టాలీవుడ్ లో దర్శకత్వ పర్యవేక్షణ అనగానే రాఘవేంద్రరావు పేరే గుర్తుకువస్తుంది. అందుకే మళ్లీ ఆయన పేరు అదే ట్యాగ్ లైన్ తో మరోసారి కనిపించబోతోంది. బాలయ్య హీరోగా, నిర్మాతగా ముస్తాబు కాబోయే ఎన్టీఆర్ బయోపిక్ కు కే. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ వహించబోతున్నారు. ఈ మేరకు అంతా రెడీ అయింది.
వాస్తవానికి క్రిష్, దగ్గర నుంచి రాఘవేంద్రరావు వరకు చాలా మందిని ట్రయ్ చేయడం, అందరూ నో అనడంతో, బాలయ్య బాబే సినిమా దర్శకుడిగా మారాలని ఫిక్సయిపోయారు. అయితే, కేవలం డైరక్షన్ అంటే టేక్ ఓకె కట్ చెప్పడం కాదు. ఇంకా చాలా చేయాలి. అందుకే ఈ మేరకు దర్శకేంద్రుడి రాఘవేంద్రరావును ఒప్పించగలిగారు. తెలుగుదేశం పార్టీతో ఆయనకు వున్న సాన్నిహిత్యం అలాంటిది. మరి బాలయ్యను ఎలా కాదనగలరు.
అందుకే సినిమా కాస్టింగ్, స్క్రిప్ట్, కీరవాణితో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చూసుకుంటారు. సెట్ మీద డైరక్షన్ అంతా బాలయ్య బాబు చూసుకుంటారు. ఇక ఈ సినిమాకు సమర్పకుడు విష్ణు. సహ నిర్మాత సాయి కొర్రపాటి. కానీ అసలు నిర్మాత బాలయ్యనే. మేజర్ స్టేక్ హోల్డర్ కూడా బాలయ్యే అని తెలుస్తోంది. అందుకే ఆయన తన తోడల్లుడు ప్రసాద్ సాయం తీసుకుంటున్నారని వినికిడి.
ఖర్చులు, కీలక వ్యవహారాలు ప్రసాద్ చూసుకుంటారు. రోజువారీ ప్రొడక్షన్, షూటింగ్ ప్లానింగ్ అంతా సాయి కొర్రపాటి చూసుకుంటారు. ఆ విధంగా అన్నిఅడ్జస్ట్ మెంట్లు జరిగిపోయాయి. ఇక షూటింగ్ కు వెళ్లడానికి బాలయ్య రెడీ అవుతున్నారు. మే ఫస్ట్ వీక్ నుంచి పది నుంచి పదిహేను రోజులు తొలి షెడ్యూలు వుంటుందని తెలుస్తోంది.