ఎమ్బీయస్‌ : సల్మాన్‌ కేసులో ప్రత్యక్షసాక్షులు

హిట్‌ అండ్‌ రన్‌ కేసులో నిందితుడైన సల్మాన్‌ ఖాన్‌ కేసును విచారిస్తున్న ముంబయి కోర్టులో మే 6న ఒక సాక్షి తన ఆరోపణతో సంచలనాన్ని సృష్టించాడు. 2002 సెప్టెంబరు 27 అర్ధరాత్రి దాటాక సల్మాన్‌…

హిట్‌ అండ్‌ రన్‌ కేసులో నిందితుడైన సల్మాన్‌ ఖాన్‌ కేసును విచారిస్తున్న ముంబయి కోర్టులో మే 6న ఒక సాక్షి తన ఆరోపణతో సంచలనాన్ని సృష్టించాడు. 2002 సెప్టెంబరు 27 అర్ధరాత్రి దాటాక సల్మాన్‌ ఖాన్‌కు సంబంధించిన స్పోర్ట్‌స్‌ యుటిలీటీ వెహికల్‌ వేగంగా వెళుతూ బాంద్రాలోని అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ బేకరీ వద్ద నిద్రపోతున్నవారిపై ఎక్కేసింది. ఒకతను చనిపోయాడు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 304 సెక్షన్‌లోని రెండు క్లాజుల కింద సల్మాన్‌పై అభియోగం మోపి కేసు నడుస్తోంది. అతను పెద్ద స్టార్‌ కాబట్టి కేసు విచారణ మందకొడిగా నడుస్తోంది. నేరం రుజువైతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు. గాయపడిన బాధితులు – ముస్లిమ్‌ షేక్‌, మన్నూ ఖాన్‌, మొహమ్మద్‌ కలీమ్‌లను ప్రత్యక్షసాకక్షులుగా ప్రాసిక్యూషన్‌ చూపిస్తోంది. ప్రమాదం జరగగానే సల్మాన్‌ ఖాన్‌ వాహనంలోంచి దిగాడని, తప్పతాగి వున్నాడని, సరిగ్గా నిలబడలేకుండా వున్నాడని, తమను చూసి అక్కణ్నుంచి పారిపోయాడని వాళ్లు చెపుతున్నారు. సల్మాన్‌ వాహనంలోంచి దిగినంత మాత్రాన అప్పటిదాకా అతనే నడుపుతున్నాడని చెప్పలేమని సల్మాన్‌ తరఫు న్యాయవాది శ్రీకాంత్‌ షివడే వాదిస్తున్నారు.

ఈ బాధితుల తరఫున యిప్పటివరకు ముఖేశ్‌ పాండే అనే న్యాయవాది వాదిస్తూ వుండేవాడు. అతనే గట్టిగా మాట్లాడి వాళ్లకు నష్టపరిహారం యిప్పించాడని అంటారు. అయితే మే 6 నాటి విచారణలో బాధితుల్లో ఒకడైన ముస్లిమ్‌ షేక్‌ ''నేను ఆ రోజు సల్మాన్‌ను చూడలేదని కోర్టులో చెప్పాలని, అలా చెపితే రూ.5 లక్షలు లంచం యిస్తామని సల్మాన్‌ తరఫు నుండి ఆఫర్‌ వచ్చింది. ఆ ఆఫర్‌ తెచ్చినది వేరెవరో కాదు, ముఖేశ్‌ పాండేయే! నాకు ఫోన్‌ చేసి చెప్పాడు.'' అని చెప్పాడు. ఈ ఫోన్‌కాల్‌ విషయం విచారించి, తమకు నివేదించమని కోర్టు పోలీసులను ఆదేశించింది. అది రుజువైతే సల్మాన్‌కి వ్యతిరేకంగా కేసు బలపడుతుంది. 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2014)

[email protected]