ఎన్టీయార్ అఫీషియల్ బయోపిక్ నుంచి తేజ తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఫలానావారు దర్శకత్వం వహిస్తారన్న వార్త రాలేదు. ఎందుకంటే బయోపిక్ అంటే మాటలు కాదని దర్శకులందరికీ తెలుసు. తేజ నిష్క్రమణకు కారణాలు ఫలానా అని ఊహాగానసభలు జరిగాయి. నిజమేమిటో సినిమా యూనిట్‌కు మాత్రమే తెలియాలి. చంద్రబాబు తిరుగుబాటు చూపించే అగత్యం నుంచి తప్పించుకోవడానికి ఎన్టీయార్ జీవితం మొత్తం తీయరని తెలియగానే వర్మ 'లక్ష్మీస్ ఎన్టీయార్' ప్రకటించారు. దాని అతీగతీ తెలియదు. ఈ సినిమాలో ఏం చూపిస్తారో స్పష్టంగా చెప్పలేదు.
నాదెండ్ల భాస్కరరావు ఉదంతం తర్వాత ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడి, ఎన్టీయార్ మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో సినిమా పూర్తి చేద్దామనుకున్నారనీ, కానీ రాజకీయాల జోలికంటూ వెళితే అక్కడే ఎందుకు ఆపారు, పూర్తిగా ఎందుకు చూపలేదని అడుగుతారని జంకి, ఎన్టీయార్ సినిమా జీవితం వరకే పరిమితం చేద్దామనుకున్నారనీ, దానిలో కూడా తేజకు, బాలకృష్ణకు దృక్పథభేదం వచ్చిందనీ వెబ్‌సైట్ల సమాచారం.
మామూలుగానే బయోపిక్ తీయడం కష్టం. జీవితచరిత్రలే కాదు, చారిత్రాత్మక చిత్రాలు తీయడమూ కష్టమే. కొన్నిటికి చరిత్ర దొరకదు, దొరికిన వాటిల్లో వైరుధ్యం ఉంటుంది. మరి కొన్నిటిలో సమాచారం మరీ ఎక్కువగా ఉంటుంది. ఏది వదిలేయాలో, ఏది ఉంచాలో తేల్చుకోవడం మహా కష్టం. అనేక సంఘటనలను యథాతథంగా చూపిస్తే యీ కాలానికి నప్పదు, గొడవలు రావచ్చు. గాంధీ లాటి సినిమాలు తీసినప్పుడే యీ కష్టాలన్నీ వెలుగులోకి వచ్చాయి.
సినిమాలు, రాజకీయాలు కలబోసిన ఎమ్జీయార్ జీవితంలో చాలా కథ ఉంది. దాన్ని ఎమ్జీయార్, కరుణానిధిల రూపేణా చెప్పాలని మణిరత్నం అనుకుని ''ఇరువర్'' (1997) తలపెట్టాడు. వారి జీవితాలలో మొదట్లో గాఢస్నేహం, తర్వాత తీవ్రశత్రుత్వం ఉన్నాయి కాబట్టి నాటకీయత ఉంటుందనుకున్నాడు. కానీ మణిరత్నం సినిమా మొదలుపెట్టినపుడు ఎడిఎంకె పాలన ఉందని, 1996లో కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యాక మణిరత్నాన్ని పిల్చి స్క్రిప్టు మార్పించాడని, అందుకే నాటకీయత తగ్గి, సినిమా ఫెయిలై డబ్బింగు రైట్స్ తీసుకున్న తను చాలా నష్టపోయానని మురళీమోహన్ తన ఆత్మకథలో రాశారు.
ఇక ఎన్టీయార్ సినిమా విషయానికి వస్తే ఆయనది మోస్ట్ కలర్‌ఫుల్ జీవితం. ఎమ్జీయార్‌కు రాజకీయాల్లో ఓటమి లేదు. చాలా ఏళ్లు రాజకీయాల్లో నలిగి, డిఎంకె పార్టీలోంచి బహిష్కరించబడి, కొత్త పార్టీ పెట్టి గెలుస్తూ పోయాడు. అతనికి వెన్నుపోటులు తెలియవు. అనారోగ్య పీడితుడై ఉండి కూడా తన అనుచరులను చెప్పు కింద తేలుగా ఉంచి పాలించాడు. కానీ ఎన్టీయార్ రాజకీయనాయకుడిగా ఎత్తులు, పల్లాలు అన్నీ చూశాడాయన. ప్రాంతీయ పార్టీ పెట్టి పది నెలల్లో ఏకంగా ముఖ్యమంత్రి కావడం ఒక రికార్డు.
