున్నారు. ఇప్పుడు తీవ్రమైన విద్యుత్ కొరత ఎదుర్కుంటున్నాం. గృహావసరాలేక సప్లయి చేయలేకపోతున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియకుండా వుంది.  సరఫరా ఇలా వుంటే పరిశ్రమలు ఏం నడుస్తాయి? ఛత్తీస్‌గఢ్ నుండి విద్యుత్ రావాలంటే లైన్లు వేయాలట. యుద్ధప్రాతిపదికపై వేసినా 1 నెలలు పడుతుందట. మొదలు పెట్టడం ఎప్పుడో తెలియదు. డబ్బులు కావాలి. రుణమాఫీకి పరిమితులు విధించబోతే కుదరలేదు, మొత్తమంతా చుట్టుకుంది. బ్యాంకర్లు బాండ్లు కుదరవంటున్నారట, డబ్బిచ్చి మాట్లాడండి అంటున్నారు. ఇలాంటప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి కూర్చుని ఉమ్మడి ప్రణాళిక రచించుకోవాలి. కానీ చీటికీ మాటికీ ఆంధ్రులను రెచ్చగొడుతూ వుంటే వాళ్లెందుకు ఊరుకుంటారు? పోలవరం విషయంలో ఒప్పందాన్ని తిరగతోడుతున్నారు కాబట్టి విద్యుత్ విషయంలో మేమూ అదే పని చేస్తాం అంటున్నారు. ఎపిఇఆర్‌సి (విద్యుత్ నియంత్రణ మండలి) వద్ద పెండింగులో వున్న పిపిఏ (పవర్ పర్చేజింగ్ అగ్రిమెంటు) అపిే్లకషన్లను విత్‌డ్రా చేసుకుంటామని విద్యుత్ ఉత్పత్తిదారు- ఎపి జెన్‌కో ద్వారా అడిగించింది ఆంధ్ర ప్రభుత్వం. ఈఆర్‌సి గతంలోనే ఆమోదించివుంటే ఏకపక్షంగా విరమించుకుంటే ఉల్లంఘన జరిగినట్లు అవుతుంది. పెండింగులో వున్న అపిలకషన్‌ను విత్‌డ్రా చేసుకుంటానంటే ఈఆర్‌సి ఏమనగలదు? కానీ ఒప్పందాలపై మీతో బాటు సంతకం పెట్టిన డిస్కం (విద్యుత్ పంపిణీ సంస్థ)లు కాబట్టి వారు కూడా ఇలా అడిగితే చూద్దాం అంది. ఈ డిస్కంలలో రెండు ఆంధ్రలో, రెండు తెలంగాణలో వున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తన డిస్కంలను అడగనీయదు. ఆంధ్రవాళ్లు ఔనంటే సగం అమలు అవుతుందేమో.

ఆంధ్రప్రభుత్వం ఇంతటితో ఊరుకోవడం లేదు. ‘విభజనకు ముందు థర్మల్ విద్యుత్ 5092 మెగావాట్లయితే, అప్పుల్లాగే ఇదీ జనాభా ప్రాతిపదికన పంచుతారనుకున్నాం. దీనిలో మాత్రం పద్ధతి మార్చి వినియోగం ప్రాతిపదికన తెలంగాణకు 53% మాకు 46% ఇచ్చారు. మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడీ ఒప్పందాలను రద్దు చేసి మరో 465 మె.గా.లను తెచ్చుకోవాలని అనుకుంటున్నాం. మా రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ మమ్మల్ని వాడుకోనివ్వండి’ అంటూ ఎపి స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎపిఎస్‌ఎల్‌డిసి) ద్వారా దక్షిణ ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు విజ్ఞప్తి చేసింది. అదేమీ పట్టించుకోకండి అంటూ తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. వివాదం కేంద్రానికి చేరుతోంది. కోర్టుకి కూడా వెళ్లవచ్చు. వాళ్లు ఏం చెపుతారో చూడాలి. కొంత కాకపోతే కొంతైనా ఆంధ్ర వాదాన్ని అంగీకరిస్తే తెలంగాణకు విద్యుత్ కొరత ఏర్పడి, బోరు పంపులపై ఆధారపడిన తెలంగాణ రైతు నష్టపోతాడు. అది గుర్తించి తెలంగాణ నాయకులు సామరస్యంగా, ఆంధ్రతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలి. దానికి బదులు హరీశ్ రావు ఆంధ్ర అసెంబ్లీకి, మంత్రుల ఇళ్లకు కరెంటు కట్ చేస్తే ఏమవుతుందంటూ విరుచుకుపడ్డారు. ఈయన కెసియార్ కంటె మరీ దూకుడు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే జాతీయస్థాయిలో ఎలాంటి ఇమేజి వస్తుందో ఊహించలేరా?

కేంద్రంతో సంబంధబాంధవ్యాలు

ఇలా చూడబోతే ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు చీటికీమాటికీ కేంద్రం వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. కేంద్రం వద్ద ఎవరి మాట చెల్లుబాటవుతే వారికే లాభం జరుగుతుంది. ప్రస్తుతానికి చూస్తే ఆంధ్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇటు కెసియార్ చూస్తే మోడీని సన్నాసి అన్నారు. స్వభావరీత్యా మోడీ ఉదారవాది కాదు. ప్రతికక్షులను, తనను విమర్శించేవాళ్లను వదిలేసే రకం కాదు. టిడిపి-బిజెపికి పొత్తు వుంది. వారి ప్రభుత్వంలో వీరు, వీరి ప్రభుత్వంలో వారు భాగస్వాములు. ఇక బిజెపి-తెరాస సంబంధాలు చూడబోతే ఏ మాత్రం బాగా లేవు. రాష్ట్రంలో తెరాసను తిడితేనే తమకు మనుగడ అని బిజెపి గుర్తించింది. ముస్లిములకు రిజర్వేషన్లు పెంచి తెరాస, బిజెపికి మరింత కడుపు మండించింది. ఇది మోడీకి హితవైన చర్య కాదు. తెరాసకు బిజెపికి చెడితే నష్టపోయేది తెంగాణ ప్రభుత్వం, ప్రాంతం. ఉద్యమనాయకుడి స్థాయి నుంచి పాలకుడి స్థాయికి కెసియార్ ఎదగాలి. బంగారు తెలంగాణ కావాలంటే కంసాలికి ఎంతో నేర్పు, ఓర్పు కావాలి మరి. సంయమనం పాటించి, విద్వేషాలు, వైషమ్యాలు వదులుకుంటేనే ఆంధ్ర-తెలంగాణ అన్నదమ్ముల్లా కలిసి సాగవచ్చు. లేకపోతే కీచులాటలేక సమయమంతా పోతుంది. 

– ఎమ్బీయస్ ప్రసాద్

[email protected]