గ్రామాధికారాల తొలగింపు, ఉద్యోగస్తుల రిటైర్‌మెంటు వయసు తగ్గింపు వంటి హఠాన్నిర్ణయాలు, ఏకపక్షంగా వ్యవహరించి అనుచరుల అసంతృప్తికి గురి కావడం, రాజకీయపు టెత్తుగడలు తెలియక వెన్నుపోటుకి గురి కావడం, ప్రజా ఉద్యమం లేవదీసి అధికారాన్ని మళ్లీ దక్కించుకోవడం, ఉద్యోగుల ఆగ్రహానికి గురై తిట్టించుకోవడం, మంత్రులకు తగినంత గౌరవం యివ్వక అహంకారం ప్రదర్శించడం, వినూత్న సంక్షేమ పథకాలతో ప్రజల ఆదరాన్ని చూరగొనడం, రాష్ట్రాల అధికారాలకై పోరాడడం, జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేయడానికి నాయకత్వం వహించడం, సొంత తప్పిదాలతో ఎన్నికలలో ఓడిపోవడం, ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కూర్చోవడం, అలిగి వెళ్లిపోవడం, కుటుంబం మాట తోసిరాజని ద్వితీయ వివాహం చేసుకోవడం, ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి ఆమెను ఎన్నికల ప్రచారంలో భాగస్వామిని చేయడం, ఎన్నికలలో గెలిచాక ఆమెకు విపరీతంగా ప్రాధాన్యత యిచ్చి పాత సహచరులను దూరం చేసుకోవడం, రెండోసారి కుటుంబసభ్యుల చేతిలోనే వెన్నుపోటుకు గురి కావడం, గడ్డిపోచలుగా చూసిన వారి చేతిలోనే చెప్పుదెబ్బలు తినడం, గాయపడిన ఒంటరి సింహంలా ఆవేదనతో ఆక్రోశిస్తూ, యింకో పోరాటానికి సిద్ధపడుతూ ఉండగానే హఠాత్తుగా మరణించడం. ఈ కథను మొత్తంగా తీస్తే ఒక గొప్ప గ్రీక్ ట్రాజెడీ అవుతుంది. ఎన్టీయార్ పార్టీ ఆయనతోనే మూతబడి ఉంటే యీ కథను యథాతథంగా తీసి గొప్ప డ్రామా పండించేవారు.
కానీ దురదృష్టవశాత్తూ ఎన్టీయార్ చేతుల్లోంచి పార్టీని లాక్కున్న వాళ్లు అధికారంలో ఉన్నారు కాబట్టి, మళ్లీ అధికారంలోకి వద్దామని చూస్తున్నారు కాబట్టి యీ కథలో తమకు అనుకూలమైనది మాత్రమే వాడుకుందామని చూస్తున్నారు. వారి ప్రతిక్షకులు వారికి ప్రతికూలమైనది మాత్రమే వాడుకుందామని చూస్తున్నారు. ఆ ప్రతిక్షకులకు ప్రత్యర్థులు దానికి విరుగుడు సినిమా తీస్తామన్నారు. వీరెవ్వరికీ పూర్తి వాస్తవాలు అక్కరలేదు. పూర్తి చరిత్ర అక్కరలేదు. దాన్ని కూడా తప్పు పట్టలేము. రామాయణాన్ని సీతారాముల కళ్యాణం వరకే చూపవచ్చు.
భారతంలో పాండవ వనవాసం మాత్రమే చూపవచ్చు. చూపించిన కాస్తా నిజాయితీగా చూపించారా లేదా అన్నదే ప్రశ్న. ఎన్టీయార్‌ను మామూలు మనిషిగా చూపిస్తే లోపాలతో సహా అన్నీ చూపించాలి. దైవాంశ సంభూతుడిగా, తప్పులేవీ చేయనివాడిగా చూపిస్తే అది చరిత్ర అవదు, జానపద కథ అవుతుంది. సంజయ్ దత్‌పై వస్తున్న చిత్రంలో అతని దుర్గుణాలతో, దురలవాట్లతో సహా అన్నీ చూపిస్తారట. అప్పుడే అది రసవత్తర గాథ అవుతుంది. చూడబుద్ధవుతుంది. అలాటి ధోరణిలో ఎన్టీయార్ సినిమా తీసే స్వేచ్ఛ దర్శకుడికి యిస్తారని ఊహించడం కూడా కష్టం.
ఎన్నికలకు ముందు వస్తోంది కాబట్టి, బాలకృష్ణ నిర్మాతల్లో ఒకరుగా ఉన్నారు కాబట్టి, టిడిపి తరఫు ప్రాపగాండా సినిమాగా దీన్ని తిర్చదిద్దవలసిన భారం దర్శకుడిపై ఉంది. రాజకీయ ప్రవేశం చూపిస్తే చంద్రబాబు ఎన్టీయార్‌ను ఛాలెంజ్ చేసిన విషయం, టిడిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయిన విషయం చూపవలసి వస్తుంది. చూపిస్తే ప్రస్తుత తెలుగుదేశాధినేత బాబుని తక్కువ చేసినట్లవుతుంది. చూపకుండా వదిలేస్తే అందరూ నిలదీస్తారు. ఎన్టీయార్, చంద్రబాబు కుమ్మక్కయి యిద్దరూ చెరో పార్టీలో ఉంటామని ముందే అనుకుని కాంగ్రెసును జెల్ల కొట్టారని చూపిస్తే ఎన్టీయార్ వ్యక్తిత్వానికి మచ్చ. మొదటి వెన్నుపోటు చూపిస్తే రెండో వెన్నుపోటు వదిలేశారేం అనవచ్చు. ఇలా రాజకీయ రంగాన్ని కాస్త కవర్ చేసినా వివాదాలు రావచ్చు. అందువలన ఎందుకొచ్చిన గొడవని సినిమాల వరకే పరిమితమౌదామని నిర్మాతలు అనుకోవచ్చు.
అదే జరిగితే నాటకీయత ఎక్కణ్నుంచి వస్తుందని దర్శకుడు వేసే మౌలిక ప్రశ్న. సినిమాల్లో ఎన్టీయార్ ఉత్థానపతనాలు ఎక్కడున్నాయి? నిర్మాతగా మొదటి రెండు సినిమాలు ఫ్లాపయ్యాయి తప్ప నటుడిగా స్లంప్ వచ్చిందెక్కడ? కొన్ని సినిమాలు ఫెయిలయినా, వాటికి రెట్టింపు హిట్టయిన సినిమాలు అదే ఏడాదిలో వచ్చాయి. పారితోషికం పెరుగుతూనే వచ్చింది. వేషాలు లేని స్థితి ఎన్నడూ రాలేదు. దర్శకుడిగా కూడా రాణించి, నిర్మాతగా కూడా అనేక హిట్ సినిమాలు తీయడం జరిగింది. దర్శకనిర్మాతగా వైఫల్యం అంటూ ఉందంటే కెరియర్ చివరి దశలో తీసిన పౌరాణిక, చారిత్రాత్మక సినిమాలు మాత్రమే.
ప్రజలకు ఆ వైఫల్యాలు గుర్తులేనంతగా అదే సమయంలో సాంఘిక సినిమాలు హిట్టయి యువతను కూడా ఆకర్షించడం జరిగింది. ఈ యూనిలేయర్‌డ్ విజయగాథను రసవత్తరమైన కథగా చెప్పడమూ, తెర కెక్కించడమూ కష్టం. జీవితంలో తొలిదశలో కొద్దిపాటి స్ట్రగుల్ ఉన్నా, సినిమా రంగంలో వరుస విజయాలే. అక్కినేనిపై సినిమా తీసినా యిదే చిక్కు.
60 సినిమాల వరకు సాగిన ఆయన జీవిత గాథను ముళ్లపూడి వెంకటరమణగారు ''కథానాయకుని కథ'' పేరుతో రాశారు. సూపర్ హిట్టయింది. 200 సినిమాలు పూర్తయ్యాక ఆ పుస్తకానికి సీక్వెల్ రాయమని అక్కినేనిగారు ముళ్లపూడిగారిని అడిగారు. 'మొదట్లో ఉన్న స్ట్రగుల్ తర్వాత ఎక్కడుంది? మీ పాత్రలు మీరు ఎంచుకునే స్థాయికి చేరాక డ్రామా ఎక్కడుంది? రాస్తే రక్తి కట్టదు' అంటూ ముళ్లపూడి సున్నితంగా తిరస్కరించారు. సినిమాల్లో తొలిదశలో ఎయన్నార్‌కు క్లిష్టకాలం ఉంది. ఎన్టీయార్‌కు అదీ లేదు. రెండో సినిమా నించే హీరో. వరుస విజయాలు.
ఏ కథలోనైనా విలన్ ఉండకపోతే రక్తి కెక్కదు. ఈయన కథలో విలన్ ఎవరవుతారు? సహనటుడు నాగేశ్వరరావా? ఇద్దరి మధ్య స్పర్ధ ఉంది కానీ బద్ధవైరం ఉందా? ఉందని నిరూపించగలరా? కొన్ని వాస్తవాలను చూపుతారా? మరుగుపరుస్తారా? కొంతకాలం పాటు తెలుగు సినిమా పరిశ్రమ ఎయన్నార్ క్యాంప్, ఎన్టీయార్ క్యాంప్‌లుగా విడిపోయిందని యీ సినిమాలో చూపిస్తారా? ఇద్దరి అభిమాన సంఘాలూ పోస్టర్ల మీద పేడముద్దలు వేసుకోవడం చూపిస్తారా? ఇరువురి నటవారసులు సఖ్యంగా ఉన్న యీ రోజుల్లో యివన్నీ చూపించి కెలుక్కుంటే బాగుండదని మానేస్తారా?
చిత్రపరిశ్రమను హైదరాబాదు తరలించడానికి ప్రయత్నించే ముందు నాగేశ్వరరావు తనను సంప్రదించలేదనే కోపంతో (విరాళాల సేకరణకు వెళ్లేటప్పుడు తనను సంప్రదించలేదని నాగేశ్వరరావు కౌంటర్) ఎన్టీయార్ తరలింపును అడ్డుకుని, మద్రాసులోనే సినిమాలు తీయాలని నిర్మాతలను అడిగారని చూపితే రాజకీయాల్లోకి వచ్చాక తెలుగు, థెలుగు అంటూ కలవరించిన ఎన్టీయార్ యిమేజి ఏం కాను? ఇలాటివన్నీ తీసి పారేస్తే యింక ట్విస్టులెక్కడుంటాయి? ప్రతినాయకుడు, ఘర్షణ, డ్రామా లేని కథ ఏం పండుతుంది?
ఎన్టీయార్ పెట్టిన పార్టీ మనుగడలో లేకపోతే కొన్నయినా డ్రమటిక్ పాయింట్స్ ఉంచేవారు. కానీ తెలుగుదేశం 2019లో పోటీ చేస్తోంది. 25కి 25 సీట్లు గెలిచి బిజెపికి బుద్ధి చెప్పాలని ఉవ్విళ్లూరుతోంది. దానికై ఎన్టీయార్ లార్జర్ దాన్ లైఫ్ యిమేజిని ఉపయోగించుకుందామని చూస్తోంది. ఇలాటప్పుడు తమను యిబ్బంది పెట్టే ఘట్టాలన్నీ తీసేసి, నాటకీయత లేని సినిమా తీస్తే డాక్యుమెంటరీలా తయారవుతుంది. ఎన్టీయార్ గెటప్స్‌లో బాలకృష్ణ కనబడి డాన్సులు అవీ చేస్తారు కాబట్టి, మహా అయితే రీ-హేష్‌డ్ ఎన్టీయార్ చిత్రలహరిలా తయారవుతుంది.
ఇది బాలకృష్ణ అభిమానులను అలరిస్తుందేమో కానీ ఎన్టీయార్ అభిమానులకు ఏ మేరకు నచ్చుతుంది? ఏ కథకైనా క్లయిమాక్స్ ఉండాలి. ఎన్టీయార్ సినిమా కెరియర్ వరకే తీస్తారనుకుంటే క్లయిమాక్స్ ఏముంటుంది? సినిమాల నుంచి తప్పుకుంటానని ప్రకటించి రాజకీయాల్లోకి వెళ్లడమా? లేక రాజకీయాల్లో ఉంటూనే ''విశ్వామిత్ర'', ''అశోక'', ''శ్రీనాథ'' వంటి ఫ్లాప్ సినిమాలు తీయడమా? రెండూ నప్పవు. అందువలన రాజకీయాలు చూపి తీరాలి.
చైతన్యరథం వంటి కొత్త కాన్సెప్టులు, జనాలు వెర్రెత్తినట్లు పరుగులు పెట్టడాలు చూపి తీరాలి. రాజకీయాలంటే చూపితే బాబు వ్యతిరేకించినట్లు చూపి తీరాల్సిందే. లేకపోతే మొత్తం సినిమాని వదిలేసి అందరూ దాన్నే ఎత్తి చూపుతారు. కానీ ఆ దృశ్యాలు చూపాలంటే బాబు వియ్యంకుడైన బాలకృష్ణను ఒప్పించాలి. ఏ దర్శకుడికైనా అది సులభమైన పని కాదు. తటపటాయిస్తూండవచ్చు. అందుకే కాబోలు, ఓ పట్టాన పేరు వెలువడటం లేదు.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]